తిరుమలేశా శతకము.
1
శ్రీ నివాసయని బిలువ సిరుల నిచ్చి
వేదనలు తీర్తువట స్వామి వేంక టేశ
ఏడు కొండల స్వామినా యేడుగడవె
తిమిర సంహార కావర తిరుమలేశ.
2
(తి)రు గిరులవెలసితివయ్య తిరము గాను
(రు)ద్రుడవు నీవెయని గొల్తురు నిజ మౌనె!
(మ)రి మరి తలతురు జనులు మహిమ జూప,
(ల)క్ష్మణాగ్రజ కావర లక్ష్మి నాథ.
3
(తి)రుపతి వనగ కష్టముల్ తీర్తు వయ్య
(రు)చికరమగు నీ నామమె రూక మాకు,
(ప)రము పురుష దయను జూపు పద్మ నాభ
(తి)రుపతి శరణు గోరుదు దీన బంధు.
(మొదటి అక్షరాలను చదివితే తిరుమల తిరుపతి అని వోచ్చేలా )
4
అభయ హస్తముతో దీర్చు నాపదలను
కోరి మ్రోక్కిన వారికి కొంగు పసిడి
కలియుగ వరదా వేగమె కావ రార,
తిమిర సంహార కావర తిరుమలేశ.
5
ఏడు కొండల నేనింక నెక్క లేను
అడుగడుగు దండములవెట్టి యలసి పోతి
పాప నాశము జేయనీ పాలబడితి
తిమిర సంహార కావర తిరుమలేశ.
6
అమ్మ వైనను నీవె నా యప్ప నీవె,
గురువు వైనను నీవె నా గురుతు నీవె
దైవ మన్నను నీవె నా దేవ దేవ
తిమిర సంహార కావర తిరుమలేశ.
7
క్రొత్త దంపతు లొత్తురు కోరి కోరి
కొంగు ముడివేసి కుందురు కోర్కె దీర్చ
కొంగు బంగారమా యని కొలతు రయ్య
తిమిర సంహార కావర తిరుమలేశ.
8
బిడ్డ నడిగిన వారికి బిడ్డ నిచ్చి
యండ గోరిన వారికి యండ నిచ్చి
ఆపదలదీర్తువయ్య నీ వ భయ మిచ్చి
తిమిర సంహార కావర తిరుమలేశ.
9
మెట్టు మెట్టుకు బొట్టును మెత్తి మెత్తి
అడుగడుగులు తడబడ నెక్కియలసి సొలసి,
కోరి గోవింద యందురు కొండ నెక్క
తిమిర సంహార కావర తిరుమలేశ.
10
ఎవరి నేరీతి గాతువో యెవరి కెరుక
యెవరి భాగ్య మెట్లు గలదొ యెవరి కెరుక
యే మని పొగడుదును స్వామి యేమి మహిమ!
తిమిర సంహార కావర తిరుమలేశ.!!
11
నరుని రూపమున పుడమిఁ నడుగిడితివి
పుడమి పట్టిని చేబట్టి పూజలంది
నరుల కెరుకబరచితివి నడవడికను
తిమిర సంహార కావర తిరుమలేశ.
12
రాముడందురు కొందరు రాజిలమది
కృష్ణుడందరు కొందరి తృష్ణ దీర
బాలవందురు కొందరు బాగు బాగు
తిమిర సంహార కావర తిరుమలేశ.
14
కారు లెక్కివచ్చెదరటా గాచెదవని
బస్సు లెక్కివత్తురటనీ పాలబడగ
నడచి వత్తురు నినుజూడ నరహరివని
తిమిర సంహార కావర తిరుమలేశ.
14
కరిని గాచితివటయా మకరిని ద్రుంచి
గిరిని దాల్చియమృతమిచ్చు హరివి నీవు
మరిమరి దలతు నిన్నునే మదన జనక
తిమిర సంహార కావర తిరుమలేశ.
15
చేపరూపము దాలిచి చేవజూపి
సోమకాసురుని దునిమి చోక్ష ముగను
వేదముల గాచితివటగా వేద పురుష
తిమిర సంహార కావర తిరుమలేశ.
16
మంధర గిరిని దాల్చిన మాధవుండ
పాల సంద్రము జిలుకగ పాటువడియు
సురల కమృతము బంచెనే చోద్యమవగ
తిమిర సంహార కావర తిరుమలేశ.
17
అవని తలమును గావగ యాదిపురుష
ఆఖనిఖపు రూపమునెత్తి యాటగాను
నలహిరణ్యాక్షు ద్రుంచెను హేలగాను
తిమిర సంహార కావర తిరుమలేశ.
18
అల నృసింహరూపము దాల్చి యాహిరణ్య
కశిపు ద్రుంచిన శ్రీ హరి కమల నయన
భక్త ప్రహ్లాదుఁనున్ బ్రోచు వరదుడవట
తిమిర సంహార కావర తిరుమలేశ.
19
మూడడుగులనేలనడిగి మూడు లోక
ములను జుట్టబెట్టినయట్టి పుణ్యపురుష
బలిమదమణతివట నీవు వామనడవ!
తిమిర సంహార కావర తిరుమలేశ.
20
పరశువును దాల్చి దుష్టుల పరగ ద్రుంచి
పరశు రాముడ వైతివి పద్మనాభ
నీ మహిమలనెంచగ స్వామి నేను జాల,
తిమిర సంహార కావర తిరుమలేశ.
21
రావణుని తుదముట్టించ రామ చంద్ర
నరుని రూపము దాలిచి నరుల బ్రోవ
నవని దిగివచ్చితివి స్వామి యాదిపురుష,
తిమిర సంహార కావర తిరుమలేశ.
22
అవని భారము తగ్గించ నాది పురుష
కృష్ణుడై వచ్చె, భక్తుల తృష్ణ దీర్చె,
జగతికి గురువందురు మిము చక్రపాణి
తిమిర సంహార కావర తిరుమలేశ.
23
హలము చేబట్టి నిల్చిన యాది శేష
ఆత్మ రూపున కన్నవై యంటివయ్య
బలపరాక్రమ విక్రమ పాహి పాహి
తిమిర సంహార కావర తిరుమలేశ.
24
శ్రీ పతులఁ, బీదలను గాచు శ్రీ నివాస
చింతలను దీర్చు శ్రీ హరి చిద్విలాస
పాహియందును ప్రోవగ పద్మనాభ
తిమిర సంహార కావర తిరుమలేశ.
25
పాలు త్రావెడి నెపమున బాల కృష్ణ
పూతనను పరిమార్చిన పురుష వరుడ
నీదు లీలలు నెంచనే నెంత వాడ,
తిమిర సంహార కావర తిరుమలేశ.
26
దినదినము గండములు దాటి దివ్య పురుష
ధర్మ స్థాపన చేసిన దానవారి
నీదు మహిమల నెంచనే నెంతవాడ
తిమిర సంహార కావర తిరుమలేశ.
27
చావు పుటుకలు లేనట్టి చక్రధారి
కటకటాల వెనుక బుట్టె కైటభారి
యబ్బురము గాదె నీలీల లబ్ది శయన,
తిమిర సంహార కావర తిరుమలేశ.
29
గోప బాలుర తోగూడి గొల్ల జేసి
వెన్న దొంగిలించినవాడ వేద వేద్య
కన్నె వలువలు నీకేల కంబు పాణి,
తిమిర సంహార కావర తిరుమలేశ.
29
అణు వణువున గలవనందు రన్నిదిశల
గలవనందు రందరిలోన గలవనందు
రదియిది యనియే మంతటన్ గలవనందు
రగుపడ వదేమి చిత్రమో యాత్మ రూప,
తిమిర సంహార కావర తిరుమలేశ.
30
వలువ లెత్తుక బోయిన, వలువ కృష్ణ;
కునిడి మానముల్ గాచిన గోప బాల
నీకె చెల్లును గోవింద నిగమ వంద్య
తిమిర సంహార కావర తిరుమలేశ.
31
జగము నంతట నిండిన చక్రధారి
కారయింటిన బుట్టగ కారణంబు
తెలియ లేదయ్య మాస్వామి తీర్థకరుడ
తిమిర సంహార కావర తిరుమలేశ.
32
యమ నియమముల బాటించి నహరహమును
మిము దలచెడివారలకైన, మిగుల భక్తి
తత్పరుల కైన నీ మాయ దాట తరమె!
తిమిర సంహార కావర తిరుమలేశ.
33
నిఖిల లోకాత్మకుడవంద్రు నిన్ను నెఱుగు
మునులు ఋషులు, నేనధముడ పుణ్య పురుష,
నీదు మాయ గెల్వతరమె నిగమ వంద్య
తిమిర సంహార కావర తిరుమలేశ.
34
తేట తెలుగులో పద్యముల్ తేనె రుచుల
తేట గీతిని నీరూపు తెలియ జేయ
తెలివి నిమ్మని కోరితి దేవ దేవ
తిమిర సంహార కావర తిరుమలేశ.
35
దేవతలు మును లైనను తెలియ నట్టి
నీదు మాయను తెలుపగ నేను చాల!
వేయి మాటలు చాలవు వేద వేద్య
తిమిర సంహార కావర తిరుమలేశ
36
ఆ యగస్త్యుని క్రోధము నణచి వేసి
అంబరీషుని గాచిన యాత్మ రూప
నాద కొనరావె మమ్మును నాది దేవ
తిమిర సంహార కావర తిరుమలేశ.
37
పాల సంద్రము నీది నీ పాల బడితి
సిరుల నిమ్మని యడుగను శ్రీని వాస
లచ్చి తోడుగ రావయ్య లక్ష్మి నాధ
తిమిర సంహార కావర తిరుమలేశ.
38
సిరుల సింహాద్రి యప్పన్న చిద్వి లాస
పాహి యన్నను గాచెడి పరమ పురుష
కలియుగ నఘము దప్పింపు కంబుపాణి
తిమిర సంహార కావర తిరుమలేశ.
39
ద్వారకా పురి వాసుడ దానవారి
యర్జున రధసారథి పాహి యాత్మ రూప
నాదు జీవిత సారథి నయము నిమ్ము
తిమిర సంహార కావర తిరుమలేశ.
40
పాము తేళ్ళను జూడగ బ్రహ్మము గన
నీగ దోమల యందున నీశును గన
సగటు మనిషిని నాకెట్లు సాధ్య పడును
తిమిర సంహార కావర తిరుమలేశ.
41
నీ వలననె జగము పుట్టు, నిన్నె పొందు
నీవలననె జగము నిల్చు నిజము కృష్ణ
నంద నంద నిను తెలుప నాకు వశమె!
తిమిర సంహార కావర తిరుమలేశ.
42
ఆప ధ్బాంధవ గోవింద యనుచు నార్తి
తోడ బిల్వ నాపదలను తొలగ జేసి
ఆదుకునెదవు, శరణందు నక్షధరుడ
తిమిర సంహార కావర తిరుమలేశ.
43
శ్రీ హరి గుణగానము సేయ శ్రీ కరమట,
చింతలను దీర్ప తలతును శ్రీ హరియని,
సతము నామది నిలువవె చక్రపాణి
తిమిర సంహార కావర తిరుమలేశ.
44
కమల నయనుడ శ్రీ హరి గరుడ గమన,
కలియుగ వరద శ్రీ పతి కావ రావె
కనుల విందుగ కనవడు కంబుపాణి
తిమిర సంహార కావర తిరుమలేశ.
45
పాల కడలి శయన విష్ణు పాహి పాహి
పీత వస్త్ర ధారుడ యని పిలుతు నిన్ను
నీలమేఘ శ్యాముడ కృష్ణ నీకు జయము
తిమిర సంహార కావర తిరుమలేశ.
46
అన్ని ధర్మముల నొదలి యార్తి తోడ
నిన్ను శరణన్న వారిని నీవె బ్రోచి
యోగ క్షేమముల్ జూచెడి యోగి వంద్య
తిమిర సంహార కావర తిరుమలేశ.
47
ఎన్ని జన్మము లెత్తిన నేమి ఫలము
చావు పుటకల మధ్యన చాల తిరిగి
విసిగి వేసారి నానయ్య వేంకటేశ
తిమిర సంహార కావర తిరుమలేశ.
48
ఆలు బిడ్డలటంచునే నలమటించి
అప్పు సొప్పుల జేసినే నాద మరచి
అప్పడగు నిను మరచితి నప్పుడపుడు
తిమిర సంహార కావర తిరుమలేశ.
49
అంది నట్టులుందువు గాని యాది పురుష
నిన్ను పొందెడి భాగ్యము నిజము గాగ
నిన్ను పొగడెడి పద్యము నిమ్ము నాకు
తిమిర సంహార కావర తిరుమలేశ.
50
కలిమి లేముల యందు మా కష్టమందు
పగలు రాత్రుల యందునో పద్మనాభ
తలవ నిమ్మయ్య మాస్వామి కలల నైన
తిమిర సంహార కావర తిరుమలేశ.
51
గుడులు గోపురములటంచు కోరి తిరిగి
వెదకి వెదకి వేసారితి వేద వేద్య,
గుండెలోనిను మరచితి గురుతు లేక
తిమిర సంహార కావర తిరుమలేశ.
52
వేదములె నిను దెలుపగ వెతలు వడగ
నిను బొగడగ యత్నించితి నిష్పలముగ,
నా మొరల నాలకించుము నన్ను బ్రోచి
తిమిర సంహార కావర తిరుమలేశ.
53
చక్ర హస్తుని తలచిన సతము శుభము
శంఖ హస్తుని గుణములు సన్నుతింప
షడ్వికారములు తొలగు సత్య మిదియె
తిమిర సంహార కావర తిరుమలేశ.
54
భక్త జనరక్ష గోవింద పాహి పాహి
సాధు జనరక్ష గోవింద చక్రధారి
దీన జనరక్ష గోవింద దేవ దేవ
తిమిర సంహార కావర తిరుమలేశ.
55
కేశవా యందు నిత్యము కేలు మోడ్చి
మాధవా యందు నిత్యము మదిని నిలిపి,
ఎంత బిలచిన కనపడ వెంత మాయ
తిమిర సంహార కావర తిరుమలేశ.
56
ఎన్ని జన్మల కర్మమో యెవరి కెరుక
నెపుడు యంతమీ నాటక మెవరెరుగుదు
రెన్నడునిను మరువకుండ నేను మనగ
తిమిర సంహార కావర తిరుమలేశ.
57
నాది నాదియటందునే నాది యేది
నీవె జగతికాధారమై నిలచియుండ
నిన్ను మరచితి శ్రీ హరి నిజము తెలిసె
తిమిర సంహార కావర తిరుమలేశ.
58
కాలు సేతులు చెవులును కాను నేను
కన్ను ముక్కులింద్రియములు కాను నేను
నేను నీవని విన్నది నేను కానొ!
తిమిర సంహార కావర తిరుమలేశ.
59
విశ్వ మంతయు నీవట విష్ణుమూర్తి
నాదు చిన్ని గుండె గుహలో నాటుకొనిన
నిన్ను గుర్తించు యెఱుకను నిత్య ముమ్ము
తిమిర సంహార కావర తిరుమలేశ.
60
బ్రహ్మ మనె మిము కొందరు బాగు బాగు
విష్ణువందురు కొందరు వేద వేద్య
బాల వందరు కొందరు భావమలర,
తిమిర సంహార కావర తిరుమలేశ.
62
పశువు వంటివాడిని నేను పశపతీశ
పతిత పావన హరి నేను పతన మైతి,
పదము లంటితి బ్రోవరా పరమ పురుష
తిమిర సంహార కావర తిరుమలేశ.
63
వెన్న, వలువలు నీకేల వెన్నదొంగ
దొంగ లందున పేరున్న దొంగ వీవు
నామనసు దోచి జూపవె నన్ను బ్రోవ
తిమిర సంహార కావర తిరుమలేశ.
64
దీన బంధుడ వందురు దేవ దేవ
తప్పులెన్నెద వేమయ్య తనయుడ నుగ
కొలది దయజూప నీకేమి కొదువగాదు
తిమిర సంహార కావర తిరుమలేశ.
65
పట్టు దప్పెకాల్జేతులు పద్మ నాభ
దేహ మొణకగ సాగెను దీన బంధు
కొండ నేనెక్కి రాలేను కూర్మనాథ
తిమిర సంహార కావర తిరుమలేశ.
66
పుట్టినందుకు గల్గెను భువనఘోష
చచ్చిన పిదప తెలియునో శాంతియనగ?
నట్ట నడిమిన నరఘోష నాకు మిగిలె
తిమిర సంహార కావర తిరుమలేశ.
67
కోట్ల సుఖములు జగతిన కుమ్మరించి
ముక్కు మూసి కూర్చొనమనె పుణ్య మబ్బ
యింద్రి యములెటులూర్కొను నేమొ స్వామి
తిమిర సంహార కావర తిరుమలేశ.
68
పాలకడలిపై శేషతల్పమున నిదుర
పాదముల కడ మాతల్లి పద్మ నయన,
భక్తుమందారుడవనినీ పాలబడితి,
తిమిర సంహార కావర తిరుమలేశ.
69
అన్నమయ్యను కానునే నాదిపురుష
వేల కీర్తనలు రచించ వేద వేద్య
చిన్ని పద్యముల్ గైకొను చిద్విలాస
తిమిర సంహార కావర తిరుమలేశ.
70
భారమాయె సంసారము బాపుమయ్య
మనసు పాపపంకిల మాయె మమ్ము బ్రోచి
దారిజూపుమ శ్రీ హరి ధైర్య మిచ్చి
తిమిర సంహార కావర తిరుమలేశ.
71
ఘడియ ఘడియకు పిలచెద గరుడ గమన
వడివడిగ కొండనెక్క నా వల్ల కాదు
అడగడుగున నా దండము నందుకొనవె
తడవ తడవకు నిన్నునే తలతు నయ్య
కడవరకు నాకు తోడుండు కమల నయన
తిమిర సంహార కావర తిరుమలేశ.
72
నేను చేసిన తప్పులు నీకె తెలుసు
పతిత పావనుడవని నీ పాలబడితి
పాపపుణ్యము లెంచకు పద్మనాభ
తిమిర సంహార కావర తిరుమలేశ.
73
ఎన్ని జన్మము లెత్తితి నెవరి కెఱుక
ఏల పుట్టితి మనిషిగ నేరి కెఱుక
చావు పుటకల మర్మపు జాడ లేదు
తిమిర సంహార కావర తిరుమలేశ.
74
అల్పుడనునే ననంతుడ వచ్యుతుడవు,
నిన్నెటుల నెఱుంగుదునయ్య నిగమవంద్య,
దయను నిన్నెఱిగింపవె దానవారి
తిమిర సంహార కావర తిరుమలేశ.
75
పెద్దలంత దర్శింతురు పెందళకడ
పేదవారికెపుడు స్వామి పెద్ద పీట
పేద ప్రజల మొఱ వినవె పేర్మి మీర
తిమిర సంహార కావర తిరుమలేశ.
76
నరుల పధ్ధతి నేకేల నచ్చలేదొ
యేడు కొండల పైకేల యెక్కినావొ
ఎచట నున్నను నినువీడ మెన్నటికిని
తిమిర సంహార కావర తిరుమలేశ.
77
లోన హరి గలడని దెల్వ లోకమంత
వెలుగు నిండు, లోకమునంత వెలుగు నిచ్చు
వాడె విష్ణువనెడి సత్య భావ మీవె
తిమిర సంహార కావర తిరుమలేశ.
78
పద్య నైవేద్య మిడుదును పద్మనాభ
పద్య శతములు వ్రాయగ వరమడిగితి
పద్యమిచ్చిన చాలును పరమ పురుష
తిమిర సంహార కావర తిరుమలేశ.
79
పద్యము చదువ నీమది హృద్య మవగ
పద్య సేద్యము సేదును పద్మ పాణి
విద్యలన్నియు నీవెగ వేద వేద్య
తిమిర సంహార కావర తిరుమలేశ.
80
ప్రాణమెప్పుడు బోవునో రామచంద్ర
పాహి యనియందు నిప్పుడె పరమ పురుష
పాహి పురుషోత్తమా యందు
తిమిర సంహార కావర తిరుమలేశ.
81
పద్య మల్లెద చక్కగ పద్మపాణి
ఫలము లిమ్మని వేడెద పద్మనాభ
బలము నీవయె మాకింక బలుమి లేదు
తిమిర సంహార కావర తిరుమలేశ.
82
రామ నామమె నాకెంతొ రమ్యమాయె
రామ పాదమె నాకిక రాజ్యమాయె
రామ నామగానమె నాకు రక్షణాయె
తిమిర సంహార కావర తిరుమలేశ.
83
అమ్మ వనికొలుతురు మిము నాత్మ రూప
అప్పడని పిలతురు మిము నంతలోనె
అన్న వెంకన్న వందురానందమొంది
యెట్లు బిలచిన పలికెద వట్లు నీవు,
తిమిర సంహార కావర తిరుమలేశ.
84
జిహ్వ చాపల్యమును వీడు చింతలేక
బ్రతికితిని స్వామి నీమీద భక్తి గలదు
నన్ను రక్షింపవోతండ్రి నరుని గాన
తిమిర సంహార కావర తిరుమలేశ.
85
తృష్ణ దీర్పగ రావయ్య కృష్ణ మూర్తి
చింత దీర్పగ రావయ్య చిద్విలాస
కరుణ జూపింప నీకింక తరుణ
తిమిర సంహార కావర తిరుమలేశ.
86
నందనందన యెందెందు కందు నిన్ను
కందువుగకాన రావయ్య కమల నయన
విందు నా చెవుల కనుల విందు వీవె
తిమిర సంహార కావర తిరుమలేశ.
87
జ్ఞాన మడుగుట మరచితి జ్ఞాన లేమి
నర్థ మడిగితి బ్రతుకంత వ్యర్థమాయె
నిన్ను దెలియకోర్కెగలిగె నేడు
తిమిర సంహార కావర తిరుమలేశ.
88
నీదు సుందర రూపమ్ము నేను జూడ
నిచ్చ గలిగెను నాస్వామి యిందిరేశ
కనుల విందుగ కనవడు కమల నయన
తిమిర సంహార కావర తిరుమలేశ.
89
సుందరమగు నీరూపము సుంతజూడ
మనసు గల్గెను నాస్వామి మాయలేల
ఇన్ని అవతారముల లోన యిందిరేశ
చిన్ని కృష్ణుని రూపమ్మె చింతదీర్పు
తిమిర సంహార కావర తిరుమలేశ.
90
భక్త వత్సలుడవని నీ పాలబడితి
తప్పుచేసిన ననువీడ తగదు నీకు
చెడ్డ వాడైనను తమకు
తిమిర సంహార కావర తిరుమలేశ.
91
కఠిన శిలవైతివాయేమి కమల నయన
సిరిని యిమ్మని యడుగను చింత వలదు
కనబడ మని యడిగితి నా కన్నులార
తిమిర సంహార కావర తిరుమలేశ.
92
నన్నయాదులు పూర్వము నడచినట్టి
పద్య సుమముల మార్గము బట్టి నేను
నిన్ను చేరగ తలచితి చిన్ని కృష్ణ
తిమిర సంహార కావర తిరుమలేశ.
93
దాతలందున నీవంటి దాతలేడు
యాచకులయందు నేనొక్క
నన్ను గావ వచ్చెదవని నాకు తెలుసు
తిమిర సంహార కావర తిరుమలేశ.
94
సాటి వారి కష్టములను చాల జూచి
సాయమందించ లేదని సాకు జూప
తగదు, సగటు మనిషిని నా తప్పు దెలిసె
తిమిర సంహార కావర తిరుమలేశ.
95
నాద రూపుడ వందరు నరహిరి మిము
వేద రూపుడ వందురు వేదవిదులు
భక్తి లేక వశమె మిము పట్టుకొనగ
తిమిర సంహార కావర తిరుమలేశ.
96
బ్రహ్మ కైనను నీ మాయ పట్టువడదు
గోపబాలుర దాచెను గోప్యముగను
సగటు మనిషిని నావల్ల సాధ్యమగునె
తిమిర సంహార కావర తిరుమలేశ.
97
చిక్కి సంసార మందున చింత వడితి
జగతి నిజమని తలచితి జలజ నాభ
కరిని బ్రోచిన దేవర కావరావె
తిమిర సంహార కావర తిరుమలేశ.
98
నందగోపుడ కానయ్య నాన్న నవగ
తల్లి యాయశోదను కాను తనివిదీర
ముద్దు ముచ్చట తీరదు ముద్దుకృష్ణ
తిమిర సంహార కావర తిరుమలేశ.
99
పాలుమీగడ లందింతు పద్మ నయన
పట్టుబట్టల నిచ్చెద పద్మపాణి
పట్టుబట్టక కనవడు పరమ పురుష
తిమిర సంహార కావర తిరుమలేశ.
100
బ్రహ్మ దిక్పాలకులకైన బలిమి నీవె
కలడు కలడను వారికి కలిమి నీవె
లేవు లేవన్న వారికిన్ లావునీవె
తిమిర సంహార కావర తిరుమలేశ.
101
పద్యమల్లగ నేర్పెను బాలుడొకడు
వంద పద్యము లల్లితి వందనమని
శతక మర్పణ జేయుదు సాగిలవడి
జయము తోబాసు గురువర జయము మీకు
తిమిర సంహార కావర తిరుమలేశ.
102
రూపమన్నది లేదటరూపివీవు
అన్ని రూపుల నీవెగ యాత్మ పురుష
ఎంత దలచిన వారల కంత నీవు
తిమిర సంహార కావర తిరుమలేశ.
103
అహము గెల్వగ మరచితి ఆగమైతి
ఇహము పరముల మరచితి నింతదనుక
సోహ మనుమాట తెలియగ సోహ మంటి
తిమిర సంహార కావర తిరుమలేశ.
104
మాయలందున మనసను మాయవేరు
పట్టి విడచును నామము పట్టులేక
పట్టి నన్ను విడువ నీకు పాడి కాదు
తిమిర సంహార కావర తిరుమలేశ.
105
బాల ధృవుని భక్తికి చాల పరవశించి
ధృవ పథము చేర్చితివట నీ కృపను జూపి
నీదు పదములె కోరితి నిన్ను జేర
తిమిర సంహార కావర తిరుమలేశ.
106
చల్ల వైనట్టి చూడ్కుల నల్లనయ్య
వేణుగోపాల రావయ్య వెన్నదొంగ
శరణు శిఖిపించ మౌళిరో శరణు శరణు
తిమిర సంహార కావర తిరుమలేశ.
107
రేపుమాపని చింతలు రేగుచుండె
నేడె తలతును మనసార నిన్నునేను
చెంత నులువవె శ్రీ హరి చివరి దాక
తిమిర సంహార కావర తిరుమలేశ.
108
కలియుగమిది నీనానమె కలిమినిచ్చు
బలము లేనివారికి నీవె బలిమి దేవ
కష్టములదీర్ప నిల్చిన కరుణ నీది
తిమిర సంహార కావర తిరుమలేశ.
109
బ్రతికి నంతవరకె తన భార్య యుండు
చచ్చిపోయిన తరువాత శవమనంద్రు
నేడె తలతును నిన్నిక నిగమ
తిమిర సంహార కావర తిరుమలేశ.
110
నిద్రయందు నాయూపిరి నీవె యనగ
మెలకువందు మరపు వచ్చె మేథలేక
తెలుసు కొననాకు నీమాయ తెలివినిమ్ము
తిమిర సంహార కావర తిరుమలేశ.
