శ్రీ రాజ రాజేశ్వరీ మాత.
శ్రీ రాజ రాజేశ్వరీ మత్తేభ శతకము.
11/10/23
మ.
విరులందెచ్చితి పూజసేయ జననీ వింతైనవీ సృష్టిలో
వరెలెన్ పుష్పములన్ని నీదు మహిమన్ వర్ణాలు వేవేలుగా
నరుడై పుట్టుట కేమిహేతువగునో నాకన్న పుష్పమ్ములే
సిరులంగోరవు స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.1
మత్తేభము
కఱవాభక్తులు నేనొకండ వినవే కాత్యాయ నీ భైరవీ
సురలంగొల్చితి బ్రహ్మ రుద్ర హరులున్ చోద్యమ్ముగా జూచిరే
మొరలంబెట్టితి మొత్తుకొంటి జననీ మూర్కొన్న వారేరిటన్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.2
మ.
విరులందూరెను రంగులన్ని జననీ వింతైన నా ఘోషకున్
మెరుపుల్దాగెను మబ్బులందు జననీ మీ నవ్వులన్ జూచి మీ
కురులందూరెను సొమ్మసిల్లె నకటా క్షోభించుచున్ చీకటుల్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.3
మ.
అరయన్ విష్ణువు శేషశాయి యగుటన్నాధారమీ శక్తియే
గిరులందాల్చెను కేలనెత్తి వెనుకన్ క్రీగంటి నీ చూపుకున్
నరునింగాచెను యుధ్ధమందు జననీ నారాయణీ ప్రోవవే
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.4
మ.
అరయంరుద్రుడు మ్రింగెనేమొ విషమీ యాజ్ఞాను సంవర్తియై
కరిచర్మంబును దాల్చెనేమొ పొలుపున్ కామారి యై నిల్చుచున్
పురముల్డుల్చుట కేమిహేతు వగునో పుణ్యంబు నీదౌనుగా
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.5
మ.
సరదా మీకది సృష్టి జేసి చిదుమన్ సంకేతమే మౌనొకో
మరులంగొల్పుచు మానవాళి సతమున్ మాయించుచున్ మోహముల్
వరముల్గోరిన వారినెల్ల పొలుపున్ బాలించినా నీకగున్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.6
మ.
బరువా నేనొక బాలకుండ జననీ బ్రహ్మాండ భాండోదరీ
తరమా సంస్తుతి జేయమిమ్ము జననీ దత్తాను సంధాయినీ
వరముల్గోరిన వాడగాను వరదా ప్రార్థించితిన్ భైరవీ
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.7
మ.
కఱవైపోయెను నీదు ప్రేమ హిమజా కారుణ్య వారాంబుధీ
తరమా భక్తులు మిమ్ము దల్వ కలిలో దారిద్య బాధార్తులున్
వరదా ప్రోవవె యంచువేడెదను నీ పాదాబ్జముల్ వట్టెదన్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.8
మ.
మరులంగొల్పును నీదు పల్కు జననీ మంజీర ముల్ సిగ్గిలన్
వరలెన్ పల్కులజేజి నీదు మహిమన్ పద్యమ్ములన్ దోగుచున్
తిరమై నిల్చును లచ్చి నీదు మహిమే దేదీప్యమౌ వెల్గుచున్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.9
మ.
అరయన్ పుట్టుక లేదు నీకు జననీ యానంద సంధాయినీ
వరలెన్ రాముడు ధర్మమూర్తి యగు చున్ వైదేహి వీవైతివే
తురిమెన్ రావణ కుంభకర్ణులగు వే దుర్మార్గు లీ వల్లనే
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.10
మ.
తిరమా రోగము లెన్ని గల్గు తొలగున్ తీర్థమ్ము లీ పాదముల్
తిరమా కష్టము లెన్ని గల్గు తొలగున్ తీరైన నీ ముంగిటన్
తిరమా జన్మము భక్తకోటికిలలో తీక్ష్ణమ్ము లౌ కర్మముల్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.11
12/10/23
మ
సరిసాటెవ్వరు నీకు వేద జననీ జ్ఞానమ్ము నీ రూపమే
సరిసాటెవ్వరు నీకు వేద వినుతా సామీప్యమం దుంచినా
సరిసాటెవ్వరు నీకు లోక జననీ శాంతమ్ము గల్గించినా
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.12
మ.
హరుసంబౌనిక యన్నవస్త్ర మిడుచు న్నారోగ్య మిమ్మందునే
వరముల్గోరను యస్త్ర శస్త్రమడుగన్ పాదాబ్జ మిమ్మంటినే
సరిసాటెవ్వరు నీకు వేద జననీ సామీ ప్యమం దుంచినన్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.13
మ.
బరువైపోయెను జీవితమ్ము వరదా భ్యాగ్యమ్ము లిమ్మంటినా
కఱవైపోయెను సంతసమ్ము మదిలో కైవల్య మిమ్మంటినా
సరిసాటెవ్వరు నీకు వేద జననీ సామర్థ్యమున్ బెంచినా
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.14
మ.
సరిలేదందురు నీదు శక్తికిలలో సందేహముల్ బెంచకే
సరిలేదందురు నీదు ప్రేమకిలలో జ్ఞానమ్ము గల్గించినా
సరిసాటెవ్వరు నీకు వేద జననీ సంతాపముల్ ద్రుంచవా
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.15
మ.
కరుణాసాగర మందుగ్రుంకు లిడగన్ కాశీ పురంబేగితిన్
కరుణాపూరిత మైన దృక్కుల గనన్ కాశీపురాధీశ్వరీ
మరుగైపోయెను క్షుత్పిపాస జననీ మాతాన్న పూర్ణేశ్వరీ
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము జననీ శ్రీ రాజ రాజేశ్వరీ.16
మ.
నెరవైయుంటివి విశ్వమంత జననీ నీరాజనం బెత్తగన్
తొరగెన్ బాష్పము కన్నులందు జననీ ధూపమ్ము లేమిత్తునో
కురచైపోయెను నాదు దృష్టి జననీ క్రోధమ్ము జూపించకే
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.17
మ
అరయందప్పులు జేసియుంటి గిరిజా యాగామి కర్మంబులున్
పరులంగోరిన లాభమేమి జననీ ప్రారబ్ధ ముల్ దీరునా
నెరవే నీవని మ్రొక్కెదన్ భగవతీ నీకన్న దిక్కెవ్వరే
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.18
మ.
గరిమన్ విశ్వము సృష్టి చేయ తగునా కారుణ్య మున్ జూపవే
తరమే నీకిది న్యాయమే భగవతీ దౌర్భాగ్యులన్ గావవే
వరదా యందురు నిన్నుభక్తులిలలో ప్రారబ్ధమున్ ద్రుంచనే
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.19
అరయంరాగిని భోగినైతి జననీ యజ్ఞానినై దోగితిన్
దొరకెన్మార్గము నీదుపాద మహిమన్ దూకొందు నీ నామమే
మరి నేబట్టెద నీదుపాద యుగళిన్ మాయించవే మోహముల్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.20
తెరలేలా కనురెప్పవిప్పి గనవా దేదీప్యమౌ చూపు వే
కిరణాలై జగమెల్లవెల్గు జననీ గీర్వాణ సంపూజితా
మఱుగేలా భువనేశి మమ్ము గనవా మాయింపవే మాయలన్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.21(15/10/23)
అరయంబంధము పెంచు ద్రుంచు మనసే యజ్ఞాని నే నైతినే
తిరమా గేహము దారపుత్రులిలలో తీరైన దీ దేహమా
తిరమౌ నీదయ జూపవేల లలితా తీరంగ నా మోహముల్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.22
అరయన్ మిత్రులు శత్రులేరి పరులే యాగర్భ సంజాతులున్
పరుగుల్బెట్టితి నాదినాది యనుచున్ ప్రారబ్ధమున్ బెంచుచున్
శరణంటిన్ భవరోగ నాశనకరీ శైలిక్యుడన్ గావవే
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.23
మ.
అరయన్ తూరుపు తెల్లవారె ననుచున్నా తారలే పువ్వులై
పరుగుల్బెట్టుచు కొప్పులోన దుమికెన్ భాగ్యమ్ము నేమందునో
మురిపెమ్మౌచును చంద్రశేఖరునికే మోహమ్ము గల్గించెనో
సిరులీకున్నను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.24
ముసిరెంజీకటి వెల్గులెట్లు కలుగున్ మూత్రాశయం క్షీణమై
పసివారైనను పెద్దలైన సతమున్ ప్రార్థింప లేకుందురే
శసనమ్మైతిరి కావ రమ్మనెద నీ శక్తుల్ సుశోభింపగన్
వసుధాదీశ్వరి వైతివమ్ము జగదంబా వైద్యనాధేశ్వరీ
శిశువుల్గాదొకొ స్వాస్థ్యమిమ్ము వరదా శ్రీ రాజ రాజేశ్వరీ.25 (16/10/23)
13/10/23
మ.
నెరవైయుంటివి కామకోటినిలయా నీకన్న దిక్కెవ్వరే
క్షరమైపోవును నీదు దృష్టి కిడుముల్ కాంచీపు రాధీశ్వరీ
వరమిమ్మా భరియింప కష్టముల నే ప్రార్థించెదన్ నెమ్మదిన్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.26
తుఱుమైపోవును పాపసంచయము నాదుష్కర్మలన్ ద్రుంచవా
పరమేశీ మటుమాయమౌను కను రెప్పల్మూసినన్ లోకముల్
మరలాపుట్టదె సృష్టి నీదు కనులన్ మాయింపు మా కష్టముల్
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.27
పరులన్మ్రొక్కిన బాధలేలతొలగున్ ప్రార్థించెదన్శ్రీ కరీ
కరముల్మోడ్చెద పాదదాసుడను నే కాత్యాయనీ భైరవీ
వరవీణామృదుపాణివే భగవతీ పాదమ్ములన్ నమ్మితిన్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.28
14/10/23
మ.
అరుణా కారణకారణమ్ము లెరుగన్ కారుణ్యమున్ జూపవే
దరహాసమ్ములు జిల్కు నీ వదనమే ధైర్యమ్ము గల్గింపదా
కరముల్మోడ్చుట దప్ప యన్య మెరుగన్ కాపాడవే శాంభవీ
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.29
పరులైదోచిరి బంధువర్గతతులున్ ప్రారబ్ధ మిట్లుండెనే
వరలంజేయుము వారినెల్లదయతో వాత్సల్య వారంబుధీ
తరియింతున్ కరుణించు నన్ను దయతో త్రైలోక్య రక్షాకరీ
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.30
మ
పరిహాసమ్ముల విందు పొందు సుఖముల్ప్రా యమ్ము గాల్చేసెనే
తరుణీసంఘము బంధు మిత్ర తతి సంతానేచ్చలో మున్గితిన్
తరుణంమ్మించెను తప్పులెన్నకుము నా తప్పొప్పు లన్ సైచవే
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.31
మ.
కెరటాలైనవి నాదుజన్మలిలలో క్లేశమ్ములం బెంచుచున్
తిరునామమ్ముల దాల్చినాడ పొలుపున్ దేహమ్ముపై భ్రాంతితో
తిరుణాలందున సంచరించి తనుచున్ దేవీనినున్ మర్చితిన్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.32
మ.
నరడైపుట్టితి నాది నీదనుచు నైనాదేవి నిన్ దల్వనే
కఱకౌపల్కుల ప్రోగుచేసితఘముల్ కాళీ నినున్ మర్చితిన్
శరణమ్మందును పాపనాశనకరీ చండీ సుతున్ప్రోవవే
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.33
మ.
నరకంబిక్కడె నాకమన్న దెరుగన్ నాతప్పుకే శిక్షలున్
వరదా నీదయ బంధమోచనకరీ వార్ధ్యక్యమే భారమా
పరితామమ్ములు గెల్తు నీదు దయతో పాలింపవే దుర్గవై
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.34
15/10/23
మ.
వరదాయీ పరమేశి విశ్వజననీ వైదేహివీ వంద్రు నీ
దరహాసమ్ముల వెల్గులందు జననీ తత్త్వమ్ము దర్శించెదన్
కరుణాపూరిత మైన దృక్కు గనెదన్ కాశీవిశాలాక్షివే
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ.35
మ.
సిగలోపువ్వులజూసి తారలరెరే సిగ్గిల్లెనే శైలజా
నగవుల్జారెనొ మంచుబిందువులపై నందీశునే గెల్వగన్
తగనా నీపదదాసదాసు డగుదున్ దాక్షాయణీ ప్రోవ నీ
సిగలో పువ్వుగనుండనిమ్ము జననీ శ్రీ రాజ రాజేశ్వరీ.36
మ.
పలు నల్వాదులు విష్ణు రుద్ర త్రిగుణాల్పంచాది భూతమ్ములున్
తొలగున్గల్గును సృష్టి సంచయము మా దుర్గమ్మ నీ వొంటిగా
కొలువైయుందువు చంద్రశేఖర సతీ క్షోభించి పెంపొందుచున్
శిల వైపోకుమ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.37 (16/10/23)
మ.
పలు లోకంబులు బ్రహ్మ రుద్రహరులీ పాదమ్ము సేవించుచున్
కొలువైయుందురు నీదు శక్తి మహిమన్ కోటీణ్దు సూర్యప్రభా
యిలలో భారతదేశ మందు నెలవై ఋక్సామ పూజార్చితా
శిల వైపోతివొ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.38
మ.
తరుణుల్బాలలు బీదబిక్కి ధనికుల్
త్వత్పాద సేవాపరుల్
తరుణీ దారుణమైన రోగములతో దావంతము న్పొందిరే
తెరవుంజూపక యుంటివేమి వరదా తీండ్రమ్ము జూపింపవా
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.39
మ.
బలగర్వాంధులు చండముండ దనుజుల్ భండాది పల్దైత్యులున్
తులువల్దుష్టులు లోని శత్రు లనఘా దుర్గమ్మవై ద్రుంచవా
నెలవై భారతదేశమందు వరదా నీ శక్తి చూపింపవా
శిల వైపోకుమ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.40.
మ.
పలు రోగమ్ములు పెచ్చరిల్లె జనులున్భాదాగ్ని లో మున్గిరే
పలు శోకమ్ములు బాధపెట్టె నిలలో బాంధవ్యమే శాపమై
పలు జన్మంబుల కారణమ్ము గనుకన్ ప్రార్థింతునో శాంభవీ
శిలవైపోకుము స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.41
17/10/23
లలితా నీపదమంట మాకు వెఱపా రాపాడవా కష్టముల్
లలితా మామొరనీకు దెల్పవలెనా రక్షింపవా బిడ్డలన్
లలితా లాలన నీదు తత్త్వ మగునా లాలించవా దీనులన్
శిలవా కావుగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.42
మ.
కలవాకన్నులు చారడేసి కనవా కాత్యాయనీ భైరవీ
విలువా రక్షణగూర్పకున్న లలితా విశ్వేశ్వరీ వైతివే
నెలవావిశ్వములన్ని నీకు జననీ నీకన్న మాకెవ్వరే
శిలవా కావుగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.43
మ.
నియమోల్లంఘన మేది నీకు జననీ నీశాశనమ్మందు నన్
దయజూపించుట నీకుపాడి లలితా దాక్షాయణీ శ్రీ కరీ
జయముల్గల్గవె నీదు పాదమహిమన్ శాతోదరీ శాంకరీ
శ్రియముల్గూర్పవె స్వాస్థ్యమిచ్చి ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.44
మ.
పెరిగెన్ కర్కశ కర్కరోగులిలలో ప్రేతమ్ములై దోచిరే
బరువైపోయెను వైద్యసేవ జనులన్ బాధించి వేధించెనే
కురచైపోవును జీవితేచ్చ జననీ క్రూరమ్మగున్ వైద్యమే
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.45
కర్క రోగము- కాన్సర్. దారుణమైన బాధలు పడుతున్నారు కాన్సర్ రోగులు.
వైద్యము చాలా బాధాకరము. కర్చు ఎక్కువే. వారిగురించి నా ప్రార్థన.
మ.
బరువా వృధ్ధులు భారమాజగతికిన్ వార్థ్యక్యమే శాపమా
పిరమై పోయెను వైద్యసేవలొకచో వృధ్ధాశ్రమాల్ పెంచెనే
వరదా భారతదేశ వృద్దతతులన్ బాలింపవే శాంకరీ
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.46.
బ్గారత దేశం లోని వృధ్ధులకొరకు నా ప్రార్థన.
మ.
ధనమే దైవమటంచు దల్చు జనులున్ దౌర్భాగ్యమౌ రీతులన్
నెనరూకూరిమి వీడి సంపదలకై నిగ్గింపరే భాధ్యతల్
కనవా భారతజాతి క్షీణదశలన్ కాత్యాయనీ భైరవీ
చెనటుల్ కారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.47
మ.
మధుమేహమ్మును రక్తపోటు పెరిగెన్ మాతీపి రోగమ్ములై
పదులైవందల వైద్యశాలలట మావైద్యమ్ము భారమ్మగున్
సుధలంజిల్కవె వైద్యనాథ సతివై శుద్ధాత్మవై ప్రోవవే
ప్రిదులంజేయకు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.48
18/10/23
మ.
లలితాదేవియె లేదులేదనరె నీ లాలిత్యమున్ జూపవా
సలిలంబగ్నియు నింగినేల పుడముల్ చైతన్య మీదౌనుగా
చలియించందగు వేగరావె జననీ జ్ఞానప్రసూ నాంబికా
శిలవైపోతివొ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.49
నడిచేదైవము నందివాహనుడు ఆనందాత్మ జుండీతడే
నడయాడేనిట దత్తదేవునిగ మా నారాయణుం డీతడే
తుడిచెన్గన్నులు ధైర్యమిచ్చి పొలుపున్ దూకొంచుచున్ దీనులన్
విడచెన్ మోహము భక్తకోటికొరకై విజ్ఞాన సంపూజ్యుడై
చెడనీడెవ్వరి నైన చెంతనిలచున్ శ్రీ రాజ రాజేశియై.50
మ.
జలమై దాహము తీర్చుదత్తునివిగా జ్ఞానమ్ము మాకిచ్చుచున్
వెలుగై దోచరెసూర్య చంద్రులెలమిన్ వేవేలు మీ వల్లనే
జ్వలియించున్గద యగ్ని మీదు బలిమిన్ శాంతించ క్షుద్భాధలున్
చెలువొందున్గద స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశివై.51
19/10/23
మ.
తలపన్నేరము భోగమోక్షముల నేదానమ్ము ధర్మమ్ములన్
తలపన్నేరము నామరూపమనఘా తైతక్కలే యాడుచున్
విలువల్నేర్వని దుండగీడు లనుచున్ వీక్షించి శిక్షింపకే
శిలవైపోకుము స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజ రాజేశ్వరీ.52
20/10/2023
మ.
అరయన్విశ్వము నీదు రూపమనిరే యాద్యంత మేలేనిచో
పరికింపన్తగు శక్తిలేని సుతుడన్పాదాబ్జ మీ యందగున్
తరియింతున్గద నీదుపాద మహిమన్ దాక్షాయణీ శాంభవీ
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము జననీ శ్రీ రాజ రాజేశ్వరీ.53
మ.
జననీ శంభుని కోరితి జగతికిన్ స్వాస్థ్యమ్ము నిమ్మంచునే
కనవా బిడ్డల సర్వశక్తిమయి శ్రీ కంఠార్థరూపేశ్వరీ
వినవా నామొర సర్వ రోగ శమనీ విశ్వేశ్వరీ శాంకరీ
చెనటుల్కారని స్వాస్థ్యమిమ్ము జననీ శ్రీ రాజ రాజేశ్వరీ.54
విషయంబేమని చర్చచేసితనఘా విశ్వేశ్వరీ శాంభవీ
విషమున్గ్రోలెను నీదు నాథుడెలమిన్ వీక్షించితీ వల్లనే
విషకంఠాయని మ్రొక్కులందుకొనినన్ వేండ్రమ్ము తానొందడే
త్రిషుగన్ధమ్మిడి సేదతీర్చితివొకో శ్రీ రాజ రాజేశ్వరీ.55
22/10/23
మ.
అరయన్ కన్నులు మూడు నీ హరనకున్ యాకామునిం గాల్చగ
న్నరయన్ చంద్రుని దాల్తువీదు తలపై
యాద్యంత మీ వుందువా
హరునిన్తాండవమందు గెల్వ వలెనా యానంద మేముండునో
కరుణంజూపగ నీకు సాటి హరుడా కాత్యాయనీ భైరవీ
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.56
అమ్మా అయ్యవారికీ నీకూ మూడు కన్నులున్నాయి. ఆయనా చంద్రురేఖ ధరిస్తాడు, నువ్వూ ఆయనా ఆద్యంత రహితులే. ఆయన మూడోకన్ను కాముడిని గాల్చింది.
తాండవంలో ఆయన నిన్ను గెలవనీ ఆయన ఓడిపోతే నీకు ఆనందం కాదుగా, కానీ అమ్మా నీ మూడో కన్ను కరుణగురిపిస్తే కాముడే బ్రతికాడు.
కాబట్టి మాకు (ప్రజలకు) ఆరోగ్యం ఈయమ్మా.
( తాండవమాడటంలో ఓ సారి వారిరువురకు పోటీ పడగా అమ్మవారు అన్ని విధాల అయ్యవారిలా నే నృత్యం చేశారట. చివరకు ఆ ముక్కంటి తాండవంలో భాగంగా తన పాదాన్ని పైకెత్తి ఆకాశాన్ని తాకారట. స్త్రీ గనుక ఆ భంగిమ తాను చేయలేదట. ఆవిడ అలిగి వేరే చోట వెలిసిందట - ఇది *చిదంబరం క్షేత్రం లోని కథ.*)
23/10/23
మ.
పెరుగన్నంబును కట్టెపొంగళులతో వేడ్వేడి శాకంబులున్
పరమాన్నంబును గారె బొబ్బటులతో బల్పిండి వంటల్నిడన్
కొరవా భక్తులు వేలకోట్లు జననీ గోబాల రక్షాకరీ
తరమా వృద్ధుడనైతి లోకజననీ దాక్షాయణీ శ్రీ కరీ
సిరులన్గోరను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.57
24/10/23
మ.
కొలువైయుందువు గుండెలోని గుడిలో గుర్తించ లేనైతినే
పలుదేహమ్ములు నామరూపములలో బ్రహ్మాండ భాండోదరీ
నెలవైయుంటివొ విశ్వమంత జననీ నిన్నెట్లు నేగాంచెదన్
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.58
మ.
కలికాలమ్మిది కాంక్షలెట్లు తొలగున్ కామేశ్వరీ ప్రోవవే
కలలోనైనను జీవితేచ్చవిడదా కామాగ్నిలో వ్రేలగన్
పలుదేహమ్ములు దాల్చితేమి యఘముల్ ప్రాప్తించవా జీవులై
తలపన్నేరనివారమైతి మనఘా దాక్షిణ్యమున్జూపువే
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.59
మ.
తలపైయుందువు నిన్నుగాంచు టెటులో త్రైలోక్య సంచారిణీ
తెలివీకున్నను నిన్నుపోల్చతరమా దేదీప్యమై వెల్గినన్
తలమేదైనను తల్లివైతివనఘా తత్త్వమ్ము దర్శింపనీ
చెలువంబారగ స్వాస్థ్యమీయవలదా శ్రీ రాజ రాజేశ్వరీ.60
25/10/23
మ.
అరవిందార్చితపాద పద్మ యుగళా యర్చింతునిన్ భక్తితో
నరవిందానన పద్మనేత్ర సుభగా యాశ్చర్య మౌరీతులన్
మొరముల్రత్నములౌను నీదు కృపతో మోడైన పుష్పించదా
చిరునవ్వుల్చిలికించగా నమృతమై సేమమ్ము చే కూర్చదా
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.61
28/10/23
మ.
మనసారా నిను తల్వ లేముజననీ మాయింపవే తప్పులన్
తనివారా తగుపూజచేయమనఘా దాక్షిణ్యమున్జూపుమా
మనవారేనని రక్షగూర్ప వలదా మాహేశ్వరీ శాంకరీ
చెనటుల్గారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.62
మ.
శరదిందీవర పూజితాంఘ్రియుగళీ శంభుప్రియా శాంకరీ
శరచాపాంకుశ శూలహస్త సుభగా చంద్రీకళా సుస్మితా
శరదామాసపు పూజలందుకొనవే చంద్రార్క నేత్రోజ్వలా
చిరకాలమ్మగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.63
30/10/23
అలకైలాస గిరీంద్రతాజతనయా యౌదార్య మే రూపమై
కొలువైయుంటివి సుందరేశ సతివై కోనేటి తీర్థమ్ములో
మెలతా శ్రీ మదురైపురంబున రహిన్ మీనాక్షి వై ప్రోవవే
శిలవైపోకుము స్వాస్థ్యమిమ్ము ప్రజకు న్శ్రీ రాజ రాజేశ్వరీ.64
మ.
అలవైకుంఠపురమ్మునందు నెలవై యాబ్రహ్మకే మాతవై
యలమేల్మంగవు శ్రీ నివాదదయితా యానంద మే రూపమై
పలురూపమ్ముల పూజలందుకొనుచున్ పద్మావతీ శ్రీ కరీ
కొలువైయుంటివి రంగనాథ సతివై కొల్హాపురాధీశ్వరీ
శిలవైపోకుము స్వాస్థ్యమిమ్ము ప్రజకు న్శ్రీ రాజరాజేశ్వరీ.65
మ.
వెలుగైగుండియ నాక్రమించి వెలుగై విశ్వమ్ములో నిండుచున్
తెలివై వెల్గుల వల్లువై కలిమివై దీపాలలో వెల్గువై
బలిమై భక్తుల నాదరించు సిరివై భాగ్యమ్ము నందించుచున్
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజ రాజేశ్వరీ.66
31/10/23
మ.
భవపాధోధిని దాటలేము వరదా పాలింపవే దీనులన్
పవి పుష్పంబగు నంద్రు నీదు దయతో భద్రమ్ము చేకూర్పవే
ధవళాద్రీశుని పుత్రివైన హిమజా దాక్షిణ్యమున్ జూపవే
శివకామేశివి స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజ రాజేశ్వరీ.67
03/11/23
మ.
తపముల్సేయగ రానివారమనఘా తత్త్వమ్ము దర్శింపగన్
జపముల్పూజలు హోమముల్వ్రత ములున్ జ్ఞానేశ్వరీనేర్వమే
కృపజూపించగ వందనమ్ములిడమా క్షేమమ్ము గల్పింపవే
త్రిపురేశీ తగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.68
మ.
పగళుల్రాత్రులుకల్గునీదు కృపతో ప్రాయంబులన్ మ్రింగుచున్
జగముల్గల్గును తొల్గు నీదు కనులన్ చైతన్య మీదౌనుగా
జగమందంతయు నిండి యుందు వనఘా చాముండి వై ప్రోవవే
త్రిగుణాతీతవు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.69
మ.
పదవుల్గోరను భోగమోక్షమడుగన్ పాదమ్ము లిమ్మంటినే
సదనమ్గోరను మేడమిద్దెలడుగన్ సామ్రాజ్యముల్గోరనిన్
మదిలోదల్తును రోగనాశనకరీ మాహేశివై కావవే
త్రిదశేశీ తగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.70
జగదానందకరీశ్వరీ భగవతీ శాకంబరీ మాతవే
జగమందంతయు నిండి యుందు వనఘా సస్యమ్ము లందించుచున్
సగమై శంభుని శక్తియై వరలుచున్ జ్ఞానమ్ము మాకీయుమా
తగవేమున్నది లోకపాలనకరీ దాక్షిణ్య మున్జూపగన్
త్రిగుణాతీతవు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.71
05/11/23
(లంకాయాం శాంకరీదేవి)1
శశిభూషా పెనుదీక్షపూని దశ శీర్షంబుల్ నివేదించెనా
దశకంఠుండెలమిన్ విరించి కొరకై దర్పమ్ముతో నిన్ను లా
లసుడై గొల్చిన సంతసించితివి శ్రీలంకాపు రీశాంకరీ
త్రిశలామాతవు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.72
(శ్రీ లంకలోని శాంకరిని గొల్చి వరాలు పొందినాడట రావణుడు. అటువంటి వానిని దయచూసే తల్లీ మాకు ఆరోగ్యం ఈయుమమ్మా)
మ.
అల శ్రీశైలపురం బునందు కొలువై యజ్ఞాన మున్బాపుచున్
నెలవైయుంటివి మల్లికార్జునునితో నిన్నెట్లు సేవింతు చం
చలచిత్తుండను జ్ఞానమిమ్ము జననీ జ్ఞానప్ర సూనాంబికా
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.73
(శ్రీ శైలే భ్రమరాంబిక)6
కలవాలంపుర జోగులాంబ సతివై కారుణ్యముజ్ జూపుచున్
పలు బ్రహ్మాదులు నిన్నుకొల్తు రనఘా బ్రహ్మేశు డీతోడుగా
కలికాలమ్మిది భక్తిలోపమనఘా కారుణ్యమున్ జూపవే
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.74
(ఆలంపురే జోగులాంబ)5
06/11/23
మ.
కలికాలమ్మని కామకోటినిలయా కాంచీపు రంబందునన్
కలవాభక్తుల పాలి కల్పతరువై కామాక్షివై ప్రోచుచున్
నెలవైయుండియు విశ్వమంత జననీ నిన్నెట్లు నే పోల్తునే
చెలువంబారగ శ్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.75
(కాంచికాపురే కామాక్షి)2
మ.
అల ప్రద్యుమ్నపురంబు నందు గలవమ్మా శృంఖలా దేవివై
బలిమై యుంటివి భంధమోచనకరీ పాశమ్ము లంజూపుచున్
పొలుపున్ గాచుచు భక్తకోటికెలమిన్ మోహమ్ములన్ ద్రుంచవే
చెలువంబారగ శ్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.76
(ప్రద్యుమ్నే శృంఖలా దేవి)3
మ.
ముదమారన్ మహిషూర్పురాన గల చాముండేశ్వరీ మాతవై
ప్రిదులంజేయవె కాంక్షలన్ని జననీ విశ్వేశ్వరీ శ్రీ కరీ
పదమిమ్మాయని భక్తకోటి కొలువన్ పాలింతువే శాంభవీ
త్రిదశేశీ తగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.77
(మైసూరు చాముండేశ్వరి-చాముండే క్రౌంచ పట్టణే)4
07/11/22
మదమాత్సర్యము లాక్రమించె జననీ మాయించవే మోహమున్
మదిలోనుండవె యేకవీరిక సతీ మాహుర్పురాధీశ్వరీ
సదసద్రూపిణి రేణుకా భగవతీ సత్చింత లన్బెంచుమా
త్రిదశేశీ తగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.(78
(మాహుర్యే ఏకవీరిక)8
మ.
కలవాదేవివి కాలకాలుని సతీ కల్యాణ ముల్గూర్పగన్
కలికాలమ్మున క్షేత్ర ముజ్జయినిలో కాలమ్మునే మ్రింగుచున్
చెలివై కాలునిచెంత నిల్చితివిగా శ్రీ కాళికామాతవై
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకు న్శ్రీ రాజరాజేశ్వరీ.79
(ఉజ్జయిన్యాం మహాకాళి)9
08/11/23
మ.
పరమేశీ పురుహూతికా భగవతీ పాలింపవే మమ్ములన్
నెరవైయుంటివి పీఠికా పురములో నీ భక్తులన్ ప్రోచుచున్
తరుణమ్మాయెను శైలరాజ తనయా దాక్షిణ్యమున్ జూపగన్
సిరులన్ గోరను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.80
(పీఠికాయం పురుహూతికా)10
మ.
ఒరియా రాష్టపు భక్తకోటి వరదా యోఢ్యాణ పీఠేశ్వరీ
బిరజా వైతరణీనదీ తటమునన్ ప్రేయస్సులన్ గూర్తువే
చిరకాలమ్ముగ పూజలందుకొనుచున్ శ్రీ మాతవై ప్రోవవే
సిరులంగోరను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.81
(ఓఢ్యాయాం గిరిజాదేవి)11
09/11/23
మ.
నెరవైయుంటివి దక్షవాటికన మాణిక్యాంబవై ప్రోవగన్
వెరపేమున్నది మాకు వేదజననీ భీమేశుడే యుండగన్
మొరలాలింపవె సర్వరోగ శమనీ భోగమ్ములన్ గోరమే
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజ రాజేశ్వరీ.82
(మాణిక్యా దక్ష వాటిక)12
12/11/23
మ
చదువుల్గోరెడు భారతీయ సుతకున్ సద్భుద్ధినీ యందగున్
పదువుల్గోరెడు రాజకీయతతికిన్ ప్రారబ్ధమీయందగున్
సదయా నీదగు జీవకోటికెలమిన్ సామర్థ్యమీ యందగున్
త్రిదశేశీ నిజ స్వాస్థ్యమీయవలదా శ్రీ రాజరాజేశ్వరీ.83
మ
విలువల్నేర్వని జన్మమాది జననీ విశ్వేశ్వరీ శ్రీ కరీ
పలుజన్మమ్ములు చాలు చాలుజననీ పాపమ్ములన్ సైచ కో
మలపాదమ్ముల సేవచేసెదము కామాఖ్యాపురాధీశివే
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజ రాజేశ్వరీ.84
15/11/23
మ
పగతో ద్వేషముతోచరింతురధముల్ పాపమ్ములన్ జేయుచున్
సెగలైసోకిన లోభమోహములు సంక్షేమమ్ము చేకూర్చునా
జగడాల్నేర్చిరి లోకులెల్ల జననీ శాంతమ్ము చేకూర్పవా
త్రిగుణాతీతవు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరా జేశ్వరీ.85
17/11/22
మ
పులుపుల్కారము లుప్పుతీపి యనుచున్ భోజ్యమ్ములన్ మ్రింగుచున్
వలపుల్మోహమలందు జిక్కి మనుజుల్ ప్రార్థించు టల్ నేర్తురా
పలుకుల్తీయగ నైన బల్కమనఘా పాపమ్ములన్ సైచవే
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరా జేశ్వరీ.86
మ.
కనులారా నినుగాంచలేము జననీ కన్నీటిలో మున్గినన్
మనసారా నిను తల్వలేము వరదా మాకష్టముల్ హెచ్చినన్
పెనురోగమ్ములు క్రుంగదీసె జనులన్ వీక్షింపవే శాంకరీ
చెనటుల్గారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.87
19/11/23
మ.
జననీ చీకటిలేదు నీదు జగతిన్ జ్ఞానమ్మె నీ రూపమా
కనగా క్లేశములెట్లుగల్గునని నీ కన్దోయి చూపించినన్
మనసే నిల్వదు నిన్ను దల్వ వరదా మాయింపు మా కష్టముల్
చెనటుల్గారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.88
19/11/23
మ.
జయదేవీ పరమేశ్వరీ భగవతీ సంపత్కరీ శాంకరీ
లయకారీ జగదీశ్వరీ సురనుతా రక్షింపవే భైరవీ
భయ నాశీ భువనేశ్వరీ శివసతీ ప్రార్థింతు నే శ్రీ కరీ
శ్రియమీవే తగు స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.89
20/11/22
మ.
తలపైగంగను దాల్చనిచ్చితివి నీ ధైవత్య మేమందు నో
సుళువాపాములు మేనిపై తిరుగగన్ శోభస్క రమ్మౌనొకో
తలలోనాల్కవు చంద్రశేఖరసతీ దాక్షిణ్యమింపారగన్
చెలు వంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.90
21/11/23
మ.
శివనామమ్మును దల్చుశక్తినిడుమా క్షేమంకరీ శ్రీకరీ
శివరూపమ్మును గొల్చు భక్తినిడుమా శీఘ్రమ్ముగా శాంకరీ
శివతత్త్వమ్మును గుర్తునిమ్ము ప్రజకున్ శ్రీ మాతవై ప్రోచుచున్
శివకామేశివి స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.91
24/11/23.
మ.
సరిలేదంద్రు ప్రయాగతీర మవనిన్ స్నానమ్ములం జేయగన్
మరుగైపోవును పాపరాశులనిరమ్మా మాధవేశీ రహిన్
పరిపాలింపవె క్షీరరాజతనయా పాపమ్ములన్ సైచుచున్
సిరులీకున్నను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.92
మ.
జవసత్త్వమ్ములు మాకు గల్గు ననఘా జ్వాలాముఖీ నిన్ గనన్
శివకాంతా పలు మ్రొక్కులందుకొనుచున్ శ్రీ వైష్ణవీ దేవివై
శివుడే భైరవుడౌచు చెంతనిలచున్ క్షేమమ్ములన్ గూర్పగన్
శివకామేశివి స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.93
25/11/23.
మ
కనులున్నన్ నిను గాంచనైతి గిరిజా కైంకర్యమున్ జేయగన్
మనసే నిల్వదు క్షేత్రమైన గయలో మాంగల్యగౌరీ సతీ
స్తనమిమ్మాయని కోరరాని వయసే
జ్ఞానమ్మునీ యందగున్
చెనటుల్గారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.94
మ.
ఇలలో మోక్షపురంబు నుండు వరదాయీ శ్రీ విశాలాక్షివే
కలి కాల్మోపగ సాహసింపడట నీ కాశీపురీ సీమలో
విలయమ్మొందని క్షేత్రరాజ పురమున్ విశ్వేశుడీ తోడుతన్
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.95
27/11/23
మ.
చనగన్ వేరొకచోటు మాకు గలదా జ్ఞానాగ్నిలో మున్గినన్
కనగన్ కన్నులు మాకులేవు జననీ కాశ్మీరవాసస్థలీ
నినునేగాంచ సరస్వతీ భగవతీ నేనంత భక్తుండనా
చెనటుల్గారని స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.96
02/12/23
మ.
భయమే భక్తిని నేర్పెమాకు భయమే ప్రార్థింపగా నేర్పగన్
నయమే మోహము పెంచెమాకు నయమే నాట్యామ్ము నాడించగన్
దయజూపన్దగు వారమైతిమనఘా దాక్షాయణీ ప్రోవవే
భయముల్బాపవె దారిజూపి జననీ భద్రమ్ము చేకూర్పుచున్
శ్రియముల్గూర్పవె స్వాస్థ్యమిచ్చి ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.97
05/12/23
మ.
తులువల్వీరని పాపకర్ములనుచున్ తూఫానులన్ బంపకే
తలపన్నేరరు పుణ్యకార్య మనుచున్ దండింపకే మమ్ములన్
కలికాలమ్మిది శైలరాజతనయా కారుణ్యమున్ జూపుచున్
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.98
(తమిళనాడు ఆంధ్రా ప్రజలను తుఫాన్ బారినుండి రక్షించమని నా ప్రార్థన)
09/12/23
మ.
పలుకుల్బేర్చుచు నిన్ను తెల్ప తరమా వ్యక్తమ్ము నీ వౌదువా
తలపుల్కూర్చుచు లోన పోల్చుటకుమా తాదాత్మ్య మే లోపమా
నెలవైయున్నను విశ్వ మంత జననీ నిన్నెట్లు గుర్తింతుమో
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.99
మ.
తరమా పద్యములల్లి నిన్ను తెలుపన్ ధైవత్యమీ దౌనుగా
వరమే యిచ్చిన పల్కులన్ని వరదా భావమ్ము నీదౌనుగా
సరమా నూటికి నూరు పద్యములతో సాహిత్యమున్ పంచగన్
సిరులంగోరను స్వాస్థ్య మిమ్ము సతికిన్ శ్రీ రాజ రాజేశ్వరీ
చిరుదీపమ్మిడ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.100.
మ.
కలదారూపము నీకు విశ్వ జననీ కారుణ్యమే రూపమా
లలితా నామము గాక వేరు గలదా లాలిత్యమే నామమా
కొలువైయుండవె గుండెలోన గిరిజా గుర్తించ యత్నించెదన్
చెలువంబారగ స్వాస్థ్యమిమ్ము ప్రజకున్శ్రీ రాజరాజేశ్వరీ.101
మ.
కనులీ రెప్పలు విప్పలేని స్థితి యే కాంతమ్ములో నుండగన్
పెను చీకట్లట చుట్టుముట్టెనదిగో భీతిల్లి నేనుండగన్
ననునే పోల్చిన వాడనైతి జననీ నా జన్మ ముంకొక్కటా
నను నీ గుండెల పైన హత్తుకొనుచున్ నా తల్లి వీవేకదా
తనువుల్చాలిక చాలుచాలు జననీ దాసుల్ని మన్నించుమా
చెనటుల్కారని స్వాస్థ్య మీయ వలదా శ్రీ రాజరాజేశ్వరీ.102
మరలా జన్మము లేలమాకు జననీ మా మోహముల్ ద్రుంపవా
తెరలన్తీయగ వేడుకుందుమనఘా దేదీప్యమౌ వెల్గులన్
పరుగుల్బెట్టుచు నిన్నుజేరెదముగా పాదమ్ములన్ బట్టగన్
సిరులన్గోరను స్వాస్థ్యమిమ్ము ప్రజకున్ శ్రీ రాజరాజేశ్వరీ.103
శతకము పూర్తి అయింది అక్షరాలా అమ్మ దయతో.
మొదటి పద్యాలలో నా సతికి మాత్రమే ఆరోగ్యం ఇమ్మని ప్రార్థించినమాట నిజమే..స్వార్థమే.
శ్రేయోభిలాషుల సలహా వల్ల అందరకీ మేలు జరగాలని పద్యాలను వ్రాయడం మొదలెట్టాను. మొత్తానికి ఆ రాజరాజేశ్వరి మాత నన్ను కరుణించినది.

No comments:
Post a Comment