శ్రీ శివ సహస్రనామావళి (త్రిశతి).
(1)స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు.
స్థిరముగ పూజలు సల్పెద
తిరముగ నుండెడి హరునకు దేవేశునకున్
స్థిరునకు వందన మనుచును
కరములు మోడ్చెద భవునకు కఱకంఠ శివా.1
(2)స్థాణుః = చలనం లేనివాడు అనగా తాను చలించుటకుమరియెక స్థానంలేక అంతటా తానై విస్తరించినవాడు.
అంతట నిండిన వాడవు
చెంతన నిలబడు టెటులని చిన్మయరూపా
వింతగ స్థాణవునైతిని
పంతము వీడవె దయగొని భసితాంగ శివా!!2.
3)ప్రభుః = సమస్తమునకు అధిపతి
ప్రభునకు వందన మందును
విభవమలర పూజజేసి పింగాక్షుడ నే
నభయము నిమ్మని గోరితి
శుభముల నిచ్చెడి దొరవని సురసేవ్య శివా.3
4)భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు
భయములు కలిగిన తొలగును
నయము యశము కలుగు నటుల నాగాభరణా
జయమగు భీమా యందున్
స్వయముగ రక్షించు మనుచు శరణందు శివా.
5)ప్రవరః = సర్వశ్రేష్టుడు
ప్రవరాయని బిలచిన వా
రెవరాయని రక్షజేయు యీశుడవయ్యా
భవరోగములకు వైద్యుడ
నివసించవె నామనమున నీలగళ శివా.5
6)వరదః = వరములనిచ్చువాడు.
చి రునగవులు గురిపింతువు
వరదాయని యన్నచాలు వందన మిడుచున్
దరిచేరితి పరమేశ్వర
కరివసనా శరణు శరణు కరుణించు శివా.6.
7) వరాః = సర్వశ్రేష్ఠుడు.
హరుడే నా వరుడనుచున్
వరించె నా గిరిజ తమను పరమేశ్వరియై
కరివసనా శరణు వరా
వరలవె నాతనువునందు పరమేశ శివా.7
8)సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు
శరణంటిని గిరిజాపతి
శరణంటిని పద్మనాభ సన్నుతచరణా,
శరణంటిని సర్వాత్మా
శరణంటిని నీవెదిక్కు శరణంటి శివా.8
9)సర్వవిఖ్యాతః
సర్వము నెరిగిన వాడవు
పిర్వీకము లేని సర్వ విఖ్యాతుడవే
గర్వము నణచెడి వాడా
శర్వా సాగిలపడుదును శరణంచు శివా.9
(పిర్వీకము= జంఝాటము)
10)సర్వః = సమస్తము తానేఅయినవాడు.
గిరులందున తరులందున
విరులందున జలధరముల వేడ్కగ సర్వా
అరయంగ జగతి సర్వము
వరలగ నీలో, మరిమరి వందనము శివా.10
11)సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు.
అరయగ సర్వము జడమట
నరయక జగతిని నడుపుచు నణచెదవు హరా
దొరవని సర్వకరుడవని
కరములు మోడ్చెద భయహర కరుణించు శివా.11
12)భవః = శివుని రూపంలో పుట్టినవాడు
ఎన్నియొ రూపములున్నవి
యన్నిట నీవుందువేమొ యంగజహరుడా
ఎన్నగ భవుడని యందును
నన్నెపుడు విడకుండుమయ్య నటరాజ శివా12
13)జటీ = జడలు ధరించినవాడు.
ఎప్పుడు పుట్టితివి జటీ
యిప్పట్టున జటలు దువ్వ నెటులో తండ్రీ
చప్పున రావయ్య హరా
తప్పదు తలదువ్వెదనిక తలనిమ్ము శివా.13
14)చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు.
చర్మీ యనిపించు కొనెడు
కర్మము తమకేల స్వామి కంఠేకాలా
ధర్మమె కరివసనము నీ
మర్మము నెరిగించుమయ్య మదనారి శివా.14
15)శిఖండీ = శిఖలు ధరించినవాడు.
మొండితనమా శిఖండీ
గండరగండడవు సిగన గంగేలనయా
చండీశుడ రావయ్యా
దండిగ పూదండలిడెద దండములు శివా.15
16)సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు
సర్వాంగా శరణు శరణు
సర్వజ్ఞా శరణు శరణు శరణంటినయా
సర్వేశా శరణు శరణు
శర్వా సాగిలపడితిని శరణంచు శివా.16
17)సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
పదముల నేర్చితి కూర్చితి
నది తమదయ యందుదేవ యక్షరుడీవే
మదిలోన సర్వభావన
పదిలముగా నుంచుమయ్య భసితాంగ శివా.17
18)హరః = సమస్త పాపములను హరించువాడు.
హరయను రెండక్షరములు
హరియించగ పాపరాశి యంగజహరుడా
హర నీ పాదము లీయవె
హరహర యని నిను భజింతు హఠమేల శివా18
19)హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు.
తగునా తిరిపెము తమరికి
జగమేలెడు తండ్రివౌర జగదీశుడవే
నగజాధిప హరిణాక్షుడ
దిగువనె నా గృహము గలదు తిగకంటి శివా.
20)సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు.
హరుడవు శుభకరుడవు పుర
హరుడవు దొర సర్వ భూతహరుడవు భవుడా
కరుణాలవాల శంభో
హరుడన శివుడన భవభయ హరమగును శివా.20
21)ప్రభుః = అధిపతి. సమర్ధుడు.
విభుడని ప్రభుడని తలచెద
శుభముల నొసగగ సురేశ సుందర రూపా
అభవుని యెలమిని గొలిచెద
సభాపతివి జగతికి హర జయమనెద శివా.21
22)ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు.(ప్రకృతిః)
చిత్తము నీపై నిలిపెద
సత్తెము నెరిగిన భవుడవు సర్వేశ్వరుడా
వృత్తియు ప్రవృత్తి వీవెగ
మొత్తము భారము వహింప మొరలిడుదు శివా.22
23)నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు.
మెత్తని మనసున్నది నీ
వృత్తి లయమనందురుగ నివృత్తివి నీవే
చిత్తము లయింపగ తగు ప్ర
వృత్తిని గోరెద భవుడవు పింగాక్ష శివా.23
24)నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు.
నియతవు నియంతవు హర వి
నియతులఁ మేము కరుణించ నిను వేడెదమే!
దయగల తండ్రివి నీవ య
నియతులమని విడకు భవుడ నింగిసిగ శివా.24
25)శాశ్వతః = నిత్యమైనవాడు.
శాశ్వతుడవు మహదేవా
విశ్వాధారా శరణము వేదవిహారా
నశ్వరమీ దేహమనిరి
విశ్వేశ్వరుడవు శరణము విచలితుడ శివా.25
26)ధ్రువః = నిశ్చల రూపము తానే అయినవాడు!
అచలుడవు ధ్రువా స్వామీ
విచలితుడను కావరావె వేదవిహారా
రుచికరమీ నామములన్
ప్రచురించెడి శక్తినిమ్ము పరమేశ శివా.26
27)శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు.
తగునా శ్మశాన వాసీ
దిగిరమ్మిక మా నెలవుకు తిరముగ నుండన్
నగజను తోడ్కొని రావో
పగతుడనా కాదు నీదు భక్తుడనుశివా.27
28)భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు.
జగముల నేలెడు తండ్రికి
భగవానునకున్ జయమని ప్రార్థింతునయా
పగతుల బ్రోచెడు వానికి
సొగసరికి నతులు జయములు శుభమందు శివా.28
29)ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు.
నా మనసను నాకాశము
నీ మూర్తిని ధ్యాసజేయు నిఖిలాధిపతీ
ఏమని గోరను ఖచరుని
నామది నిలువవె భవుడవు నటరాజ శివా.29
30)అగోచరః = కంటికి కనిపించనివాడు.(గోచరః)
కనులున్నవి నినుగానవు
మనసున్నది నిను తలవదు మానటరాజా
నిన గోచరుడ వనగ నా
కనుమానము తీర్చు భవుడ కరుణించి శివా.30
31)అర్దనః = తనలోనికి తీసుకొనువాడు.
జగములు నీలో గలవట
జగములలో నీవుగలవు జగదీశ్వరుడా
తగు నిను యర్దనుడన హే
నగజాధిప నతులు భవుడ నటరాజ శివా.31
32)అభివాద్యః = నమస్కరింప తగినవాడు.
వందన మభివాద్యునకభి
వందనమందును గణేశ వందిత చరణా
వందనములు నగజాధిప
వందనమందును భవునకు పంచాస్య శివా.32
33)మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు.
జయము మహా కర్మాయన
నయములు గల్గును జనులకు నాగాభరణా
జయజయ శంకర యనగా
స్వయముగ రక్షింతువయ్య శరణందు శివా.33
34)తపస్వీ = తపస్సుచేయువాడు.
నినుగన తపములు జేసిరి
తనువును మనసును మరచిరి తమ తపమేలా
యని యడిగెదను తపస్వీ
మనసున నను నిలుపవె భవ మదనారి శివా.34
35)భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
వందనము భూతభావన
వందనమందును కపాలి పశుపతినాథా
అందరి భావన లందున
సుందర నీరూపు నిలుప శుభమగును శివా.35
36)ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు
ఉన్మత్తుని వలె నగుపడు
చిన్మయ రూపివి నినుగన శ్రీ కరమౌగా
జన్మము లభించె నగుపడ
తన్మయమొందెద భవుడని దండములు శివా.36
37)సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు
గజవసన సర్వలోక
ప్రజాపతికి శరణమందు పాదము లిడగన్
కుజనుల బ్రోచెడి దొరవట
విజయము లిచ్చెడి భవుడవు వినతులివె శివా.37
38)మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు.
శరణు మహారూపునకున్
శరణు మహాదేవదేవ సర్వేశునకున్
శరణము సురేంద్ర వందిత
శరణమనంటిని భవునకు జగదీశ శివా.38
39)మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు
జయము మహా కాయునకున్
జయ మపరాజితునకు జయ జంగమదేవా
జయములు సదాశివునకు త్రి
నయనునకు జయము భవునకు నగచాప శివా.39
40)వృష రూపః = పుణ్య స్వరూపుడు
జయములు వృషరూపునకున్
జయములు పరమేశ్వరునకు జయమంటి హరా
జయములు వృషవాహనునకు
జయములు భూరికి భవునకు జయమంటి శివా.40
41)మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
జయములు మహా యశునకున్
జయములు ముక్కంటి మీకు జయమని యనెదన్
జయములు వృషధ్వజునకున్
జయములు శూలికి భవునకు జయమంటి శివా.41
42)మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు.
తరులు గిరులు విరులు మహాత్మా
గిరివనముల వనచరముల కిలకిల రవముల్
చరము లచరములు జగతిన
పరిపరి విధముల దరించు పరమేశ శివా.42
43)సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు.
కాయము బెంచిరి, పండ్లను
కాయలు మేకలును కోళ్ళు గతికెడి వార
న్యాయముగ సర్వభూతా
త్మాయను మాట మరచితిమి మన్నించు శివా!43
44)విశ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు
నింగిన వెల్గెడు తారలు
చెంగట కొండలు నదులును చెన్నుగ తరువుల్
ముంగిట మృగములు పశువులు
దంగును భవ విశ్వరూప దర్శనము శివా.44
45)మహాహనుః = గొప్ప దవడలు గలవాడు.
46)లోకపాలః = లోకములను పరిపాలించువాడు
వందనము *మహాహనువుకు*
వందనమందును హరునకు వాజసునునకున్
వందనము*లోక పాలక*
వందనమందును భవునకు భసితాంగ శివా.45
47)అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
అంతర్హితాత్మునకు మా
చెంతనె యుండి యగుపడని శ్రీ కంఠునకున్
వింతగ వర్తిలు వానికి
యంతక హరునకు భవునకు హారతులు శివా.46
48)ప్రసాదః = అనుగ్రహించువాడు.
జననము శివప్రసాదము
జనకుడు పరమేశ్వరుడట జగతికి నాకున్
జనని జగదీశ్వరియగున్
సనాతనులకున్ జయములు సన్నుతులు శివా.47
49)నీల లోహితః = నల్లని కంఠము, ఎర్రని జుట్టు కలవాడు.
50)పవిత్రం
హే *నీల లోహితా* యని
నీనామము బల్కినంత నీలగళేశా
మానాల్క *పవిత్ర* మగును
హే నాదవినోద భవుడ హీరుడవు శివా.48
51)మహాన్ = గొప్పవాడు,
52)నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
53)నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
54)సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు.
శరణము *మహానుభావా*
శరణంటిని *నియమ* మిమ్ము శరణంటి నయా
శరణము *నియమాశ్రితుడా*
శరణంటిని *సర్వకర్మ* సర్వేశ శివా.49
55)స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
56)ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
57)ఆదికర్మః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
58- నిధిః= అన్నిటికి మూలమైనవాడు
59)సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
శరణు *స్వయంభూత!* శరణు
శరణీయవె *యాది*!పురుష శరణం టినయా
శరణంటి *నిధి*!కి శివునకు
శరణు *సహస్రాక్ష* !జయము ! శరణంటి శివా!50
60)విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
61)సోమః = చంద్రుని వంటివాడు
వందనము విశాలాక్షా
వందనములిడెదను సోమ వందిత చరణా
వందన మరిందమ హరా
వందనమంగజహర భవ వందనము శివా.51
62)నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
63)చంద్రః = చంద్రుని వంటివాడు
64)సూర్యః = సుర్యుని వంటివాడు
*నక్షత్ర సాధక* శరణు
త్ర్యక్షుడ బడరుడ పినాకి దర్శనమీరా
రక్షణ గోరితి *చంద్రా*
రక్షింపగ *సూర్యుని* వలె రావయ్య శివా.52
65)కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
66)శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
67)గ్రహః = సర్వదేవతలచే పూజలనందువాడు,
68) గ్రహపితః = గ్రహములకు నియంత్రించువాడు.
69) వరాః= శ్రేష్టుడు
మెల్లగ కదిలెడు *శనివా*
క్రల్లను పులిమితివి *కేతు* *గ్రహపతి* వీవా!
అల్లరి చేయకుము *వరా*
చల్లని తండ్రివి భవుడవు శరణంటి శివా.53
క్రల్ల = భస్మము
70) అత్రిః - త్రికరహితుడు
ఆదియునంతము నరుడట
యేదియు నీరూపుకాదు! యీశుడవనిరే
నాదము విన త్రికరహితా
నీదయ గోరితి భవుడవు నీలగళ శివా.54
71)అనఘః = పాపరహితుడు,
72)మహాతపాః = గొప్ప తపస్సు చేసినవాడు,
73)ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు.
మృగబాణార్పణ !యనఘా!
జగదీశ మహాతపా! గజవసన! వరదా
నగజాధిప ఘోరతపా!
మృగచర్మాంబర భవుడవు మించరివి శివా.55
మించరి =దివ్యుడు
74)అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు, దీనుడు కానివాడు.
అచలా! యదీన! యనఘా!
విచలితుడను వేదరూప వినునా మొరలన్
శుచిగా పూజలు గొని నా
రచనలు వినుమయ్య భవుడ లలితోడ శివా.56
75)దీన సాధక= బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
76)సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
77)మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
78)ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
వందనము *దీనసాధక*
అందవు *సంవత్సరకర* యంగజ హరుడా
వందనము *మంత్ర* రూపుడ
వందనమందును *ప్రమాణ* పశుపతివి శివా!!57
79)పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
80)యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
81)యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
82)మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,.
శరణము *పరమంతపునకు*
శరణము *యోగీశ్వరునకు* జగదీశునకున్
శరణము *యోజ్యా* శరణము
శరణు *మహాబీజ* శరణు శరణంటి శివా.58
83)మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
84)]మహాబలః = గొప్పశక్తి కలవాడు.
85)సువర్ణరేతాః = బంగారపు తేజస్సు కలవాడు,
86)సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
శరణంటి *మహారేతా*
శరణు *మహాబల* శరణము జగదీశ హరా
శరణము *సువర్ణరేతా*
శరణము *సర్వజ్ఞ* స్వామి జయమంటి శివా.59.
87)సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
88)బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
89)దశబాహుః = పది భుజాలు కలవాడు,
90)అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
వందన మనిమిష! వందన
మందు హరహర! దశబాహు! వంగజ హరుడా
వందనము బీజ వాహన
చందనమలిమెద సుబీజ సంగతిగ శివా.60
91)నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
92)ఉమాపతిః = పార్వతి భర్త
93)విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
ఎందుకు తొందర పడితివి
విందుగ గొన నీలకంఠ! విషభోజనమా
కందె నుమాపతి! వదనము
చందన మిదె విశ్వరూప! చేగొనుము శివా!61
94)స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
95)బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
96)బలః = బలము కలవాడు
97)గణః = సమూహ స్వరూపమైనవాడు
98)గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
99)గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు
100)దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు
101)కామః = కామము యొక్క స్వరూపము తానే అయినవాడు.
బలవీరా! గణకర్తా!
బలమీవే గణ! బల! గణపతి! దిగ్వాసా!
కలిమి నిడు స్వయంశ్రేష్ఠా!
కలికల్మశ నాశ కామ! కరుణించు శివా62.
102)మంత్రవిత్ = మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు
103)పరమః = అందరికంటె ఉన్నతుడు
104)మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు
మంత్రవిదుడవట పరమా
మంత్రము తమరూపమంద్రు మదనాంతకుడా
మంత్రము లేవియు తెలియదు
తంత్రిని యందించుమయ్య తరియింతు శివా.63
105)సర్వభావకరః = సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు
106)హరః = పాపములను హరించువాడు
107)కమండలుధరః = కమండలమును ధరించినవాడు
108)ధన్వీ = ధనుస్సు ధరించినవాడు.
హే *సర్వభావకరుడా!*
నా సర్వస్వము *హర*! తమ న్యాసము కాదా!
ఈశ *కమండలుధర!* హర!
దాసుని మన్నించు *ధన్వి!* దండములు శివా.64
109)బాణహస్తః = చేతియందు బాణము ధరించినవాడు
110)కపాలవాన్ = కపాలమును చేత ధరించినవాడు
111)ఆశనిః = వజ్రాయుధము
112)శతఘ్నీ = శతఘ్ని అను ఆయుధమును ధరించినవాడు
113)ఖడ్గీ = ఖడ్గమును ధరించినవాడు
114)పట్టసీ = పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు
వందనము *బాణహస్తా!*
వందనమందును *కపాలవానా*! *ఖడ్గీ*
వందన*మశని!* *శతఘ్నీ!*
వందనములు *పట్టసి*! ధర వందనము శివా!65
115)ఆయుధీ = ఆయుధము కలవాడు
116)మహాన్ = గొప్పవాడు
117)స్రువహస్తః = హోమము చేసే పరికరమును చేత ధరించినవాడు.
వందనము లాయుధీయని
చందన మర్పింతునయ్య శశిశేఖరుడా
వందనములు స్రువహస్తా
వందనముమహానుభావ భసితాంగ శివా.66
118)సురూపః = మంచి రూపము కలవాడు
119)తేజః = తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు
120)తేజస్కరః = తేజస్సును కలుగజేయువాడు
121)నిధిః = ఐశ్వర్యమునకు మూల స్థానమైనవాడు.
ఎంచగ సురూప! మందురు
మించిన తేజము! గలదట మినుసిగవేల్పా
గాంచితి తేజస్కర! నిధి!
అంచితపాదా శరణము హటకేశ శివా!!67
122)ఉష్ణీషీ = శిరస్త్రాణము కలవాడు
123)సువక్త్రః = మంచి ముఖము కలవాడు
124)ఉదగ్రః = అన్నిటికంటె ముందుండువాడు
గంగయె యుష్ణీషము నీ
సంగతి యెరుగను సువక్త్ర చక్కని తండ్రీ
ఇంగితము లేని వాడను
చెంగట నుండెద నుదగ్ర చెలువముగ శివా!68
125)వినతః = వినయము కలవాడు
126)దీర్ఘః = పొడవైనవాడు
127)హరికేశః = ఆకర్షణీయమైన కేశములు కలవాడు
128)సుతీర్థః = ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు.
వినతా! యని వినతులిడుదు
వినవలె నా మొరల దీర్ఘ! వేదవిహారా
కనగా హరికేశు!డవట
మనమున నిలువవె సుతీర్థ! మదనారి శివా.69
129)కృష్ణః = నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు
130)సృగాలరూపః = నక్కయొక్క ఆకారము కలవాడు
131)సిద్ధార్థః = అన్ని ప్రయోజనాలను సాధించినవాడు
తెల్లని దేహపు కాంతియు
నల్లని లింగమున కృష్ణ నదురేది హరా
కల్లల సృగాలరూపము
చల్లని సిద్ధార్థుడవట శరణందు శివా.70
132)మృడః = భక్తులను ఆనందింపజేయువాడు
133)సర్వశుభంకరః = సమస్తమైన శుభములను కలుగజేయువాడు
134)అజః = పుట్టుక లేనివాడు
135)బహురూపః = అనేక విధాలైన రూపములు కలవాడు
136)గంగాధారీ = గంగను ధరించినవాడు
137)కపర్దీ = జటాజూటములు కలవాడు
మృడుడవు సర్వశుభంకర
జడుడను బహురూప వజుడ శరణంటి హరా
తడవకు గంగా ధరయని
విడువను పదముల కపర్ది విసిగింతు శివా.71
138)ఊర్ధ్వరేతాః = ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు
139)ఊర్ధ్వలింగః = ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు
140)ఉర్ధ్వశాయీ = ఊర్ధ్వముగా నిద్రించువాడు
141)నభస్థలః = ఆకాస ప్రదేశమున ఉండువాడు
శరణంటి నూర్ధ్వరేతా
శరణంటిని నూర్థ్వలింగ శరణంటి హరా
శరణంటి నూర్థ్వ శాయీ
శరణంటి నభస్థల భవ శరణంటి శివా.72
142)త్రిజటః = మూడు జడలు ప్రధానముగా కలవాడు
143)చీరవాసాః = నారచీరలు ధరించువాడు
144)రుద్రః = శత్రువులను దుఃఖపెట్టువాడు
145)సేనాపతిః = సైన్యమునకు అధిపతి
146)విభుః = అధిపతి
త్రిజటుడవు చీరవసనుడ
నిజరూపము జూపు రుద్ర నీలగళేక్షా
అజుడవు సేనాపతివే
గజవసనుడవు విభుడీవె కరుణించు శివా.73
147)నక్తంచరః = రాత్రులందు సంచరించువాడు
148)అహశ్చరః = పగటియందు సంచరించువాడు
149)తిగ్మమన్యుః = తీక్షణమైన కోపము కలవాడు
150)సువర్చసః = మంచి కాంతి కలవాడు
చరుడవు నక్తంచరుడవు
కరుణ నహశ్చరుడవీవె కనుపింపుమయా
హర! తిగ్మమన్యుడ వనిరి
దొరా సువర్చసుడ నన్ను దూఁకొనవె శివా.74
151)గజహా = గజాసురుని చంపినవాడు
152)దైత్యహా = రాక్షసులను చంపినవాడు
153)కాలః = కాలము యొక్క స్వరూపమైనవాడు
గజహరుడవు శివశివ యం
గజహరుడవు దైత్యహరుడ కరుణించ వయా
గజవసన కాల రూపుడ
నిజరూపము చూపవె భవ నిటలాక్షశివా.75
154)లోకధాతా = లోకములను ధరించువాడు
155)గుణాకరః = ఉత్తమ గుణములకు గనివంటివాడు.
లోకేశ లోకధాతా
శ్రీ కాళేశా పరేశ చిన్మయరూపా
శ్రీ కర గుణాకర దొరా
నీకర మందించుమయ్య నీలగళ శివా.76
156)సింహశార్దూలరూపః = సింహము, పెద్దపులి రూపములలో ఉన్నవాడు
ద శకంఠ సేవ్య శరణము
విశాఖ పూజిత శరణము విశ్వేశ్వరుడా
పశుపతి నాథా సర్వే
శ సింహశార్దూలరూప శరణంటి శివా.77
157)వ్యాఘ్రచర్మాంబరావృతః = పెద్దపులి చర్మమును వస్త్రముగా చుట్టుకొని యున్నవాడు
158)కాలయోగీ = కాలమును నియంత్రించినవాడు
159)మహానాథః = గొప్పవాడైన అధిపతి.
పురహరుడ వ్యాఘ్రచర్మాం
బరావృత శరణు పరేశ పరమేశ శివా
కరివసన కాలయోగీ
శరణు మహానాథ శరణు శరణంటి శివా.78
160)సర్వకామః = సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు
161)చతుష్పథః = అనేక మార్గముల కూడలి అయినవాడు.
కోరికలు సర్వకామా
తీరు చతుష్పథుని దివ్యతేజము వలనన్
దారియు తెన్నుయు నీవే
చేరెద నీపదము చిట్ట చివరికిక శివా.79
162)నిశాచరః = రాత్రులందు సంచరించువాడు
163)ప్రేతచారీ = ప్రేతభూతములయందు సంచరించువాడు
164)భూతచారీ = సర్వప్రాణులందు సంచరించువాడు
165)మహేశ్వరః = గొప్పవాడైన అధిపతి
అశనము గరళము హరహర
నిశాచరా ప్రేతచారి నినుగన తరమా!
శశిధరుడ భూతచారీ
పశుపతి నాథా మహేశ బహురూప శివా.80
166)బహుభూతః = అనేక రూపములలో ఉన్నవాడు
167)బహుధరః = అనేకమైన వాటిని ధరించువాడు
బహుభూతా యెటు లుంటివి
బహుధరుడా యెచట నుంటివయ్య కపాలీ
బహురూపుడ శరణంటిని
దహనాంబకుడా యడిగితి దర్శనము శివా.81
168)స్వర్భానుః = స్వయం ప్రకాశకుడు
169)అమితః = పరిమితి లేనివాడు
170)అగతిః = ఒకే విధమైన నడక లేనివాడు
తమిలో మునిగితి తేలితి
క్రిమికీటక పక్షిజన్మ లెత్తితి నయ్యా
తిమిరహరా స్వర్భానుడ
యమిత దయగొను మగతి యని యర్థింతు శివా.82
171)నృత్యప్రియః = నాట్యములందు ప్రీతి కలవాడు
172)నిత్యనర్తః = ఎల్లప్పుడు నాట్యము చేయువాడు
నృత్యప్రియా మహేశ్వర
సత్యవ్రతుడవు పురహర సర్వేశ్వరుడా
నృత్యమన నిత్యనర్తన
మత్యంత శుభకరమనుచు నర్థింతు శివా.83
173)నర్తకః = స్వయముగా నాట్యము చేయువాడు
174)సర్వలాలసః = అన్నిటియందు ఆసక్తి కలవాడు
175)మహాఘోరతపాః = గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు
176)శూరః = పౌరుషము కలవాడు
నర్తకుడ సర్వలాలస
భర్తవు నీవే మహేశ పసివాడనయా
స్పూర్తి మహా ఘోరతపా
యార్తిగ జగదీశ శూరు నర్థింతు శివా.84
177)నిత్యః = శాశ్వతమైనవాడు
178)అనీహః = కోరికలు లేనివాడు
179)నిరాలయః = స్థిరమైన గృహము లేనివాడు.
180)సహస్రహస్తః = అనేకమైన (వేయి) హస్తములు కలవాడు
వందనము నిత్య నూతన
వందనము నిరాలయ యభివందనమయ్యా
వందనమనీహ వందన
మందును తమరికి సహస్రహస్తుడవు శివా.85
181)విజయః = విజయమును సాధించువాడు
182)వ్యవసాయః = ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు
183)అతంద్రితః = తొట్రుపాటు లేనివాడు
184)అమర్షణః = దుష్టత్వమును కోపగించుకొనువాడు
నిజ వ్యవసాయము చేసెడు
విజయుండ వతింద్రిత హర వేదవిహారా
కుజనుల కమర్షణుడవై
సుజనుల ప్రోచెడు సురేశ శూలధర శివా.86
185)మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు
186)యజ్ఞహా = దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు
187)కామనాశకః = మన్మథుని నశింపచేసినవాడు
శరణంటి మర్షణాత్మా
శరణంటిని యజ్ఞహా విసపుమేతరివే
శరణంటి కామనాశక
తరమా మీతెఱ వెరుగుట దయజూపు శివా.87
188)దక్షయాగాపహారీ = దక్ష యజ్ఞమును నాశనము చేసినవాడు
189)సుసహః = మిక్కిలి సహనము కలవాడు
మదిలో తలచితి నే శివు
ని దక్షయజ్ఞాపహారిని యఖిల గురునిన్
సదయుని సుసహుని భవునిన్
పదిలముగా నిలువుమయ్య పరమేశ శివా.88
190)మధ్యమః = మధ్యేమార్గమున ఉండువాడు
191)తేజః అపహారీ = ఇతరుల తేజస్సును హరించువాడు
192)బలహా = ఇతరుల బలమును హరించువాడు.
ప్రథముడవు మధ్యముడ యే
నధముడ తేజాపహారి హరహర శంభో
వ్యథలో మునిగితి మరి నీ
కథనంబేమి బలహారి కరుణించు శివా.89
193)ముదితః = ఎల్లప్పుడు సంతోషంతో ఉండువాడు
194)అర్ధః = ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు
195)అజితః = జయింపబడనివాడు
196)వరః = అందరికంటే ఉత్తముడు
భక్తులయడ ముదితుడవే
శక్తివి నీవయట యర్ద జయమగు నజితా
యుక్తినిడవె వర వరదా
ముక్తిని నేకోరుకుందు పురభిత్తు శివా.90
197)గంభీరఘోషః = గంభీరమైన కంఠధ్వని కలవాడు
198)గంభీరః = లోతైన స్వభావము కలవాడు
199)గంభీర వాహనః = పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు
గంభీర ఘోష శరణము
గంభీరా శరణు శరణు కరుణా సింధో
గంభీర వాహన శరణు
శంభో శంకర శరణము శరణంటి శివా.91
200)న్యగ్రోధరూపః = వటవృక్షము యొక్క రూపమైనవాడు
201)న్యగ్రోధః = తానే వటవృక్షమువలె వ్యాపించియుండువాడు
న్యగ్రోధ రూప శరణము
న్యగ్రోధా శరణు శరణు నటరాజ శివా
ఉగ్రత్వము జూపకుమా
వ్యగ్రత చెందితిని స్వామి పరమేశ శివా.92
202)వృక్షకర్ణస్థితిః = చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు
203)విభుః = సమస్తమునకు అధిపతి
నెలవా శ్మశాన మందురు
కలవంతట యంద్రు వృక్షకర్ణస్థితివా
కొలువిమ్మా విభుడా మిము
కొలుచుకొనెద జీతమడుగ గురుడీవె శివా.93
204)సుతీక్షణ దశనః = మిక్కిలి పదునైన దంతములు కలవాడు
205)మహాకాయః = గొప్ప శరీరము కలవాడు
206)మహాననః = గొప్పదైన ముఖము కలవాడు
గతుకుటకు గరళమా హర
శ్రుతివి మహాకాయ స్వామి సుందరి గిరిజా
పతివయ్య మహాసనుడా
మతిలేని మనిషిని నేను మన్నించు శివా.94
207)విశ్వక్సేనః = విష్ణుసేనాధిపతియైన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు,
208)హరిః = విష్ణువే తానైనవాడు.
హరివై విశ్వక్సేనా
దొరవలె పాలింతువయ్య దుర్గేశుడవై
కరివసనమ్మేల తమకు
కరవా వలువలు పరేశ కరకంఠ శివా.95
209)యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు
210)సంయోగపీడ వాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు
యజ్ఞా నిన్నెట్లెఱుగుదు
ప్రాజ్ఞా సంయోగపీడ వాహన యీశా
యజ్ఞము నీరూప మనిరి
యాజ్ఞనిడి దయగొను సాంబ యఖిలేశ శివా.96
211)తీక్షణతాపః = తీక్షణమైన వేడిమి కలుగజేకలవాడు
212హర్యశ్వః = పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యునివంటివాడు.
మతిలేని వాడను శరణు
సుతీక్ష్ణతాపా మహేశ సుందరరూపా
గతివీవయ హర్యశ్వా
పతితుడ గాకుండునట్లు పదమిమ్ము శివా.97
213)సహాయః = ఎల్లప్పుడు మనతో ఉండువాడు
214)కర్మకాలవిత్ = జీవుల కర్మముల కాలముల గురించి ఎరిగినవాడు
215)విష్ణుప్రసాదితః = విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు
శంకర సహాయమడిగితి
బింకమువిడి కర్మకాలవిదుడవు స్వామీ
అంకము ముగించ వేడెద
తంకము విష్ణుప్రసాదిత తొలగదు శివా.98
216)యజ్ఞః = యజ్ఞము యొక్క రూపము తానేఅయినవాడు
217)సముద్రః = సముద్రము యొక్క రూపము తానేఅయినవాడు
218)బడబాముఖః = సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు
నీ యజ్ఞమ్మున సమిధను
నీయాగమ్మున సముద్ర నినదింతు హరా
మాయావివి బడబాముఖ
నీయానతి నీయుమయ్య నినుచేర శివా.99
219)హుతాశన సహాయః = అగ్ని సహాయముగా కలవాడు
220)ప్రశాంతాత్మా = శాంతమైన ఆత్మ కలవాడు
221)హుతాశనః = తానే అగ్ని రూపమైయున్నవాడు
222)ఉగ్రతేజాః = తీవ్రమైన తేజస్సు కలవాడు
శరణము హుతాశన శరణు
శరణు హుతాశన సహాయ శరణంటినయా
శరణు ప్రశాంతాత్మా హర
శరణంటిని యుగ్రతేజ జయమంటి శివా.100
223)మహాతేజాః = గొప్పదైన తేజస్సు కలవాడు
224)జన్యః = సమస్త జంతువుల రూపము తానే అయినవాడు
225)విజయకాలవిత్ = విజయము పొందు కాలము తెలిసినవాడు
కనులుండి మహాతేజా
కననైతిని జన్య విజయ కాలవిదుడవే
మనుజుడ నైతిని స్వామీ
నినుగనుటకు దృష్టి నిమ్ము నిటలాక్ష శివా.101
226)జ్యోతిషామయనం = నక్షత్రములకు మూలస్థానమైనవాడు
227)సిద్ధిః = అష్ట సిద్ధి రూపము తానే అయినవాడు
228)సర్వవిగ్రహః = సమస్తమైన విగ్రహరూపములు తానే అయినవాడు
హర ! జ్యోతిషామయనమా
శరణంటిని సిధ్ధి గోరి సర్వేశ్వరుడా
దొర! సర్వ విగ్రహ! భవా
దరిశన మీయవె పురహర దయజూపి శివా.102
229)శిఖీ = శిఖ ధరించినవాడు, జ్ఞాని
230)ముండీ = కేశరహితమైన శిరస్సు కలవాడు
231)జటీ = జడలు కలిగినవాడు
శిఖలు ధరించిన వానివి
సుఖముగ ముండీ యగుటకు సూత్రము నీవే!
విఖురుల డుల్చితివి జటీ
ముఖమును చూపించరావె ముక్కంటి శివా.103
232)జ్వాలీ = అగ్నిజ్వాలా రూపమైనవాడు
233)మూర్తిజః = విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు
234)మూర్దగః = సహస్రార చక్రమున ధ్యేయ రూపమునున్నవాడు.
ఏలా గున నిన్ జూచుట
జ్వాలీ! మూర్తిజుడ నిన్ను శరణంటి హరా
లీలగ నైనను మూర్దగ
హేలగ నాట్యమున నైన యీశుడవు శివా.104
235)బలీ = బలము కలవాడు
236)వైష్ణవః = విష్ణుశక్తి కలిగినవాడు
237)ప్రజవీ = మిక్కిలి వేగము కలవాడు
238)తాళీ = సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు
239)ఖేళీ = మిక్కిలిగా నటించువాడు
బలమెవ్వరు మాకు బలీ
బలమెవ్వరు మీరుగాక వైష్ణవశక్తీ
బలమీవయ్యా ప్రజవీ
బలమీవే తాళి!ఖేలి! పరమేశ శివా.105
240)కాలకటంకటః = యముని నియంత్రించువాడు
కాల కటంకటుడవు నీ
చేలము పట్టనిమ్ము స్వామి చిరకాలము నీ
లీలల నెన్నతరమె భవ
నీలగళుడ కానరావె నిటలాక్ష శివా.106
241)నక్షత్రవిగ్రహమతిః = నక్షత్రములు, గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు
242)గుణబుద్ధిః = మంచి గుణములను గురించి తెలిసినవాడు
243)లయః = తానే ప్రళయరూపమై అయినవాడు
244)అగమః = తేలికగా పొందుటకు వీలులేనివాడు
245)ప్రజాపతిః = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
నక్షత్ర విగ్రహమతీ!
రక్షంచుమయ గుణబుద్ధి! లయ!కారకుడా
శిక్షింపకుము ప్రజాపతి!
భిక్షనిడెదనయ్య యగమ! ప్రియమార శివా.107
246)విశ్వబాహుః = ప్రపంచమునే తన భుజములుగా కలవాడు
247)విభాగః = ప్రపంచం యొక్క భాగములు తానే అయినవాడు
విశ్వము నీలో కలదట
విశ్వాత్మక విశ్వబాహు విశ్వేశ్వరుడా
విశ్వము లోని విభాగమ
విశ్వరహస్యము తెలుపుము ప్రియమార శివా.108
248)సర్వగః = సమిష్టి కార్య రూపుడు
249)అముఖః = అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు
250)విమోచనః = విముక్తి కలుగజేయువాడు
251)సుసరణః = తేలికగా ప్రసరించువాడు
252)హిరణ్య కవచోద్భవః = బంగారు కవచముతో పుట్టినవాడు
253)మేఢ్రజః = లింగము నుండి పుట్టినవాడు
శరణంటి సర్వగోముఖ
శరణు విమోచన!సుసరణ! జయమందు నయా
శరణంటిని నే మేఢ్రజ
హిరణ్య కవచోద్భవ పర హితకరివి శివా!109
254)బలచారీ = బలముతో సంచరించువాడు
255)మహీచారీ = భూమియందు సంచరించువాడు
256)స్తుతః = స్తుతి చేయబడినవాడు
బలమీవే బలచారీ
బలమీవె సురస్తుత! హర! ఫణిపతి భూషా
బలమీవ మహీచారీ
కలికల్మష నాశ పోష కరుణించు శివా.110
257)సర్వతూర్య వినోదీ = సర్వ తూర్య వాద్యములచేత వినోదించువాడు
258)వ్యాళరూపః = సర్ప రూపమున ఉండువాడు
259)గుహావాసీ = యోగి
శరణంటి వ్యాళరూపా
దొరవీవంటినయ సర్వతూర్య వినోదీ
శరణంటి గుహావాసీ
శరణంటిని వ్యాళరూప శరణంటి శివా.111
260)సర్వతోద్య పరిగ్రహః = పశుపతి
261)గుహః = కార్తికేయ రూపుడు
262) మాలీ = వనమాల దాల్చువాడు
263)తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు
శరణంటి గుహా!మాలీ!
దొరవీవంటినయ సర్వతోద్యపరిగ్రహా
శరణము తరంగ విదునకు
కురంగపాణివి శరణము గురుతిమ్ము శివా.112
264)త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు
265)కాలదృక్ = సకాలమును బాగుగా గుర్తించుయోగి
త్రిదశా యందురు తమరిని
సదమల వృత్తిని కొలిచెద సర్వేశ్వరుడా
హృదయమున కాలదృక్కని
ముదమార తలచెద మిమ్ము పురనాశ శివా.113.
266)కర్మ సర్వబంధ విమోచనః = కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు.
పశుపతి వీవయ మా క
ర్మ సర్వబంధముల ద్రుంచి రక్షించుమయా
దశకంఠ దర్ప భంజన
దిసమొల వేల్పామహేశ దేవేశ శివా.114
267)బంధనస్త్వసురేంద్రాణాం = రాక్షస శ్రేష్ఠ బలికి బంధనరూపం అయివున్నవాడు.
కనగన్నసురేంద్రుల బం
ధన రూపివి కరి వసనము ధరియించెదవే
అనవరతము తలచెద మిము
వినుమా మొరలను దయగొని విశ్వేశ శివా.115
268)యుధి శత్రు వినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు
అనరా మిము మహదేవా
రణమా శత్రువుని గెల్వ రతిసేవ్య శివా
వినరా ముద్దుగ చెప్పిన
మనవాడే!వీడనుచును మామంచి శివా.(116)
269)సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు
270)దూర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయిననూ ధరించువాడు
271)సర్వసాధు నిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు.
శరణంటిని దుర్వాసా
శరణము సాంఖ్యప్రసాద శరణము శంభో
హర సకల సాధు సేవిత
పరమపురుష దేవదేవ పదమిమ్ము శివా.(117)
272)ప్రస్కందః = శత్రువులను నశింపజేయువాడు
273)విభాగజ్ఞః = యజ్ఞ భాగముసేవించబడినవాడు.
274)అతుల్యః = తనతో సమానుడు లేనివాడు
275)యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు
శరణము ప్రస్కందా ! జే
కరుణా సింధో అతుల్య! కంఠే కాలా
శరణంటి విభాగజ్ఞా !
విరక్త జయ యజ్ఞభాగవిత్శరణు శివా.(118)
276)సర్వవాసః = సమస్తమును ధరించువాడు
277)సర్వచారీ = సమస్త ప్రదేశములందు చరించువాడు
278)దుర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు
279)వాసవః = ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు
శరణంటి సర్వవాసా!
శరణంటిని సర్వచారి! శరణంటి హరా
శరణంటిని దుర్వాసా!
శరణము వాసవ! శరణము సర్వేశ్వ శివా.(119)
280)అమరః = మరణము లేనివాడు
281)హైమః = బంగారు మయమైనవాడు
282)హేమకరః = బంగారమును చేయువాడు
283)యజ్ఞః = యజ్ఞపురుష రూపము తానేఅయినవాడు
284)సర్వధారీ = సమస్తమును ధరించువాడు
శరణంటి హైమ! యమరుడ!
శరణంటిని హేమకరుని! జయ జయ శంభో
శరణంటిని యజ్ఞ ! పురుష
శరణంటిని సర్వధారి! సకలేశ శివా.120
285)ధరోత్తమః = ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు
286)లోహితాక్షః = ఎర్రని వర్ణముకల కన్నులు కలవాడు
287)మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు
288)విజయాక్షః = విజయముపై దృష్టి కలవాడు
హరుడ ధరోత్తముడ! శరణు
వరదాయని లోహితాక్ష! ప్రార్థించెదనే
దొరవని విజయాక్షుడ!వని
సరగున చేరెద మహాక్ష! శరణనుచు శివా.121
289)విశారదః = బాగుగా తెలిసినవాడు
290)సంగ్రహః = మిక్కిలి గ్రహించువాడు
291)నిగ్రహః = ఆత్మనియంత్రణ కలిగినవాడు
292)కర్తా = సర్వకార్యములు చేయువాడు
వందనమందు విశారద!
చందనమిదె నిగ్రహ! హర ! సంగ్రహ! దేవా
వందనమందవె కర్తా!
సుందర బాలేందుమౌళి శుభమగును శివా.122
(Page-93/211)
293)సర్పచీర నివాసనః = పాములే వస్త్రముయొక్క నివాసముగా కలవాడు.
294)ముఖ్యః = ప్రధానమైనవాడు
295)అముఖ్యః = అప్రధానమైనవాడు; తనకంటె ఇతరమైన ప్రధానుడు లేనివాడు
296)దేహః=అత్యంతము పుష్ఠి కలవాడు
297)కాహళిః = మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు
ఈశుడవు సర్పచీర ని
వాసనుడ!వముఖ్య! ముఖ్య! బలమిడు దేహా!
వాసవనుత ! కాహళి! హర
దాసుని తప్పులను సైచ తరియింతు శివా.123
298)సర్వకామదః = సమస్తమైన కోరికలు ఇచ్చువాడు
299)సర్వకాల ప్రసాదః = సమస్త కాలములందు అనుగ్రహించువాడు
అశనము గరళమదేలా
కసముగొనుటమేలు సర్వకామద! యీశా
రుసరుస లాడకు శరణం
దు సర్వకాలప్రసాద! దొరవయ్య శివా.124
(కసము- కషాయము)
300)సుబలః = మంచి బలము కలవాడు
301)బలరూపభృత్ = బలమైన రూపము ధరించువాడు
సుబలా దుర్బలుడను నే
నభయమ్మిమ్మంటి స్వామి యంధకరిపువా
ప్రభువా మరిమరి శరణం
దభవా బలరూపభృతుడ వజితుడవు శివా.125
302)సర్వకామప్రదః = సమస్తమైన కోరికలు విశేషముగ ఇచ్చువాడు
303)సర్వదః = సమస్తమును ఇచ్చువాడు
304)సర్వతోముఖః = అన్ని ప్రక్కల ముఖము కలవాడు
శివశివ యన భవభయమా
కవినా నినుతెలుప సర్వకామప్రదుడా!
చవిగొని సర్వద! యందును
కవివీవయ సర్వతోముఖా! శరణు శివా.126
305)ఆకాశ నిర్విరూపః = ఆకాశము నుండి వివిధ రూపములు బయకు వెడలుటకు ఆధారమైనవాడు.
306)నిపాతీ = దేహ తాదాత్మ్యము పొందు స్వభావము కలవాడు.
307)అవశః = దేహ సంబంధము వలన అపరి హార్యమైన దుఃఖాది సంబంధం కలవాడు.
*ఆకాశ నిర్విరూపమ*!
చీకాకుల నొందినాను శీఘ్రమె రావో
ఏకాకినియ *నిపాతీ*!
నీకడ నిలచెద *నవశుడ*! నీదు దయ శివా.127
308)ఖగః = హృదయాకాశమును పొందినవాడు.
309)రౌద్రరూపః = తీవ్రకోపముతో కూడిన రూపము కలవాడు
310)అంశుః = దేవతా విశేషమైనవాడు
నిగమాగమ పూజితుడా
*ఖగా*! శరణు *రౌద్రరూప*! కరుణింపు మయా
జగమెరిగిన *యంశుడవే*
సిగలో జాబిల్లినౌదు చేకొమ్ము శివా.128
311)ఆదిత్యః = సూర్యుడు తానైయున్నవాడు
312)బహురశ్మిః = ఎక్కువ కాంతి (కిరణములు) కలవాడు
313)సువర్చసీ = మంచి కాంతి కలవాడు
314)వసువేగః = కిరణముల యొక్క వేగము కలవాడు
*ఆదిత్యా* వందనములు
శోధించెదను *బహురశ్మి* సుందర రూపా
వేధించకుము *సువర్చశి*
సాధింతు మిము *వసువేగ* శరణనుచు శివా.(129)
315)మహావేగః = గొప్ప వేగము కలవాడు
316)మనోవేగః = మనస్సు వంటి వేగము కలవాడు
317)నిశాచరః = రాత్రియందు సంచరించువాడు
318)సర్వవాసీ = సమస్త ప్రదేశములందు నివసించువాడు
319)శ్రియావాసీ = శ్రీ శోభతో నివసించువాడు
శరణందు *మహావేగా*
శరణు *మనోవేగుడా* *నిశాచర* శుభదా
శరణందు *సర్వవాసీ*
శరణు *శ్రియావాసి* మీకు జయమందు శివా.(130)
320)ఉపదేశకరః = ఉపదేశము చేయువాడు
321)అకరః = మౌనముగా ఉపదేశించు వాడు
322)మునిః = మౌనము కలవాడు
*ఉపదేశకరుడ* *వకరా*
జపతపముల నెఱుగనయ్య జటదారి శివా
చపలుడను నేను *మౌనివి*
కృపజూపవె దేవదేవ క్ష్వేళగళ శివా.131
323)ఆత్మనిరాలోకః = ఆత్మయందు నిశ్చయించుకొని ఆలోచించువాడు
324)సంభగ్నః = బాగుగా సేవింప బడినవాడు
325)సహస్రదః = అనేకమైన వాటిని ఇచ్చువాడు
326)పక్షీ = గరుత్మంతుడను పక్షి రూపము వాడు
*శరణాత్మనిరాలోకా*
శరణాగత వత్సల జయ *సంభగ్న* హరా
శరణము *సహస్రద* శరణు
శరణము *పక్షీ* మొరవిను శరణందు శివా.132
327)పక్షరూపః = మిత్ర రూపమున సహాయుడు
328)అతిదీప్తః = మిక్కిలి ప్రకాశించువాడు
329)విశాంపతిః = సార్వభౌముడు
వందనము పక్షరూపా
వందనముగొను మతిదీప్త వందనమయ్యా
వందనము విశాంపతికిన్
చందన మందింతునయ్య జయమనుచు శివా.133
330)ఉన్మాదః = మోహము కలిగించు వాడు
331)మదనః = మన్మధడు
332)కామః = కోరబడువాడు
333)అశ్వత్థః = తానే రావిచెట్టు రూపమున ఉన్నవాడు
334)అర్థకరః = ధనాదులొసగువాడు
*ఉన్మాదుడవా!*మదనా!*
తన్మయుడవ *కామ*!జ్వాలి తరుణేందు ధరా
సన్మార్గుల *కశ్వత్థా*
చిన్మయడీ *వర్థకరుడ*! చేతనము శివా.134
335)యశః = కీర్తి ప్రదుడు
336)వామదేవః = కర్మ ఫలమువిభజించు ఒసగువాడు
337)వామః = కర్మల ఫలస్వరూపుడు
338)ప్రాక్ =అన్నిటికి ఆద్యుడు
339)దక్షిణః = ముల్లోకముల నాశ్రయింప జేయ సమర్థుడు
340) వామనః = వామనావతారుడు
341) సిధ్ధయోగి= సనత్కుమారాది సిధ్ధముని
ఏమని కోరెదను *యశా*
*వామా* జయ *వామదేవ* పాదము లిడవే
క్షేమంబగు *ప్రాక్దక్షిణ*
వామనుడవు *సిద్ధయోగి* భసితాంగ శివా.135
342)మహర్షిః= వశిష్టాది మహర్షి
343) సిద్ధార్థ= ఋషభ దత్తాత్రేయాది స్వరూపుడు
344) సిద్ధ సాధక= విద్వాంసుడగు సన్యాసి.
345)భిక్షుః = లింగధారియగు హంస
346)భిక్షురూపః = లింగరహితుడైన పరమహంస.
శరణు *మహర్షీ* శరణము
శరణము *సిధ్ధార్థ సిద్ద సాధక* శంభో
శరణంటి *భిక్షు* శరణము
శరణంటిని *భిక్షురూప* జయమంటి శివా.136
347)విపణః = అసముడు
348)మృదుః = సర్వభూతముల కభయ దాత, కోమలత్వము గల ప్రభువు
349)అవ్యయః = నిర్వకారుడు
ఎట్టుల గుర్తింతు *విపణ*
పట్టెద *మృదు* వంచు మిమ్ము భావనలోనన్
చుట్టెదను తమరి *నవ్యయ*
చట్టున పదముల పడెదను శరణనుచు శివా.137
350)మహాసేనః = కార్తికేయుడు
351)విశాఖః = కుమారస్వామి (సేనాపతి) తానే అయఅయినవాడు
352)షష్టిభాగః = కాలమును అరవై భాగములుగ విభజించినవాడు
353)గవాంపతిః = గోవుల యొక్క పతి (వృషభము) తానే అయినవాడు
వందనము *మహాసేనా*
వందనమందును *విశాఖ* వందన మయ్యా
వందనము *షష్టిభాగా*
వందనము *గవాంపతికిని* వందనము శివా.138
354)వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు
355)విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు
356)చమూస్తంభః = సేనా సమూహమును నిరోధించువాడు
357)వృత్తావృత్తకరః = వృత్తం (యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం), ఆవృత్తం (శత్రుసైన్యాన్ని నశింపజేసి ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం) రెంటిని నైపుణ్యంగా చేయువాడు
జయమంటి *వజ్రహస్తా*
జయమగు *విస్రంభ* మిమ్ము శరణంటినయా
జయమగును *చమూస్తంభా*
జయ *వృత్తావృత్తకర* విజయమంటి శివా.139
358)తాలః = తాళ స్వరూపము తానే అయినవాడు
359)మధుః = వసంత ఋతువు రూపము తానే అయినవాడు
360)మధుకలోచనః = తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు
అందని వాడవు *తాలా*
వందనమందు *మధు* తమకు వందనమయ్యా
వందనము *మధుకలోచన*
చందనమందింతు తమకు శరణనుచు శివా.140
361)వాచస్పత్యః = వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. దేవ పురోహితునకనుజుడు.
362)వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు (వాజసనుడు) తానే అయినవాడు
శరణము వాచస్పత్యా
శరణము వాజసన దేవ శరణంటినయా
హరహర శంభో శంకర
శరణముమాపతి మహేశ శరణంటి శివా.141
363)నిత్యమాశ్రిత పూజితః = ఎల్లప్పుడు తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు
364)బ్రహ్మచారీ = బ్రహ్మ మందు చరించువాడు
365)లోకచారీ = లోకమునందు సంచరించువాడు
పూజలివె నిత్యమాశ్రిత
పూజితుడా భక్ష్యలేహ్య భోజనమిదివో
భ్రాజిల్లు బ్రహ్మచారీ
రాజిల్లుచు లోకచారి రమ్మంటి శివా.142
366)సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు
367)విచారవిత్ = అంతర్ముఖుడై చరించువాడు
368)ఈశానః = నియంత
రావయ్య సర్వచారీ
నీ వైనమెఱుగను స్వామి నీలగళేశా
నీవే విచారవిదుడవు
దేవా యీశాన నన్ను దీవించు శివా.143
369)ఈశ్వరః = వ్యాపించు వాడు
370)కాలః = మృత్యురూపము తానే అయినవాడు
371)నిశాచారీ = మహాప్రళయమున చరించువాడు
ఈశ్వరుడ సర్వచారీ
విశ్వేశ్వరుడీవె కాల వేదవిహారా
శాశ్వతుడ నిశాచారీ
విశ్వము నీలో గలదట వినతులివె శివా.144
372)పినాకభృత్ = పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు
373)నిమిత్తస్థః = ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు
374)నిమిత్తం = నిమిత్త మాత్రుడు
కనికరము జూపుమీశా
పినాకపాణీ పరేశ భీరుడను హరా
వినవె నిమిత్తస్థా హే
సనాతన నిమిత్త దేవ శరణంటి శివా.145
375)నందిః = జ్ఞాన సంపదగలవాడు
376)నందికరః = సంపత్కరుడు
377)హరిః = హనుమ రూపుడు
378)నందీశ్వరః = వృషభరూపము తానే అయినవాడు
379)నందీ = శివగణ రూపుడు
380)నందనః = ఆనందపరచువాడు
381)నందివర్ధనః = ఆనంద స్థితిని వృద్ధి చేయువాడు
నందివి! నందికరుండవు!
నందీశ్వర! హరివి నీవు నర్తింతువయా
నందీ! యని మొరలిడుదున్
నందన!హర నందివర్థన! శరణందు శివా.146
382)భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు
383)నిహంతా = చంపువాడు
384)కాలః = కాలరూపము తానే అయినవాడు
385)బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
386)పితామహః = తానే బ్రహ్మ అయినవాడు
387)చతుర్ముఖః = నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు
జయమంటిని భగహారీ!
దయజూపు నియంత ! కాల! దండము తండ్రీ
జయమగు బ్రహ్మ! పితామహ!
జయము చతుర్ముఖ! పినాకి శరణంటి శివా.146
388)మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు
389)చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు
390)లింగాధ్యక్షః = లింగాకారములన్నిటికి అధిపతి
వందనము మహాలింగా
వందనములు చారులింగ ప్రమథాధిపతీ
సుందర లింగాధ్యక్షా
వందనమందును మహేశ పరమేశ శివా.147
391)సురాధ్యక్షః = దేవతలకు అధిపతి
392)యోగాధ్యక్షః = సమస్త యోగశాస్త్రమునకు అధిపతి
393)యుగావహః = సమస్త కాలమును ఆవహించియుండువాడు
394)బీజాధ్యక్షః = సృష్టియొక్క మూలమునకు అధిపతి
శరణు సురాధ్యక్ష శరణు
హర యోగాధక్ష స్వామి హఠమేలనయా
శరణు యుగావహ జగదీ
శ్వర బీజాధ్యక్ష శరణు శరణంటి శివా.148
395)బీజకర్తా = సృష్టియొక్క మూలమును కలుగజేయువాడు
396)అధ్యాత్మానుగతః = ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు
397)బలః = బలరూపము తానే అయినవాడు
398)ఇతిహాసః = పూర్వచరిత్ర కలవాడు
గురుతిమ్ము బీజకర్తా
హర ఆధ్యాత్మానుగతుడ హటకేశ్వరుడా
వరదా బలమీవె శరణు
కురంగపాణి వితిహాస గురుతిమ్ము శివా.149
399)సకల్పః = యజ్ఞ ప్రయోగ విధికల వాడు
400)గౌతమః = గౌతమ స్వరూపుడు
401)నిశాకరః = చంద్రుడు, చంద్ర వ్యాకరణ కర్త
402)దంభః = మిక్కిలి అట్టహాసము కలిగినవాడు
403)అదంభః = అట్టహాసము లేనివాడు
404)వైదంభః = దంభము లేనివాడు
405)వశ్యః = భక్తులకు అధీనుడైనవాడు
406)వశకరః = ఆకర్షణ గుణము కలవాడు
కుశలమె *సకల్ప* గౌతమ*
నిశాకరుడ *దంభదంభ* నింగిసిగహరా,
పశువుని నే *వైదంభా*
పశుపతి శరణంటి *వశ్య* వశకరుడ* శివా.150
407)కలిః = కలి పురుషుడు తానే అయినవాడు
408)లోకకర్తా = లోకమును నడిపించువాడు
409)పశుపతిః = నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి
410)మహాకర్తా = గొప్పవాడై లోకములను నడిపించువాడు
411)అనౌషధః = ఔషధములు అక్కరలేనివాడు
కలి వైన లోకకర్తా
విలవిల లాడితి పశుపతి వేదన హెచ్చెన్
ఇలలోన మహాకర్తా
తలపులనౌషధ నిలువవు దయజూపు శివా.151
412)అక్షరం = నాశములేని
413)పరమం = శ్రేష్టమైన
414)బ్రహ్మ = జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్ధము తానే అయినవాడు
415)బలవాన్ = బలము కలవాడు
416)శక్తః = సమర్థుడైనవాడు
అక్షరుడ! బ్రహ్మ! పరమా!
దక్షుని దండించ మీకు తగునా తండ్రీ
త్ర్యక్షా బలవాన తమరి
రక్షణ కోరితిని శక్త! రతిసేవ్య శివా.152
417)నీతిః = నియమ (ధర్మ) శాస్త్రము తానే అయినవాడు
418)అనీతిః = నియమము లేనివాడు
419)శుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు
420)శుద్ధః = పరిశుద్ధమైనసమర్థుడైనవాడు
421)మాన్యః = గౌరవింప తగినవాడు
422)గతాగతః = జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు
423)బహుప్రసాదః = మిక్కిలి అనుగ్రహము కలవాడు
*నీతి వనీతివి శుధ్ధా*
త్మా తరమా *శుధ్ధ మాన్య* తమరిన్ తెలియన్
త్రాతా *బహుప్రసాదా*
*ధాత గతాగత* హరహర దయజూపు శివా.153
424)సుస్వప్నః = మంచి కలగా కనిపించువాడు
425)దర్పణః = ప్రకృతియొక్క ప్రతిబింబము చూపించువాడు
426)అమిత్రజిత్ = శత్రువులను జయించినవాడు
*సుస్వప్న* దేవ *దర్పణ*
విశ్వాసము కలుగనిమ్ము వేదవిహారా
విశ్వేశ *యమిత్రజితుడ*
నా స్వప్నమునైన నీవు నర్తించు శివా.154
end of 50 in 401-500)
427)వేదకారః = వేదములను తెలియపరచినవాడు
428)మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు
429)విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు
430)సమరమర్దనః = యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు
శరణంటి వేదకారా!
శరణంటిని మంత్రకార! శరణము విద్వాన్!
శరణంటి సమరమర్థన!
విరులను పూజింతుమిమ్ము ప్రియమార శివా.155
431)మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు
432)మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు
433)వశీకరః = అందరను ఆకర్షచేయువాడు
నమతులివె *మహాఘోరా!*
ప్రమథాధిపుడా కపాలి వందనములు శూ
లి *మహామేఘనివాసీ!*
రమితుడవు *వసీకర* మము రక్షించు శివా.156
(రమిత= ఆనందమును పొందినవాడు)
434)అగ్నిజ్వాలో = అగ్నివంటి తేజస్సు కలవాడు
435)మహాజ్వాలః = అగ్నికన్నను గొప్ప తేజస్సు వాడు
436)అతిధూమ్రః = మిక్కిలి ధూమ్రవర్ణము (నలుపు, ఎరుపు కలసియున్న రంగు) పొగవర్ణములో ఉన్నవాడు
437)హుతః = అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు
438)హవిః = హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు
439)వృషభః = వాహనమగు ఎద్దు రూపము తానైనవాడు
వందనములగ్నిజ్వాలా!
వందనమ తిధూమ్ర! దేవ పరమేశ్వరుడా
వందనము మహాజ్వాలా!
వందనము హుత! హవి! వృషభ! పదమిమ్ము శివా.157
440)శంకరః = సుఖమును కలుగజేయువాడు
441)నిత్యంవర్చస్వీ = ఎల్లప్పుడు వర్చస్సు కలవాడు
442)ధూమకేతనః = ధూమవర్ణము కల జెండా కలవాడు
443)నీలః = నల్లనైనవాడు
వందనము శంకరా! హర
వందనములివె గొను నిత్యవర్చస్వి వయా
సుందరుడ ధూమకేతన!
వందనములు నీల! దేవ వందనము శివా.158
444)అంగలుబ్ధః = మన్మథుని యందు ఆసక్తి కలవాడు
445)శోభనః = శుభములను కలుగజేయువాడు
446)నిరవగ్రహః = ప్రతిబంధములు లేనివాడు
447)స్వస్తిదః = శుభములను ఇచ్చువాడు
448)స్వస్తిభావః = శుభమైన భావములు కలవాడు
శరణంటి నంగలుబ్దా!
పరమేశా శోభన! నిరవగ్రహ రావే
వరదా స్వస్తిద! శుభకర
శరణంటిని స్వస్తిభావ! శరణంటి శివా.159
449)భాగీ = యజ్ఞమునభాగము కలవాడు
450)భాగకరః = హవిస్సు భుజించువాడు
451)లఘుః = తేలిక అయికలవాడు
452)ఉత్సంగః = సంగరహితుడు
453)మహాంగః = మహాలింగ స్వరూపుడు
భాగీ! నగజాధిపుడా
భాగకరా! లఘు! భగాలి బాలేందుధరా
రాగదె యుత్సంగ ! హరా
సాగిలపడెదను మహాంగ! శరణనుచు శివా.160.
454)మహాగర్భపరాయణః = తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకొనువాడు
455)కృష్ణవర్ణః = నల్లని వర్ణము కలవాడు
456)సువర్ణః = బంగారు వర్ణము కలవాడు; బంగారం తానే అయినవాడు
వినవె మహాగర్భపరా
యణా! మనవి కృష్ణవర్ణ! యంగజహరుడా
నినుగని సువర్ణ! యందురు
కనుగొన లేనైతినయ్య కనులిమ్ము శివా.161
457)సర్వదేహినా మింద్రియం = సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు
458)మహాపాదః = విస్తారమైన పాదములు కలవాడు
459)మహాహస్తః = గొప్పనైన చేతులు కలవాడు
జయమంటిని సర్వేశా
త్రియంబకుడ శరణు సర్వదేహులకీవిం
ద్రియుడవని! మహాపాదా!
జయము మహాహస్త!స్వామి శరణంటి శివా.162
460)మహాకాయః = గొప్ప శరీరము కలవాడు
461)మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు
462)మహమూర్ధాః = గొప్ప శిరస్సు కలవాడు
463)మహామాత్రః = గొప్ప పరిమాణము కలవాడు
464)మహానేత్రః = గొప్పవైన నేత్రములు కలవాడు
జయమంటి మహాకాయా!
జయమంటి తమకుమహాయశ! మహా మూర్ధా!
జయమంటి మహామాత్రా!
జయము మహానేత్ర! స్వామి శరణంటి శివా.163
465)నిశాలయః = అవిద్య నాశకుడు
466)మహాంతకః = మృత్యువుకే మృత్యువు
467)మహాకర్ణః = గొప్పవైన చెవులు కలవాడు
468)మహోష్ణః = గొప్ప వృషభము కలవాడు
469)మహాహనుః = గొప్ప దవడలు కలవాడు
470)మహానాసః = గొప్ప ముక్కు కలవాడు
శరణము స్వామి *నిశాలయ*
కరుణించవె మము *మహాంతక మహాకర్ణా*
శరణు *మహోష్ణ మహాహను*
శరణు *మహాసన* మహేశ శరణంటి శివా.164
471)మహాకంబుః = గొప్ప కంఠముగల వాడు
472)మహాగ్రీవః = విశాల కంఠము కలవాడు
473)శ్మశానభాక్ = స్మశానములో ఉండువాడు. దేహబంధములను బేధించువాడు
474)మహావక్షాః = విశాల వక్షస్థలము కలవాడు
శరణు మహాకంబు! శరణు
శరణుమహాగ్రీవ! మీకు జయమంటినయా
పురహర శ్మశాన వాసీ!
శరణు మహావక్ష! స్వామి శరణంటి శివా.165
475)మహోరస్కః = గొప్పదైన రొమ్ము కలవాడు
476)అంతరాత్మా = ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు
477)మృగాలయః = సామాన్య జంతువులకు నిలయమైనవాడు
478)లంబనః = అందరకును పట్టుకొమ్మ అయినవాడు
శరణు మహోరస్క! శరణు
వరమడిగితి నంతరాత్మ! పదమీవె హరా
కరివసనుడవు మృగాలయ!
శరణము లంబన! పరేశ శరణంటి శివా.166
479)లంబితోష్ఠః = నోరు తెరచి ఉన్నవాడు; వ్రేలాడుచున్న పెదవులు కలవాడు
480)మహామాయః = గొప్ప మాయ కలిగినవాడు
481)పయోనిధిః = సముద్రుని వంటివాడు
వందనము మహామాయా!
సుందరుడవు లంబితోష్ట! సూక్ష్మాత్ముడవే
వందనమయ్య పయోనిధి!
చందనమందింతునయ్య శరణనుచు శివా.167
482)మహాదంతః = గొప్పవైన దంతమకలిగినవాడు
483)మహాదంష్ట్రః = గొప్పవైన కోరలు కలవాడు
484)మహాజిహ్వః = గొప్పదైన నాలుక కలవాడు
485)మహాముఖః = గొప్పదైన ముఖము కలవాడు
శరణంటి మహాదంతా!
శరణు మహాదంష్ట్ర! స్వామి శాంతించుమయా
శరణంటి మహాజిహ్వా!
శరణు మహాముఖ! మహేశ జయమందు శివా.168
486)మహానఖః = గొప్పవైన గోళ్ళు కలవాడు
487)మహారోమః = గొప్పవైన వెండ్రుకలు కలవాడు
488)మహాకేశః = గొప్పవైన తలవెండ్రుకలు కలవాడు
489)మహాజటః = గొప్పవైన జడలు కలవాడు
శరణములయ్య మహానఖ!
శరణు మహారోమ! యంటి సర్వేశ్వరుడా
శరణు మహాకేశ! శరణు
శరణు మహాజట! సురేశ శరణంటి శివా.169
490)ప్రసన్నః = అనుగ్రహించువాడు
491)ప్రసాదః = అనుగ్రహరూపము కలవాడు
492)ప్రత్యయః = విశ్వాసము తానే అయినవాడు
493)గిరిసాధనః = కొండలను సాధించువాడు
494)స్నేహనః = స్నేహము కలవాడు
ఏదయ *ప్రసన్న* నీదయ
పాదము లీవే *ప్రసాద ప్రత్యయు డవుగా*
*సాధన* చేయించవె *గిరి*
*సాధన స్నేహన* పరేశ శరణనెద శివా.170.
495)అస్నేహనః = వాత్సల్యము లేనివాడు
496)అజితః = జయింపబడనివాడు
497)మహామునిః = గొప్ప మౌనము కలవాడు
నీ హితులెవ రస్నేహన
నాహితుడవు వీ వజితుడ నాదశరీరా
స్నేహితుడవగు మహాముని
సాహాయ్యము చేయుమయ్య శరణనెద శివా.171
498)వృక్షాకారః = వృక్షము యొక్క ఆకారము కలవాడు
499)వృక్షకేతుః = వృక్షము తన జెండాగా కలిగినవాడు
500)అనలః = అగ్ని ఆకారము తానే అయినవాడు
వృక్షాకారా శరణము
వీక్షింపవె వృక్ష కేతు ప్రేమగ నన్నున్
శిక్షింపకు నన్నిక నీ
రక్షణ లోనుంచుమనుచు ప్రార్థింతు శివా.172
501)వాయువాహనః = వాయువు వాహనముగ కలవాడు
502)గండలీ = గుహలో నివసించువాడు
503)మేరుధామా = బంగారు కొండ నివాసముగా కలవాడు
504)దేవాధిపతిః = దేవతలకు అధిపతి అయినవాడు
(End of 60 in 500అయినవాడు
శరణంటి వాయువాహన!
శరణంటిని గండలీ! విజయుడవు భవుడా
శరణంటి మేరుధామా!
శరణము దేవాధిపతికి శరణంటి శివా.173
505)అధర్వ శీర్షః = అధర్వణ వేదము శిరస్సుగా కలవాడు
506)సామాస్యః = సామ వేదము ముఖముగా కలవాడు
507)ఋక్సహస్రామితేక్షణః = ఋగ్వేదమును పరిమితిలేని కన్నులుగా కలవాడు
508)యజుఃపాదభుజః = యజుర్వేదము పాదములు, భుజములుగా కలవాడు
పురహర *యధర్వశీర్షా*
శరణము *సామాస్య* దేవ శరణంటి నయా
శరణు *యజుపాదభుజ* స్వా
మి *ఋక్సహస్రామితేక్ష* మేలంటి శివా.174
509)గుహ్యః = రహస్యమైనవాడు
510)ప్రకాశః = అందరకును వెలుగు రూపమున బహిరంగమైనవాడు
511)జంగమః = కదలిక కలిగినవాడు
512)అమోఘార్థః = వ్యర్ధము కాని ప్రయోజనము కలవాడు
జగతికి *ప్రకాశ* మీవే
నగజాధిప *గుహ్య* దేవ నాదివ్వెవుగా
జగదీశ *జంగమ* శరణు
*నిగమామోఘార్థ* యంచు నినదింతు శివా.175
513)ప్రసాదః =దయాళువు
514)అభిగమ్యః = సులభముగా పొందతగినవాడు
515)సుదర్శనః = మంగళ ప్రదమైన దర్శనము కలవాడు
516)ఉపకారప్రియః = ఉపకారము చేయుటయందు ప్రీతి కలవాడు
517)సర్వః = సమస్తమునందు వ్యాపించియుండువాడు
518)కనకః = బంగారము తానే అయినవాడు
సదయుడ *ప్రసాద* మడిగితి
*సుదర్శనుడవాభిగమ్య* సుందరరూపా
ముదమగు *నుపకారప్రియ*
పదములిడగ *సర్వ కనక* ప్రార్థింతుశివా.176
519)కాంచనచ్ఛవిః = బంగారపు కాంతి కలవాడు
అంచిత పాదయుగళుడా
పెంచరె మీ కాంచనచ్ఛవిని! మా కొరకై
త్రుంచరె మా క్లేశములను
సంచిత మౌ పాపములను, శరణనెద శివా.177
520)నాభిః = ప్రపంచమునకు నాభిస్థానము వంటివాడు
521)నందికరః = ఆనందము కలుగజేయువాడు
522)భావః = అందరి మనస్సు తానైనవాడు
*నాభివి నందికరుండవు*
నీ భావమెరుగను *భావ* నిటలాక్షుడవే
లోభివి నను రానీయవు
నీ భక్తుని గానరావు నిజమేమి శివా.178
523)పుష్కరస్థాపితః = బ్రహ్మాండ ప్రభువు
524)స్థిరః = స్థిరమైనవాడు
525)ద్వాదశః = ద్వాదశ రూపములు కలవాడు
526)త్రాసనః = భయమును కలుగజేయువాడు
527)ఆద్యః = ఆదియైనవాడు
528)యజ్ఞః = యజ్ఞపురుషుడు తానే అయినవాడు
కోపింపకు *స్థిర పుష్కర*
*స్థాపిత ద్వాదశుడ* వీవె *త్రాసన యాద్యా*
పాపినిగావవె *యజ్ఞా*
దాపున నిలుచుండనిమ్ము దయజూపి శివా.179
529)యజ్ఞసమాహితః = యజ్ఞము అనే కర్మతో కూడియుండువాడు
530)నక్తం = రాత్రి రూపమైనవాడు
531)కలిః = కలి పురుషుడు తానే అయినవాడు
532)కాలః = కాలపురుషుని రూపము తానే అయినవాడు
533)మకరః = మొసలి రూపము తానే అయినవాడు
534)కాలపూజితః = కాలము (కాలుని) చేత పూజింపబడినవాడు
535)సగణః = గణములతో కూడినవాడు
జోతలు యజ్ఞ సమాహిత!
జోతలు నక్త!కలి!కాల!జోతలివె హరా
జోతలివె కాలపూజిత
జోతలు మకర! సగణ!భవ జోబిళ్ళు శివా.180
536)గణకారః = సైన్య సమూహములను సృష్టిచేయువాడు
537)భూతవాహనసారథిః = ప్రాణుల యొక్క వాహనములను నడిపించువాడు
538)భస్మాశయః = భస్మమున శయనించు వాడు
539))భస్మగోప్తా = భస్మమును ధరించిన వారిని రక్షించువాడు
సారథివి భూత భావన
సారథి! గుణకార! స్వామి శరణంటినయా
కోరితి మిము భస్మాశయ!
సారెకు దయ భస్మగోప్త!శరణనుచు శివా.181
540)భస్మభూతః = భస్మమయుడు
541)తరుః = కల్పవృక్ష రూపుడు
542)గణః =గుణ రూపుడు
543)లోకపాలః = లోకములను పరిపాలించువాడు
544)అలోకః = లోకాతీతుడు
545)మహాత్మా = పూర్ణుడు
దండములు భస్మభూతా!
దండము తరు!గణ!యలోక! దండములయ్యా
దండములు లోకపాలా!
రండు మహత్మా! దయగొని రక్షింప శివా.182
546)సర్వపూజితః = అందరిచే పూజింపబడువాడు
547)శుక్లః = శుద్ధ స్వరూపము తానే అయినవాడు
548)త్రిశుక్లః = త్రికరణములచే శుద్ధుడు
549)సంపన్నః = సంపూర్ణ సంపదలచే కూడియున్నవాడు
550)శుచిః = శుచియైనవాడు; అగ్ని రూపములో ఉన్నవాడు
కైమోడ్తు సర్వపూజిత!
కైమోడ్పులు గొనవె శుక్ల! కరుణామయుడా
కైమోడ్తును సంపన్నా!
కైమోడ్పులు శుచి! త్రిశుక్ల! కామారి శివా.183
551)భూత నిషేవితః = ప్రాణుల చేత సేవింపబడినవాడు
552)ఆశ్రమస్థః = ఆశ్రమమున నివసించువాడు
553)క్రియావస్థః = కర్మలతోను వాటి పరిస్థితులతోను కూడియున్నవాడు
554)విశ్వకర్మమతిః = ప్రపంచమందలి కర్మములను గురించి బాగుగా తెలిసినవాడు
దండము భూతనిషేవిత!
దండముగొనుమాశ్రమస్థ! దహనాంబకుడా
దండములు క్రియావస్థా!
మండితపద విశ్వకర్మమతి!వీవె శివా.184
555)వరః = శ్రేష్ఠుడు.
556)విశాలశాఖః = అనేకమైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు
557)తామ్రోష్ఠః = తామ్ర+ఓష్ఠ అనగా ఎర్రనైన పెదవులు కలవాడు
558)అంబుజాలః = సముద్ర రూపమైనవాడు
559)సునిశ్చలః = మిక్కిలి చలనము లేకుండ ఉండువాడు
వరుడవు! విశభుజించువాడు
వా తామ్రోష్ఠ! మిమ్ము తెలియగ తరమా
దొరవయ్య యంబుజాలా!
మొరను సునిశ్చల!వినవలె ముదమార శివా.185
560)కపిలః =కపిలవర్ణుడు
561)కపిశః = కపిశ వర్ణుడు
562)శుక్లః = తెల్లనైనవాడు
563)ఆయుః = మానవుల ఆయువు రూపము తానే అయినవాడు
564)పరః = ఉత్కతెలిసినవాడు
వందనములు కపిల! కపిశ!
వందనములు శుక్ల!ఆయు!వందనమయ్యా
వందనములివె గొను పరా!
చందనమందింతు నయ్య శరణనుచు శివా.186
565)అపరః = అర్వాచీనుడు
566)గంధర్వః = గంధర్వులను ఒక జాతికి చెందినవాడు
567)అదితిః = అదితి సంతానమైనవాడు
568)తార్క్ష్యః = గరుడుని రూపము తానే అయినవాడు
569)సువిజ్ఞేయః = సులభముగా తెలియదగినవాడు
570)సుశారదః = మంచి పండితుడు
అపరా! గంధర్వా! యని
తపియింతు నదితి!నతులివె తార్ క్ష్యా ! యనఘా
సుపథమిడు సువిజ్ఞేయా!
రపము సుశారద! తమరిది రక్షింపు శివా.187
(రపము=చెల్లుబడి)
571)పరశ్వధాయుథః= పరశువు (గండ్ర గొడ్డలి) ఆయుధంగా కలవాడు
572)దేవః = దేవుడైనవాడు
573)అనుకారీ = అనుసరించి పోవువాడు
574)సుబాంధవః = మంచి బంధువైనవాడు
తరమా మీతో రణములు
*పరశ్వధాయుథుడ దేవ* పరమేశ్వరుఁడా
వరదుడవీ *వనుకారివి*
పరమ *సుబాంధుడవు* మీకు భద్రమగు శివా.188
575)తుంబవీణః = పెద్దదైన వీణ కలవాడు
576)మహాక్రోధః = మిక్కిలి కోపం కలవాడు
577)ఊర్ధ్వరేతా = ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలవాడు
578)జలేశయః = జలమునందు శయనించువాడు
579)ఉగ్రః = తీక్షణమైనవాడు
కొనగోట తుంబవీణియ
కనగ మహాక్రోధకాల కాలుడవుగ్రా
మునివరుల కూర్ధ్వరేతా
యనువగు జలశాయి పోలె యగుపించు శివా.189
580)వంశకరః = వంశప్రవర్తకుడు
581)వంశః = వంశ స్వరూపుడు
582)వంశనాదః = వెదురులోని నాదం తానే అయినవాడు
583)అనిందితః = నింద లేనివాడు
గిడిగిళ్ళు వంశకరునకు!
గిడిగిళ్ళివె తమకు వంశ! గిరిజాపతికిన్
గిడిగిళ్ళు వంశనాదా!
గిడిగిలనిందిత!మహేశ గిరిశుడవు శివా.190
584)సర్వాంగరూపః = సమస్త అవయవ రూపము కలవాడు
585)మాయావీ = మాయ చేయువాడు
586)సుహృదః = మంచి స్నేహితుడు
587)అనిలః = వాయు రూపమైనవాడు
588)అనలః = అగ్తీక్షణమైనవాడు
589)బంధనః = బంధించువాడు
జోతలు గొను మాయావీ!
జోతలు సర్వాంగరూప! జోబిళ్ళివిగో
జోతలివె సుహృద! అనిలా!
జోతలనల! బంధన! హర జోబిళ్ళు శివా.191
590)బంధకర్తా = సంసారనిర్మాత
591)సుబంధ విమోచనః = బంధముల నుండి విముక్తి కలిగించువాడు
592)సయజ్ఞారిః = యజ్ఞశత్రువులు దైత్యులతో కూడియుండువాడు
593)సకామారిః = జితకామ యోగులతో కూడియుండువాడు
594)మహాదంష్ట్రః = గొప్పకోరలు కల నృసింహరూపుడు
శరణంటి బంధకర్తా!
శరణు సయజ్ఞారివి గిరిశ సకామారీ!
శరణు సుబంధ విమోచన!
శరణు మహాదంష్ట్ర! దేవ శరణంటి శివా.192
595)మహాయుధః = గొప్ప ఆయుధము కలవాడు
596)బహుధా నిందితః = అనేక విధముల నిందింపబడినవాడు
597)శర్వః = సమస్తము తానే అయినవాడు
598)శంకరః = సుఖమును కలుగజేయువాడు
599)అధనః = దిగంబరుడగుట వలన ధనహీనుడు
*బహుధా నిందితుడవుగా*
*మహాయుధా శర్వ యధన* మహనీయుడవే
దహనాంబకుడా *శంకర*
సహాయమీవే కపాలి శరణనెద శివా.193
600)అమరేశః = దేవతలకు అధిపతి
601)మహాదేవః = దేవతలలో గొప్పవాడు
602)విశ్వదేవః = ప్రపంచమునకు దేవుడు
603)సురారిహా = దేవతల శత్రువులను చంపినవాడు
604)అహిర్భుధ్న్యః = శేష స్వరూపుడు
అమరేశ! మహాదేవా!
తమినాశక విశ్వదేవ! దండములయ్యా
నమసము సురారిహా! హర
విమల అహిర్భుధ్న్య!యందు ప్రియమార శివా.194
605)అనిలాభః = గాలివంటి వాడు
606)చేకితానః = సర్వజ్ఞుడు; అత్యంత జ్ఞానయుక్తుడు
607)హవిః = భోగ్య వస్తుసముదాయము
608)అజైకపాత్ = ఏకాదశ రుద్రులలోనొకడు
609)కాపాలీ = భూమ్యాకాశములను కపాలములు కలవాడు
610)త్రిశంకుః = త్రిశంకువను రాజు తానే అయినవాడు
అనిలాభ! చేకితానా!
కనరావె యజైకపాత్తు!కసుగాయనుగా
వినవే కాపాలీ! హవి!
మనవిని వినవే త్రిశంకు! మదనారి శివా.195
611)అజితః = జయింపబడనివాడు
612)శివః = శుధ్ధుడు
613)ధన్వంతరిః = మహావైద్యుడు
614)ధూమకేతుః = ఉత్పాత విశేష మైనవాడు
615)స్కందః = కుమారస్వామి
*అజితా శివుడ* వనుచు
నిజమగు *ధన్వన్తరివట* నిటలాక్షుడవే
విజితుడవు *ధూమకేతూ*
గజవసనా *స్కంధు* డీవె కరుణించు శివా.196
616)వైశ్రవణః = కుబేరుడు
617)ధాతా = బ్రహ్మ
618)శక్రః = ఇంద్రుడు
619)విష్ణుః = విష్ణువు తానే అయినవాడు
620)మిత్రః = సూర్యుడు
621)త్వష్టా కుమారస్వామి
622)ధ్రువః = ధ్రువుడు తానే అయినవాడు
623)ధరః = ప్రపంచమును ధరించినవాడు
624)ప్రభావః = గొప్ప పుట్టుక కలవాడు
దండములివె వైశ్రవణా!
దండములివె శక్ర! విష్ణు! ధాతా! మిత్రా!
దండములివె త్వష్టా! ధ్రువ!
దండములివె ధర!ప్రభావ!దండములు శివా.197
625)సర్వగః = అన్నింటియందు ఉండువాడు
626)వాయుః = వాయు రూపము తానే అయినవాడు
627)అర్యమా, సవితా = సూర్యుని రూపము తానే అయినవాడు
628)రవిః = సూర్యుడు తానే అయినవాడు
629)ఉషంగుః = ఉషస్సును కలుగజేయు సూర్యుని రూపము తానే అయినవాడు.
శరణంటి నర్యమునకున్
శరణము వాయువుకు రవికి శరణముషంగా
శరణంటిని సర్వగునకు
శరణన దోషము లణచవె శరణందు శివా.198
630)విధాతా =వివిధ ప్రకారములు గా పోషించు వాడు
631)మాంధాతా =జీవులకు తుష్టిని కల్గించువాడు
632)భూతభావనః = ప్రాణుల యొక్క క్షేమమును గూర్చి ఆలోచించువాడు
633)విభుః = అధిపతి అయినవాడు
634)వర్ణవిభావీ = వర్ణముల యొక్క విశేషములను గూర్చి భావించువాడు
సువిధాతా! మాంధాతా!
భవభయ హరుడీవె భూతభావన! శూలీ
సువిభూ! వర్ణవిభావీ!
నివసించవె గుండెలోన నిటలాక్ష శివా.199
635)సర్వకామగుణావహః = సమస్తమైన కోరికల గుణములను ఆవహించి యుండువాడు
636)పద్మనాభః = పద్మము నాభియందు గల విష్ణువు తానే అయినవాడు
637)మహాగర్భ = గొప్పదైన గర్భము కలవాడు
638)చంద్రవక్త్రః = చంద్రునివంటి ముఖము కలవాడు
639)అనిలః = వాయువు తానే అయినవాడు
సేవకుడ సర్వకామగు
ణావహుడవు! పద్మనాభ!నను బ్రోవుమయా
నీవాడ మహాగర్భా
కావుమనిల చంద్రవక్త్ర కరుణించు శివా.200
640)అనలః = అగ్ని రూపము తానే అయినవాడు
641)బలవాన్ = మిక్కిలి బలము కలవాడు
642)ఉపశాంతః = మిక్కిలిగా శాంతించువాడు
643)పురాణః = ప్రాచీనుడు
644)పుణ్యచంచుః = పుణ్యము చేత ప్రసిద్ధమైన వాడు.
అనలా! బలవానుడవే!
మునిగణ నుతుడ వుపశాంత!పురశా శనుడా
మనుజుడ పురాణ! దయతో
వినతులు గొను పుణ్యచుంచు! ప్రియమార శివా.201
645)కురుకర్తా = కురుక్షేత్రమును సృష్టించినవాడు,
646)కురువాసీ = కురు భూముల యందు నివసించువాడు
647)కురుభూతః = కురు భూములందు పుట్టినవాడు
648)గుణౌషధః = మంచి గుణములు ఔషధములుగా కలవాడు
649)సర్వాశయః = సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు
కురుకర్తకు! వందనములు
కురువాసికి! వందనములు కురుభూత! హరా
కరివసనునా గుణౌషధ!
శరణము సర్వాశయ! హర శరణంటి శివా.202
650)దర్భచారీ = దర్భలందుంచు హవిస్సు భుజించువాడు.
651)సర్వేషాం ప్రాణినాం పతిః = సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు.
652)దేవదేవః = దేవతలకు దేవుడైనవాడు
653)సుఖాసక్తః = సుఖమునందు ఆసక్తి కలవాడు
కం.
శరణు సుఖాసక్తా శివ
పరమేశ శరణము సర్వ ప్రాణాధిపతీ
శరణంటి ధర్బచారీ
శరణంటిని దేవదేవ జయమందు శివా.203
654)సదసత్ సర్వరత్నవిత్ = మంచి చెడు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానము కలవాడు
655)కైలాసగిరివాసీ = కలవాడు
పర్వతమునందు నివసించువాడు
656)హిమవత్ గిరి సంశ్రయః = హిమవత్ పర్వతమునందు నివసించువాడు.
657)కూలహారీ = ప్రవాహరూపములో నదుల దరులను కూల్చువాడు
జయ కైలాసగిరిపతీ!
ప్రియ సదసత్సర్వరత్నవిదుడవు! శూలీ
జయమగు హిమవత్గిరిసం
శ్రయులకు హర కూలహారి! శరణందు శివా.204
658)కూలకర్తా = మహా తటాక కర్త
659)బహువిద్యః = అనేకమైన విద్యలున్న వాడు
660)బహుప్రదః = అధికముగ ఇచ్చువాడు
661)వణిజః వ్యాపారమునకు మూలపురుషుడు
662)వర్ధకీ = వృద్ధి పొందినవాడు
663)వృక్షః = వృక్షము తానే అయినవాడు
664)వకుళః = పొగడ చెట్టు తానే అయినవాడు
వందనము *కూలకర్తా*
వందిత *బహువిద్య వృక్ష* వందనము హరా
సుందర *వణిజ బహుప్రద*
వందనమందింతు *వకుళ వర్ధకివి* శివా.205
665)చందనచ్ఛదః = చందనము యొక్క మైపూత కలవాడు.
666)సారగ్రీవః = బలముతో కూడిన కంఠము కలవాడు
667)మహాశత్రుః = గొప్పవారైన శత్రువులు కలవాడు
668)అలోలః = ఆసక్తి లేనివాడు
హర చందనచ్చదా భవ
శరణు మహాశత్రు మిమ్ము శరణంటినయా
శరణము సారగ్రీవా
శరణాలోలా మహేశ జయమందు శివా.206
669)మహౌషధః = గొప్ప ఔషధము వంటివాడు
670)సిద్ధార్థకారీ = అర్థసిద్ధిని కలుగజేయువాడు
671)సిద్ధార్థః = ప్రయోజనముల సిద్ధిని పొలేనివాడు
672)ఛందో వ్యాకరణోత్తరః = ఛందస్సు, వ్యాకరణములను బాగుగా పఠించినవాడు.
(End of 80కలుగజేయువాడు
శ్రీ కర *మహౌషధా* హర
చేకొని *సిద్ధార్థకారి* సేమంబీవే
తేకువ నీవే *ఛందో*
వ్యాకరణోత్తమ* మహేశ పరమేశ శివా.207
673)సింహనాదః = సింహము వంటి కంథధ్వని కలవాడు
674)సింహదంష్ట్రః = సింహపు కోరలు కలవాడు
675)సింహగః = సింహ రూపుడు
676)సింహవాహనః = సింహములు పూంచిన రథము కలవాడు
ఎందులకు సింహనాదము
ఎందులకీ సింహదంష్ట్ర యేమయ్య హరా
ఎందులకు సింహరూపము
వందనమందింతు సింహ వాహనుడ శివా.208
677)ప్రభావాత్మా = సత్యమునకు సత్యము
678)జగత్కాల స్థాలః = జగత్తును గ్రసించు కాలము భోజన పాత్రగా కలవాడు.
679)లోకహితః = లోకహితుడు
680)తరుః = తరింపజేయువాడు
681)సారంగః = పక్షివిశేష రూపుడు.
వినవె మొర ప్రభావాత్మా
యనఘ జగత్కాల స్థాల యనిబిల్తు హరా
వినుమొర లోకహిత తరూ
విను సారంగా మొరలను విశ్వేశ శివా.209
683)నవచక్రాంగః = నూతన హంసయైన వాడు
684)కేతుమాలీ = మయూరకుక్కుటాది పక్షిరూపుడు.
685)సభావనః = ధర్మ పరీక్ష స్థానమును రక్షించు వాడు
686)భూతాలయః = సమస్త ప్రాణులకు అలయమైనవాడు
నవచక్రాంగా శూలీ
భవనాశక కేతుమాలి పశుపతినాథా
భువనాదీశ సభావన
భవ భూతాలయ మహేశ పరమేశ శివా.210
687)భూతపతిః = సమస్త ప్రాణులకు అధిపతి
688)అహోరాత్రం = పగలురాత్రి తానైనవాడు
689)అనిందితః = నింద లేనివాడు.
690)వాహిత = వహించు వాడు
690)సర్వభూతనిలయః = సర్వ భూతముల నిలయమైన వాడు
జోతలివె *భూతపతికిన్*
జోత*లహోరాత్రునకును* జోబిళ్ళుహరా
జోత*లనిందిత వాహిత*
నేతరివట సర్వభూత నిలయుడవు శివా.211
692)విభుః = జన్మ రహితుడు
693)భవః = పుట్టుక స్థానమైనవాడు
694)అమోఘః = వ్యర్థము లేనివాడు
695)సంయతః = నియమ బద్ధుడైనవాడు
696)అశ్వః = ఉచ్చైశ్రవాది రూపుడు
697)భోజనః = అన్నదాత
విభుడ వమోఘా భవుడవు
సభాపతివి సంయుతుడవు శంభుడ వశ్వా
ప్రభుడవు భోజన ప్రియుడవు
యభయము నీయవె మొరవిని యశుతోష శివా.212
698)ప్రాణధారణః = సమస్త ప్రాణములను నిలుపు వాడు.
699)ధృతిమాన్ = ధైర్యము కలవాడు
700)మతిమాన్ = బుద్ధిమంతుడు
701)దక్షః = సమర్ధుడు
702)సత్కృతః = బాగుగా సత్కరింపబడినవాడు
మీ వలన ప్రాణధారణ
మావివి ధృతిమంతుడీవె మతిమంతుడవే
మీవలె దక్షులెవరు హర
సేవలుగొను సత్కృతుడవు క్షేమేశ శివా.213
703)యుగాధిపః = యుగమునకు అధిపతి
704)గోపాలీ = గోవులను రక్షించువాడు
705)గోపతిః = వృషభము వంటివాడు
706)గ్రామః = జననివాసముల యొక్క సమూహము తానే అయినవాడు
707)గోచర్మవసనః = గోవు యొక్క చర్మమును ధరించువాడు
708)హరిః = విష్ణువు యొక్క రూపము తానే అయినవాడు
*గోపతివి యుగాధిపుడవు*
గోపాలుడ *గ్రామ* వాస గోచారివిగా
భూపతి *గోచర్మవసన*
పాపిని రక్షింపవె *హరి* పరమేశ శివా.214
709)హిరణ్యబాహుః = బంగారు భుజములు కలవాడు
710)గుహాపాలః = గుహలను పాలించు వాడు
711)ప్రవేశకః = తనని ధ్యానించిన వారిని (లేదా) గుహలో నివసించే ఋషులను,మునులను రక్షించేవాడు.
712)ప్రకృష్టారిః = తీవ్రమైన శత్రువులు కలవాడు (లేదా) శత్రువులను పూర్తిగా నిర్మూలించేవాడు,తుడిచిపెట్టేవాడు
శరణనెద *ప్రకృష్టారీ*
*హిరణ్యబాహూ* శరణు మహేశ భవహరా
శరణంటిని *గుహపాలా*
కరుణించవె గుహ *ప్రవేశకా* శరణు శివా.215
713)మహాహర్షః = గొప్ప హర్షము కలవాడు
714)జితకామః = కామమును జయించినవాడు.
715)జితేంద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడు.
716)గాంధారః = స్వరవిశేషము అయినవాడు.
717)సువాసః = మంచి వాసము కలవాడు(కైలాస పర్వతం పై నివసించేవాడు).
718)తపస్సక్తః = తపస్సునందు లగ్నమైనవాడు
720)రతిః = ప్రీతిరూపుడు
721)నరః = బ్రహ్మాండమును పొందించు విరాడ్రూపుడు.
జితకామా గాంధారా
జితేంద్రియుండవు సువాస చేకొమ్ముహరా
ధృతి నీవె తపస్సక్తా
రతిలో హర్షించు నరుడ రక్షింపు శివా.216
722)మహాగీతః = వేదముచే గానము చేయబడినవాడు
723)మహానృత్యః = గొప్ప నాట్యము చేయువాడు
724)అప్సరసోగణసేవితః = అప్సరసల సమూహము చేత సేవింపబడినవాడు
వందనము మహాగీతా
సుందరమీ నృత్య మంద్రు సుందర వదనా
వందనమప్సర సేవిత
వందనమందింతు దేవ పరమేశ శివా.217
725)మహాకేతుః = వృష ధ్వజము కలవాడు
726)మహాధాతుః = మేరు పర్వతము
727)అనేకసానుచరః = అనేకమైన కొండ చరియలందు సంచరించువాడు
728)చలః = పట్టుచిక్కని వాడు
వినతులివె మహాకేతూ
యనేక సానుచరుడవు మహాధాతూ మా
వినతులకు చిక్కవు హరా
సనాతనుడ దేవదేవ శరణందు శివా.218
729)ఆవేదనీయః = వాక్కుల కందనివాడు, గురువులచే తెలియవలసిన వాడు
ఏ వేదము నేనెరుగను
నీవే గతియని తలచితి నీలగళేశా
ఆవేదనీయుడ వనుచు
నా వేదన తెలుపుచుంటి నటరాజ శివా.219
730)ఆదేశః = కేవలము ఉపదేశ రూపుడు
731)సర్వగంధ సుఖావహః = ఒకేసారి సమస్త విషయ స్పర్శలకు సుఖము కల్గించు వాడు
732)తోరణః = మోక్షద్వారాదుల స్వరూపుడు
733)తారణః = తరింపజేయువాడు
జయ సర్వగంధసుఖదా
జయమాదేశా మహేశ జయమందు హరా
జయమందు తోరణా జయ
జయ జయయనుచు తరియింతు జయదేవ శివా.220
734)వాతః = వాయువు రూపమైనవాడు
735)పరిధీ=బ్రహ్మాండము యొక్క దుర్గ రూపుడు
736)పతి ఖేచరః = ఖేచరేశ్వరుడు గరుడుడు
కననైతి వాయురూపుడ
నిను పరిధీ మందమతిని నిర్భాగ్యుడనే
నిను ఖేచర పతి యందురు
వినుమా మొరలను పరేశ విశ్వేశ శివా.221
733)సంయోగః = స్త్రీ పురుష సంయోగమే తానైనవాడు
734)వర్ధనః = వృద్ధిచేయువాడు
735)వృద్ధః = పెద్దవాడు
736)అతివృద్ధః = మిక్కిలి పెద్దవాడు
737)గుణాధికః = మంచి గుణములచేత అధికుడు.
సంగతి కతివృద్ధుడవా
లింగా సంయూగవృద్ధ లేవయ్య శివా
రంగని ప్రియుడవు వర్ధన
జంగముడ గుణాధికుడవు శరణందు శివా.222
738)నిత్యః = ఎల్లకాలములయందు
739)ఆత్మా = అందరి ఆత్మల రూపము తానే అయినవాడు
740)సహాయః = సహాయముగా ఉండువాడు
741)దేవాసురపతిః = దేవతలకు, రాక్షసులకు అధిపతి అయినవాడు
742)పతిః = సమస్తమునకు అధిపతి అయినవాడు
743)యుక్తః = తగినవాడు
నిత్యుడ వాత్మసహాయుడ
వత్యంత సులభుడవు పతి వైతివి యుక్తా
సత్యము దేవాసురపతి
వత్యంత సుఖదుడవైన యజితుడవు శివా.223
744)యుక్తబాహుః = శత్రుమర్ధనకు సరియైన బాహువులు కలవాడు
745)దేవః = దేవుడైనవాడు
746)దివి సుపర్వణః = స్వర్గాధిపతికి ఆరాధ్యుడు
747)ఆషాఢః = అన్నిటిని సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు
748)సుషాఢః = గొప్ప సహనశీలుడు
సురపతి కారాధ్యుడవట
శరణంటిని యుక్తబాహు శరణము దేవా
వరదుడవీ వాషాఢా
శరణు సుషాఢా మహేశ శరణంటి శివా.224
749)ధ్రువః = అచంచలుడు
750)హరిణః = శుద్ధుడు
752)హరః = శూలధారి
753)వపురావర్తమానేభ్యః = స్వర్గ చ్యుతులకు దేహమొసంగు వాడు
స్వర్గచ్యుతుండను హరా
దుర్గమమీ తనువు హరిణ దూకొనుమయ్యా
మార్గము చూపించు ధృవా
భర్గా నీవాడనయ్య పరమేశ శివా.225
754)వసుశ్రేష్ఠః = ధనముకంటె అధికుడు
755)మహాపథః = శిష్టాచార రూపుడు
(End of 90 of 800-900)
756)శిరోహారీ విమర్శః = వివేకము తో బ్రహ్మ శిరస్సును ఖండించినవాడు
757)సర్వలక్షణ లక్షితః = సాముద్రిక శాస్త్రము లో చెప్పిన శుభలక్షణములు గలవాడు
నీవలె మహాపథుడెవరు
నీవా విధి శిరసు ద్రుంచ నివ్వెరపడితిన్
రావయ్య వసుశ్రేష్ఠా
నీవతి శుభలక్షణుడవు నిటలాక్ష శివా.226
758)అక్షః = రథమునకు ఇరుసు వంటివాడు
759)రథయోగీ = రథముతో కూర్చబడిన వాడు
760)సర్వయోగీ = ప్రభువై ఎల్లరను స్ప్రుశించువాడు
761)మహాబలః = గొప్ప బలము కలవాడు.
762)సమామ్నాయః = వేదరూపుడు
ఇరుసు రథంబును నీవే
దొరకొందువు నీవెమమ్ము దొరవైతివిగా
తరమె మహా బలుని దెలియ
శరణు సమామ్నాయ యందు జయమందు శివా.227
763)అసమామ్నాయః = వేదముల కతీతుడు
764)తీర్థదేవః=తీర్థస్వరూపుడు
765)మహారథః = భూమి రథముగా గలవాడు
అరుణా చలమన నెలవా
తరమా వేదములకైన తమరిని తెలుపన్
వరదుడవు తీర్థదేవా
శరణంటి మహారథుడవు శరణంటి శివా.228
766)నిర్జీవః = అచేతన ప్రపంచ రూపుడు
767)జీవనః = అచేతన దేహములకు చైతన్యదాత
768)మంత్రః = ప్రణవ లేక మృత సంజీవ మంత్ర స్వరూపుడు
769)శుభాక్షః = శుభమైన దృష్టి కలవాడు
చేతన మీవే మంత్రా
చేతన రహితుడను నేను చేకొనవె హరా
త్రాతవు నీవె శుభాక్షా
దాతవు రక్షింపుమయ్య దయచేసి శివా.229
770)బహు కర్కశః = మిక్కిలి కఠినమైనవాడు.
771)రత్నప్రభూతః = మంచి రత్నములు కలవాడు
772)రక్తాంగః = ఎఱుపు రంగు శరీరము కలవాడు
773)మహార్ణవ నిపానవిత్ = గొప్పదైన సముద్రపు నీటిని ఎండించుటలో నేర్పరి.
మిక్కిలి కర్కశుడీవట
చక్కని రత్నముల గొల్తు శాంతించ వయా
లెక్కకు రక్తాంగుడవట
దక్కవు సంద్రపు జలములు దయజూపు శివా.230
774)మూలం = సృష్టికి మూలమైనవాడు
775)విశాలః = అతి విస్తారమైనవాడు
776)అమృతః = అమృత స్వరూపము తానైనవాడు
777)వ్యక్తావ్యక్తః = కనిపించి, కనిపించనివాడు
778)తపోనిధిః = తపస్సుకు స్థానమైనవాడు
జగతిని సృజించి పెంచుదు
వగమ్య గోచరుడ వమృత హరహర శంభో
తగనా తపోనిధీ నను
సిగలో పూవుగ నిలుపగ శ్రీకరుడ శివా.231
779)ఆరోహణః =పరమపద మారోహింప గోరువాడు
780)అధిరోహః = పరమును ఆరోహించిన వాడు
781)శీలధారీ = పుణ్యకారి
782)మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు
పర మపరమ్మును నీవే
దరిజేర్చవె మమ్ము శీలధారివి శూలీ
వరదా మహాయశా యన
పరమ పదము దక్కు మాకు పరమేశ శివా.232
783)సేనాకల్పః = సైన్యాలంకార పరాక్రమ రూపుడు
784)మహాకల్పః = దివ్యభూషణుడు
785)యోగః = చిత్తవృత్తి నిరోధకుడు
786)యోగకరః = యోగమును సృష్టించినవాడు
787)హరిః = విష్ణువు తానైనవాడు.
శరణము సేనా కల్పా
శరణు మహాకల్ప మీకు శరణంటినయా
వరలవె చిత్తము నిలుపుచు
శరణము యోగకరుడ హరి శరణంటి శివా.233
788)యుగరూపః =ధర్మాధర్మ సంకర రూపుడు
789)మహారూపః =రూపరహితుడైన గొప్పవాడు
790)మహానాగహనః = గజాసుర హంత
791)వధః = మృత్యువు
శరణంటిని యుగరూపా
శరణు మహూరూపునకును జయమందు నయా
శరణు మహానాగ హనా
శరణంటిని మృత్యురూప శరణంటి శివా.234
792)న్యాయ నిర్వపణః = ధర్మాను సారముగ మనోరధమును దీర్చు వాడు
793)పాదః = పొందదగు గమ్యుడు
794)పండితః = పరోక్ష జ్ఞానము కలవాడు
795)అచలోపమః = తత్త్వ జ్ఞాని
ధర్మమెఱుగు పండితుడవు
శర్మదుడు నినుపొందె నేమొ శరణంటినయా
మర్మమెఱింగిన జ్ఞానివి
కర్మముల నెఱుగని వాడ కరుణించు శివా.235
796)బహుమాలః = అనంత లీలలు కల వాడు
797)మహామాలః = వాడని పూల మాలలు కలవాడు
798)శశీహరసులోచనః= చంద్రుడే శాంతదృష్టి కలవాడు
799)విస్తారో లవణకూపః = లవణ సముద్ర రూపి
నీ లీలలనంత మహా
మాలలు ధరియింతువయ్య మాయలమారీ
శూలివి సంద్రపు రూపివి
తాలిమి శశిలోచనుడవు దయజూపు శివా.236
800)త్రియుగః =కృత త్రేత ద్వాపర యుగములు తానైనవాడు
801)సఫలోదయః = సఫలమైన అవతారము కల వాడు.
802)త్రిలోచనః = శాస్త్రము ఆచార్యుడు ధ్యానము అను మూడు కన్నులు కలవాడు
803)విషణ్ణాంగః = భూమ్యాదష్ట మూర్తులు కలవాడు
804)మణివిద్ధః = కుండలధారి
కలియుగ వరద త్రియుగుడ స
ఫలోదయుడవు త్రినయనుడ ఫణిభూషుడవే
కలలోన విషణ్ణాంగా
తలచితి మణివిద్దుడవని దయజూపు శివా.237
805)జటాధరః = జడలను ధరించినవాడు
806)బిందుః = అనుస్వారము రూపము తానైనవాడు
807)విసర్గః = విసర్గ రూపము తానైనవాడు
808)సుముఖః = మంచి ముఖము కలవాడు
809)శరః = బాణరూపము తానైనవాడు
810)సర్వాయుధః = సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు
వందనము జటాదరునకు
బిందు విసర్గాకృతునకు పింగాక్షునకున్
వందనమీశరములకున్
సుందర సర్వాయుధునకు సుముఖు నకు శివా.238
811)సహః = సహనము కలవాడు.
812)నివేదనః = సమస్త వ్యాపారములు విరమించినందు వలన కలిగిన జ్ఞానం కలవాడు
813)సుఖజాతః = సుఖ రూపమున ఆవిర్భవించిన వాడు
వందనము సహన రూపికి
వందిత సుఖజాతునకును పరమే శునకున్
సుందర నివేదనాయని
వందనమందింతు నీకు వందనము శివా.239
814)సుగంధారః = చక్కని గాంధార దేశమున అవతరించిన వాడు
815)మహాధనుః = గొప్పదైన ధనుస్సు కలవాడు
816)గంధపాలీ =సర్వప్రాణుల బుద్ధివాసనా మయుడు
817)భగవాన్ = భగవంతుడు
జయము సుగంధారునకున్
జయము మహాధనువునకును జయమందు హరా
జయమగు సు గంధపాలికి
జయమగు భగవానునకున శరణంటి హరా.240
818)సర్వకర్మణామ్ = సమస్త కర్మలకు
819)ఉత్థానః = ఫలశ్రుతి కలుగజేయువాడు.
820)మంథానో బహుళో వాయుః= గొప్ప ప్రళయ వాయువు
823)సకలః = పూర్ణుడు
ప్రళయపు వాయువు నీవే
పలములిడుచు కర్మములకు పరిపూర్ణుడవే
విలయము సృజించి నీవే
కలుములు బాపినను నీవె కరుణించి శివా.241
824)సర్వలోచనః =అంతయు చూచువాడు
824)తలస్తాలః = తాళమనెడి వాద్యము
825)కరస్థాలీ = చేతులు భోజన పాత్రగా కలవాడు
శరణంటి కరస్థాలిని
శరణు తలస్తాలి మీకు జయమందునయా
హర సర్వలోచనాయని
పరిపరి తలచెద మహేశ పరమేశ శివా.242
826)ఊర్ధ్వ సంహననః = శ్రేష్టమైన ధృడ శరీరము కలవాడు
827)మహాన్ = అత్యున్నతుడు
828)ఛత్రం = సృష్టి కంతటికి గొడుగు వంటివాడు
829)సుచ్ఛత్రః = మంచి ఛత్రముగా ప్రసిద్ధి చెందినవాడు
జయమూర్ధ్వ సంహనునకున్
నయమనెద మహానుభావునకు జయమీశా
జయమగు మీ ఛత్రమునకు
జయమంటి సుచత్రమునకు శరణంటి శివా.243
830)విఖ్యాతోలోకః = ప్రసిద్ధమైన ప్రాణిస్వరూపుడు
831)సర్వాశ్రయక్రమః = సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు
832)ముండః = తలవెంట్రుకలు తీయబడి నవాడు
833)విరూపః = వికారమైన స్వరూపము కలవాడు
834)వికృతః = విపరీత క్రియలన్నియు దాల్చువాడు.
కనుగొంటి లోక ప్రముఖుని
కనుగొని యాశ్రయమడిగితి కనవేమి హరా
నినునే విరూప వికృతుని
వని బోడి తలగల వాని వని కంటి శివా.244
835)దండీ = దండము కలవాడు
836)కుండీ = కమండలము కల వాడు
837)వికుర్వణః = కర్మలవల్ల లభ్యము కాని వాడు.
(End of 100 of 900-1000)
838)హర్యక్షః-సింహరూపుడు
దండములయ్యా దండీ
దండము కుండీ తమరికి దండము తండ్రీ
దండము వికుర్వణునకున్
దండము హర్యక్షునకును దయజూప శివా.245
839)కకుభః- సర్వదిగ్రూపుడు
840)వజ్రీ = వజ్రం వంటి శివుడు, దేవేంద్ర స్వరూపుడు
841)శత జిహ్వః = వంద నాలుకలు కలవాడు.
దిక్కువు నీవయె కకుభా
చక్కని వజ్రివని నిన్ను శరణంటినయా
చక్కెర శతజిహ్వునికా
ముక్కంటివి నిన్నెటులని పూజింతు శివా.246.
842)సహస్రపాత్ సహస్రమూర్ధా = వేయి(అనంతమైన) తలలు గలవాడు. వేయి పాదములు కలవాడు 843)దేవేంద్రః =దేవేంద్రుడు 844)సర్వదేవ మయో = సకల దేవతల స్వరూపుడు 845)గురుః = ప్రపంచంలోని అన్ని జీవులకు గురువు 846)సహస్ర బాహు = వేయిబాహువులు కలవాడు
ఎన్నుటకు నామ రూపము
లున్నవి కరములు గురువరు నూహించెద నే
నెన్నగ దేవేంద్రుడవో
కన్నులు చాలవు కనుగొన కరుణించు శివా.247
848)సర్వాంగః=సర్వమును పొందువాడు 848)శరణ్యః= శరణు పొందదగువాడు 849) పవిత్రం- పుణ్యతీర్థాది రూపమున పవిత్రమైన వాడు
సర్వాంగ సుందరుండవు
సర్వేశ్వరుడవు మహేశ శరణు శరణ్యా
గర్వమణచవె పవిత్రా
శర్వా శరణంటి మిమ్ము శరణంటి శివా.248
850)త్రికకున్మంత్రః= బీజశక్తి కీలకములనెడి ఉన్నత స్థానములు కల మంత్రమైనవాడు, 851)కనిష్టః- అదితి పుత్రులలో చివరి వాడు (వామనుడు),852)కృష్ణపింగళః= హరిహర మూర్తి
కం
శరణము త్రికకున్మంత్రా
శరణంటిని వామనునకు సర్వేశునకున్
శరణము హరిహర రూపా
శరణంటిని విశ్వరూప శరణంటి శివా.249
853)బ్రహ్మదర్కా వినిర్మాతా- బ్రహ్మ దండమును నిర్మించిన వాడు
854)శతఘ్నీ పాశ శక్తిమాన్= శతఘ్నీ పాశపు శక్తికలవాడు
855)పద్మ గర్భః= బ్రహ్మ
శర్మదుడొ బ్రహ్మ దండము
నిర్మించినవాడ వేమొ నిటలాక్షుడవో
నిర్మల శతఘ్ని ధరుడవొ
మర్మమరయ పద్మగర్భ మాయావి శివా.250
856)మహాగర్భః=గొప్ప గర్భము కలవాడు
857)వేదగర్భః=వేదగర్భితుడు
858)జలోధ్బవ= జలమయ మైనప్పుడు అవతరించు మాయావి
859)గభస్తిః=కిరణములు కలవాడు
వందనము మహా గర్భా
వందనములు వేదగర్భ వరమేమడుగన్
వందనము గభస్తీశా
వందనము జలోధ్బవుడవు పదమిమ్ము శివా.251
860)బ్రహ్మ కృత్=వేదకర్తా
861)బ్రహ్మీ=వేదాధ్యాయి
862)బ్రహ్మ విత్=వేదార్థ మెరిగినవాడు
863)బ్రాహ్మణః=బ్రహ్మిష్ఠుడు
864)గతిః= బ్రహ్మిష్ఠులకు గతియైనవాడు
వందనము వేదకర్తా
యెందుకు వేదాధ్యయనము నెఱిగిన వాడా
వందనమిదె బ్రాహ్మిష్టా
వందనమందును గతివని పరమేశ శివా.252
865)అనంతరూప=అనంతమైన రూపము కలవాడు
866)నైకాత్మ= అనేక శరీరములు దాల్చినవాడు
867)తిగ్మతేజః స్వయంభవః=బ్రహ్మ దృష్టిలో తీవ్రమైన తేజస్సు కలవాడు
868)ఊర్ధ్వగాత్మా = దేశకాల వస్తువులనెడి ఉపాధిత్రయమును మించిన రూపం కలవాడు.
869)పశుపతిర్ = బ్రహ్మ నుండి సమస్త జీవులకు శివుడే పరమాత్మ
వందన మనంత రూపా
వందనమిదె తిగ్మతేజ పశుపతి నాథా
వందనములు నైకాత్మా
సుందరమీ తేజమెంత సుందరము శివా.253
870)వాతరంహః = వాయువేగం కంటే వేగవంతమైనవాడు
871)మనోజవః = బుద్ధి వేగం కలవాడు
872)చందనీ = గంధము ను శరీరము పై పూసుకునేవాడు
కదలని వాడవు దేవా
కదలగ చోటేది నీకు కలదా గతియున్
ఇదిగో చందన గంధము
కదలవె వేగమును జూపి కరుణించ శివా.254
873)పద్మనాలాగ్రః = పద్మనాళము చివర గలవాడు (విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణువు యొక్క ఔన్నత్యాన్ని సవాలు చేసినప్పుడు, అక్కడ లోతైన ఓంకార శబ్దంతో ఒక భారీ శివలింగం ఉద్భవించింది)
874)సురభ్యుత్తరణో = తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కామ ధేనువు( సురభి ) కు శాపం ఇచ్చినవాడు.
875)నరః = బ్రహ్మ మరియు విష్ణువు శివలింగం యొక్క పైభాగం మరియు దిగువ గురించి తెలియదు, ఇంకా మానవులు ఏమి తెలియదు .
శ్లోకము 107
876)కర్ణికార మహాస్రగ్వీ = పరమ శివుడు మెడ లో కర్ణికార పుష్పాలతో చేసిన మాల ధరించి ఉంటాడు
877)నీలమౌలిః = మహాదేవుడు నీలం రాయి తో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటాడు
సురభికట బుద్ధి చెప్పిన
నరుడవొ సుందరుడ పద్మ నాలాగ్రా నే
నరయంగ నీలమౌళివి
పురహర గొను కొండగోగు పూవులను శివా.255
878)పినాకధృత్ = పినాకపాణి
879)ఉమాపతి = బ్రహ్మ విద్యకధిపతి
880)ఉమాకాంతో =బ్రహ్మ విద్యచేత కామింప బడినవాడు
881)జాహ్నవీధృత్ = గంగా దేవిని తన జటా జూటం లో ధరించినవాడు,
శరణము పినాకపాణీ
శరణముమాపతి పరేశ శరణంటినయా
శరణంటి నుమాకాంతా
శరణము గంగాధర హర శరణంటి శివా.256
882)ఉమాధవః = పార్వతీపతి
శ్లోకము 108
883)వరోవరాహః = భూమినుద్ధరించిన యజ్ఞవరాహము.
884)వరదః = శివుడు అనేక అవతారాలలో ప్రజలను పాలించువాడు
885)వరేణ్యః = ప్రభువుగా కోరదగిన వాడు.
886)సుమహాస్వనః = వేదగర్భితుడగు హయగ్రీవుడు
శరణంటినుమానాథా
వరేణ్యుడ మహా ప్రసాద పరమేశ్వరుడా
వరదుడ వరోవరాహా
హర సుమహాస్వనుడ నాగహారుడవు శివా.257
887)మహాప్రసాదః = భక్తులను గొప్పగా అనుగ్రహించేవవాడు
888)దమనః = దుష్టులను మరియు దుర్మార్గులను నాశనం చేసేవాడు
889)శత్రుహా = శత్రువులను నాశనం చేసేవాడు
890)శ్వేతపింగళః = శరీరంలో సగం తెల్లగా, మిగిలిన సగం ఎరుపు రంగులో ఉన్న అర్థనారీశ్వర స్వరూపం
891)ప్రీతాత్మ = అందరిచే పూజింపబడేవాడు
అరిషడ్వర్గము దునుమగ
వరదుడవు మహాప్రసాద ప్రార్థించెదనే
దొర శ్వేతపింగళాయని
శరణని పూజింతునయ్య జయమనుచు శివా.258
893)పరమాత్మా = అంతటా ఉన్న ఆత్మ, ఆనంద స్వరూపుడు
894)ప్రయతాత్మా = నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన ఆత్మ
895)ప్రధానధృత్ = ప్రకృతి త్రిగుణాలను ధరించినవాడు
896)సర్వపార్శ్వముఖః = అన్ని వైపులా ముఖాలు కలిగినవారు .
897)త్య్రక్షః = మూడు కన్నులు కలవాడు
శరణంటిని ప్రయతాత్మా
పరమాత్మా శరణు శరణు పంచాననుడా
శరణము త్రిగుణాతీతా
శరణము త్ర్యక్షా పరేశ శరణంటి శివా.259
902) సాధ్యర్షి=దేవతలకు సాధ్యులకు ఆచార్యుడు,
903)వసురాదిత్యః= అదితి పుత్రుడగు వసురూపుడు,
904) వివస్వత్ సవితామృతః= అమృత స్వరూపమైన సూర్యుడు,
905) వ్యాసః=పురాణేతిహాస కర్త
906) సర్గః సుసంక్షేపో విస్తరః= పురణములకు సూత్ర రూపమున సంగ్రహముగా భాష్యరూపమున విస్తారముగా కలవాడు
కం
వసురాదిత్యుడవు సురల
కసాధ్యుడవు భాస్కరుడవు కరుణామయుడా
అసమాక్షుడవట వ్యాసా
పశువుని సర్గా దయగొని పదమిమ్ము శివా.260
907) పర్యాయోనరః= అంతట వ్యాపించిన వైశ్వానర రూపుడగు జీవుడు
908) ఋతుః= ఋతుస్వరూపుడు
909)సంవత్సరః= సంవత్సర స్వరూపుడు.
910)మాసః=మాస స్వరూపుడు
911)పక్షః=పక్షస్వరూపుడు
912)సంఖ్యాసమాపనః=సంక్రాంతి దర్శ(అమావాస్య) పౌర్ణమాసి మొదలైన స్వరూపము గలవాడు
913)కలాకాష్ఠా లవామాత్రాః=కాల (కాష్ఠ లవ మాత్ర విభాగ) స్వరూపుడు
దిన పక్ష మాస వత్సర
మును ఋతువులు నీవెగావ పురుషో త్తముడా
కన పర్యాయోనరుడవు
నిను కాల సురూపుడనిరి నిటలాక్ష శివా.261
914)ముహూర్తాహః క్షపా=ముహూర్త దిన రాత్రి రూపుడు
915) క్షణః=క్షణ రూపుడు
916)విశ్వక్షేత్రః=బ్రహ్మాండవృక్షమున కాలవాలము
917)ప్రజాబీజః=ప్రజలకు బీజమువంటి వాడు
918)లింగః=మహత్తత్వము
జోతలు విశ్వక్షేత్రా
జోతలు కాలస్వరూప జోతలు గొనుమా
జోతలివె ప్రజాబీజా
జోతలు లింగస్వరూప జోబిళ్ళు శివా.262
919)ఆద్యో నిర్గమః=అంకురరూపమైన వాడు
920) సత్= కార్యము
921)అసత్=కారణము
922)వ్యక్తం =ఇంద్రియ గ్రాహ్యము
923)అవ్యక్తం= అనుభవైక వైద్యమైన అజ్ఞానము
924)పిత=తల్లి
925)మాత=తండ్రి
926)పితామహః-తాత (బ్రహ్మ)
తల్లివి దండ్రివి తాతవు
బల్లిదుడవు బీజ రూప వ్యక్తావ్యక్తా
అల్లదె సదసద్రూపా
చల్లగ కరుణించ వయ్య శరణంటి శివా.263
927)స్వర్గద్వారం= తపము
928)ప్రజాద్వారం= రాగము
929) మోక్షద్వారం=వైరాగ్యము
930) త్రివిష్టపం= స్వర్గసాధన ధర్మం
931)నిర్వాణం= మోక్షము
తరమా తపమును జేయుట
తరమా రాగమును మోక్ష ద్వారము లెరుగన్
తరమా సాధన జేయగ
తరియింతును నిన్ను దలచి దయ జూపు శివా.264
932) హ్లాదనః= ఆనందపరచువాడు
హ్లాదము నీరూపంబన
మోదము నీకెట్లు కూర్తు మోహనరూపా
ఖేదమె నారూపమ్మగు
వేదన తీర్చవె భవహర విశ్వేశ శివా.265
933) బ్రహ్మలోక=సత్యలోకము అయినవాడు
లోకములు నీవలననే
లోకేశుండవట బ్రహ్మలోకాధీశా
లోకస్థుడ నేనొకడను
చీకాకులు దీర్చుమయ్య చిద్రూప శివా.266
934)పరా గతిః= ఉత్కృష్ట గతి యైనవాడు.
గతివీవె యెల్లరి పరమ
గతివీవె యుమాపతీశ కంఠేకాలా
మతినీవె యంబికాపతి
పతివీవె పశుపతివీవె పదమిమ్ము శివా.267
935)దేవాసుర వినిర్మాతా= దేవాసురల సృష్టికర్త
దేవతలున దానవులున
నీ వలననె కల్గు తొల్గు నిటలాక్ష శివా
నా వంటి దానవుని గని
నీవై కాపాడవలయు నిక్కమిదె శివా.268
936)దేవాసురపరాయణః=దేవా సురలకు ఉత్కృష్టాశ్రయుడు
937)దేవాసురగురుః= బృహస్పతి శుక్రరూపుడు
938) దేవః=జయేచ్చగలవాడు
939)దేవాసుర నమస్కృతః= దేవ దానవులచే నమస్కరింపబడినవాడు
దేవా దేవాసురులీ
దీవెనలనుగోరినిన్ను దేహీయనరా
దేవాసురగురుడవుగా
దేవాసురవందితుడవు తిగకంటి శివా.269
940)దేవాసుర మహామాత్రః= దేవ దానవ శ్రేష్ఠుడు
941) దేవాసుర గణాశ్రయః= దేవ దానవ గణముల చేత ఆశ్రయింప దగినవాడు
942)దేవాసురగణాధ్యక్షః= ఇంద్ర విరోచనాది రూపుడు
943)దేవాసురగణాగృణిః=కార్తికేయ కేశిదైత్య రూపుడు
944)దేవాతిదేవః= ఇంద్రియముల నతిక్రమించి స్వయముగా ప్రకాశించు వాడు
దేవాసుర శ్రేష్ఠుండవు
దేవాసురులాశ్రయించి దేహీయనరే
దేవాసుర గణపతివే
దేవా దేవాతిదేవ దీనుండ శివా.270
945)దేవర్షిః= నారదాది రూపుడు
946)దేవాసురవరప్రదః= బ్రహ్మ రుద్రాది రూపమున దేవాసురులకు వరము లిచ్చువాడు
947)దేవాసురేశ్వరః= దేవదానవుల ప్రభువు
948)విశ్వః= లోక గర్భుడు.
949)దేవాసురమహేశ్వరః=దేవ దానవుల కధిష్ఠానమైన మహేశ్వరుడు
950)సర్వదేవమయః= సర్వదేవతా స్వరూపుడు
దేవర్షీ వందనములు
దేవాసుర వరదుడీవె దేవేశుడవే
దేవాసుర ప్రభువీవే
నా వందనములివె విశ్వనాథుడవు శివా.271
951) అచింత్యః=చింతింప తగువాడు, తానుతప్ప అన్యుడు లేనివాడు
952)దేవతాత్మః= దేవతలకంతరాత్మ
చింతించెద నీ నామము
సంతస ముప్పొంగ స్వామి శరణంటి నయా
దాంతుడవు దేవతాత్మా
పంతము నీకేలనయ్య పదమిమ్ము శివా.272
953)ఆత్మసంభవః= స్వయం భువుడు
954) ఉద్భిత్= భేదించుకొని ఆవిర్భ వించువాడు
955)త్రివిక్రమః=మూడు భువనముల నాక్రమించువాడు
956)వైద్యః=విద్యావంతుడు
స్వయముగ పుట్టిన వాడవు
స్వయంభువుడ వైన నిన్ను శరణంటి నయా
జయమందు త్రివిక్రమునకు
జయమందును వైద్యుడవని జయమందు శివా.273
957)విరజః=నిర్మలుడు
958)నీరజః= రజోగుణ హీనుడు
959)అమరః= నాశనము లేనివాడు 960)ఈడ్యః= స్తుత్యుడు
శర్మము నీరూపంబట
నిర్మలుడ వమరుడవీవె నీరజుడీవే
మర్మమెరిగి స్తుతింతును
ధర్మము బోధించుమయ్య దయజూపి శివా.274
961)హస్తీశ్వర= కాళహస్తీశ్వరుడు
962)వ్యాఘ్రః= పెద్దపులి
963)దేవసింహః= దేవతల లో పరాక్రమి
964)నరర్షభః= నరులలో శ్రేష్ఠుడు
965)విబుధః=పండితుడు
కరుణించవె హస్తీశ్వర
కరుణించవె వ్యాఘ్రరూప కరుణించు మయా
శరణంటి దేవసింహా
శరణు నరశ్రేష్ఠ విబుధ జయమందు శివా.275
966)అగ్రవరః= యజ్ఞమున ముందుగా భాగమును కోరువాడు
967)సూక్ష్మః=దుర్లక్ష్యుడు
వందన మగ్రవరునకున్
వందనములు సూక్ష్మరూప పరమేశునకున్
వందనముమా మహేశా
వందనములు దేవదేవ పదమిమ్ము శివా.276
968)సర్వదేవః=సర్వదేవతా స్వరూపుడు
సకల చరావర రూపివి
సకలము నీయందు గలదు సర్వేశ్వరుడా
అకళంకము నీ చరితము
చకితుడనైతిని నినుగన శరణందు శివా.277
969)తపోమయః= తపస్సే ప్రధానముగా కలవాడు
970)సుయుక్తః=మిగుల సంసిద్ధుడు
971)శోభనః= కల్యాణుడు
972)వజ్రీ= వజ్రాయుధం కలవాడు
వందనము తపోమయునకు
సుందరుడ సుయుక్తుడీవె శోభను డీవే
వందనములు మాపతికిన్
చందన మందింతు వజ్రి శరణనుచు శివా.278
973ప్రాసానాం ప్రభవః = ప్రాసాధ్యా యుధములకు ఉత్పత్తి స్థానము
974)అవ్యయః= ఏకాగ్ర చిత్తముతో పొందదగినవాడు
975)గుహాః=కుమారస్వామి
ఆయుధములు నీకేలా
మాయలు చాలించుమయ్య మదనాంతకుడా
ప్రాయము లేదవ్యయుడవు
సాయము కోరితి గుహుడవు శరణనుచు శివా.279
976)కాంతః=ఆనందమునకు పరాకాష్ఠ
ఆనందమె నీరూపము
రా నందీశా పురహర రతిసేవ్య శివా
ఆనందమె నీ తత్తము
దీనుండను నేనొకడను దీవించు శివా.280
977)నిజస్సర్గః=తనకంటే అన్యుడు లేనివాడు
తరులు గిరులు విరులు నదులు
పరుగిడు తువ్వాయిలు పలు పశుపక్షాదుల్
మెరిసెడి తారలు నింగిన
తరమా నినుగన జగతిన దయజూపు శివా.281
978)పవిత్రం= మృత్యు దుఃఖము నుండి కాపాడువాడు
సత్తెము నుడివెద దేవా
పత్తిరి దెచ్చితిని మిత్తి భయము కలుగగన్
చిత్తము నీపై నిలిపెడి
బత్తిని నాకిమ్ము స్వామి పరమేశ శివా.281
979)సర్వపావనః= బ్రహ్మాదులను కూడా శుద్ధిచేయువాడు
పావనమౌ నీ పాదము
కావలె మాకెల్లరకును కరుణించవయా
రావయ్య సర్వపావన
సేవలనందింతునయ్య శితికంఠశివా. 282
980)శృంగీ= వృషభాది రూపుడు
981)శృంగప్రియః= పర్వత శిఖరాశ్రయుడు
982)బభ్రుః=శనైశ్చరుడు
983)రాజరాజః=కుబేరుడు
984)నిరామయః=నిర్దోషుడు
శృంగప్రియునకు శృంగికి
మంగళములు రాజరాజ మహనీయు నకున్
మంగళము శనైశ్చరునకు
మంగళము నిరామయునకు మంగళము శివా.283
985)అభిరామః=ప్రీతిజనకుడు
986)సురగణః= దేవసంఘ రూపుడు
987)విరామః= విశ్రాంతి రూపుడు
మంగళమభి రామునకున్
మంగళము సురగణ రూప మంగళము హరా
మంగళమందు విరామా
మంగళములు దేవదేవ మంగళము శివా.284)
988)సర్వసాధనః=సమస్తమైన సాధన కర్మలు తనను చేరు సాధనమైన వాడు
989)లలాటాక్షః=నుదుట కన్ను గలవాడు
990)విశ్వదేవః=బ్రహ్మాండమనెడి బంతులతో ఆడు వాడు
991)హరిణః=మృగరూపుడు
మంగళము సర్వ సాధన
మంగళమందు నిటలాక్ష మంగళము హరా
మంగళము విశ్వదేవా
మంగళములు హరిణ రూప మహదేవ శివా.285
992)బ్రహ్మవర్చసః=విద్యా తపస్సముద్భవమైన తేజము కలవాడు
892) ప్రధానధృత్= త్రిగుణాత్మక మైన జగత్కారణమైన ప్రథానాఖ్యము కల అజ్ఞానము నకు అధిష్టానము కలవాడు.
వందనమందును యీశా
వందనమందింత బ్రహ్మ వర్చసునకునే
సుందర ప్రధానధృతునకు
వందనమందింతు నయ్య పరమేశ శివా.286
993)స్థావరాణాం పతిః= హిమా లయాది రూపుడు
ఏవిధి కనుగొందును మిము
స్థావర జంగంబులందు శరణందు నయా
సేవలు చేసి తరింతును
కావవె నీచెంతనుంచి కరుణించి శివా.287
994)నియమేంద్రియవర్ధనః= నియమములతో ఇంద్రియములను హింసించువాడు
యమనియమము లెరుగను నే
తమకము నన్నావహించె దైన్యము నిండెన్
నమకము చమకము లెరుగను
తమికొని ప్రార్థింతునయ్య దయజూపు శివా.(288)
995)సిద్ధార్థః=తత్త్వ జ్ఞానార్థి
సిద్ధులలో సిద్ధుడవట
సిద్ధార్థుని కానునేను సిద్ధుని కానే
సిద్ధులు సైతము కోరను
సిద్ధము చేసితి తనువును సేవించ శివా.(289)
996)సిద్ధభూతార్థః=మోక్షరూపుడు
అరచేతిని పండగునా
తరమా మోక్షంబుగోర దయనీదైనన్
ధరణిని నేనుండు వరకు
తరియించెద శివశివయని దయజూపు శివా.(290)
997)అచింత్యః=చింతింప సాధ్యము కానివాడు
చిరుచిరు పద్యములల్లితి
హరహర యాద్యంతరహిత హటకేశ్వరుడా
పరిపరి చింతించితినే
సరిసరి యని బల్కుమయ్య శరణందు శివా.(291)
998)సత్యవ్రతాయ =సత్యమనగా బ్రహ్మము అట్టి బ్రహ్మను గూర్చి తపము చేయువాడు
సత్యము నే నెఱుగనయా
సత్యవ్రతుడ నిను తెలియ సాధ్యంబగునా
భృత్యుని కాపాడవయా
సత్యము నెఱిగింపమనుచు శరణంటి శివా.(292)
999)శుచిః=నిర్మల చిత్తుడు
నిర్మల చిత్తుడ వీవయ
కర్మములకు పాలబడితి కర్కశు నైతిన్
కర్మ విమోచన జేసెడి
మర్మమలను దెల్పుమయ్య మహదేవ శివా.(293)
1000)వ్రతాధిపః =ఆయా తపముల ఫలమొసగువాడు
కుపసము విడువని పాముని
శిపివిష్టా శరణు శరణు చేకొమ్ము హరా
జపతపముల నెఱుగను నే
తపముల ఫలమెట్లు గల్గు దయజూపు శివా.(294)
1001)పరం = శివాఖ్య పర బ్రహ్మము
వరములు శాపము లెఱుగను
పరాపరములెఱుగ నైతి పరమేశ్వరుడా
దరిజేర్చెడి విధములెఱుగ
కరుణామయుడవని వింటి కరుణించు శివా.(295)
1002)బ్రహ్మః =దేశకాల వస్తువు లచే వేరుచేయబడనివాడు
ఎంతని వెదుకను దేవా
యంతట నీవుండువందు రాద్యంతమునన్
ఇంతటి కన్నులు చాలవు
సంతతము నినుగననిమ్ము శరణందు శివా.(296)
1003)భక్తానాం పరమా గతిః= భక్తులకు కైవల్య రూపుడు
శివశివశివ యని దలచిన
భవహర మగునని దలచితి భక్తుడ గానో
అవసర మెఱుగక తలచితి
దవగడు వలె రాలిపోదు దయజూపు శివా.(297) (ఎండుటాకు)
1004)విముక్తః=నిత్య ముక్తుడు
అంటియు నంటక యుందువు
తంటా లెట్లుండు మీకు దహనాంబకుడా
ఒంటరి వాడను కానయ
పెంటితనము నిండెనన్ను విను మొరలు శివా.(298)
1005)ముక్తతేజాః=శత్రువులపై తేజస్సు విడచువాడు
అరిషడ్వర్గము లేదట
పరులెవరయ నీకు వేరు పరమేశ్వరుడా
వరదా నిను తెలియగ మా
తరమాదొర ముక్తతేజు దయజూపు శివా.(299)
1006)శ్రీమాన్= యోగైశ్వర్య ముక్తుడు
ఏమందును నిను హరహర
శ్రీ మంతుడవంద్రునిన్ను క్షేమేశ్వరుడా
ఏమార్చకు నీ భక్తుడ
కామారివి గావెనీవు కరుణించు శివా.(300)
1007)శ్రీవర్ధనః=వేదత్రయ రూప సంపదను పోషించువాడు
నీవయె జగతికు మూలము
శ్రీ వర్ధునుడీవె దేవ శ్రీ కరుడీవే
నా వలె నీభక్తుడెవరు
కావగ రావయ్య తండ్రి కరుణించు శివా.(301)
1008)జగత్=నిత్యము రూపాంతరము చెందు లోక స్వరూపుడు.
జగములు గల్గును నీల్గును
జగములలో నీవుగలవు జగదీశ్వరుడా
జగమే మాయగ దోచును
జగదీశానిన్ను శరణు శరణందు శివా.(302)
శివశివ యని దలచితినే
శివశివ నీ నామరచన చేయించితి వీ
శివరామకృష్ణ శాస్త్రికి
భవనాశము కలుగునట్లు వరమిమ్ము శివా.(303)
శివనామము శ్రీ కరమని
భవనాశము గల్గునంచు భావించితి నా
శివనామ సహస్రములకు
శివాని దయగల్గనిమ్ము క్షేమేశ శివా.(304)
శివరాత్రియె శుభకరమని
శివరాత్రికి నామరచన చేయించితి వీ
శివనామ పద్యముల వే
చవిగొని చదివిన హితులకు జయ మందు శివా.(305)
ఎందరు కవులెందరు మును
ముందుగ శివనామరచన ముగియించి తిరో
అందరిలో నాపద్యము
విందుగచేకొన్నచాలు విశ్వేశ శివా.(306)
వచ్చిన పద్యము నల్లితి
మెచ్చిన హితులందరకును మేలందు శివా
మెచ్చని వారికి దండము
లచ్చికబుచ్చికపు పద్య మనుకొమ్ము శివా. (307)
శివరాత్రికి నీనామము
కవనమ్ముగ ముగియు నట్లు కరుణించితి వీ
శివనామము పఠియించిన
శివభక్తులకెల్లరకును క్షేమమగు శివా.(308)
|| ఇతి శ్రీ శివ సహస్రనామావళిః శివార్పముక్తుడు

No comments:
Post a Comment