ఇప్పటి వరకు నేను వ్రాసిన పద్యములన్నియు అయ్య వారి మీదనే. మరి నా మీద పద్యములు వ్రాయవా అని అమ్మ నాతో అన్నట్లు అనిపించినది.
అందులకే ఈ శ్రీ మాతవుగా అని బుజ్జగిస్తూ, బామాలుతూ నా విన్నపాలను వినిపించాను.
కం.
ఎన్నో బ్రహ్మాండంబులకన్ని
టికిన్ తల్లివీవె యని వింటినిగా
నిన్నేమని పొగడుదునే
చిన్ని కుమారుడను గాద శ్రీ మాతవుగా.1
ఏమీ తెలియని వాడను
యీ మాయాతెరను ద్రుంచు మీశునిరాణీ.
ఏ మాటకు నామాటే
చీమకు బ్రహ్మ కి జననివి శ్రీ మాతవుగా.2
ఎన్నో పద్యము లల్లితి
నన్నీ మానాన్నపైన యనుకుంటినినే
నాన్నా నేనూ యొకటని
చెన్నుగ చెబితివి గదమ్మ శ్రీ మాతవుగా.3
ఎన్నో యుగములు గడచెను
నాన్నను నిన్నును మరచితి నన్నెన్నకుమా
అన్నీ యెఱిగిన దానవు
చిన్నా నేనుంటి ననవు శ్రీ మాతవుగా.4
తల్లివి బ్రహ్మాండములకు
తల్లీ నిన్నెట్లు పోల్తు దండములందున్
తల్లీ యని బిలచిననూ
చెల్లీ యని యన్ననీవె శ్రీ మాతవుగా.5
ఎల్లలు లేవీ జగతికి
తల్లివి నీవందురమ్మ దయజూపగదే
మెల్లగ వేడితినమ్మా
చెల్లని వాడని యనకుము శ్రీ మాతవుగా.6
వేదాంతులు నిన్నెరుగక
పాదాక్రాంతు లగుదురట పద్మదళాక్షీ
వేదము నేనెరుగుదునా
చేదుకొనవె తల్లి నన్ను శ్రీ మాతవుగా.7
తరచుగ గౌరీ యన్నను
తరింతురాల్మొగలు నీదు దయతో తల్లీ
పరవశమున నిన్ను దలచు
చిరు కోరిక దీర్చవమ్మ శ్రీ మాతవుగా.8
అరవిరిసిన పూలకు నీ
దరహాసపు తీరులేదు తరుణేందు ముఖీ
చిరుచిరు నగవులు గన నే
చిరకాలము వేచియుంటి శ్రీ మాతవుగా.9
నీకను సైగల సురలకు
వీఁకము గలిగించెనంట విశ్వేశ్వరివే
నీ కనుపాపల వెలుగులు
చీకట్లను తొలగదోయు శ్రీ మాతవుగా.10
మంగళ గౌరీ యన్నను
మంగళముల నిచ్చు తల్లి మాహేశ్వరివే
బంగరు తల్లీ యందును
చెంగట నిలుచుండనిమ్ము శ్రీ మాతవుగా.11
ఆకలి దీర్చెడి తల్లివి
నాకము నాకేలనమ్మ నారాయణివే
నీకడ నన్నుంచినచో
శ్రీ కరమగు నాకుచాలు శ్రీ మాతవుగా.12
వడిగా పూజలు సల్పను
మడియాచారము లెఱుగను మన్నింపగదే
తడిబారెను నా కన్నులు
చెడునడతలు మాన్పవమ్మ శ్రీ మాతవుగా.13
ఏమడిగిన నదియె దొరకు
నేమని యడుగుదు నిను పరమేశ్వరి గనుకన్
ఏమీ కోరని వాడన్
శ్రీ మంతుడ నేనునీవు శ్రీ మాతవుగా.14
సుందర హిమవన్నగములు
సుందర వనముల తరువులు సుందర నదముల్
సుందరముగ సృజియించగ
చెందెను మాకెల్లరికిని శ్రీ మాతవుగా.15
లలితా యందురు కొందరు
ఫలితము నాశించి తాము వరదాయినివే
లలితా యని నే బిల్తును
చిలికించుము చిరునగవులు శ్రీ మాతవుగా.16
గిరిబాలగ బుట్టితివట
గిరీశుని కరమును బట్టు క్షేమంకరివే
విరులను నేనిచ్చెద నీ
చిరునగవుల చూపుమమ్మ శ్రీ మాతవుగా.17
అలకల మోమును జూడగ
లలితా యని బిలువ శివుడు లాలిత్యముగా
మిలమిల లాడగ కన్నుల
చిలికించితివట నగవులు శ్రీ మాతవుగా.18
విజయము లిచ్చెడి తల్లివి
సుజనుల రక్షింతువమ్మ శుభకారిణివే
కుజనుల సరి దిద్దెదవే
త్రిజగన్మోహిని శరణము శ్రీ మాతవుగా.19
నీ దయగల్గిన విజయము
నీ దయ తొల్గ నపజయము నికరము తల్లీ
నీ దయ గల్గిన చాలున్
శ్రీ దరిజేరును శరణము శ్రీ మాతవుగా.20
నెలవై యుంటివి జగతికి
కొలువై యుందువు సుజనుల గుండెలలో నా
తలపుల నెలకొని యుండవె
చెలువారగ నిన్నుగొల్తు శ్రీ మాతవుగా.21
అరవిరెసెను దరహాసము
పరికించితి నా నుతులని భావించెదనే
మరినా పద్యములన్నియు
చిరుకానుకలమ్మ నీకు శ్రీ మాతవుగా.22
కలయో నిజమో యెఱుగను
చలచల్లగ జారిపోయె జవసత్వములున్
వెలుపల వెదికిన దొరకవు
చిలికించవె నీదు కరుణ శ్రీ మాతవుగా.23
కేలను గుడుచుచు మురియగ
పాలని త్రాగింతువమ్మ పసిపాపలకున్
మేలొనరింతువు జననిగ
లీలలు నేనెన్న తరమె శ్రీ మాతవుగా.24
సృష్టి స్తితి లయములు నీ
యిష్టాపూర్తముల నంద్రు యీశ్వరివీవే
దృష్టిని సారించి సకల
శిష్టుల రక్షింతువమ్మ శ్రీ మాతవుగా.25
ఏక మనేకంబగునట
నీకను రెప్పలు తెరచిన నీలో జగముల్
చీకటికావల నీవే
శ్రీ కర శుభకర శరణము శ్రీ మాతవుగా.26
పండితులును పామరులును
దండిగ ధనమున్నవారు తమలో రిపులన్
దండించ లేక బోయిరి
చెండాడుము నా రిపులను శ్రీ మాతవుగా. 27
అణువణువున నీ వుందువు
కణకణమున నీదు శక్తి కదిలించుటకున్
కొనియాడెద నీ కరుణను
చినుకై మాపై కురియుము శ్రీ మాతవుగా.28
మాతవు వాణికి లక్ష్మికి
మాతవు దుర్గాంబకు మాకు మాతవు నీవే
మాతా యనిబిలిచినచో
చేతన కలిగింతువమ్మ శ్రీ మాతవుగా.29
అమ్మను పొగడిన వారలు
కమ్మని పద్యములనల్లి కవులుగ మారెన్
అమ్మా వందనమన జే
జెమ్మను నను కవిని జేయు శ్రీ మాతవుగా.30
అన్నియు తెలుసని యంటిని
యెన్నియొ చదివితి ననుకొని యేమరు పాటున్
చిన్నగ నవ్వులు విరియగ
చెన్నుగ బుగ్గలు పుణికిన శ్రీ మాతవుగా.31
వెలుగులు గుప్పుచు జగతికి
తొలి గురువుగ నీవె తమిని తొలగింతువుగా
ఉలివలె నీ కను సైగల
శిలలను శిల్పములజేయు శ్రీ మాతవుగా.32
కోలాహలముప్పొంగగ
హాలాహలమును కొనుమని హరునకు జెప్పన్
శూలి శితికంఠుడగుటీ
చేలము బట్టుట వలననె శ్రీ మాతవుగా.33
శ్రీ లంకన్ వెలిసితివే
లీలగ ట్రింకోమలీపురేశ్వరి వనినే
కేలన్మోడ్తు సభక్తిన్
శ్రీ లన్ గలిగించ వమ్మ శ్రీ మాతవుగా.34
సంచిత పాపములెంచవు
కాంచీ పురమున నెలకొను కామాక్షివిగా
మంచిని పెంచెదవేమా
శించక వందనము లందు శ్రీ మాతవుగా.35
ఆద్యవి శృంఖల దేవీ
ప్రద్యుమ్న పురమున వెలయు భర్గుని రాణీ
విద్యా రూపిణి పద్యపు
సేద్యము చేయంగనిమ్ము శ్రీ మాతవుగా.36
చాముండివి కలిగించుచు
క్షేమము మహిష పురమునకు శ్రీ వర్ధినివే
చామంతుల పూజింతున్
ప్రేముడి కాపాడవమ్మ శ్రీ మాతవుగా.37
ఆలంపురమున మాతవు
పూలన్ నిను జోగులాంబ పూజింతురుగా
శ్రీ లన్ గూర్చుచు నిజ స
చ్చీలుర కాపాడుమమ్మ శ్రీ మాతవుగా.38
శ్రీ శైలంబున నెలవై
పాశము తొలగింతువమ్మ భ్రమరాంబికవై
క్లేశంబుల తొలగింపుము
లేశము లేకుండు మాకు శ్రీ మాతవుగా.39
తరగని సంపదలకు నీ
కరవీర పురమున లచ్చి కాపురముండున్
దరిశన మొందిన వారికి
సిరిసంపద లిచ్చితీవు శ్రీ మాతవుగా.40
విజయము లిచ్చెడి దుర్గవు
నిజముగ బెజవాడ యందు నిలచితి వమ్మా
సుజనుల కరుణించుచు నీ
త్రిజగము లందుంటి వమ్మ శ్రీ మాతవుగా.41
తిరముగ వెలిసెను మాహుర్
పురమునగల యేకవీర పూజల నందున్
కరుణా మయివని కొలుతును
సిరులను నేకోరనమ్మ శ్రీ మాతవుగా.42
ఉజ్జయిని మహాకాళివి
ముజ్జగముల నేలుతల్లి పురరిపు రాణీ
ఒజ్జవు రా రమ్మనుచున్
సెజ్జగ మది నుంచినాను శ్రీ మాతవుగా.43
పురుహూతిక మాత పిఠా
పురమున గల పీఠమందు పూజలు గొని మా
కరుదైన దర్శనమ్మును
చిరకాలమునిచ్చి తీవు శ్రీ మాతవుగా.44
ఒరియా రాష్టము నందున
గిరిజా మాతకు శరణని కేలను మోడ్తున్
వరలగ జాజిపురంబున
స్థిరముగ పూజింతురమ్మ శ్రీ మాతవుగా.45
శిక్షలు వేయక జనులకు
దక్షా వాటికన నీవు దాక్షాయణివై
రక్షణ మాణిక్యాంబగ
శిక్షణ నిప్పింతువమ్మ శ్రీ మాతవుగా.46
గువహటి పురకామాఖ్యా
నివసింతువు గుండెలోన నీలాంబరివై
కవులందున కవితవుగా
శివాని వీవమ్మతల్లి శ్రీ మాతవుగా.47
జయమగు ప్రయాగ పురమున
ప్రియముగ శరణమ్ము మాధవేశ్వరి యనగన్
రయమున రక్షణ చేయుచు
శ్రియముల చేకూర్తువమ్మ శ్రీ మాతవుగా.48
జోలలు పాడగ లేనే
జ్వాలాముఖ వైనమేమి వైష్ణవి మాతా
హేలగ నర్తింతువు నీ
లీలలు నేనెన్నలేను శ్రీ మాతవుగా.49
గయ గయ యన్న జయంబులు
గయలో మాంగళ్యగౌరి గలిగింతువుగా
నయములు చేకూర భవుని
ప్రియసతి వనిగొలిచెద నిను శ్రీ మాతవుగా.50
పరుగులిడి వారణాసికి
శరణు విశాలాక్షి యనగ జయములు గల్గున్
హర హర విశ్వేశ్వా యని
శిరముంచిన శుభములిచ్చు శ్రీ మాతవుగా.51
పావన హిమవన్నగముల
పావకి కాశ్మీరము పరిపాలన జేయన్
లావుగ సరస్వతికి నే
సేవల నందింతు గొనుము శ్రీ మాతవుగా.52
భావింపగ మాకగునా
యీ విశ్వము నిండియుండు యీశ్వరి వీవే
దేవి తవ విరాడ్రూపము
సేవించెడి భాగ్యమిమ్ము శ్రీ మాతవుగా.53
హాటకగర్భుని రాణివి
పాటవమొప్పంగ నిన్ను ప్రస్తుతి జేయన్
ధాటిక పద్యములల్లుట
చీటకమనిపించు కవికి శ్రీ మాతవుగా.54
నిద్రాణమైన శక్తుల
భద్రమ్ముగ మేలుకొల్పు పార్వతివే నీ
ముద్రల నభయము జూపుచు
చిద్రూపము చూపుమమ్మ శ్రీ మాతవుగా.55
పాడియె నీకిది యనుచును
దాడిమి విరులు నినుజూసి తలవంచునుగా
వాడిన వర్ణము వాడని
చేడియవని మ్రొక్కులిడుదు శ్రీ మాతవుగా.56
అణువణువునా కహము నీ
కణకణమున శక్తినిండె కరుణామయివే
మనుజుల తీరిది యనకుము
చినవాడని దారిజూపు శ్రీ మాతవుగా.57
నీలో లోకము లున్నవి
నాలోగల లోకమంత ననుబంధించెన్
నాలోకము లడగించుము
లీలగ నన్నుధ్ధరించు శ్రీ మాతవుగా.58
నింగిని తారల మెరుపులు
రంగుల పూల్పుడమికద్దె రాతిరి బవళుల్
సింగారము నీకొంగుకు
చెంగావి వలువను దాల్చు శ్రీ మాతవుగా.59
నింగిని పులిమిన రంగులు
బంగరు తల్లికి వలువల వర్ణము లలమెన్
చెంగావిరంగు చెఱఁగును
సింగారించితివి నీవు శ్రీ మాతవుగా.60
అవధులు లేనిది నీదయ
ప్రవహించును గుండెనుండి వరదై గంగై
అవకరములు గలవాడను
చివరకు దరి చేర్చుకునెడి శ్రీ మాతవుగా.61
గగనము నెగిరెడి హంసలు
చిగురులు తొడిగినవి నీదు చిరునవ్వులలో
ధగధగ రవికిరణములను
శిగలో గురుల మెరపించు శ్రీమాతవుగా !!62
సరసము లాడితివేమో
మెరుపులు కనిపించె నీదు మేలిముసుగులో
హరుడే పకపకమన నీ
చిరునవ్వులు తారలాయె శ్రీ మాతవుగా.63
తప్పని చెప్పితి బిడ్డకు
తప్పని చెప్పితి పరులకు తప్పుల గనుచున్
తప్పైనది నా వలనని
చెప్పక పోతిని శరణము శ్రీ మాతవుగా.64
బొక్కితి నిన్నియు మునుకొని
చిక్కితి భవపాశములకు చెప్పగ నేలా
రెక్కలు తొడిగిన యాశల
చిక్కులు తొలగించుమమ్మ శ్రీ మాతవుగా.65
గలగల మను సెలయేరులు
కిలకిల రవములు శుకములు కేకుల రవళుల్
మిలమిల కన్నుల చేపలు
చెలువము నీ సృష్టి లోన శ్రీ మాతవుగా.66
అమ్మాయని నే బిలచిన
రమ్మాయని చిరునగవుల రక్షణగూర్పున్
కొమ్మాయని విరుల నిడగ
లెమ్మా యని పథము జూపు శ్రీ మాతవుగా.67
నాటకమని మఱచితినే
పాటవముగ పాట్లుబడితి పాత్రలలోనన్
సూటిగ చెప్పెదనమ్మా
చేటగు జన్మముల నాపు శ్రీ మాతవుగా.68
నన్నెవరో కని నవ్వగ
గన్నులు తెరచీ తెరవని కసుగాయగ..నా
వెన్నునుఁబ్రీతిగఁ దట్టుచుఁ
జిన్నగ జోకొట్టినట్టి శ్రీ మాతవుగా.69
వాలము లంకను గాల్చుట!
వాలిని పరిమార్చి తిమికి వారథి గట్టన్
కాలపు మహిమా! మరినీ
చేలము బట్టుట వలననె శ్రీ మాతవుగా.70
నిప్పులు గ్రక్కున గురియుచు
దిప్పలు కుప్పలగునమ్మ తీండ్రము హెచ్చన్
ముప్పులు ముంచగ నీకున్
జెప్పిన దొలగించు చుండు శ్రీ మాతవుగా.71
అమ్మా యన్నట్టి పిలుపు
కమ్మని దీలోకమందు గన్నులు తడుపున్
అమ్మా యనుచు బిలువగా
జెమ్మగిలు కనుల దయగొను శ్రీ మాతవుగా.72
పుట్టుక లెన్నియొ కలిగెను
బుట్టితి నీ పుడమిపైన పోరును సల్పన్
బట్టి విడను నీ పాదము
చిట్ట చివరి జన్మ నిడిన శ్రీ మాతవుగా.73
అందెల రవళులు విందులు
మంద గమనమున రమ్ము మాయింటికి హే
బృందావన సంచారిణి
చిందులు వేయించు మదిని శ్రీ మాతవుగా.74
సదమల వృత్తిన కొలచుచు
బదముల నంటెదను తల్లి పరమేశ్వరివే
పదులగు పాపములణచెడి
త్రిదశేశ్వరి వమ్మనీవు శ్రీ మాతవుగా.75
భవ రోగమ్ముల బాపెడి
భవానివని సతము నిన్ను ప్రార్థించెదనే
శివశివ యన్నను మురిసెడి
శివానివని శరణమందు శ్రీ మాతవుగా.76
సంపెంగ రంగు వలువకు
సంపెంగలు కొప్పు నందచందము లింపౌ
కెంపుల స్వర్ణాభరణము
చెంపల సిగ్గలముకునెడు శ్రీ మాతవుగా.77
జగముల నేలెడు తల్లివి
జగతికినాథుని సఖియవు జగదీశ్వరివే
భగభగ లాడెడి రుద్రుని
సెగలను భరియింతువమ్మ శ్రీ మాతవుగా.78
మనుజులు మృగములు తరువులు
జననీ తమసృష్టి జీవజాలములకటా
ఎనుబది నాలుగు లక్షలు
చినిగిన వస్త్రముల బాపు శ్రీ మాతవుగా.79
కలడనుచును లేడనుచును
యలసిరి వెదకుచు ఘనులిట హరికన పడకన్
కలడని చెప్పవదేమని
చిలికింతువు చిరునగవులు శ్రీ మాతవుగా.80
~~~~
మెలికల పాములు మెడలో
సలిలము చిందించు గంగ సతమత మగుచున్
పలుకుల లో నవనీతము
చిలికించుట నీకె చెల్లు శ్రీమాతవుగా.81
ఒత్తిడి నిండిన నామది
లత్తుకలంటగ తలనిడి రక్షణ యంటిన్
మెత్తని హస్తము నిమురగ
చిత్తము శాంతించెనమ్మ శ్రీ మాతవుగా.82
నగలా నాగుల దండలు
సగమే దేహము సరసన సరిగంగంమ్మా
నగవుల నాపవు నగజా
సిగలో జాబిలి వెలుగుల శ్రీ మాతవుగా.83
కోతుల దేమాభాగ్యము
సేతువు నిర్మించె నాడు శ్రీ రామునికై
చేతన నీవిచ్చినదే
సీతమ్మా శరణు శరణు శ్రీ మాతవుగా.84
ఎందరొ ఋషులెందరొ నీ
ముందర తమి తారలైరి పొందగ వరముల్
కొందరు నావలెనె తల
క్రిందగుదురు నవ్వబోకు శ్రీ మాతవుగా.85
చేతులు రెండును మోడ్చెద
చేతలు సరిజేసి కొనుచు సేవల నిడుదున్
చేతన నీదే నిన్నే
రీతిన కొలచెదను నేను శ్రీ మాతవుగా.86
వేడిన దర్శన మీయవు
వేడని వారికి యగుపడి వెనుకనె నిలువన్
పాడియె నీకిది తల్లీ
క్రీడలు చాలించుమమ్మ శ్రీ మాతవుగా.87
దోగాడెడి పసి పాపలు
తోఁగించెడి దుష్టులు నిను దొరకొందురుగా
దాగుడు మూతల నాపుము
క్రీగాడిని కావవేల శ్రీ మాతవుగా.88
రేపని మాపని చూడకు
రేపకుమిక యాశలన్ని రగ సౌరాష్ట్ర ప్రజల ప్రార్థలందున్
దాసుల తప్పులు సైచుచు
క్లేశము లణగింతువమ్మ శ్రీ మాతవుగా.89
శ్రీ సోమనాథ పురమున
వాసిగ సౌరాష్ట్ర ప్రజల ప్రార్థన లందున్
దాసుల తప్పులు సైచుచు
క్లేశము లణగింతువమ్మ శ్రీ మాతవుగా.90
శ్రీ శైలగిరుల మనసు
న్యాసము శ్రీ మల్లికార్జునాయన చాలున్
పాశము లణతువు సోదర
శ్రీశుని తిరుమల గిరులని శ్రీ మాతవుగా.91
కాలము మీరూపమ్మట
హేల మహాకాలుడుజ్జయినిలో వెలసెన్
కాలుని తన్నుట మరినీ
చేలపు మహిమే యనంద్రు శ్రీ మాతవుగా.92
ఓం కారమ్మమలేశులు
ఝంకారపు నర్మదమ్మ ఝరిలో తడిసెన్
ఐంకారము నీ రూపము
హ్రీంకారపు సత్త్వమిడుము శ్రీ మాతవుగా.93
పరలీ పురమున నెలకొన
తరమా హే వైద్యనాధ తమరిని గెలవన్
గిరిజా పతివని బిల్చితి
చిరునగవుల జూచితమ్మ శ్రీ మాతవుగా.94
లోభిని యాత్రల కేగితి
లాభము ఢాకిని పురమున రక్షణ దొరకెన్
నా భారము వహియించిన
శ్రీ భీమాశంకర సతి శ్రీ మాతవుగా.95
చేతన రాళ్ళకు కలిగెను
సేతువు రామేశ్వరమున చెందిన వరమే
కోతుల జన్మము ధన్యము
సీతమ్మా నీమహిమయె శ్రీ మాతవుగా.96
నాగేశా యని వెదికితి
దాగెను దారుక వనమున దర్శన మిడె నీ
భాగము సగమా మరి నీ
శ్రీ గుణమే మాకుచాలు శ్రీ మాతవుగా.97
వాసిగ పురముల యందున
కాశికి యేసాటి కావు కాపాడగ నీ
దాసుల సరియెవరని వి
శ్వేశాయన మురిసెదవట శ్రీ మాతవుగా.98
త్ర్యంబకుడే నీతోడుగ
గుంభనముగ నాసికపుర కూర్మిని బెంచన్
అంబలి నైవేద్యమిడుచు
చెంబెడు గోదారి నిడుదు శ్రీ మాతవుగా.99
కేదారేశా నీదయ
రాదా హిమ శైలమందు రహి నీవుండన్
రాదారిన గౌరీ యన
చేదుకొనవె మమ్ము మురిసి శ్రీ మాతవుగా.100
శివశివ ఘృష్ణేశాయన
భవాని వై రక్షణనిడు భవభయ హారీ
కవులందున నేనొకడను
శివాని గొను పద్యములను శ్రీ మాతవుగా.101
శివుడుండిన కృష్ణాతటి
శివ యమరా రామపురపు క్షేమంకరివే
శివరామకృష్ణుడను మం
చివాని పద్యములను గొను శ్రీ మాతవుగా.102
ధారగ క్షీరము పోసిన
యారామములందు శివుని యర్థాంగివిగన్
కోరిన కోర్కెలు దీర్పన్
క్షీరారామపురవాసి శ్రీ మాతవుగా.103
దక్షారామము నందున
దీక్షగ భీమేశుతోడ తిరముగ నిలచెన్
భిక్షుల ప్రోచుచు దుష్టుల
శిక్షణ చేయుంచుమమ్మ శ్రీ మాతవుగా.104
నీమంబుగ శివ నామము
భీమారామమ్మునందు పేర్మిన జేయన్
సోముని సిరమున దాల్చుచు
క్షేమము చేకూర్తువమ్మ శ్రీ మాతవుగా.105
భీమవరమ్మున వరలుచు
సోమేశ్వరుతో నెలకొని శుభముల నిచ్చున్
కాముని రక్షించితివట
సేమమ్ముల గూర్పుమమ్మ శ్రీ మాతవుగా.106.
ఏమాత్రము దయజూపడు
రామాయని పిలచినాను రహిజూపడుగా
నామాటను వినిపింపుము
క్షేమము గల్గించుమమ్మ శ్రీ మాతవుగా.107
నా మాతా పితరులకును
నామది నిలచిన గురులకు నావారలకున్
రాముని బందుగులనుకొని
క్షేమము గల్గించుమమ్మ శ్రీ మాతవుగా.108
స్వస్తి.

No comments:
Post a Comment