కలవని నమ్మితి గానీ
తలపుల తలుపులు తెరవను తప్పే దత్తా
ఇల యందణువణువూ మీ
నెలవని గురుతెరుగ నైతి నిజమే దత్తా (1)
ఆకసమే నీ వందురు
తాకుట యెటులో యెరుగను తప్పే దత్తా
నాకిలలోపల వెలుపల
తాకుచు తమరుంటి రెరుగ తప్పే దత్తా.(2)
చల్లని గాలులలో నా
తల్లి కరస్పర్శ గనను తప్పే దత్తా
కల్లా కపటము లెరుగని
తెల్లని మల్లెల జాజులు తమరట తెలిసెను దత్తా.(3)
మబ్బుల మెరపులు జూచితి
తబ్బిబ్బై తమను గనను తప్పే దత్తా
అబ్బా తడిసెను మేనని
దబ్బున జలముల మునిగితి తప్పే దత్తా.(4)
చప్పున తింటిని పప్పూ
ధప్పళముల తమను మరచి తప్పే దత్తా
ఇప్పట్టున జఠరాగ్నిగ
నిప్పును రగిలింతు వనిరి నిజమా దత్తా.(5)
తెలతెల వారెను గానీ
తలుపులు తెరచుట నెరుగను తప్పే దత్తా
వెలుపల నీవుందు వనెడు
తలపే కలుగక వగచితి తప్పే దత్తా.(6)
చలిలో చెలికౌగిలిలో
తలచుట మరచితి తమరిని తప్పే దత్తా
నులివెచ్చని నీరెండకు
నెలవే నీవని మరచితి నిజమిది దత్తా.(7)
ఆలికి యన్నము బెట్టుట
తాలిమి యనుకుంటి నాది తప్పే దత్తా
కాళిని మ్రొక్కితి గానీ
తాలిమి తను జూపె ననను తప్పే దత్తా.(8)
ఆమని సొబగుల మురిసితి
తామసమున తమను మరచి తప్పే దత్తా
కాముని గాల్చితివట న
న్నోమెడు దొరవని మరచితి నొప్పక దత్తా.(9)
నేరము లెన్నో జేసితి
తారక రాముని మరచితి తప్పే దత్తా
దార సుతుల పోషించితి
కారణ మీవని మరచిన కపటిని దత్తా.(10)
ఎప్పటి కప్పుడు క్రొత్తగ
తప్పుల కలవాటి పడితి తప్పే దత్తా
చెప్పిన పాపము పోదని
తప్పక దండించుమయ్య దయతో దత్తా.(11)
మనసారా నిను పిలువను
తనివాఱగ నిను కొలువను తప్పే దత్తా
పనివారని కసిరితినే
మనవారని మరచినాను మనుజుడ దత్తా.(12)
పనిగండము కలదంచును
తనువును దాచితి పనులకు తప్పే దత్తా
మునివలె మాటాడితినే
దనుజుడ దండించునన్ను దయతో దత్తా.(13)
అడిగిన వారికి లేదని
తడబడకయె బొంకినాడ తప్పే దత్తా
తడిలేనిది నా మనసే
కడగండ్లకు వగవనేల కనవా దత్తా.(14)
ఎప్పుడు బిలచిన నప్పుడె
తప్పక వచ్చెదననంటి తప్పే దత్తా
చెప్పులపై మోజు విడదు
చెప్పగ నేలా మరణము చేదగు దత్తా.(15)
మగఁడనని కెరలి బలిమిన
తగువాడితి తరుణితోడ తప్పే దత్తా
పగతుని వలె వర్తించితి
తగనిపనుల చేసి నాడ తప్పే దత్తా.(16)
మునుపటి జన్మము లెరుగను
తనువే నేనని తలచితి తప్పే దత్తా
మనుజుడనో దనుజుడనో
మనుగడ సాగించినాడ మహిలో దత్తా.(17)
నగవులు మొగమున పులిమితి
తగవులు మనసున విడువవు తప్పే దత్తా
జగడము లాడుట నేర్చితి
జగమున బ్రతుకుట మరచితి జయగురు దత్తా.(18)
జాతకముల నమ్మితి నా
త్రాతవు మిమ్మెరుగకుంటి తప్పే దత్తా
పాతకములు విడకుండనె
జాతకమెట్టుల సరియగు జయగురు దత్తా.(19)
నిరతము నిను దలచుచు నే
తరతమ మెరుగక చరించ తప్పే దత్తా
కరకుగ మాటాడితినే
పరులని మనవారనుచును పాపిని దత్తా.(20)
నాదని నీదని తలచితి
తాదాత్మ్యతలేకనేను తప్పే దత్తా
నాదనుటయె నాటకమట
నీ దయ మరచితిని నేను నిజమే దత్తా.(21)
తూరుపు పడమటి సంధ్యలు
దారిని చూపించుటెరుగ తప్పే దత్తా
సారెకు జన్మము వలదని
తారక నామము మరచితి తప్పే దత్తా.(22)
అపరాధములే నిజమగు
తపమా యనునటుల చేయ తప్పే దత్తా
అపరాధుల సరిజేసెడు
తపమే నీదని తెలియుట తరమా దత్తా.(23)
రేపెటులని చింతించుచు
తాపమునకు లొంగిపోతి తప్పే దత్తా
ఆపను నీ నామ భజన
తాపులు తన్నిన విడువను తమదయ దత్తా.(24)
చచ్చిన మేలనుకుంటిని
తచ్చాడితి నటునిటులను తప్పే దత్తా
వచ్చని పనికాకుండగ
చచ్చిన ఫల మేమి గలుగు జయ గురు దత్తా.(25)
స్నానము సంధ్యల నెరుగను
దానము ధర్మము లెరుగను తప్పే దత్తా
ఏ నామము నుదుట నిడను
నీ నామమ్ముల నెరుగను నిజముగ దత్తా.(26)
పాపము పుణ్యము లేవని
తాపసి వలెబల్కినాడ తప్పే దత్తా
పాపినని తెలిసెను తుదకు
తాపులు తన్నుడి దయగొని తమదయ దత్తా.(27)
అప్పులు చేసితి తీర్చితి
తప్పులు చేసితి తెగబడి తప్పే దత్తా
ముప్పులు ముంచుకు వచ్చెను
తప్పక దండించుమయ్య దయతో దత్తా.(28)
చెప్పిన పాపము విడునే
తప్పక మరుజన్మ వలదు దండించప్పా
తప్పుల తిప్పలు పెరిగెను
తప్పక చేసితి ననుటయు తప్పే దత్తా.(29)
మనసును శుచిగా నుంచక
తనువును శుభ్రముగ నుంచ తప్పే దత్తా
అనిశ మటునిటు తిరిగు నా
మనసును తమరే ధరింప మారును దత్తా.(30)
పెద్దల తలచుట మరచితి
తద్దినములు తలువనైతి తప్పే దత్తా
బుధ్ధిన నిలువవె దత్తా
గుద్దులు గుద్దినను మేలు గురుడవు దత్తా.(31)
చిత్తము తిరుగుట నేర్చెను
దత్తా దత్తా యనుచును తప్పే దత్తా
దత్తుని నామము విడువను
చిత్తము నందున నిలువవె శ్రీ కర దత్తా.(32)
తెలివైన వాడననుచున్
తల నెత్తుకు నడచినాడ తప్పే దత్తా
చెలిమి కలిమి కూరిమి కా
వలయునని తెలిసెను మీదు వరమున దత్తా.(33)
తలపులు మీపై నిలుపక
తల పండిన దనుకొనుటయు తప్పే దత్తా
కలలా కరగెను వయసే
మెలకువ కల్గించుడయ్య మీ దయ దత్తా.(34)
చిరుబురులాడుచు తిరుగుచు
దరహాసము మరచినాను తప్పే దత్తా
అరకొర చదువులు చదివితి
తెరవే లేదని వగచితి తెలిసెను దత్తా.(35)
గీతను భారత భాగవ
తాదుల చదివినది లేదు తప్పే దత్తా
వ్రాతలు మారవదేలని
తాతల తండ్రులని తిడితి తప్పే దత్తా.(36)
తీర్థము ప్రసాదములను ప
దార్థములనుకొంటి నాది తప్పే దత్తా
వ్యర్థమ్మన రాదు ప్రతిప
దార్థము నందుండె మీరు తధ్యము దత్తా.(37)
పదపద మని యముడనె నా
తదనంతర మెటుల ననుట తప్పే దత్తా
ఇదె చివరిదొ మొదటిదొ నీ
పదములకడ నుండనిమ్ము భగవాన్ దత్తా.(38)
దేహి ని నేనను కుంటిని
దాహము తీరదనుకొంచు తప్పే దత్తా
దేహీ యందును స్వామీ
సోహమ్మను నెరుక పరుచు శుభకర దత్తా.(39)
ఆగని యలలై కోర్కెలు
దాగెను నామదిన తెలియదప్పా దత్తా
సాగదు నాయాన మనుచు
దాగెద నీ పదములకడ తప్పదు దత్తా.(40)
పిల్లలవలె సంతోషము
తల్లులవలె ప్రేమ తెలియదప్పా దత్తా
ఎల్లలు లేనిది నీదయ
తల్లియు దండ్రియు గురువులు తమరే దత్తా.(41)
అహమును పెంచి చరించితి
దహియించుట నెరుగనైతి తప్పే దత్తా
అహరహుము మిమ్ము తలచెద
సహియించుడి నన్నుకూడ శరణము దత్తా.(42)
తనువును పోషించుటకై
ధన సంపాదన మరిగితి తప్పే దత్తా
తనువు ధనము కఱగు ననుచు
చనువుగ బోధించినారు జయగురు దత్తా.(43)
దత్తుని బత్తుడ ననుచున్
తత్తర పడు టడుగడుగన తప్పే దత్తా
దత్తుడు నాయడ గలడను
సత్తెము తెలిపితిరి మీకు జయమగు దత్తా.(44)
బరువయ్యెను నా తప్పులు
ధరణికి చేటగుట నాది తప్పే దత్తా
తరలి జనగ చోటేదీ
తరియించెద తమ పదముల తప్పదు దత్తా.(45)
పరులకు గల పెంపోర్వక
తరమా నీ దరికిజేర తప్పే దత్తా
మరిమరి బుధ్ధిని కోరెద
తరియింపగ తమ పదముల తధ్యము దత్తా.(46)
తరలిరి రాజులు ఘనులును
తరలిరి పండితులు పెద్ద ధనవంతులనన్
తరలక నిలుచుట కగునా
తరలెద తమ పదముజేర తప్పక దత్తా.(47)
చేసిన తప్పులు చేసెడి
దాసుని దండించ వలయు తప్పక దత్తా
త్రాసము యమునికి విడచెద
వాసన తొలగించ మిమ్ము వదలను దత్తా.(48)
ఉత్తరమో దక్షిణమో
దత్తుని కెరుకని మరచితి తప్పే దత్తా
సత్తెము పల్కుట నేర్చెద
నిత్తెము మిము భజనజేసి నీదయ దత్తా.(49)
మును నే చేసిన కర్మము
తనువు గలుగుతెఱుగ నంటి తప్పే దత్తా
ననునీ చెంతకు జేర్చగ
మనసారా వేడుకొనెద మరిమరి దత్తా.(50)
కర్మముపై కర్మములను
ధర్మము తప్పిచరియించ తప్పే దత్తా
మర్మము లెఱిగిన వాడవు
శర్మదులగు మీరెనాకు శరణము దత్తా.(51)
ఋణముల తీరిన తదుపరి
క్షణమైనను నిలువనిచట శరణము దత్తా
గణపతి సచిదానందా
క్షణమ్మొక యుగమనిపించె శరణము దత్తా.(52)
కర్పటమైనది తనువే
దర్పమణగ మిము తలచుట తప్పే దత్తా
అర్పణ చేసెద తమరికి
సర్పము వంటిది యహమను శరణము దత్తా.(53)
మరిమరి నహముకు లోనై
తరియించెడి దారి గనను తప్పే దత్తా
తరమా మీదయ లేకనె
ధరలో మనుగడ నిజముగ తప్పే దత్తా.(54)
రెండవదేదియు లేదని
ఖండితముగ చెప్పినారు కన నే దత్తా
దండము లందును మరిమరి
దండించి మరల తెలుపుడి దయతో దత్తా.(55)
కరుణామయుండు నిత్యము
దరహాసమ్ముల జగతిని తడిపెడు దత్తున్
వరదున్ సనాతనున్నే
వరముల నడిగెదను చాలు పదములు దత్తా.(56)
భారధ్వాజస గోత్రున్
ధారుణి గండ్లూరి వంశ దత్తాత్రేయున్
కారణ జన్మున్ సదయున్
శౌరిన్ మిమ్మున్ భజింతు సతతము దత్తా.(57)
సారెకు చికాకు పడితిని
దారికి రాదీ మనసన తప్పే దత్తా
ఊరక కూర్చుండు టగునె
కారము నుప్పూ తిననిక గాంచవె దత్తా.(58)
చిక్కుల పరిష్కరణముల్
దక్కునె నే కోరినటుల తప్పే దత్తా
చిక్కుల లెక్కలు వేరని
మిక్కుటముగ తెలిసెనేడు మీదయ దత్తా.(59)
అనుమానము పెనుభూతము
తనువును మరిమరి దహించె తప్పే దత్తా
మనవారల ననుమానిం
చినవాడను సిధ్ధమంటి శిక్షకు దత్తా.(60)
సన్నటి యవమానములును
తన్నులు తింటినని తలువ తప్పే దత్తా
మున్నే చేసిన కర్మము
దన్నులు తప్పవని తెలిసె తండ్రీ దత్తా.(61)
(దన్నులు - సలుపు నొప్పిపెట్టు)
భడవలు తిట్టితి రనుకొని
తడవకు వగచితి మరిమరి తప్పే దత్తా
కడగండ్లును వడగండ్లును
తుడుచుట కగునా భరింతు దూకలి దత్తా.(62)
(దూకలి- నొప్పి బాధ)
సహియించితి నన్యాయము
దహించె నేనూరకుంటి తప్పే దత్తా
సహనము మోమాటములను
వహింప నికపై వలదని బల్కెద దత్తా.(63)
ఊరక గుర్తింపు కొరకు
తారట్లాడితి మరిమరి తప్పే దత్తా
సారెకు యత్నము చేయక
తేరగ నేది దొరకదని తెలిసెను దత్తా.(64)
సిరములు వంచి ఫలమిడెడి
తరువుల వలె ఫలములీయ తరమా దత్తా
మరిమరి కెరలితి మూర్ఖుడ
బరువై పోవగ తెలిసెను పదమిడు దత్తా.(65)
తప్పులు మరిమరి చెప్పుచు
తప్పక మారెదననుకొన తరమా దత్తా
తప్పులు తగ్గించు కునెద
తప్పక దండించుమయ్య దయతో దత్తా.(66)
సత్సంగము కేగవలయు
తాత్సారము చేసినాడ తప్పే దత్తా
ఉత్సాహము లోపించెను
కుత్సితుడను గాను వలయు కూరిమి దత్తా.(67)
గ్రహ దోషంబుల శాంతికి
తహతహ లాడితి నిజముగ తప్పే దత్తా
గృహ గ్రహ కలుములు తమ యను
గ్రహమువలన తొలగు నంద్రు లయకర దత్తా.(68)
తెలియదు క్షమించమనుటయు
తలపను తమరికి కృతజ్ఞతలనుట దత్తా
తలచుచు దత్తా యనుచున్
తలపులు శుచిచేయనైతి తప్పే దత్తా.(69)
నావలె న్నొరులను చూచిన
తావేదీ లోకమందు తగవుకు దత్తా
కోవెల చేసెద నామది
నీవై నామది నిలచిన నీదయ దత్తా.(70)
నీ చేత గల్గ చేతన
నే చెప్పితి పద్యములను నీదయ దత్తా
వాచాలత తగ్గించెద
యాచించెద తమ పదముల నార్తిగ దత్తా.(71)
ఆర్తిని దీర్తువు దయతో
స్పూర్తిని కల్గింతురయ్య సూనృతములతో
ధూర్తుడ తమ చూపులతో
కర్తవ్యము తెలిసెను తమ కతతో దత్తా.(72)
సుతుని కొఱకు శకటము కై
సతతము సతిసుతుల కొఱకు శాంతము కొఱకై
వెతలు భరించుట కొఱకై
పతనము కాను తలతు తమ పదములు దత్తా.(73)
చిటికల చిరుచిరు కవితల
పటుతర సాహిత్యము తమ పటిమయె దత్తా
నిటనిట లాడెడు వారికి
దిటవును గల్గించు సత్య దీప్తులు దత్తా.(74)
గీతా పారాయణ తో
పాతకములు వీడునంచు భక్తుల కెలమిన్
త్రాతవు నీవై తెలపగ
గీతను పఠియించ మాకు క్షేమము దత్తా.(75)
హనుమాన్ చాలీసాతో
జనులకు శుభము గలుగునని సత్యము నెలమిన్
మునివలె చేయించి తమర
వనిన గిన్నిస్రికార్డు పట్టిరి దత్తా.(76)
దేశ విదేశము లరుగుచు
వాసిగ ప్రార్థనలతోడ భక్తుల కెలమిన్
నాశాపాశముల తొలగ
దోసెడు మార్గముల జూపు దొరవే దత్తా.(77)
మాంసాహారము మనసుకు
హింసను నేర్పించు ననెడి హితుడవు దత్తా
ధ్వంస రచన మానుడనుచు
సంసారులకిది తగదను జయ గురుదత్తా.(78)
భజనల చేయుట నేర్పుచు
కుజనుల సజనులగ మార్చు కోవిదుడీవే
నిజముల పల్కుట నేర్చితి
కుజనుడ నేనొకడ మిమ్ము గురడని దత్తా.79
యోగము ధ్యానము నేర్పుచు
భోగులకొక దారిచూపు మోహన దత్తా
రాగ మనురాగముల భవ
రోగములను బాపి మమ్ము లోఁగొను దత్తా.80
అత్తా కోడళ్ళ తగవు
మెత్తని చీవాట్లతోడ మ్రింగుడువడగన్
దత్తుని భజనలు సల్పగ
చిత్తము శాంతించు నటుల చేసెడు దత్తా.81
నాదమె నీయూపిరియట
వేదము నీరూపమంద్రు వేంకటదత్తా
నాదముతో రోగములను
వేదనలను తీర్చుస్వామి ప్రేమగ దత్తా.82
కలియుగపు సంయమీంద్రులు
కలియ తిరుగు లోకమంత కరుణామయులై
కలుములు బాపగ జనులకు
జలముల జన్మించితిరిల జయ గురుదత్తా.83
పరులన్మంచిగ చూచుచు
బరువని తలిదండ్రినంటి పాపిని దత్తా
తరలిరి తలిదండ్రులు నా
తరమా క్షమియించ మనుట తప్పే దత్తా.84
నడకలు తడబడినప్పుడు
నడతలు పెడదారి పట్టి నప్పుడు దయతో
వడిగా కాచెడి వాడవు
జడుడీడని ప్రేమతోడ జయ గురుదత్తా.85
నాదని తలచిన తప్పగు
మీదని యనినంత మాకు మేలగు దత్తా
బాధలు భరించు చుంటిని
మీదగు నాటకమునందు మీదయ దత్తా.86
మనమా సద్గురుని కడకు
జనుమా వినుమా భజనలు శాంతము కొఱకై
కనుమా సద్గురు రూపం
బనవరతమని తలలచెద నార్తిగ దత్తా.87
పరితాపమ్ములు తొలగుట
కొఱకై భవసాగరముల కుప్పించుటకై
సరిలేని దత్త దయకై
పరిపరి విధముల భజింతు పదమిడు దత్తా.88
అరుదైన గురుని కొఱకై
దరిచేర్చెడి సచిదనంద దత్తుని దయకై
వరమిచ్చు తండ్రి కొఱకై
సరిలేరని యందు మిమ్ము జయ గురుదత్తా.89
త్రోవను తప్పితి పడితిని
మీవలననె లేచినాడ మిమ్ముభజింపన్
సేవలు చేయించుకొనుచు
నావను దరిజేర్చినారు నయముగ దత్తా.90
కీలెరిగి వాత పెట్టుచు
మేలగునటు బుధ్ధిచెప్పు మిత్రుడవీవే
చాలని యనకుండగ నా
కేలన్మోడ్తు నదినాకు క్షేమము దత్తా.91
ఉప్పూ కారముల తినుచు
తప్పులు కుప్పలుగ చేసి తమికొనుచును నే
నిప్పుడె మిము తలచితి నా
కొప్పగు మార్గంబు జూపు చోమవె దత్తా.92
నను నేను దిద్దుకొనగ
న్ననవరతము మీదు రక్ష నర్థింతునయా
మనసును తమరై నిలచిన
తనువును తపియింపగలను తమదయ దత్తా.93
మీ పనుపున వొచ్చితినో
నా పనిపైవొచ్చితేనొ నాకేమెరుకా
మీ పదమంటితి విడువక
నా పని చూచుటయె మీకు న్యాయము దత్తా.94
మాయను ఛేదించుము నా
కాయువు తీరుటకు సమయమాసన్న మయెన్
కాయము నీకర్పించెద
సాయము చేసెడి దొరవని జయగురు దత్తా.95
ఏమివ్వ గలను తమరికి
యేమిచ్చిన మీదికానిదేదీ జగతిన్
మీ మాయా సృజనమ్మే
స్వామీ నామది గొనుమిక జయగురు దత్తా.96
నా వెలుపల నా లోపల
నీవై నెలకొనగ నేను నినుగన నైతిన్
నీ వైనమునెఱిగింపవె
నీవై చూపుము కరుణను నీదయ దత్తా.97
రిపులౌదురు హితులైనను
నృపులౌదురు లోకమందు నీదయ కలుగన్
రిపులెవ్వరు హితులెవ్వరు
జపియించెద మిమ్ము సతము జయగరు దత్తా.98
ఊరించుచు రుచులన్నో
స్వారీ చేయమను చుండు సౌఖ్యము లన్నో
వారించెడు వారెవరో
వారిన్దలచుచు భజింతు పదముల దత్తా.99
జగమెఱుగని వాడనునే
త్రిగుణమ్ములు నేడునాకు తిక్కను రేపెన్
సెగతగులగ చింత పడుచు
జగద్గురులని మిము తలతు జయగురు దత్తా.100
హరుడనిరి శుభకరుడనిరి
హరియనిరి కమలజుడవన నరయగ తరమా
అరవిరిసిన చిరునగువుల
గురుడవని తలతు జగతికి గురువగు దత్తా.101
జగము కలుగు నిలచు తొలగు
నిగమాగమ వంద్య దత్త నీదయ వలనన్
పగళులు రాత్రులు కఱిగెను
జగదీశ్వర పాహిపాహి జయగురు దత్తా.102
మీ వలననె తప్పు తెలిసె
మీ వలననె బుధ్ధికలిగె మీదయ తండ్రీ
మీ వలననె మోహముడిగె
మీ వలననె పద్యమమరె మీదయ దత్తా.103
ఎవ్వాని నవ్వు వెన్నెల
యెవ్వాని కరుణ జలనిధి యెవ్వండెవ్వం
డెవ్వాడిచ్చున్న భయం
మ్మవ్వానిన్ శరణమందు నార్తిగ దత్తా.104
ఎవ్వాని చూపు లమృతము
లెవ్వాని పలుకులు నాద మెవని కరుణతో
రవ్వలగు దొసగు లనినే
సవ్వడి చేయుచు భజింతు జయగురు దత్తా.105
అండగ నిల్చెడి గురుడవు
దండధరుని భయము తీర్చు ధర్మాత్ముడవే
వెండియు రక్షణ గూర్పగ
గుండె గుడి నెలకొని యున్న గురుడవు
దత్తా.106
పలుకులలో దత్త భజన
తలపులలోదత్త దత్త దత్తాయందున్
కలలోనను దత్త భజన
సలిపెడు వర మీయుమయ్య జయగురు దత్తా.107
అవధూత దత్త పీఠము
రవిచంద్రులు నిలచు వరకు రక్షణ నిచ్చున్
శివరామకృష్ణ శాస్త్రిని
సవినయముగ పల్కుచుంటి జయగురు దత్తా.108.
