శ్రీ శివాష్టోత్తర శత నామావళి.
^^^^^^^
lllllllllllllllllllllll
lllllll =°= lllllll
lllllllllllllllllllllll
lllllllllllllllllllllll
lllllllllllllllllllllllllllllllllllllllllllllllll
lllllllllllllllllllllll. \
llllllllllllllll
llll
llllllllllllll
llllllllllllllllllllll
llllllllllllllllllllllllllllllllllllllllllll
1)ఓం శివాయ నమః
ఓన్నమ శివాయ యన్నను
చెన్నుగ నవ్వితివి స్వామి శ్రీ కంఠుడవే
అన్నన్నా మరువకు నను
కన్నప్పను గాచినటుల కరుణించు శివా
2)ఓం మహేశ్వరాయ నమః
శరణము మహేశ్వరాయన
సరగున పదముల నిడెదవు శశిశేఖరుడా
మొరలను వినవయ్య భవుడ
కరముల మోడ్చెద హరహర కరుణించు శివా!2
3)ఓం శంభవే నమః
అంబా సుతునే వేడెద
గుంభనగా యుండువాని గుట్టును దెలుపన్
అంబా కరుణించ మనెద
శంభో శంకర మహేశ శరణంటి శివా.3
4)ఓం పినాకినే నమః
శరణము పినాక పాణికి
శరణము శర్వాణియంటి శాంతించగదే
శరణము గణేశ యంటిని
శరణము శరవణ భవునకు శరణంటి శివా.4
5)ఓం శశిశేఖరాయ నమః
శరణము శశిశేఖరునకు
శరణము శీతేశ్వరునకు జగదీశునకున్
శరణము సురేశ యందును
శరణు శరణు భవహరునకు శరణంటి శివా.5
6)ఓం వామదేవాయ నమః
వందనము వామదేవా
సుందరవదనా శశిధర సురపూజితుడా
చందన మందింతు తమకు
వందనమందును దయగొన పరమేశ శివా.6.
7)ఓం విరూపాక్షాయ నమః
శరణంటి విరూపాక్షా
దొరకని వాని వనుచు నిను దూషించెదరే
సరగున పద్యము లల్లితి
కరములు మోడ్చెతి దొరవని కరుణించు శివా.7
8)ఓం కపర్దినే నమః
దొరకవు కపర్ధి యందురు
దొరఁకొను వారికి జగతిన దొరకని దేదీ
దొరలందున మేటి దొరవు
దొరకెను నా పద్యమందు దొరవంటి శివా.8
9)ఓం నీలలోహితాయ నమః
కరకంఠ నీల లోహిత
మురుడేశ్వరమున శివుడని పూజించితినే
విరులును బిల్వదళములిడ
సరగున గోకర్ణము జని శరణంటి శివా.9
10)ఓం శంకరాయ నమః
హరహర శంభో శంకర
పురహర భవభయ హరయని పూజింతు నయా
వరముల నేమియు గోరను
విరులను పూజింతు మొరలు వినుమయ్య శివా.10
11)ఓం శూలపాణయే నమః
ఏమడుగ శూల పాణిని
యేమడుగను గజవసనుని యేవర మడుగన్
ఏమడిగిన యేమగునో
యేమడుగను యేమయినను యిమ్మంటి శివా.11
12)ఓం ఖట్వాంగినే నమః
ఏమడిగెద ఖట్వాంగుని
నా మనమున నిలువమందు నయనా యుధునే
ఏ మడిగెద ముక్కంటివి
నీ మాయలు చాలనందు నిటలాక్షశివా.12
13)ఓం విష్ణువల్లభాయ నమః
శ్రీవిష్ణు వల్లభాయని
సేవింతును శూలపాణి సేమంబిడుమా
లావొక్కింతయు లేదయ
నీవే దిక్కంటి స్వామి నీలగళ శివా13
14)ఓం శిపివిష్టాయ నమః
ఒకపరి కపర్ది వలె గని
యొకపరిని జటాధరి వని యుగ్రుడ వనిరే
సకలము నెరిగిన వాడని
యొకపరి శిపివిష్టు డనిరి యుగ్రాక్ష శివా.14
15)ఓం అంబికానాథాయ నమః
శరణము సర్వజ్ఞయనెద
కరుణింపవె నన్ను నంబికానాథా నీ
చరణమ్ములనిమ్మంటిని
శరణంటి నుమాపతి తమ జయమంటి శివా.15
16)ఓం శ్రీకంఠాయ నమః
శివశివ శ్రీ కంఠాయన
శివమెత్తుచు నాట్యమాడి చిందులు తొక్కన్
అవసరమా శశిశేఖర
నివసించవె నా మనమున నిటలాక్ష శివా.16
17)ఓం భక్తవత్సలాయ నమః
జే భక్త వత్సలాయని
నీ భక్తులు నీలకంఠ నినుతలతురుగా
జే భూతనాథ యందును
నీ భక్తుడ నేనొకడని నినదింతు శివా.17
18)ఓం భవాయ నమః
శివుడవొ భవుడవొ హరుడవొ
యెవరని పూజించనయ్య యెంచెద నెటులో
శివరామకృష్ణుడను నా
కవితల నందింతునయ్య కరుణించు శివా.
19)ఓం శర్వాయ నమః
జయజయ శర్వా శరణము
జయమగు బీమా మొరవిని శాంతించ వయా
జయజయ శూలీ శరణము
జయములు యశములు కపర్ది జయమంటి శివా.19
20)ఓం త్రిలోకేశాయ నమః
వందనము త్రిలోకేశా
యెందని వెదికెదను స్వామి యెటులుంటి వయా
అందని వాడవనిరి నిను
నందరి వాడవని యందు నగుపడవె శివా.20
21)ఓం శితికంఠాయ నమః
రావయ్యా శితికంఠా
నీ వృషభము నెక్కి రమ్ము నెలదారి శివా
మా విందులు గై కొనుచున్
మా విన్నపములు వినవలె మాతండ్రి శివా.21
22)ఓం శివాప్రియాయ నమః
వందనములు గిరిజాపతి
వందనము శివాప్రియా! కపాలీ! శూలీ!
వందనముపార్వతీశా
వందనములుమామహేశ పరమేశ శివా.22
23)ఓం ఉగ్రాయ నమః
వందనముగ్రా భర్గ్యా
చందనమందింతు నయ్య శాంతించవయా
ముందుగ నిను తలచితినే
మందమతిని కాన నన్ను మన్నించు శివా.23
24)ఓం కపాలినే నమః
శూలివి కపాలివి భవా
హాలాహల భక్షకుడ వహర్పతివీవే
పాలింపవె నీ భక్తుడ
చాలించవె నీదుమాయ శరణందు శివా.24
25)ఓం కామారయే నమః
కామారివి సర్వేశా
నామార్చన చేయనిమ్ము నాగాభరణా
ఏమార్చకు నీ భక్తుడ
రామార్చిత పాదయుగ్మ రతిసేవ్య శివా.25
26)ఓం అంధకాసుర సూదనాయ నమః
చేదుకొను మంధకాసుర
సూదన యని వేడుకొన్న శుభకరమని నే
నీదయ కోరితి నీశా
పాదము లిమ్మంటినయ్య పరమేశ శివా.26.
27)ఓం గంగాధరాయ నమః
గంగాధర కరుణాకర
రంగాశ్రిత పాదయుగ్మ రతిసేవ్య శివా
శృంగారమెటుల చేసెద
చెంగట నిలుచుండనిమ్ము చెలువార శివా27
28)ఓం లలాటాక్షాయ నమః
శరణంటి లలాటాక్షా
శరణంటిని నీలకంఠ జయపరమేశా
శరణంటి త్రిలోకేశా
శరణంటిని భూతనాథ శాంతించు శివా.28
29)ఓం కాలకాలాయ నమః
వందనము కాలకాలా
యెందులకాశూలమయ్య ఋషభ ధ్వజుడా
ఎందులకు మహాకాలా
బొందికి పాములు, విబూది పులుమెదవు శివా.29
30)ఓం కృపానిధయే నమః
ఏమడుగ కృపానిధి మిము
యేమడుగ దయానిధి మిము ఋషభ ధ్వజునిన్
ఏమడిగిన యదె దొరకును
యేమడుగుట రానివాడ నేమందు శివా.30
31)ఓం భీమాయ నమః
కం.
భీమా వందనమయ్యా
రా మాలో రిపుల బాపి రక్షింపవయా
సోమార్ధధరా శరణము
కామారీ శరణు శరణు కరుణించుశివా.31
32)ఓం పరశుహస్తాయ నమః
శరణంటి పరశుహస్తా
శరణంటి పినాకపాణి శరణు మహేశా
శరణంటిని విశ్వేశా
శరణము శ్రీ శైల వాస శరణంటి శివా.32
33)ఓం మృగపాణయే నమః
ఏలా మృగపాణీ నిన్
భోళా శంకరుడ వంద్రు భూతేశ శివా
హాలాహలమే మేలా
యాలియె మా యన్నపూర్ణ యగుపడదె శివా.33
34)ఓం జటాధరాయ నమః
చుట్టూ భూతగణంబులు
బిట్టరచిన వినవు నీవు భేతాళవిభో
ఎట్టా నీ తల కడుగను
చట్టున కనబడవు నీవు జటధారి శివా.34
35)ఓం కైలాసవాసినే నమః
కైలాస వాసివట నీ
లీలల నేనెన్నలేను, రేయింబవళుల్
హేలగ నాట్యము లాడుచు
కేళియె భక్తుల గనుటయు క్ష్వేళగళ శివా.35
36)ఓం కవచినే నమః
కవచము నీకేల కవచి
శవభస్మము చాలదేమొ శాంతించుటకున్
నివసించ శ్మశానమ్మా
నివాసముండవె మనమున నిటలాక్ష శివా.36
37)ఓం కఠోరాయ నమః
హఠమేలనో కఠోరా
శఠుడను నేనొకడ స్వామి శరణంటినయా
మఠమే వేసెద నయ్యా
కఠమర్దుడ వంద్రునిన్ను గనుపింపవయా.37
38)ఓం త్రిపురాంతకాయ నమః
త్రినయన త్రిపురాంతకుడవు
మినుసిగదేవర కపాలి మేలుభజింతున్
మనసిజమర్దన గావర
కనులున్నను గాంచ లేను కరుణించు శివా.38
39)ఓం వృషాంకాయ నమః
(ఆవాహనము)
రా రమ్మంటి వృషాంకా
నీ రాకయె మాకు ముదము నీలగళేశా
దారంతయు పూలుపరచి
నీరాకకు వేచియుందు నిటలాక్ష శివా.
39
40)ఓం వృషభారూఢాయ నమః (ఆసనము)
ఆసనమిదె వృషవాహన
దాసుని హృదిపీఠమిడెద దహనాంబకుడా
ఆశగ విరులను దెచ్చితి
వాసిగ బిల్వముల నిడెద పరమేశ శివా.40
41)ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః (పాద్యము)
పాదము లిడు భస్మాంగా
కాదనకుము గంగ తోడ కడిగెదనయ్యా
సాదరముగ గ్రోలెద నీ
పాదజలము చాలు నయ్య భసితాంగ శివా.41
42)ఓం సామప్రియాయ నమః(అర్ఘ్యం)
సామప్రియా కరములిడ
సేమంబు లడిగి కడిగెద చేతన మీవే
నీమము లెరుగని వాడను
పామరుడను నీపదముల పడనిమ్ము శివా.42
43)ఓం స్వరమయాయ నమః (ఆచమనీయం)
స్వరమయు నకాచమము మీ
స్వరములు మృదుమధుర మంద్రు చల్లని తండ్రీ
త్వరపడ పనిలేదయ్యా
దరహాసము జూపుమయ్య దయజూపి శివా.43
44)ఓం త్రయీమూర్తయే నమః
(స్నానము)
ఎక్కడి గంగను తెచ్చెద
చక్కని నీ స్నానమునకు శాంతించవయా
లెక్కలకు త్రయీమూర్తివి
చిక్కులు విడబోవవేమి శ్రీ కరము శివా.44
45)ఓం అనీశ్వరాయ నమః(వస్త్రం)
ఎక్కడ వస్త్రము తెచ్చెద
చక్కనగు ననీశ్వరునకు సతమత మైతిన్
ముక్కంటీ శరణంటిని
చిక్కెను గజచర్మమొకటి చింతిలగ శివా.
46)ఓం సర్వజ్ఞాయ నమః (యజ్ఞోపవీతం)
యజ్ఞోపవీత మా స
ర్వజ్ఞా సకలము నెరిగిన వాడవు వరదా
అజ్ఞానిని నేనొకడను
యజ్ఞము యాగము లెరుగని యర్భకుడ శివా.46
47)ఓం పరమాత్మనే నమః(గంధము)
బూడిద పులిమిన వాడవు
పాడియె గంధమడుగంగ పరమాత్ముడవే
వాడని పూల్దెచ్చెద నా
వాడనుకొను మయ్య సాంబ! భవనాశ శివా.47
48)ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
(పుష్పం)
దిసమొల వేల్పుకు పుష్పమ
న సోమసూర్యాగ్ని లోచనా నటరాజా
కుసుమములు తెల్లబోయెను
ముసిముసి నగవులను రువ్వి మురిసినవి శివా.48
49)ఓం హవిషే నమః (ధూపం)
ధూపము దీపము హవిషా
యేపగిది నొసంగెదనయ ఋషభధ్వజుడా
ద్రాపునకు వందనమనుచు
దాపున నిలుచుంటి నయ్య దయజూపు శివా.49
50)ఓం యజ్ఞమయాయ నమః (దీపం)
లో వెలుగులు యజ్ఞమయుడ
నీ వలననె, దీపమిడెద నీదీవనకున్
ఆవల నీవల యుందువు
సేవల గైకొనుచు లోన శితికంఠ శివా.50
51)ఓం సోమాయ నమః (నైవేద్యము)
నీవయె సృష్టికి మూలము
నావన్నవి లేవు సోమ నైవేద్యమిడన్
నీవిచ్చిన భావంబుల
కావలసిన పద్యమల్లి గైకొనవె శివా.51
52)ఓం పంచవక్త్రాయ నమః (తాంబూలం)
తమలములు పంచవక్త్రా
తమరికి తాంబూల మీయ తగువేమి శివా
తమి తొలగించగ వేడెద
తమరే కాపాడ వలయు తప్పదిక శివా.52
53)ఓం సదాశివాయ నమః (నమస్కారం)
వందనమందు సదా శివ
వందనమందును యమభయ వారణ శంభో
వందనముమా మహేశా
చందనమించుక పులిమెద చవిగొమ్ము శివా.53
54)ఓం విశ్వేశ్వరాయ నమః( ప్రదక్షిణం)
ఎటులో ప్రదక్షిణమనుచు
దిటవుగ విశ్వేశ్వర తమ దేవాలయమం
దటునిటు తిరిగితి నయ్యా
పటుతరముగ పూజచేయ పడియుంటి శివా.54.
55)ఓం వీరభద్రాయ నమః
రుద్రుడవు వీరభద్రా
చిద్రూపా పాహిపాహి చిచ్చఱకంటీ
భద్రమ్మగు నిను గొల్చిన
ఛిద్రము సేయవె దొసగులు శితికంఠ శివా.55
56)ఓం గణనాథాయ నమః
గణనాథా శరణు శరణు
కణకణమున నీవు గలవు కననైతినయా
అణువణువు కలిపెదవు నీ
గుణగణముల నెన్ననాకు గురుతిమ్ము శివా.56
57)ఓం ప్రజాపతయే నమః
కలినాశన గరళాశన
మెలకువనీవయ్య స్వామి మినుసిగదేవా
కొలిచెద ప్రజాపతివనుచు
తలపులలో మాయజేయు తండ్రివట శివా.57
58)ఓం హిరణ్యరేతసే నమః
శరణము హిరణ్యగర్భా
శరణంటి హిరణ్యరేతసా శరణంటిన్
శరణము హిరణ్యవర్ణా
శరణంటి హిరణ్య పతికి శరణంటి శివా.58
59)ఓం దుర్ధర్షాయ నమః
దుర్ధర్షా దురిత హరా
నిర్దయుడవయితి వదేల నిటలాక్ష శివా
కర్దమ పూజిత చరణా
మర్దించవె నారిపులను మదనాశ శివా.59
60)ఓం గిరీశాయ నమః
శ్రీశార్చితపద యుగళా
కాశీనాథా గిరీశ కలినాశ శివా
శ్రీ శైలవాస శరణము
దాసుని మదిలోన సతము తనరారు శివా.60
61)ఓం గిరిశాయ నమః
గిరిశా నెలవే కరవా
తెరచితి నామది గిరీశ తిలకించు మయా
కరుణాలవాల రావయ
నరేశ నీభక్తుని మది నర్తించ శివా.61
62)ఓం అనఘాయ నమః
అనఘా యఘనాశ హరా
దినకరసాహస్రతేజ దీనశరణ్యా
తనివారగ నినుతలచెద
కనరా కరుణాలవాల కరకంఠ శివా.62
63)ఓం భుజంగ భూషణాయ నమః
దండము భుజంగ భూషణ!
దండగ పాములనుదాల్చ తగునా తండ్రీ
కుండలమండితయీశా
దండిగ పూదండలిడుదు తగువేమి శివా.63
64)ఓం భర్గాయ నమః
భర్గా భక్తశరణ్యా
దుర్గమ్మను గూడిరావె దురితాపహరా
అర్గళమే లేదు తమకు
మర్గించవెనా రిపులను మహవీర శివా.64
65)ఓం గిరిధన్వనే నమః
గిరిధన్వా ధరకార్ముక
కరివసనా పాహిపాహి కరకంఠ శివా
మరుగొంగా మహదేవా
పురశాసన పాదమీర ముక్కంటి శివా.65
66)ఓం గిరిప్రియాయ నమః
వందనము గిరిప్రియునకు
వందనమందును గిరిజకు పంచా స్యునకున్
వందనము కరివదనునకు
వందనములు స్కందున కభివందనము శివా.66
67)ఓం కృత్తివాససే నమః
కృత్తివసనుడ దిగంబర
బత్తిగ గోరితిని స్వాము పదముల నిడగన్
మొత్తము భారము వైచెద
మెత్తని మనసున్న నీకు మేలనెద శివా.67
68)ఓం పురారాతయే నమః
పురరిపువు పురారాతివి
పురశాశన పురహరుడవొ పురభిత్తుడవో
మరుగొంగా గజరిపువా
దరహాసము జూపరావె దరినుంటి శివా.68
69)ఓం భగవతే నమః
భగవన్ విశ్వేశ్వరయన
నగచాటులు తప్పుననిరి యన నైతినయా
జగతిని పుట్టినదాదిగ
జగడములకు పాల్పడతిని శరణంటి శివా.69
70)ఓం ప్రమథాధిపాయ నమః
ఆపక స్తన్యము గ్రోలుచు
పాపడ నిను తలువనైతి ప్రమథాథిపుడా
పాపము నావాడనుకొను
దాపున నన్నుండనిమ్ము దయచేసి శివా.70
71)ఓం మృత్యుంజయాయ నమః
చిత్తము వచ్చిన యాటల
మిత్తిని మరచితిని స్వామి మృత్యుం జయుడా
ఇత్తరి మన్నించ మనుచు
చిత్తము నీపై నిలిపెద చింతిలుచు శివా.71
72)ఓం సూక్ష్మతనవే నమః
ఆరడుగుల యవ్వనమున
శూరుడననుకొంటి స్వామి సూక్ష్మత నుడవే
సారెకు మన్నించ మనుచు
చేరితి దరి శరణ మనుచు చిద్రూప శివా.72
73)ఓం జగద్వ్యాపినే నమః
మనసున తలచుట మరచితి
కనులున్నను గాంచనిన్ జగద్వ్యాపివిగన్
ధన సంపాదన మరగిన
తనయుని మన్నింపుమయ్య దయజూపి శివా.73
74)ఓం జగద్గురవే నమః
అవయవములు పట్టు విడచె
జవసత్వము లుడిగిపోయె సతమత మైతిన్
శివ శివ జగద్గురుడవట
భవదీయుని గావుమయ్య భవనాశ శివా.74
75)ఓం వ్యోమకేశాయ నమః
జపతపముల నెరుగను నే
నపచారములెన్నొజేసి నటమటమైతిన్
కపటుడను వ్యోమకేశా
చపలత్వము వీడదాయె శరణంటి శివా.,75
76)ఓం మహాసేన జనకాయ నమః
అరయ విహితకర్మలనన
శరణు మహాసేన జనక శరణంటినయా
ఎరుగ నిధిధ్యాసలనే
దరిజేరితి పాతకుండ దయజూపు శివా.76
77)ఓం చారువిక్రమాయ నమః
ఎచ్చటి గంగను, దళముల
తెచ్చెద నభిషేకమునకు తెరవేనెరుగన్
ముచ్చటగ చారు విక్రమ
వచ్చితి నిను చూడ దలచి వందనము శివా.77
78)ఓం రుద్రాయ నమః
చక్కెర పాలను తేనెయు
వక్కలు తమలములు గంగ, పంచా మృతముల్
ఎక్కడ తెచ్చెద రుద్రా
నిక్కము నేనల్పుడ దరి నిలుచుంటి శివా.78
79)ఓం భూతపతయే నమః
ఉదయపు స్నానము సంధ్యల
సదమలముగ జేయలేక సతమతమైతిన్
సదయుఁడ భూతపతివి నీ
పదముల కడనుండమనెడి వరమిమ్ము శివా.79
80)ఓం స్థాణవే నమః
దానము దక్షిణ మరచితి
మానిత కాశిపుర మరిగి మహదేవ యననే
పూనిక లోపము స్థాణూ
దీనుడ మన్నించుము నను దీవించు శివా.80
81)ఓం అహిర్బుధ్న్యాయ నమః
గంగా తటమున దీక్షలు
చెంగట హోమము జపములు చేయగనైతిన్
సంగతిగ యహిర్బుధ్న్యా
ముంగిట నిలుచుంటినయ్య మునుకొనుచు శివా.81
82)ఓం దిగంబరాయ నమః
కాశీ పురమున కేగడు
దాసుడు దానములుచేసి తరియింపంగన్
వాసిగ దిగంబరా మరి
చేసిన సద్గోష్టిలేదు చెవియొగ్గి శివా.82
83)ఓం అష్టమూర్తయే నమః
చందన దీపము ధూపము
లందించగ భక్ష్య భోజ్య హారతు లెరుగన్
మందమతినష్ట మూర్తికి
వందనమని యనుట నేర్వ పరమేశ శివా.83
84)ఓం అనేకాత్మనే నమః
చీకటి తప్పులు చేయుచు
లోకుల తప్పొప్పులెంచి రోసితినయ్యా
ఏకాకి ననేకాత్మా
నీ కనుసన్నుల నిలుపవె నీవాడ శివా.84
85)ఓం స్వాత్త్వికాయ నమః
తామసుడ నేను సాత్త్విక
నీమము లెరుగక చరించి నిందించితినిన్
సామము నేర్వని వాడను
నీమది నన్నుంచుమయ్య నిటలాక్ష శివా.85
86)ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓంకారమ్మును నేరక
ఘీంకారము చేసినాడ క్ష్వేళగళుండా
కింకరుడ శుద్ధవిగ్రహ
జంకితి నీదరికి జేర శరణంటి శివా.86
87)ఓం శాశ్వతాయ నమః
శాశ్వతమీ జన్మమనుచు
నశ్వరమీ దేహమనుచు నగుబాటైతిన్
శాశ్వతుడవు నిను మరచితి
విశ్వేశా శరణమనుచు వేడెదను శివా.87
88)ఓం ఖండపరశవే నమః
ఖండపరశవే శరణము
భండునివలె తిరిగినాడ భక్తశరణ్యా
చండీశా శరణు శరణు
దండించవె నా రిపులను దయజూపి శివా.88
89)ఓం అజాయ నమః
ఎప్పుడు పుట్టితి వజుడా
యప్పెవ్వరు నీక వ్వెవ్వరయ్య కపాలీ
చప్పున పాదములంటెద
తిప్పలుబెట్టక కనపడు తిగకంటి శివా.89
90)ఓం పాశవిమోచకాయ నమః
ఆశనిరాశల జిక్కితి
చేసితి తప్పులు మరిమరి సిగ్గనక శివా
ఈశుడ నను మన్నింపవె
పాశవిమోచన పదముల పడనిమ్ము శివా.90
91)ఓం మృడాయ నమః
నాదమె నీరూపమ్మట
ఖేదమె నారూపమయ్య క్ష్వేళగళుండా
మోదము నెరుంగను మృడా
పాదములిమ్మని యడిగెద పరమేశ శివా.91
92)ఓం పశుపతయే నమః
సుతులని సతియని తిరుగుచు
పతితుడ నైతిని జగతిన పశుపతినాథా
మతిలేక చరించితినే
సతమతమైతిని చివరకు శరణంటి శివా.92
93)ఓం దేవాయ నమః
మనసును నీపై నిలుపక
ధనము కొరకు వగచిన యమ దండన కాదా
తనువే డస్సెను దేవా
మనవాడనుకొని పదముల మననిమ్ము శివా.93
94)ఓం మహాదేవాయ నమః
క్షణములు నిముషములయ్యెన్
దినములు మాసములు కార్లు తీరుగ కరిగెన్
మనసు నిలిపి మహదేవా
యని యొకపరి పిలువనైతి నధముడను శివా.94
95)ఓం అవ్యయాయ నమః
కరములతో పలుకులతో
చరణముల కదలికతోడ శ్రవణము తోడన్
కెరలి తనమన ధనముతోన్
మరచితి నవ్యయ యనుటయె మన్నించు శివా.95
96)ఓం హరయే నమః
నడి సంద్రపు నావను నను
వడిగా దరిజేర్చు మనుచు పాహి యనంటిన్
విడువకు నాకరము హరా
పడియుండెద పదములకడ పరమేశ శివా.96
97)ఓం పూషదంతభిదే నమః
నియమము లెరుగని వాడను
లయకర రక్షింపమంటి రతిసేవ్య శివా
జయ పూషదంతభిద నను
దయగొని రూపమ్ముజూప తరియింతు శివా.97
98)ఓం అవ్యగ్రాయ నమనమః
అవ్యగ్రా శరణు శరణు
దివ్యము నీ నిగ్రహమ్ము దీనశరణ్యా
దివ్యము నీ విగ్రహమతి
భవ్యపు పాదమ్ములకడ పడియుందు శివా.98
99)ఓం దక్షాధ్వరహరాయ నమః
దక్షాధ్వరహర శంభో
త్ర్యక్షా శాంతించవయ్య యఘనాశా రు
ద్రాక్ష కపాలధర శరణు
రక్షింపవె భక్తుల గని రతిసేవ్య శివా.99
100)ఓం హరాయ నమః
హరహర శివశివ శరణము
హరహర భవభయహర పురహర కరివసనా
హరహర జ్వరహర విషధర
వరదుడ జటధర మొరవిని పదములిడు శివా.100
101)ఓం భగనేత్రభిదే నమః
భగనేత్రభిదా వరదా
జగదీశా నిగమవంద్య సర్వేశ్వరుడా
నగచాపధరా దేవా
నగజాధిప శరణు శరణు నటరాజ శివా.101
102)ఓం అవ్యక్తాయ నమః
వ్యక్తము చేయ దలచిత
వ్యక్తా మిము నాపలుకుల భవభయ హారీ
శక్తిని యుక్తిని గోరితి
భక్తికొలది పద్యమల్ల వ్యక్తమగు శివా.102
103)ఓం సహస్రాక్షాయ నమః
కనుదృష్టి సహస్రాక్షా
మనుజులకు తగులగవచ్చు మాదనాం తకుడా
కనుపింపవు నాకనులకు
మనసున నెలకొనవె స్వామి మన్నించి శివా.103
104)ఓం సహస్రపాదే నమః
విహరింపవె నామనుమున
సహస్రపాదా పరేశ సర్వేశ్వరుడా
దహియింపవె నాదొసగులు
సహస్రనామాలదల్తు శరణనుచు శివా.104
105)ఓం అపవర్గప్రదాయ నమః
అపవర్గప్రదుడవు హర
జపతపముల నెరుగనీశ శరణంటినయా
అపవాదు కలుగును తమకు
చపలుడనని నన్నువిడకు శరణంటి శివా.105
106)ఓం అనంతాయ నమః
అనఘా యనంత గనుమా
యనంత ఛ్చందంపు సొబగు లంబర మంటన్
వినతులగైకొనుమయ్యా
జనకుడ గావవె యనంత సభ్యులను శివా.106
107)ఓం తారకాయ నమః
లంక శివరామకృష్ణుడ
పంకిలమగు భాగ్యనగర వాసిని స్వామీ
కింకరుడ కుషాయిగుడన
జంకుచు తారక శరణము శరణంటి శివా.108
108)ఓం పరమేశ్వరాయ నమః
శరణంటిని పరమేశ్వర
చిరుకవితల బద్యములను జేకొమ్ముశివా
శరణంటిని విశ్వేశ్వర
కరుణించుచు పద్యములను గైకొనుము శివా.108
స్వస్తి
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత శ్రీ లంక మహాదేవ సుబ్రహ్మణ్య శాస్త్రి పుత్ర శివరామకృష్ణ ప్రణీతంబగు
శ్రీ శివాష్టోత్తరశతనామావళికి తెలుగున కంద పద్య సమర్పణ.
లంక శివరామకృష్ణ శాస్త్రి,
కుషాయిగుడ,
హైదరాబాదు.
9701367992.

No comments:
Post a Comment