Saturday, June 25, 2022

లంకా శతకము

 కలియుగమ్మిది కష్టము లెన్నో

కలిమి లేములు కాఁకలు రేఁచున్

కలుష మైనది కాలము నాన్నా

కలడు నీకడ కన్నయ లంకా.1


విషయ వాంఛల వేదనలా! స

ద్విషయ వాంఛలు దివ్యముకాదా

విషము బెంచును ప్రేమము గాదా

విషయ మిద్దియె వింతగ లంకా.2


తిరుమలేశుని తీరుగ గోవిం

ద రవి వంశజ తప్పదు రక్షిం

చర మహా పురుషా యని వేడన్

పరము దక్కును పాడవె లంకా.3


జనక జాపతి జానకి రామా

మనసు నిల్పుట మాయర రామా

యనుచు బల్కిన నార్తిగ రామా

వినగ తీరును వేదన లంకా.4


సకల మంత్రపు సారము నీవే

సకల వేదపు సారము నీవే

సకల శాస్త్రపు సారము రామా

నికరమైనది నీదనె లంకా.5


ఎవరి కెవ్వరు నీభువి లంకా

యెవరు సోదరు డెవ్వరు లంకా

చివరకేమని చెప్పకు లంకా

నివురు గప్పిన నిప్పుర లంకా.6


గురుని పాదము కోరుము లంకా

గురుని కోరిక కోరకు లంకా

గురుని బోధలు కూరిమి లంకా

గురుని దూషణ కూడదు లంకా.7


శివుని పాదము చింతలు దీర్చున్

భవుని పాదము పట్టర లంకా

శివుని నామము శ్రీ కర మౌగా

శివుని గానము చేయర లంకా.8



ఇడుము లన్నయు యింటికి వచ్చెన్

వడిగ చేసిన ప్రార్థన మేలౌ

విడక దల్చుము వేంకట నాథున్

పడకు, పట్టుము పాదము లంకా.9


కలత లన్నియు కాకలు రేఁచున్

విలయమా యను వేదన బెంచున్

తలను వంచకు తప్పది నాన్నా

కలడు రాముడు కాచును  లంకా.10



ఛలికి యెండకు చచ్చెద నంటే

కలియుగమ్మిది కష్టము లెన్నో

మలయమారుత మౌనని యంటూ

కలతలన్నియు గాంచర  లంకా.11


అవనిలోగల యాపద లన్నీ

కవుల కల్పన గాదుర నాన్నా

శివుని దల్చిన చింతలు వీడున్

ధవుని ప్రార్థన తప్పదు  లంకా.12


చవిటి నేలన సాగదు సేద్యం

బవిటి వానికి యప్పులు శూన్యం

బవని లోపల యాగదు యానం

బయిన సాగుము నాపక లంకా.13



హరుని దల్చిన హాయిర లంకా

హరిని గొల్చిన హ్లాదము లంకా

హరిహరాదులు నాకృతి జూడన్

స్మరణజేయుచు సాగర  లంకా.14


నిజము బల్కుట నిష్ఠుర మౌగా

నిజము గాల్చెడి నిప్పుర నాన్నా

నిజము దాచిన నిందలు రావా

నిజము జెప్పుట నేర్వర లంకా.15



దురముగా తిమి దూకుచు  లంకా

పురము జొచ్చిన మూర్తికి జేజే

గరిమ లంకను గాల్చిన వానిన్

త్వరగ పాదము బట్టర  లంకా.16



సతికి చెప్పకు సాకులు  లంకా

పతుల మాటలు భార్యలు వింటే

హతవిధీ యని యందురు నాన్నా

కతలు చెప్పకు కాంతకు లంకా.17


మనసు నిల్పుట మాయర  కన్నా

తనువు వీడుట తప్పదు నాన్నా

కనులు నిక్కము గాంచుట కల్లే

యినకులేశుని నెంచర లంకా.18



ఎదుటి వారిని  నెంచగ నేలా

ఒదిగి యుండుట యొద్దిక కాదా

వెదుకులాటలు వ్యర్థము నాన్నా

బదులు చెప్పకు భార్యకు లంకా.19



వయసు మీదకు వచ్చెను కానీ

హయములా మది యాగదు స్వామీ

భయము వీడక పట్టిన నేమౌ

నయము దత్తుని నమ్మర లంకా.20


వదిలి వెళ్ళెడి వారిని పోనీ

వదలకుండెడి వారని రానీ

కదలి పోవును కాలము నాన్నా

మదిని నిల్పుట మానకు లంకా.21



తలచు కొమ్మని దత్తుడు చెప్పెన్

కలత చెందెడి కారణమైనా

కలడు నీకడ కాదనకుండా

తలచుకొమ్మిక దత్తుని లంకా.22


అవసరమ్ములు నందల మెక్కెన్

జవసవమ్ములు జాలిగ జూచెన్

శివుని నామము చింతలు దీర్పున్

భవునిపాదము పట్టర లంకా.23



కడుపునింపదు కప్పుడు కాఫీ

కుడితిలా గొనకూడదు బాబూ

దడదడాయని దంచక ముందే

పడతి పాదము పట్టర లంకా.24



ఉదయ సంధ్యలు నూపిరి బీల్చున్

కదులుచున్నది కాలము గన్కన్

మదన గోపుని మందిర మైతే

మది మనోహర మౌనుర లంకా.25



విలువలన్నవి పేలిక లయ్యెన్

వలువలా యవి పల్చన యయ్యెన్

కలత చెందిన కాలము గానన్

తలచుకొమ్మిక దత్తుని లంకా.26



ఇడుములన్నియు నేకము లయ్యెన్

వడిగ వచ్చెను వాకిట నిల్చెన్

కడుపుచించిన కాళ్ళకు మేలా

విడక పట్టుము వెన్నుని లంకా.27




తనువు గల్గెను తప్పవు కష్టాల్,

మనసు ముంచును, మానక రామా

యనుట నేర్చిన హాసము తోడన్

వెనుక దీరును వేదన లంకా.28


పనికిమాలిన పాఠము లెన్నో

మునుపు నేర్చితి మోసము తోడై

వినకపోతివి పెద్దల మాటల్

విని తలంచుము వెన్నుని లంకా.29



మనసు జేయును మానక తప్పుల్

తనువు కించుక దండన గల్గున్

తనవు వీడక తప్పదు గన్కన్

వినతి జేయుము వెన్నుని లంకా.30




పురుటి నొప్పులు పోరొనరించెన్

చిరు కవిత్వము చిందులు వేసెన్

వరదుడాయని వందన మంటిన్

వరములిచ్చెను పద్యము లంకా.31



సుజనులుండరు చుట్టము లందున్

కుజనులుండరు కూరిమి జూపన్

ద్విజుడవైతివి దీనత లేకన్

కుజను మ్రొక్కిన కూరిమి లంకా.32



దడదడాయనె దంతము లన్నీ

గడగడాయని కాళ్ళును జారెన్

గడబిడైనది కాయము నాన్నా

దడుపు మంత్రము దత్తుడు లంకా.33



విషము మ్రింగిన బేలరి నైతిన్

విషయవాంఛలు వేదన బెంచెన్

చషకమేమని జాలిని జూపున్

విషధరా యను వెన్కను లంకా.34



నటనమాడితి నవ్వుల తోడన్

పొటమరించెను పోయెడి రోజుల్

కటకటా నను కాలుడు బిల్చున్

కిటిని దల్చిన క్షేమము లంకా.35



కటికచీకటి కాలము వచ్చున్

పటిమ జూపిన భద్రము గల్గున్

చిటికలో నిను జీవుడు వీడున్

కిటిని దల్చిన క్షేమము లంకా.36




మనసుజూపిన మార్గము చేతన్

తనువుకించుక దండన గల్గున్

కనులు జూచును కాంక్షలు రేఁచున్

కనికరించడు కాలుడు లంకా.37



సగము దేహము శక్తికి నిచ్చెన్

నిగమవంద్యుడు నిక్కము కాదా

నగజ వంద్యుని నమ్మిన చాలున్

దిగులు చెందకు దీనుడ లంకా.38



ఇచట చేసిన దెప్పటికైనన్

యచటి కొచ్చు ననందురు లంకా

శుచికి మూలము చూడర లంకా

ముచికలా తెగిపోమ్మిక లంకా.39



పడితి లేచితి వాదన లేలా

పడని వారికి బాధలు లేవా

పడుము దత్తుని పాదము పైనన్

వడిగచేయగ ప్రార్థన  లంకా.40



సిరిని కోరిన చిక్కులు గల్గున్

హరిని నమ్మిన యాపద తీరున్

దురితమాడకు దూరకు లంకా

దరికి చేర్చును దత్తుడు లంకా.41



అరువు దెచ్చిన యాపద గల్గున్

బరువు బాధ్యత భారము బెంచున్

తెరవు జూడక తిప్పలు గల్గున్

దరికి చేర్చును దత్తుడు లంకా.42



గరుడవాహన కావగ రారా

కరుణజూపగ కానగ రారా

శరణు గోరితి శౌరియనంగన్

దరికిచేర్చును దత్తుడు లంకా.43



వరదుడాయని ప్రార్థన చేయన్

హరిహరీయని హారతు లెత్తన్

హరహరాయన యాదర మొప్పన్

దరికి చేర్చును దత్తుడు లంకా.44



అరువుకోసర మర్రులు జాచన్

కరిగి పోవును కాలము లంకా

తరుణమైనది దండము బెట్టన్

దరికి చేర్చును దత్తుడె లంకా.45




హనుమ పాదము లార్తిని దీర్చున్

హనుమ నామము హాయిని గూర్చున్

హనుమ నీదయ యన్నను మేలౌ

హనుమ గానము నాపకు లంకా.46



కరిని ప్రోచిన కన్నయ రారా

గిరిని యెత్తిన కేలును నీరా

సిరికి నాథుని చేరువ యైనన్

పరమునిచ్చును ప్రార్థన లంకా.47



కుదురుకోనివి కోరికలెల్లన్

మదిని దొల్చును మానక లంకా

పదములంటుచు ప్రార్థన సేయన్

దదనమిచ్చును దత్తుడు లంకా.48



సుముఖుడా శివ సుందర పుత్రా

నమతులందును నారద వంద్యా

తిమిని దాటగ దీనుడనైతిన్

నుమసుతాయన నూతము లంకా.49




సతుల బిడ్డల సౌఖ్యము కోరన్

వెతలు గల్గును వేదన గల్గున్

గతిని మార్చ సకాలము నందున్

సతము దల్చుము శౌరిని లంకా.50



గతము దల్చిన కల్గెడి దేమో

వెతల గుర్తులు వేదన బెంచున్

మతిని ద్రుంచును మాయను బెంచున్

సతము దల్చుము శౌరిని లంకా.51




పడతి యొక్కతి బాధలు బెట్టున్

పడతి యొక్కతి పాఠము నేర్పున్

పడతి యొక్కతి భద్రము గూర్పున్

కడకుబట్టుము కాళ్ళను లంకా.52




గడచిపోయిన కాలము మేలా

విడచివేసిన వేదన మేలా

తుడిచివేసిన దుఃఖము మేలా

వడిగ సేయర ప్రార్థన లంకా.53




విషవిభూషణ వేగమె రారా

విషమలోచన వేద్యుడ రారా

ఋషిమనోహర యీశుడరారా

విషధరాయను వేగమె లంకా.54




వదిలిపెట్టెడి వన్నియు పట్టన్

వదలకుండగ పట్టును నిన్నే

మొదట దేహపు మోహము వీడన్

తుదకువీడును దుఃఖము లంకా.55



ధరలు మండెను ధైర్యము తగ్గెన్

ధరణి మండెను దైన్యము హెచ్చెన్

కరుణతగ్గెను కాంక్షలు రేఁగెన్

హరిని వేడర యార్తిగ లంకా.56




ముసలివాడను మోహము ముంచెన్

మొసలిలా నను పోరును సల్పెన్

విసుగుచెందితి వేదన బెంచెన్

శశిధరాయన శాంతము  లంకా.57



ఎఱుక లేదని నెన్నితి తప్పుల్

ఎఱుక గల్గియు నెన్నితి తప్పుల్

నెఱి నసత్యము నీడన నీల్గన్

మఱకలంటును మానర లంకా.58



భయము గల్గె నపాయము లంచున్

భయము తొల్గెను ప్రార్థన సేయన్

భయ విదూరుని పాదము లంటన్

భయము దీర్చు నుపాయము లంకా.59



పనికిమాలిన భావము లన్నీ

పనుచుచుంటిని పద్యము లంచున్

మనుచుకొమ్మిక మాధవ దేవా

యనుచు ప్రార్థన నాపకు లంకా.60



గిరిసుతాయని కేలను మోడ్చన్

గిరిసుతాయన క్షేమము గల్గున్

గిరిసుతాయన క్ష్వేళగలుండే

దరికిచేర్చును తప్పక లంకా.61



కరిగె బాల్యము కాలమునందున్

తరిగెనాయువు తంకనతోడన్

నరులు దత్తుని నామము బల్కన్

దరికిచేర్చును తప్పక లంకా.62



లలితనామము రక్షణ నిచ్చున్

లలిత గానము లచ్చిని గూర్పున్

లలితపాదము లౌల్యము దీర్చున్

లలితమౌనుర లక్ష్యము లంకా.63



అలలు చేసెడి యాలము పోలెన్

కలలు తీరవు కష్టము లుండున్

అలమటించక నాహరి గొల్వన్

కలి మలంబుల కాల్చును లంకా.64




కరకుమాటలు కక్షలు బెంచున్

దురుసు పల్కులు దూరము బెంచున్

హరిని జూడుమునందరి లోనన్

దరికిజేర్చును దత్తుడు లంకా.65



విరులు తెచ్చితి వేంకటనాథా

సరము గ్రుచ్చితి చక్కనితండ్రీ

కరము మోడ్చితి క్రన్నన బ్రోవన్

తిరు పతీయనె తీరుగ లంకా.66




మనుజు డొక్కడుమన్నన నేర్పున్

మనుజుడొక్కడు మౌఢ్యము నేర్పున్

మనుజుడొక్కడు మంచిని బెంచున్

మనుజులే పెను మాయర లంకా.67



చినుకునై భువి జేరితి గానీ

తిని పరుండితి తిప్పలు గల్గెన్

చినిగిపోయెను జీవిత మంతా

విని తలంచుము వెన్నుని‌లంకా.68



పలుకరించిన ప్రాణము నిచ్చున్

కలి మలంబుల కళ్ళెము వేయున్

బలిమినిచ్చును ప్రార్థన జేయన్

తలచుకొమ్మిక దత్తుని లంకా.69



సిగను గంగయు శీతకరుండున్

జగములేలెడి చక్కని తండ్రిన్

నిగమవంద్యుని నీలగళేశున్

పొగడి మ్రొక్కిన పుణ్యము లంకా.70



పొలముగట్టున పొన్నలు పూచెన్

పిలుపులంపగ వేణువు నూదెన్

చెలువరాయని చెంగట చేరన్

కిలకిలా నగు కృష్ణుడు లంకా.71


గురుని దల్చిన కూరిమి గల్గున్

గురుని పాదము కోరిక దీరున్

గురుని బోధలు గుర్తును పెంచున్

దరికి చేర్చును దత్తుడు లంకా.72



వసతి కోరితి బాధలు గల్గెన్

కసిగ దూకెను కష్టము లన్నీ

వ్యసనమైనవి బాధలు చూడన్

వసుమతీశుని పట్టర లంకా.73



తరము మారెను తప్పవు బాధల్

తరముకాదని  తప్పుకు పోవన్

చరణయుగ్మము చాలవు పట్టన్

హరిహరీయను నాపకలంకా.74



మలుపులుండును మార్గము నందున్

తలపులన్నియు దగ్ధము జేయన్

వలచి శ్రీ హరి పాదము బట్టన్

కలతదీర్చును కన్నయ లంకా.75




మలుపులుండును మానకు లంకా

చలనమాపకు సాగర లంకా

తలనువంచుట తప్పదు లంకా

తలచుకొమ్మిక దత్తుని లంకా.76



నరుని జన్మ సనాతనమైతే

నరుని కర్మ వినాశన మైతే

దొరలు జన్మ సుదుర్లభ మైతే

దరికి చేర్చును దత్తుడు  లంకా.77




భయము గల్గ నపాయము హెచ్చున్

భయ విరాముని బంటుని గొల్వన్

భయము లెల్ల నివారణ రామా

లయము నిచ్చును రక్షణ  లంకా.78



చిరిగిపోవును చెప్పులు లంకా

చెరిగిపోవును జీవితమంతా

పరుగులాపిన ప్రాణము పోదా

త్వరగ జేరుము దత్తుని లంకా.79



చదువుకొమ్ముర చక్కని తండ్రీ

చదువులేక విచారము గల్గున్

చదువులన్నియు సార్థకమైతే

వదలబోకుము ప్రార్థన లంకా.80



బడికివెళ్ళితి బాల్యము వీగెన్

గుడికి వెళ్ళితి కోపము హెచ్చెన్

చెడితి మిత్రుల స్నేహము చేతన్

వడిగ దత్తుని  పట్టెను లంకా.81



అమరులైనను నచ్చెరు వొందన్

అమిత సౌఖ్యము లచ్చట నుండెన్

చమట పట్టని చక్కని దేశం

బమెరికాయని యందులు లంకా.82




మధురమైనవి మామిడి పండ్లన్

మధుర మైనవి మానక తిన్నన్

వ్యధనుపెంచును వ్యాధికి తోడై

నిధన మార్గము నీదగు లంకా.83



తిథియు వారము తీరుగ మారెన్

వ్యధలు చూడగ వాసిగ హెచ్చెన్

పథము వీడిన పాంథుడ వైనన్

నిధనమార్గము నీదిర లంకా.84



దరికి వచ్చె సదాశివుడయ్యా

గురుతు పట్టను గోపతి నౌరా

నరుల యందుసనాతను డందున్

దరికి చేర్చును తప్పక లంకా.85




తమరు కాక సదాశివ నన్నీ

తమిని నెవ్వరు దాటగ జేయున్

కమలలోచన కావర యంచున్

విమల భక్తిని వేడర లంకా.86



వలువలిచ్చిన వానికి జేజే

వలువ దోచిన వానికి జేజే

తులువకంసుని ద్రుంచిన వానిన్

తలచుకొమ్మిక తప్పదు లంకా.87



కుడిచి పాలను కూరిమితోడన్

పడతి పూతన ప్రాణము గ్రోలెన్

చెడినమూకల చెండిన వాడౌ

గడుసు కృష్ణుని గాంచర లంకా.88



కుడిచిపాలను కుండల గొట్టెన్

దుడుకు కృష్ణుడు దుత్తల ద్రుంచెన్

పడగలెత్తిన పామును గొట్టెన్

గడుసు కృష్ణుని గాంచర లంకా.89




తనువు నీదన తంకము గల్గున్

తనుకులాడక తప్పదు నాన్నా

తనువునందున దత్తుని గాంచన్

మనసు నిల్పుట మానకు లంకా.90



ప్రజలనాడిని పట్టినవారే

ప్రజల వద్దకు పాలన తెచ్చెన్

ప్రజలపాలన పాట్లను పెంచెన్

నిజముబల్కుట నిప్పుర లంకా.91



ప్రజలచే పరిపాలన మేలా

ప్రజలకై పరిపాలన మేలా

ప్రజల ముంచిరి పాలకు లౌరా

నిజముబల్కుట నిప్పుర లంకా.92




ఉచితమన్నవి యుద్గత మయ్యెన్

నుచిత విద్యలు నూతము నిచ్చె

నుచిత వైద్యము నూపిరి తీసెన్

నుచితబోధన కౌనను లంకా.93



నిదురబుచ్చితి నిన్నటి రోజున్

నిదురలేచెను నేటి సమస్యల్

నిదురబోవుట నిత్యము కాదా

నిదురసౌఖ్యము నీయదు లంకా.94


పిలచు నెల్లరి పేర్మిని గానీ

పిలువనైతిని వేంకటనాథున్

నలిగిపోయెను నాలుక చాలా

తలచుకొమ్మిక దత్తుని లంకా.95



వలపులోపడి ప్రాయము నంతా

పిలువనైతిని వేంకటనాథున్

ఫలముదక్కదు బాధలు పెంచెన్

తలచుమిప్పుడు దత్తుని లంకా.96



ధనముపార్జన తప్పులు చేతన్

తనువునందున దాగిన వానిన్

కనకపోతి సకాలము నందున్

మనుజ జన్మము మాయరలంకా.97



మనల నెవ్వరు మాటన కుండన్

మనము నందరి మాటన విన్నన్

మనసునందున మానక దత్తా

యనుటనేర్వర యార్తిగ  లంకా.98



వినకపోతిని పెద్దల సుద్దుల్

వినక పోతిని వేదము‌ నైనన్

విని తరించగ వేంకట నాథా

యనుట మానకు నార్తిగ లంకా.99



మగువ కోరె సమానపు హక్కుల్

మగని వీపు విమానపు మోతల్

తగవులాడుట తప్పుర నాన్నా

జగతి చెప్పిన సత్యము లంకా.100



బడులలో పసివారిని గాంచన్

పడక వేసెను పాఠములన్నీ

చెడు ప్రవర్తన చేటును బెంచెన్

వడలిపోయెను బాల్యము లంకా.101



పనికివచ్చెడి వన్నియు దాచెయ్

పనికిరానివి పక్కకు బెట్టెయ్

యనుచు దల్చితి‌ నప్పటి దాకా

పనికిరావని భార్యనె లంకా.102



చదవకూడదు జాతకమంతా

బ్రదుకుచుండిన బాధలు రావా

విధిని నమ్ముము వేదన తగ్గున్

మదిని ప్రార్థన మానకులంకా.103




పడుట మాననివాడను నేనే

పడిన లేచినవాడను నేనే

పడుట నేర్పెను పాదము లంటన్

వడిగ దత్తుని పట్టర లంకా.104



చితిని చక్కగ చేరక మున్నే

వెతికి పట్టుము వెన్నుని‌లంకా

చితికిపోయెను జీవితమంతా

సతము దల్చుము శౌరిని లంకా.105



పతితపావన పాదము, సీతా

పతిని నమ్నుచు సాగెను లంకా

పతిని గూల్చిన పాదము నీవే

పతియటంచును పాడర లంకా.106



పరమ నల్లని వాడవు గానీ

పరగ చల్లని వాడవు కృష్ణా

కురియు పిల్లన గ్రోవిని రాగా

లరయ దీర్చును నార్తిని లంకా.107




అగరుగంధము హారతులెత్తన్

నగజ తల్లిని నాంత్రము సేయన్

చిగురుబోఁడికి చేలము లెత్తన్

పగతులార్గురు పారరె లంకా.108.



వడుగుబాపని వైతివి గానీ

యడుగు బెట్టితివాపదలే మూ

డడుగులిమ్మని ముంచెడి వానిన్

వడిగ పాదము పట్టర లంకా.109




పిలచిబెట్టిరి పెద్దలు నాడే

చలిది వణ్ణము చాలనకుండా

నలుగు బెట్టిన స్నానము కూడా

బలిమిపెంచెను బాగుగ లంకా.110



బడికి వెళ్ళెడి బాలలకే రా

బడుల నిచ్చెడి  పాఠము లుండున్

మడుల నమ్మక మానరు పెద్దల్

గుడికి వెళ్ళిన కూరిమి లంకా.111




శివుని యాజ్ఞని చీమలు కుట్టున్

శివుని ధ్యానము చేతన బెంచున్

శివుని గానము చింతలు దీర్చున్

శివశివాయన క్షేమము లంకా.112




పదవి గల్గిన భాగ్యము లింపౌ

పదవిలోపని భారము కాదో

పదవిలో నపవాదులు మెండౌ

పదవి పోయిన బాధలు లంకా.113



కనుడు ముంబయి కప్పల గంతుల్

కనులకింపుగ కాసుల పేరుల్

జనులమాత్యుల సంగతి జూడన్

పనుచు సొమ్ముల పండుగ లంకా.114


పడతి గట్టిన  వల్వలనన్నీ

విడచిబెట్టును వెన్కనె మళ్ళీ

మడచుక్రొత్తవి మానక తానే

మడత పెట్టదు మంచివి లంకా.115



పడతి చేయదు వంటలు వార్పుల్

కుడువ స్విగ్గిని కోరిరి వారల్

మిడిసిపాటుకు మేకపు తోడౌ

గడుసు భార్యల కాలము లంకా.116



గడన చేసెడి కాంతల గంటిన్

చెడుగుడాడగ చెడ్డిలు మిడ్డీల్

బిడియమేమని బీరులు గ్రోలెన్

గడుచునా కలికాలము లంకా!!117




పుడమి యందున బుట్టెను తానై

పడతి జానకిఁ బంచన జేరెన్

కడలి దాటెను క్రన్నన తానై

దుడుకు రావణుఁ డుల్చగ లంకా.118



సరుకులన్నియు చచ్చులు పుచ్చుల్

పురుగులుండెడి పుచ్చుల కూరల్

ధరలు జూడగ తంకము గల్గున్

నరక మిచ్చట నాకము లంకా.119





వెలది నేర్వని విద్యలు లేవోయ్

నెలత ముంగిట నిల్వగ లేవోయ్

పిలచి తన్నును ప్రేమను పంచున్

కలితదే కలికాలము లంకా.120