Friday, March 8, 2024

శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందోదాహరణ కావ్యము

 శ్రీ శ్రీ శ్రీ  గణపతి సచ్చిదానందో దాహరణ కావ్యము


ప్రార్థన

దండము లందు గణపతికి

దండములందింతు మీకు దత్తాత్రేయా

దండములు హరిహరులకున్

దండములు గణపతి సచ్చిదానందు నకున్.(1)


జయలక్ష్మి నృసింహజునకు

నయగారపు మొగము వాని నగుమో మునకున్

లయరాగతాళ ప్రియుడా

దయగలుగు గణపతి సచ్చిదానందు నకున్.(2)


దత్తుడె వేంకట నాథుడు

దత్తుడె నా తల్లి దండ్రి దత్తా యందున్

దత్తుడె నాకుల దైవము 

దత్తుడన గణపతి సచ్చిదానందుండౌ.(3)


గజముఖుని సూర్పకర్ణుని

సుజనుల రక్షించు భక్త సులభుని హేమా

ద్రిజసుతుని యేక దంతుని

విజయము లిమ్మనుచు గొల్తు విఘ్నేశ్వరునిన్.(4)


వందనమమ్మా వాణీ

వందనములు పలుకుజెలివి వందన మమ్మా

వందనములు గీర్వాణీ

వందనమందింతు నమ్మ పద్యము లిడగన్.(5)

@@@@@@@@@@@@@

ఉదాహరణ కావ్యము.


ప్రథమా విభక్తి.

ఉ.

దత్తుడు రక్షకుండు నవతారము దాల్చిన నాదరూపుడున్ 

దత్తడు దీనబాంధవుడు దాంతుడు ధీరుడు సత్స్వ రూపుడున్

దత్తుడు పీఠమందుభయ తారక మార్గము జూపు వాడు మా

చిత్తము నందు నిల్చి తమ చిన్మయ ముద్రలి నిల్పి గావుతన్.(1)


ప్రథమా విభక్తి

చం.

వలపటి చేత ధర్మమును భక్తులుదల్చిన వారిదాపటన్

కలుషములైన మానవుల కల్మష మంతయు శుద్ధిజేయగన్

చెలువముమీర భక్తులకు క్షేమము గూర్చెడి దత్తదేవుఁడై

జలములలోన పుట్టెనిల సత్య సురూపుడు మేకెదాటునన్.(2)


కళిక

వృషభగతి రగడ.

మఱియు నీతడు నృసింహ సుతుడు మాయ మోహములందు చిక్కడు

ముఱియ మాజయలక్ష్మి పుత్రుడు పూర్ణ ఫలముల నిచ్చు నీతడు

కుఱియు వానలు నీతడుండిన మెరయు మబ్బుల రూప మీతడు 

విఱియ మోదము జగతి నంతట కుఱియు కాంతుల రూపమీతడు.

జన్మ సిధ్ధుడు నిత్య తృప్తుడు చర్మ చక్షుల కంద డీతడు

జన్మ జన్మల నుండి గాచెడు జ్ఞాన రూపుడు నిర్మలాత్ముడు.

ధర్మమార్గము జూపవచ్చిన దత్తుడీతడు కృష్ణుడీతడు

కర్మ సంచయ మంతమొందగ కాలుబెట్టిన కాలకాలుడు(3)


హరిణగతి రగడ.(ఉత్కళిక)

నామ కీర్తన నాద మయమని 

నాద మందున నాట్యమాడెను

భక్తి మార్గము ముక్తి నిచ్చను

భార తావని భార మెత్తెను

మూఢ జనులకు ముక్తి నిచ్చెడు 

మోక్ష మార్గము మునిచె నీతడు

మహిష పురమున మాత పుత్రుడు

మహిమ జూపెను మాకు దత్తుడు.(4)



@@@@@


ద్వితీయా విభక్తి.


ఉ.

శ్రీ గురునిన్ కృపాకరుని క్షేమము గూర్చెడు వాని శ్రీ కరున్

లోఁగక నీ భవాంబునిధి లో విహరించెడు వాని సద్గురున్

త్యాగిని పాహి పాహియన తాలిమి జూపుచు ప్రోచి కష్టముల్

లోగొను వాని దల్తు భవరోగము బాపగ సత్య రూపునిన్.(5)


ఉ.

అంతటయుండువాని మునులందరు నిత్యము దల్చువాని వే

దాంతులు యోగులందరును ధ్యానము నందున గొల్చువాని స

చ్చింతన చేయువారి వెస సేమము యోగము గూర్చు వానినిన్

చింతిలు భక్తితత్పరుల శ్రీలను గూర్చెడు వాని శ్రీ గురున్.(6)


కళిక

హరిగతిరగడ.

మేనున బూదిని నలముచు బుట్టిన వానిని రుద్రాక్ష గలుగు వానిని 

పూనుచు భక్తుల నెల్లర బిల్చుచు ముక్తిని భుక్తిని గూర్చెడు వానిని

పుట్టుకతోడనె సిధ్ధులుగల్గియుముచ్చట కైనను తెల్పని వానిని

పుట్టుటగిట్టుట లెరుగని వానిని పోడిమి భజనలు నేర్పెడు వానిని

చల్లనినవ్వులు రువ్వెడి వానిని చంద్రుని మోమున దాచిన వానిని

చెల్లని జీవుల బిల్చెడు వానిని చేతన కేతన మిచ్చెడు వానిని

వేదము యోగము గానము ధ్యానము వేకువ పూజలు సలిపెడు వానిని

నాదముతోభవ రోగము డుల్చెడు  నాగురు దైవము గొల్తును వానిని.(7)


ఉత్కళిక

మధురగతి రగడ.


సాధన చేయుట సత్యము వల్కుట

బోధలు చేయుచు పుడమిను జుట్టుట

పడమటి భౌతిక వాదము నాపుట

పరుగులు బెట్టి నివారణ చేయుట

గీతా పఠనపు కేతనమెత్తుట

సీతా పతినే చేరువ చేయుట

మారుతి నామము మానని వానిని

తారణ దత్తుడు దల్తును వానిని.(8)


@@@@@



తృతీయా విభక్తి.

ఉ.

ఎవ్వనిచేత దత్తచవి యెల్లెడలా గను పించె వానిచే

నెవ్వని చేత భక్తులకు హీన గుణమ్ము లు తొల్గె వానిచే

నెవ్వని కీర్తిచంద్రికలు యీజగ మంత యు నిండె నన్న యే

మివ్వని వాడవయ్య జగదీశుడ శ్రీ గురు పాద ధూళిచే.(9)


ఉ.

శ్రీ లనుగూర్చు పాదముల చింతన జేసితి సుంత భక్తితో

రాలిన పూలతో కొలిచి రక్షణ గోరితి దత్త దేవ నీ

లీలలు శ్రద్ధతో విని నిరీక్షణ జేసితి నీదు రాకకై

వాలిన భక్తితో తమరి పాదము లంటితి దారి జూపగన్.(10)


కళిక

హరిగతి రగడ పద్య లక్షణములు 

అఘములు తొలగెడి యనఘా వ్రతములు హరుసము నొసగును  గురువరు చేతను             రఘువరు భజనలు సలుపుట చేతను లఘువలఘు లగుట గురువుల చేతను              జగముల నేలెడి గురువరు చేతను జయములు కలుగును గురువరు చేతను                           నగవులు విరియును గురువరు చేతను నయములు గలుగును గురువరు చేతను                రోగము లణగెడి భజనల చేతను లోకుల కందును గురువరు చేతను భోగము లందున మోహము తొలగును పూజలు తెలిపెడి గురువరు చేతను               రాగము ద్వేషము తొలగగ చేయును రాగము పాడెడి గురువరు చేతను అన్నము దానము చేయుట చేతను ఆర్తిని బాపును గురువరు చేతను.(11)


ఉత్కళిక.

మధురగతి రగడ.


దత్తుని నిచ్చెలు దల్చుట చేతను

చిత్తము శాంతిని చెందుట చేతను

సిధ్ధ గురువులను సేవించుటచే

బుధ్ధులు కలుగును పూజించుటచే

మన్మథవేదన మాయల చేతను

జన్మలు కలుగవు జ్ఞానము చేతను

ధనుములు గలుగును ధర్మము చేతను

గుణములు కలుగును గురువుల చేతను.(11)


@@@@@@


చతుర్థీ విభక్తి.


చం.

కరములు సేవకై భజనకై శృతికై లయకై పదమ్ము పై

నిరతము నుంచు భాగ్యమును నీపద ధూళులచేత, హారివై

కరివసనుండవై నలువకైవడి‌ దత్తునివైన, ముక్తికై 

గురువర దల్తు నాకొఱకు కూరిమి నిచ్చలు దత్త భక్తికై.(13)


ఉ.

నీదయ కోరి వేచితిని నీమృదుహాసము జూడగోరితిన్

నీదు పదాంబుజమ్ములను నెమ్మది దల్చితి భక్తినీయగన్

నీదరినుంచ వేడెదను నీమది స్థానము నీయ మంటినే

నాదొక విన్నపంబనుచు నాముము బల్కెద దత్త దేవరా.(14)


శా.

నీకై పూలను తేను మూఢమతినై నీపాద మెట్లంటెదన్

నీకై సేవలు చేయనైతినిగదా నీభక్తుడే నౌదునో

నీకై పద్యము లల్లనైతిని సదా నీకీర్తి వ్యాపింపగన్

నీకై నామది దత్తదేవ గొని నన్నెట్లైన రక్షింపుమా.(15)



కళిక.

హరిగతి రగడ


మఱియు తొలిగురువుగ జనని వెలయగ మలిగురువుగ మేనత్త గురుతుకై

మెఱసెడి సిధ్ధుల జనులకు తెలుపక మిసిమి వయసున వరలెడి గురునకై


గణపతి కపివరు డెలమిన సాక్షులు కరివస నునికడ కలుగు గురుతు కై

నణువణువునగల యా జగగీశ్వరి నహరహమును గురుతిడెడు గురునకై


కృష్ణాజినమును ధర్భయు మౌఞ్జీ క్షేమకరమనిడె గణపతి వటువు కై

కృష్ణాతటమున దీక్షలభించగ  హృష్టి గమండలు దొరకె గురుతుకై


నారద శారద హనుమల ఫలముగ నాదోపాసన సలిపె జనులకై

తారణ గీతాపఠనము జనులకు ధారగ హనుమను తలచుట కొర కై.(16)


ఉత్కళిక


కడు తాపముతో ముది తాపసికై-

వడి మానసతటిలో  మునకలు గై-

కొని మనసున పరి తాపము విడి గై

కొని దీక్షలు కడు వేగము తగు కై 

వారమునిడె గిరిపతి నగవులకై

పారెడు తమ భక్తుల ప్రోచుట కై

పలురాలను వెస  కరగిం చుటకై 

భళిరాగము తాళము శ్రోతల కై.(17)


@@@@@@


పంచమీ విభక్తి

చం.

దినములు రాత్రులీవలన తేపకు జన్మము కర్మ వల్ల నే

మునుకొని పుణ్య కార్యములు పూజలు సల్పుట మీదు వల్ల నే

మనసున దత్తదత్త యని మానక దల్చుట మీదు వల్ల నా

తనువుకు కీర్తినిచ్చి తగు ధర్మము  నుంచుట మీదువల్లనే.(18)


ఉ.

ఈఁవికి పేరు నీవలన యీమని జెప్పుట భావ్యమౌనె నా

మోవికి పేరు నీవలన మోహము వీడెడి బల్కు నీగదే

కావికి గుర్తు నీవలన కాంక్షలు దీరెడి‌ దారి జూపవే

జీవికి పేరు నావలన చింతలు దీర్పవె దత్త దేవరా.(19)



కళిక

హరిగతి రగడ 


జగతికి వెల్గులు నెవ్వాని వలన జయలక్ష్మి సుతుని చిరునగవు వలన

పగళులు రాత్రులు నెవ్వాని వలన జగతికి కన్గవ గురువరుని వలన

నింగిన తారలు నెవ్వాని వలన చెంగట చంద్రుడు నెవ్వాని వలన

సంగతి తెల్పెడి సద్గురుని వలన సత్యము తానౌ సద్గురుని వలన

కోర్కెలు తీరుట నెవ్వాని వలన కోరిక లుడిగిన  గురుడగుట  వలన

తర్కాల తొలగు టెవ్వాని వలన తప్పని తెలిపెడి  గురుడగుట వలన

భవరోగముడుగు టెవ్వానివలన భువిజనుల కెలమి సద్గురుని వలన

కవినగు టేనును నెవ్వాని వలన చవిజూపు గురుని సత్కరుణ వలన.(20)


ఉత్కళిక


పదవులు కలుగుట నెవ్వాని వలన పదముల నిచ్చిన సద్గురుని వలన

సదనము గలుగుట నెవ్వాని వలన జగమంత నెలవు సద్గురుని వలన

పుట్టుకలాగుట నెవ్వాని వలన గిట్టుటలాగుట నెవ్వాని వలన

పుట్టుక లెరుగని సద్గురుని వలన భువిజను లందరి సద్గురుని వలన.(21)


@@@@@


షష్టీ విభక్తి

ఉ.

చిత్తమునందు నిల్చుటకు చింతలు దీర్చుట కున్ పదమ్ములన్

మెత్తగ నొత్తి మ్రొక్కుటకు మేలునుపొందుట  కున్ సదా గురున్

బత్తిగ సేవచేయుటకు ప్రార్థన చేయుటకున్ చిదాత్మకున్

దత్తుని చెంత నిల్చుటకు దప్పక గొల్తును నాదు ముక్తికిన్.(22)


చం.

ధనమును కోరువారలకు తత్త్వము దెల్పెను చిత్త శాంతికై

మనసున స్పర్థవీడుటకు మాయ జయించెడి దారి జూపి యీ

తనువున నున్న జీవులకు తాలిమి నేర్పెను మూఢ చిత్తులౌ

జనులకు ధర్మ మార్గమును జ్ఞానము నీయవె దత్త దేవరా.(23)



కళిక

విజయభద్ర రగడ 


కటువైన దిటవైన యిడుములుడుగు టకు చిటికల్ల కవితల తెలిపెడు శ్రీ దత్త గురునకు

పటువైన  మాపాట్లు వడిగ తొలగుటకు లటపిట లేలని తెల్పెడు శ్రీ దత్త గురునకు

రాగాలు ద్వేషాలు రాపాట నాపుటకు రాగసాగరమున రహి శ్రీ దత్త గురునకు

భోగాలు మోహాలు పోగాలముడిగి భవ రోగాల కర్మముడుపు శ్రీ దత్తగురునకు.(24)


సంగీత సాహిత్య సౌశీల్యములకొరకు సరిలేని తులలేని శ్రీ దత్త పదములకు

రంగారు బంగారు చెంగావి పలుకులకు రాగాలు బల్కించు శ్రీ దత్త పదములకు


వందనము లన్నంత క్షేమంబు గలుగుటకు వందనా లందింతు శ్రీ దత్త పదములకు

అందాల మోమునకు ఆతెల్ల గడ్డముకు అందింతు వందనము శ్రీ దత్త పదములకు.(25)


ఉత్కళిక


పరిహాసమాడుచును ప్రవచనము సలుపుటకు సరిలేని వెలలేని సంకీర్త నమ్ములకు 

దరహాస వదనునకు దరిచేర్చు వరదునకు గురువులకు  సద్గురులు సచ్చిదా నందులకు

మంగళం మ్మందింతు మోహనా కారునకు 

మంగళంమ్మందింతు త్రైలోక్య గురువులకు

మంగళంమ్మందింతు దత్తపీఠమ్ములకు మంగళములు గణపతి సచ్చిదా నందులకు.(26)


@@@@


సప్తమీవిభక్తి.


చం.

పదములయందు చిహ్నములు పాదుక లందున మోక్ష మార్గముల్

పదములయందు కీర్తనలు పాటల కందని సూక్తి బోధనల్

పదములయందు పీఠములు భక్తుల యందున ప్రేమ భావనల్

పదమిడు దత్తదేవునకు ప్రార్థనలందున నాదు జోతలున్.(27)


ఈ జగమందు మీదయన ఋత్విజు లందరు పెంపు నొంద మీ

రే జగమంత నుండు నమలేశ్వరు లై మము గాచు చుండ మీ

రీ జనలోకమంతటను లీలలు జూపగ నుద్భవించ మీ

లో జగమంత నుండ భవరోగము బాపవె దత్తదేవరా.(28)



ఉత్కళిక

విజయమంగళ రగడ 


దొసగులన్ని తొలగిపోవు వెసులుబాటు లెవని యందు కసవునైన పరిహరించు దత్తగురుని కనులయందు

విసములన్ని తొలగిపోవు వెసులుబాటు లెవనియందు పశువులెల్ల శిశువులవ్వు పరమపూజ్య గురునియందు


విషయవాంచ లలముకున్న జనుల మారు టెవని యందు విషయమిద్ది యనుచుచేయు దత్తగురుని పలుకులందు

రసవిహీన జీవితమున రక్తిగలుగుటెవని యందు రహినిజూపు నామభజన సతము నేర్పు గురుని యందు


కౌతుకమున సంచరించు జనులుమారు టెవనియందు ఘాతకమగు పనులుజేయు జనులుమారు టెవనియందు

భౌతికమగు వాదనలను పరిహరించు గురునియందు పాతకులను సాత్వికులుగ వరలజేయు గురునియందు


పామరులకు పండితులకు పథముగల్గు టెవనియందు సోమరులకు దుర్జనులకు పథముగల్గు టెవనియందు

సామగాన లోలుడైన సద్గురుండు వానియందు సచిదనంద మందజేయు దత్తగురుని భజనలందు.(29)


ఉత్కళిక

తురగవల్గన రగడ  

ఊరువిడచి దారిమఱచి ఉదరపోష ణార్థమందు‌                         ఊరుగాని ఊరుచేర ఊరడిల్లు నెవరియందు‌                       దారితప్పి ధనముకొఱకు దాసులైన జనులయందు

దారిజూప దత్తుడంద్రు   పరమునిచ్చు పదము లందు.(30)


@@@@@


సంబోధన ప్రథమావిభక్తి

ఉ.

ఆగమశాస్త్ర హోమకలశాంబుధి ధీగుణ పండితోత్తమా

రాగవినోదివీవయ కళా రససాగర గానమూర్తివై

సాగిల మ్రొక్కులంది మనసారగ భక్తుల కోర్కెదీర్తువే

శ్రీ గురుదత్త దేవయన చింతలుదీర్చెడి వేద మూర్తివై.(31)


ఉ.

హే గురుదేవ దత్తవిభు హే కరుణావరణాలవాల నీ

వాగమ శాస్త్రపండితుల కందనివాడవు మాయరూప యే

రాగము లేనివాడ వనురాగము ద్వేషము మమ్ము వీడగన్

మా గత జన్మ సంచయము మాయము జేయగ నిన్ను వేడెదన్.(32)



కళిక

మధురగతి రగడ 

కలిమల హరుడా కలియుగవరదా కలవని నమ్మిన గాచెడి వరదా తలపులయందున తనరెడు వానివి తలచిన గాచెడి దత్తుడవైతివి తనయుడ వైతివి తండ్రికి గురువా మునివర ఋషివర పూజిత గురువా ధరణిన వెలసిన దత్తుడ వైతివి కరుణను జనులను గాచెడి వానివి.(33)


ఉత్కళిక


సాధన నేర్పిన చల్లని గురువా

బోధలు చేసిన పూజ్యుని మరువా

త్రాతవు నీవే తండ్రివి నీవే

దాతవు నీవే దత్తుడవీవే.(34)


@@@@


సర్వవిభక్తి వృత్తము

శా

దత్తాత్రేయుడ వీవు నిన్ను మదిలో తాదాత్మ్యతన్ దల్తునే

దత్తాత్రేయుని చేత నాగురుతు కై దండం బులందిం తునే

దత్తాత్రేయుని కంటెవే రెవరునా దాహర్తి నిన్ దీర్తు రా

దత్తాత్రేయుని యందు నెమ్మదిన పాదాక్రాంతునై నిల్చెదన్.(35)


ఉ.

దత్తుడు లోక రక్షకుడు దత్తుని పాదము లంటి నిల్చెదన్

దత్తుని చేత చేతనము దక్కగ దత్తునికై భజింతు నీ

దత్తుని కన్న వేరొకని దల్వను లోపల వెల్పలందు నీ

దత్తుని యందుడిందు పరదైవము నామది నిండి యుండగన్.(36)



@@@@



కవినామాంకిత వృత్తము.

శా.

దత్తాత్రేయుని భక్తితో కొలిచి చిత్తాబ్జంబు నర్పింప నీ

తొత్తున్ శ్రీ మదనంత ఛందమున శ్రీ తోపెల్ల శిష్యుండ సా

క్షాత్తీ శ్రీ శివరామకృష్ణుడను నే కౌండిన్య గోత్రీకుడన్

బత్తిన్ జాటెడు కావ్యమల్లితిని సద్భావంబు పెంపొందగన్.(37)



స్వస్తి.





No comments:

Post a Comment