Wednesday, April 12, 2023

వేంకటేశ్వరా

 ఇయ్యది ఉత్పలమాల లో శతకము.


దేహమునప్పగించెదను తీరుగనేనిల వల్లకాటికిన్

గేహమునప్పగించెదను గేస్తుని కానిక పోయివచ్చెదన్

శ్రీ హరి పాదమంటెదను చిత్కళ రూపునిచింత దీర్పగన్

సోహము సోహమందునిక శూన్యము చేయగ చిత్త వృత్తినిన్.


పోవలదంచు బల్కుదురు పొమ్మనకన్ పొగబెట్టు వారలున్

కావలె నీకుశాస్తియని కాటికిరమ్మని వాడుబిల్వగన్

నావలె మూర్ఖుడేడియని నాకిపుడించుక బుధ్ధి గల్గగన్

రావలదంచు బల్కకుము రక్షణ గోరితి వేంకటేశ్వరా.1


గోవుల దానమెన్నడును కోరికతీరగ చేయనైతి నే

బావిని త్రవ్వి నీరిడెడి భాగ్యము నెమ్మది చేయనైతి మీ

కోవెల కెన్నడైన మిము కోరిభజింపగ రానివాడనే

రావలదంచు బల్కకుము రక్షణ గోరితి వేంకటేశ్వరా.2



చేయనితప్పులేదు సరిజేసిన పుణ్యము లేమి లేవు నే

కూయని కూతలేదు మరి కూరిమి పూజలు చేయ లేదు నీ

తీయని నామగానమును తీరుగ చేసిన వాడగాను నా

కాయము వీడువేళనను కాదనబోకుము  వేంకటే శ్వరా.3



కానలకేగలేదు నినుకాంచగ తాపసినైన కాను నే

వీనులవిందుగా చదువ వేదమునేర్చిన వాడగాను నా

మానిని వెంటతిర్గి పెనుమాయకు లొంగితి బుధ్ధి గల్గె నే

దీనుడ నైతి నిప్డు నిను దిక్కని నమ్మితి వేంకటేశ్వరా.4



రాజులు మంత్రులన్ పొగిడి లావుగరోజులు వెళ్ళబుచ్చి నే

మోజులు తీర్చుకుంటి మరిమోహము తీరక తిండి పోతునై

గాజుల చేతివంటరుచిగా తిని రాముని దల్చనైతి నీ

రోజున గుర్తుబట్టితిని రోగము క్రమ్మగ వేంకటేశ్వరా.5



రాయుల కెల్ల రాయుడవు రక్షణ కోరిన చాలనంద్రు నీ 

వాయన పాదమంటినను నార్తిగ బిల్చిన చాలనంద్రు నా

రాయణ యంచు బల్కుటకు రాదని చెప్పని భక్తి నిమ్ము నే

పాయక నీదు నామమును పాడెద నీ దయ వేంకటేశ్వరా.6



కుక్షిని చేతబట్టుకొని కొందలమందిన వారినై ననున్

లక్షలు కోట్లు దానము సలక్షణ రీతిగ చేయువారలన్

రక్షణ గోరి వచ్చినను రాక్షసులైనను రామరామ  కా

మాక్షిగ నీవు గాచెదవు మాతవు నీవయి వేంకటేశ్వరా.7


ఏ పదమందు గంగ ప్రభవించగ పాపము లెల్ల ద్రుంచునో

యేపదమంటి సూర్యుడుదయించుచు నిత్యము వెల్గు లీనునో

యేపద ధ్యాసకల్గ తపియింతురు మౌనులు  దీన బాంధవా

యా పదసేవ కోరితిని యాపదమీయవె   వేంకటే శ్వరా.8


 నీ కరమందు నందకము నీవరదాభయ హస్తముం చగన్

నీకడగంటి చూపులకు నిత్యము వేచిరి బ్రహ్మ రుద్రు లున్

నీ కమనీయ పాదములు నెమ్మదిగూర్చును లోక పాలకా

చేకొని కావవేడితిని చిన్మయరూపుడ వేంకటేశ్వరా.9



వానరజాతి భాగ్యమది వారధిగట్టిన పుణ్యమబ్బెనే

దానవజాతి భాగ్యమది దండనచే నిను చేరుకుంటిరే

మానరజాతి భాగ్యమది మాధవుడే రఘురాము డయ్యెనే

మానక నిన్నుదల్చెదను మాయిలవేల్పువు వేంకటే శ్వరా.10


వేలకువేల తారకలు విశ్వము నంతట లంకరించ నీ

చేలము బట్టినాడనుచు చింతలు దీర్పిన లోకపా లకున్

లీలగ విశ్వరూపము కిరీటికి చూపక పోల్చడాయె నీ

లీలల నెన్నలేని త్రస రేణువునైతిని వేంకటేశ్వరా.11


నిత్యము నీదు నామమును నెమ్మది దల్చెడి నారదా దులున్

భృత్యులు నిన్ను చేరగ తపించుచు రాక్షస జన్మ మెత్తినన్

నిత్యము నిన్ను దూరినను నీదరి చేరిరి కంసులా దిగన్

నిత్యము నిన్ను దల్చుమతినీయగ కోరితి వేంకటే శ్వరా.12


కోటలు దాటి పోయెడివి కోరక కష్టము కొన్ని తెచ్చు నే

నాటికి వీడకుండనవి నాటిన వృక్షపు వేళ్ళ పోలెనే

సూటిగ గుండెలోకి దిగి చుక్కలు చూపును కొన్ని మాటలున్

మాటలు గుండె నింపెడెవి మంచివి నీయవె వేంకటేశ్వరా.13


సారెకు వారు వీరనుచు చాలనచేసెడి మాటలంటి నా

వా రనువారు లేరనుచు వాదన చేసితి లోకులెల్ల నీ

వారని గుర్తెరుంగక నవాకుచెవాకులు ప్రేలినాడ నె

వ్వారల నైన నీదు పరివారము నుంచవె వేంకటే శ్వరా.14



వందల వేల సౌఖ్యములు వద్దనకుండెడి మోహపా శముల్

వందలవేల వర్ణములు వద్దనకుండెడి యింద్రి యాదులున్

వందల వేల జన్మలను వద్దనకుండనె పొందితింక చా

లందును నిన్నుపొందుటకు నానతినీయవె వేంకటే శ్వరా.15


జీవితమంత కష్టములు చింతలు దీరని నన్ను బోలు మా

జీవులు కొండకొచ్చెదరు, జీవనయానము గుర్తెరింగి నా

కోవిదులైన వారలును కోర్కెలుదీరగ కొండజేర నే

లావుగ గుర్తెరుంగ మిము రక్షణ కోరితి వేంకటేశ్వరా.16



బల్లులు దోమలైన పెనుపాములు చీమలు నీగలైన మా

కొల్లని జంతుజాలములు కొల్లలుగా కల నీదు సృష్టి మా

కెల్లరికేల సాధ్యమగు కేశవమాధవ నిన్ను గాంచ  మా

యుల్లమునందు నిల్పుటకు నూనిక నీయవె వేంక టేశ్వరా.17


వేకువగల్గునిక్కడ వివేకము పెంపగు నొక్కచోట పెం

జీకటి నొక్కదేశమున చింతలు దీర్పుచు వెల్గురే ఖలున్

లోకము తీరుతెన్నులివి రోజులు మోజులు తీరవాయె మా

లోకుల కెల్ల నీదు నిజ రూపముజూపవె వేంకటేశ్వరా.18


జంతువుబోలు జన్మయని జాలము చేసెడి వారమైన మే

మింతలు చేసి దల్తుమట నెంతలు నెంతల టంచు కాని మా

చింతలు దీరలేదనుచు శీఘ్రమె చేరగ నీయవయ్య నీ

చెంతకు లోక రక్షకుడ చిన్మయరూపుడ వేంకటేశ్వరా.19


అంతట నిండియుందువట యందురిలోనిను గాంచ నైతి నే

నెంతటి వాడనయ్య కనులిచ్చిన వానిని పోల్చనైతి నే

చెంతకు చేరుటెట్లు మది చింతలు తీరెడిదెట్లు స్వామివై

స్వాంతము పొందునట్లు నును పాలన చేయవె వేంకటేశ్వరా.20


కొందరి గాంచ సంతసము కొందరి గాంచగ ఖేదమేలనో

కొందరి గాంచ దుర్భరము కొందరిపై దయ గల్గుటేలనో

కొందరిగాంచ ధైర్యమును కొందరిలో భయమేల గల్గు ని

న్నందరి యందు గాంచు మతి నందరి కీయవె వేంక టేశ్వరా.21


 భక్తులు బారుతీరెదరు ప్రార్థన చేయుచు కొండ నెక్కుచున్

ముక్తిని కోరువారలును ముందుగ వత్తురు నిన్ను చేరగన్

శక్తిని కోరి చేరెదరు శక్తివి నీవని, నిన్ను గాంచ నే

యుక్తిని లేనివారలకు యుక్తివి నీవయ వేంకటేశ్వరా.22


దుష్టుడనై చరించితిని దూరితి పెద్దల గుర్తులేకనే

కష్టము లీయగోరెదను కల్మషమించుక ద్రుంచు కుందు నీ

సృష్టిని కష్టనష్టముల తృష్ణయు దీరక బుధ్ధిరాదు నా

కష్టము లోర్చు శక్తినిడి కాయము గైకొను వేంకటే  శ్వరా.23


చీకటిజీల్చి వెల్గులను చిమ్మెడి సూర్యుని శక్తివైతివే

లోకుల గుండెలో నొదిగి లోకము లెల్లను గాచు చుంటివే

యాకలి కన్నపూర్ణవయి యాకలి బాధల కౌషధమ్ము వై

చేకొని కావుమయ్య మము చిన్మయరూపుడ వేంకటే శ్వరా.24


ఆశ నిరాశలందు జనులందరు తేలుచు క్రుంగి పోవుచున్

వాశికి చిక్కనట్టి పలు పాపము లన్నియు చేయు చుండగన్

కాశి నివాస మేగెదరు కాయము వీడెడి వేళ రక్షకై

రాశుల పాపపుణ్యముల క్రాఁగుటనాపవె వేంకటే శ్వరా.25


సాయిని నాథుడంచు పలుసాధుల సంతుల గొల్చు వారలున్

రాయలలోన రాయుడవు రాముడవీవని గొల్చు వారలున్

మాయని గెల్వలేక పలుమారుల హమ్ముకు లొంగిపోదురే

సాయము చేయవయ్య తగు సాంత్వన గూర్చుచు వేంకటేశ్వరా.26


కొమ్మలపైన గోయిలలు, కొండలలో సెలయేటి ధారలున్,

గమ్మని పూల వాసనలు, గాంతులు జిమ్మెడి యాక సమ్ముపై,

నిమ్మహిలోసుగంధమున నీశ్వరుడుండగ గానలేరనో

రమ్మని కొండపైనిలుచు రాముడవీవయ వేంకటే శ్వరా.27



వేళకు సూర్యచంద్రులను వెల్గుల తారల వేలవేలు నే

తాళము లేని సంపదలు త్రాగెడి నీటిని గాలినిచ్చి భూ

గోళము పైన జీవులను కొండల కోనల నిల్పినట్టి నీ

కేళికి వందనమ్ములిడ కేలను మోడ్తును వేంకటే శ్వరా.28



కర్మము వల్ల జన్మములు కల్గగ జన్మము వల్ల కర్మముల్

శర్మము నిచ్చు కర్మములు సౌఖ్యము గూర్పని కర్మ మేల నీ

ధర్మము దారిజూపునని దానము ధర్మము చేయు మంద్రు నీ

మర్మము నేర్చు శక్తినిడి మాయని బాపవె వేంకటే శ్వరా.  29



రంగని రూపమందు జనులందరి యార్తిని దీర్చు వాడ శ్రీ

రంగపురేంద్ర నాథుడవు లాంగలమైతివి గుండెలో తులో

చెంగట కొంగుబంగరము శ్రీ గిరి వాసుడ మల్లిఖా ర్జునా 

లింగని రూపమై తిరుమలేశుడ వైతివి వేంకటేశ్వరా.30



తామస భావులయ్యునిల తాపసు లౌదురు నిన్నుగొల్వగా

పామరులైనవారిలను పండితు లౌదురు

నిన్నుదల్చగా

నీమముతోడ నిత్యమిల నిన్నుదలంచుట వింతగాదుగా

క్షేమము గూర్తువందరకు కేలును మోడ్చిన వెంకటేశ్వరా.31



కోరిక గల్గె నెక్కటికి కోరిసృజించె జగత్తునంతనున్

కోరికవల్ల జీవులకు కోరిన జన్మము లట్లు గల్గునో

కోరికలున్న చాలునట కూరిమి యంతయు మాయ మౌటకున్

కోరితి నీదు పాదములు కోరిక దీర్పవె వేంకటేశ్వరా.32


అల్లదె మబ్బులాకసము నంతయు మెల్లగ నాక్ర మించగన్

మెల్లగ  పిల్లతెమ్మరలు మేనుని తాకెను మండు టెండలో

చల్లని వాన జల్లులకు సాంత్వన గల్గెను హాయి నొందితిన్

ఎల్లెడ నుండువాడవట యెట్టుల పోల్తును వేంక టేశ్వరా.33


తాతల యాస్తి నాస్తి భవతాపపు నాస్తికి వారసుండ నే

వేతన జీవినైతి పరివేదన చెందుట జన్మహక్కుగా

యాతన కోర్చినాడ మరియాదయె కాదని యేడ్వ నైతినే

దాతవు నీవుగాన పరిదానము చేయవె వేంకటేశ్వరా.34


ఎన్నడు కానరావు కనులెందుకు మోమున పెట్టినావయా

తిన్నగ కానరావు పలు తిప్పలు బెట్టుట నీకు పాడియా

పన్నగశాయి నిన్నెటుల భావన చేసెదనయ్య దేవరా

మన్ననజేసి పిల్చితిని మాయలు చాలును  వేంకటేశ్వరా.35


తిట్టెడి వారలెవ్వరట తీరుగ మెచ్చెడి వారలెవ్వరో

మొట్టెడి వారలెవ్వరట మోహము దీర్చెడి వారలెవ్వరో

కొట్టెడి వారలెవ్వరట కోరిక దీర్చెడివారలెవ్వరో 

కట్టెలమీద కెక్కినను కాంచగనైతిని వేంకటేశ్వరా.36


నాలుగు రోజులీ బ్రతుకు నాదని నేన నహంక రించితిన్

కాలము జారిపోయినది కాలుడు బిల్చును కట్టె లెక్కగన్

ఆలము నందు గెల్చితిని హాంత్రము చేరువ యైన నేమిలే

చాలును చాలునందు తమ సన్నిధి చేరెద వేంకటే శ్వరా.37


కోరితి కోటి కోర్కెలను కోరనివైనను నెట్టులోర్తువో

దారుణమైక కోర్కెలను తప్పనిపించక కోరినాడనే

కేరడమాడినాడ తమ క్షేమము నెన్నడు నెంచనైతినే

కోరి భజింపనైతి మిము కూరిమి లోపము వేంక టేశ్వరా. 38



కంటికి రెప్పలిచ్చితివి కాళ్ళకు వేళ్ళను గోళ్ళనిచ్చి వీ

డొంటిగ నుండలేడనుచు నూరికి మధ్యన నుండ నేర్పి నా 

కింటిని కట్టబెట్టితివి యింతిని బిడ్డల నైన నేమిలే

మంటలు పెట్టె నామనసు మాయలమారిది వేంకటే  శ్వరా.39


పచ్చని చెట్లనిచ్చితివి పాడియు పంటలు పూలు పండ్లతో

వెచ్చగ నింటనుండమని వెచ్చని కౌగిలి కింతినిచ్చితో

లచ్చలకోట్ల సంపదలు లచ్చనమైనవి పద్యమిచ్చినా

ముచ్చుది మెచ్చదే మనసు పుచ్చుది చచ్చుది వేంకటేశ్వరా.40


తీరుగ నైదు నశ్వముల తేరుకు పూన్చితి నింద్రియా దులన్

సారథి బుధ్ధి నామనసు చక్కని కళ్ళెము తేరు దేహమే

తీరవు కోర్కెలెన్నటికి తిప్పలు గల్గెను నిన్ను చేరగా

దారిని తప్పి పోయినది తప్పు గ్రహించితి వేంకటేశ్వరా.41


రేపటి నుండి పూజలకు  లేచెద ప్రొద్దున తప్ప దంచు నే

మాపటి వేళ వేచెదను మానక రేపను రోజు కోసమై

తేపకు తిండి తిప్పలను తీరుగ మానక చేయు చుంటి నీ

దాపున వేచియుంటినయ తప్పు నెరింగితి వేంకటే శ్వరా.42


చెప్పులు బెట్టి కొట్టినను చెప్పుడు మాటలు కేల జూచునో

నిప్పుల వ్రేల్చినా మనసు నీరజనాభుని‌ తల్వదేమొకో

చప్పున దూకునీ మనసు సారవిహీన భవాంబు దీదగన్

తప్పులు సైచుమా యనుచు దండము పెట్టెద వేంకటేశ్వరా.43


కామము క్రోధముల్ విడను కాలుడు పిల్చెడి వేళయై ననున్

నామము పల్కినా తుదకు నామది నీకడ చేరదేమొకో

పామితి త్రోమితిన్ భయము భక్తియు నొంటికి పట్టవేలనో

కాముని కన్నతండ్రివట కావగ వేడెద  వేంకటేశ్వరా.44



మా యిలవేల్పు నీవనుచు మానక దల్చితి నెళ్ళవే ళలన్

మా యిలవేల్పు నీవ పరమాత్మవు నీవని దల్తు నెప్పుడున్

మా యిలవేల్పు వంచు పలుమారులు వచ్చితి కొండలెక్కుచున్

కాయము వీడు వేళ నను కావగ వేడెద వేంకటేశ్వరా.45


పద్యము వ్రాయ నేర్చి పలు భావము లొప్పుచు కూర్చినాడనే

హృద్యము లైన పద్యముల బృందపు సభ్యులు వ్రాయు చుండగన్

పద్యపు సేద్యమందు పలు బాలల పెద్దల చేయి బట్టుచున్

పద్యము నేర్పు మద్గురు శుభమ్మును కోరితి  వేంకటేశ్వరా.46


భారత దేశమందు కడు భాగ్యవశమ్మున జన్మ నెత్తితిన్

భారత దేశ పౌరులకు బల్మిని కోరెద దేశభక్తియున్

భారత వీర సైనికుల భాసుర తేజము పెంపు కోరెదన్

భారత దేశమంతటికి భద్రము గూర్పవె వేంకటేశ్వరా.47


కోపము దాచిపెట్టితిని కూరిమి కాస్త నటించి చూపి తిన్

తేపకు నేడ్చువచ్చినను తేరగ నవ్వితి వెర్రివానిలా

పాపము లెన్ని జేసితిని భక్తుని పోలెనె వేషమెత్తితిన్

తాపులు తన్నబోకుమయ దండము పెట్టెద వేంక టేశ్వరా.48


పాలును వెన్నయా కఱవు బాలను బేలను గొల్లకన్యకన్

చాలును చాలు నీ ప్రతిభ చక్కనివాడవు శ్యామ సుందరా

కేలను మోడ్చి మ్రొక్కెదను క్షేమము గానను చేదుకో వయా

లీలలు చూపుచున్ తగు పరీక్షలు పెట్టకు వేంకటే శ్వరా.49



పాహియటంచు బిల్చితిని బంగరు లేడిని వెంబడించితో

పాహియటంచు వేచితిని పాలను వెన్నను గ్రోలబోతివో

పాహియటంచు వేచితిని భామల వల్వల పట్టబోతివో

దేహి యటంచు బిల్చెదను దీనును గావవె వేంకటే శ్వరా.50



పాలను గ్రోలి పూతనను వల్వల దోచుచు గొల్ల కన్యలన్

రాలను తేల్చి వారథిని రక్కసి మూకల ద్రుంచి జానకిన్

లాలనజేసి పాండవుల రక్షణ జేయుట నీకు చెల్లుగా

లీలగ నన్ను గావగ నిరీక్షణ చేసితి వేంకటేశ్వరా.51



ఉండెడి దొక్క వస్తువట నొంటిగ జంటగ నన్ని రీతులన్

రెండవదేది లేదనిరి క్రేపుల గొల్లల రూపునీదెగా

నుండను చోటు లేదనుచు నుంటివి యంతట, గాంచ లేరురా

రండని కొండమీద మము రమ్మని బిల్చుచు వేంకటేశ్వరా.52


తేకువ తెచ్చుకుంటినిక తీరని కష్టము లెన్ని గల్గినన్

బాకులవంటి మాటలకు బాధల నొందుట మానివేసితిన్

మా కులదైవమున్నదని మమ్ముల గావగ వేచిచూచుచున్

వ్యాకుల పాటు చెందనని వాటికి చెప్పితి వేంకటేశ్వరా.53


చాకలివాని పల్కులకు చానను కానల కంపినావుగా

వ్యాకులమొందినాడవట బంగరు లేడిని పట్టబోవుచున్

చాకలివాని మాటలకు ఛప్పున గ్రుద్దులు గ్రుద్దినావటే

మాకిటివంటి కష్టముల మాత్రము నీయకు వేంకటేశ్వరా‌.54


శ్రీ గురుదత్త దేవయన చింతలు దీర్తువు రుద్రరూపుడా

శ్రీ గురుదత్త పాహియన శ్రీకరమౌనట విష్ణురూపుడా

శ్రీ గురుదత్త బ్రహ్మమన శీఘ్రమె సంతస మొందువాడవే

శ్రీ గురుదత్త యందుమిము చిన్మయ రూపుడ వేంకటేశ్వరా.55


పాటవ మేమిలేదు పలు పద్యము లల్లితినింతదన్క పో

రాటము చేసినాడ  కనురాపును తట్టుకు నిల్చినాడ నా

రాటము తీరకున్న పలురాత్రులు నిద్రను కోలుపోతి నీ

చాటుకు చేరుకుంటినిక సద్గతినీయవె వేంకటేశ్వరా.56


వాక్కులకంద బోవనిరి వర్ణనచేయగ నాకుసాధ్యమా

దృక్కులకందరావనిరి కృష్ణుని రూపము చూపరావయా

చక్కనివాడవంద్రు నిను సాగిల మ్రొక్కెద కానరావయా

యక్కున చేర్చుకొమ్మనుచు నార్తిగ వేడితి వేంకటేశ్వరా.57



రెండవదేది లేదనుచు రేడువునీవని గొల్చుచుంటినే

గుండెలలోననుందువట కోర్కెలనేమియు కోర బోను నీ

కొండలనెక్కలేను మరి కూరిమిలోపము లేదు లేదు నా

కండగ నుండవేడెదను నార్తినిబాపుచు వేంకటేశ్వరా.58


హత్యలు మానభంగములు హాయిగ జూపెడి టీవి వారలన్

సత్యము దాచిపెట్టుచు నసత్యము నెప్పుడు జూపు వారలన్

నిత్యము దేశ ద్రోహులను నీచ నికృష్టుల పెంచు వారలన్

దైత్యులటంచు నెంచెదను దారుణమాపవె వేంకటేశ్వరా.59


వైద్యముపేర రోగులను బాధలు పెట్టుచు దోచు వారి నై

వేద్యము పేర మాన్యముల పేదల భూములదోచు వారలన్

మద్యము నమ్ముచున్ ప్రజల మానము ప్రాణము గ్రోలు వారలన్

చోద్యము జూచువారలను శోధన జేయవె వేంకటేశ్వరా.60


ఆస్తుల నమ్మి పైచదువులందలమెక్కగ  తల్లి దండ్రులన్

పస్తులబెట్టి మూర్ఖముగ పశ్చిమదేశము లేగువా రలన్

కిస్తులకట్టకుండ పలు కేసుల బ్యాంకుల దోచు వారికిన్

శాస్తిని జేయవేయనుచు సాగిల మ్రొక్కెద వేంకటేశ్వరా.61


పోయెడిరోజు వెంట కొనిపోయెడిదేమియు లేదనంచు నా

జాయ సుపుత్రులేవురికి చక్కగ సంపద లన్ని గూర్చుచున్

కాయమునిత్యమంచు మమకారము కేనిక లొంగిపోయితిన్

బాయక నీదునామమును ప్రార్థన చేసెద వేంకటేశ్వరా.62


తీయని లోకమందు పలు తీరుల కోరిక లూర చుండగన్

కాయముతోడ సౌఖ్యములు కాలువ లందున నీదు చుండినన్

గాయముకాక తప్పదిక కత్తికి పూసిన తేనె నాకినన్

మాయను ముంచబోకుమయ మానక తల్తును వేంకటేశ్వరా.63


పాదుకలిచ్చి సోదరుని బాధ్యత తెల్పిన దేవదేవ నీ

పాదములిచ్చితో గుహుని ప్రాభవమేమని తెల్వనైతి నీ

పాదపుధూళి సోకినది ప్రాకటమైయ్యె నహల్య మాత నీ

పాదములంట నీయవయ భద్రము నాకగు వేంకటేశ్వరా.64


వచ్చినవారు పోయెదరు వారని వీరని చెప్పనేల నే

నిచ్చటనుండి పోదునని యింతలు నంతలు బల్కు వారలున్

చెచ్చెరగాను కొందరును చేసినదేమియు లేనివా రలున్

వచ్చితి పోయిరాననుచు ప్రార్థన చేసెద వేంకటేశ్వరా.65


ఎచ్చటినుండి వచ్చితిని నెచ్చటికేగెద టంచు ధ్యాసతో

నిచ్చట కాలమంతయును నెగ్గులు బల్కుచు తిర్గినాడ  నీ

ముచ్చట మర్చి పోయితిని ముచ్చును నేను క్షమించ వేడెదన్

చచ్చిన వెన్క  నీదరికి చప్పున చేర్చవె వేంకటేశ్వరా.66


పండరిచేరు యాత్రికులు బాటలవెంబడి సాగుచుండ మీ

కండగ నుంటిమేమనుచు నార్తిగ పాదపు నొప్పి దీర్పగన్

రండని రెండుకాళ్ళను సలక్షణ రీతినిపట్టుపాదమిన్

దండిగ మేలుచేయుమని దండము పెట్టెద వేంకటేశ్వరా.67


సార విహీనమైన భవసాగర మీదెడి నేర్పు నిచ్చి వే

సారిన జీవులందరికి సద్గతినిచ్చెడి ధర్మ మార్గ మా

ధారము చేయమంచు పరితాపము తీర్చెడి దీన వత్సలా

తారణ నీదునామమట దత్తుడవీవయ వేంకటే శ్వరా.68


దవ్వున కష్టముండినను దత్తుడ వీవని దండ మంటినే

చివ్వున కంటనీరుబుక చేమ్మయె లుప్తము కన్ను లందునన్

నవ్వును మోముపై పులిమి నాటక మాడితి లోకమందు నే

రివ్వున కొండనెక్కెద పరీక్షలు పెట్టకు వేంకటేశ్వరా.69


సూదులు గ్రుచ్చి గ్రుచ్చి పలు చుక్కల రక్తము తీసితీసి హాఁ

నీదు శరీరమందసలు నెత్తురు లేదని తేల్చి చెప్పిరే

బాధలు పెట్టువారలను వైద్యలటంచన నేమి చిత్రమో

వేదన తీర్చి నాసతిని వేగమె కావవె వేంకటేశ్వరా.70


కొండలనెత్తగా వలదు కోకల నేమియు కోరలేదుగా

భండనమైన కాదుమరి పార్థుని పోలెనె రక్షగోరనిన్

ఖండితమైన పేరుగొని కాచెడి వాడవు దీనబాంధు మా

కండగ నుండు దేవుడ వనాదర మేలయ వేంకటేశ్వరా.71


కాయమునైన గైకొనక కష్టముపెట్టుట నీకు పాడియా

నాయను వారులేరనెద నన్నిక రక్షణ చేయకున్నచో

మాయనిమచ్చ నీకగును మమ్ములగావని వాడ వైనచో

బాయననీదు పాదములు పట్టిన వారము వేంకటేశ్వరా.72


సోదరి పాహిపాహియన శోకము వల్వల నిచ్చి గాచితో

జూదములాడువేళ తమ చుట్టము లోటమి లేల నొందెనో

ఖేదము నొందు వేళలను క్షేమముగా తిరు గాడి చుండినన్

నీ దయ కోరుకుంటినయ నీదరి చేరగ వేంకటేశ్వరా.73


బాధలు పెట్టి నవ్వుదురు వారలు వీరలు లోక మందు నీ

బాధలు మేము తీర్తుమని బాధలు కొందరు పెంపు జేయగన్

బాధలు తీర్చవేడితిని పాహియనంటిని యైన నింకనున్

బాధలు పెట్టి నవ్వెదవు పాడియెనీకిది వేంక టేశ్వరా.74


నారదమౌనిలా సతము నామము బల్కుట నాకు సాధ్యమా

నేరముకిట్టి శిక్షయని నిర్ణయమెవ్వరు చేసినారయా

దారణమైన శిక్షలను దండనలిట్టుల నీయ పాడియా

నేరక చేసితిన్ భజన నేనిక చేయను వేంకటేశ్వరా.75


అంటిని మాటలంటిని సహాయము చేయని వాడ వంటినే

వింటిని చూప కంటి వెనువెంటనె నీపద మిమ్మనంటి ర

మ్మంటిని రామభద్రుడన యార్తిని తీర్చెడి వాడవంటి నే

తుంటరివాడనైతి నిను దూషణ చేసితి వేంకటేశ్వరా.76


దండములంటి దాశరథి దాసుని తప్పులు సైచ మంటినే

దండములంటి నీదు వరదాభయ హస్తము చూప మంటినే

ముండన మాచరించెదను ముందుగ కొండకు పిల్వ నంపి మా

కండగ యుండమంటి శరణాగత వత్సల వేంకటేశ్వరా.77


ఆశ నిరాశలందు తిరుగాడుచు సొక్కుచు రేబవళ్ళలో

చేసిన పాపపుణ్యముల చిక్కుల లెక్కలు తేల్చలేక నే

కాశికి వెళ్ళినాడ కలకాలము నచ్చట నుండ లేని నీ

దాసుడు నిన్నుగాక మరి తల్చెద నేరిని వేంకటేశ్వరా.78



నీదయలేక కష్టమట నిన్ను తలంచుట దీనవత్సలా

నీదయలేమి యోడిరట నీ సఖులైన యుధిష్ట రాదులున్

నీదయచేత వేడెనట నీదు సహోదరి కృష్ణ రక్షకై

నీదయ నిన్నుదల్చుటకు నీమతి కోరితి వేంకటేశ్వరా79


ఘోరతపమ్ముచేసెనట ఘోరుని మెప్పును పొంద నస్త్రమున్

కౌరవవీరులన్ గెలుచె గావగ గోవుల పార్థుడొక్కడౌ

వీరుని యుధ్ధ రంగమున భీరుని చేసె మనస్సు చిత్రమే

పారకనుండనిమ్ము తమ పాదముపై మది వేంకటే శ్వరా.80


బాలుడనై సహాయకునిపై చిరు ప్రాయము నుండి తల్లిపై 

చేలము పట్టువాడనయి చీరని వీడని వాడనై తమిన్

పాలకునై సమూహములపై యటుపిమ్మట నాదు భార్యపై

కాలము వ్యర్థమై తమరికై తలనొగ్గితి వేంకటేశ్వరా.81


కాలము నీదు రూపము సకాలము నందున పోల్చ లేక నే

తేలుచు మున్గుచున్ పెనగి దేహము నేనని భ్రాంతి చెంది పా

పాలను చేసిచేసి పరిపక్వత నొందక మోసపోయితిన్

కాలము తీరువేళ నను క్షాళన చేయవె వేంకటేశ్వరా.82


ఉంటిరి తోడు కాని తమరుండిన సంగతి పోల్చనైతి నీ

కంటన పోల్చలేక బహుకాలము చూచితి గుళ్ళలోన నే

నొంటరి వాడనైతినని యూరక తల్చితి నిన్నినాళ్ళు నా

కంటిన మాయదారి తమినంతము జేయవె వేంక టేశ్వరా.83


కుక్షిని నింపజూచితిని క్షుద్రపుకార్యము లన్నిజే యుచున్

మక్షికమై చరించితిని మానవునన్నది పేరుకైన నే

రాక్షసు నైనకాదు మరి రక్షణ చేయక చూడ న్యాయమా

సాక్షిగ లోనదాగితివి చక్కని తండ్రివి వేంకటేశ్వరా.84


పక్షిని కాక పోతినయ ప్రాణము లర్పణ చేయగాను నీ

పక్షము నందు పోరగను వానరునైనను కాకపోతి నే

ఋక్షరజస్సు వారసుడ నేవిధినామది నిల్వదాయె నే 

దక్షత లేనివాడనయ దండముపెట్టెద వేంకటేశ్వరా.85


రివ్వున పోవు బ్రాణమట రెప్పలు శాశ్వత నిద్ర కోరగన్

నవ్విన నేడ్చినన్ బ్రతుకు నాలుగు రోజులు నేరికై ననూ

దివ్వెలువేలవేలట గదిన్ నలువంకల గ్రమ్మె చీకటుల్

నవ్వెడుశక్తినీయుమయ నవ్వెదనెప్పుడు వేంక టేశ్వరా.86


బాధలు వేరువేరుమరి భాషయె చాలదు తేల్చి చెప్పగన్

బాధలు క్రొత్త క్రొత్తవట వైద్యుల కందని రోగ మెల్లెడన్

బాధలు లేని జీవితము పండనికాయయు వ్యర్థమే యనన్

బాధలకోర్చు శక్తినిడి భద్రము గూర్పవె వేంకటేశ్వరా.87



విశ్వమునంత నిండినది విష్ణుని రూపమటంచు నంద్రు నీ

నశ్వరమైన దేహమది నాదను భావము వీడదేమొకో

శాశ్వతమైన వాడవట సత్త్వము నీవని పెద్ద లంద్రు హే

ఈశ్వర నేనుమూర్ఖుడను నేవిధి పోల్తును వేంకటేశ్వరా.88


కాలము శక్తి వంతమట కల్గును బంధము మోక్ష మైన న

న్నాలము చేయలెమ్మనుచు నారడి పెట్టును పారి పొమ్మనున్

మేలగుమాటచెప్పినను మేలములాడకు పొమ్ము పొమ్మనున్

కాలము నీదు రూపమట క్రాఁగుడు నాపవె వేంక టేశ్వరా.89


రాగము ద్వేషమోహముల రట్టడి నాపెడి దారి లుప్తమై

రోగము మృత్యు భీతియును లోనయి పీఠము వేసి యుండగన్

దాగిన శత్రులార్గురును దాంతము శాంతము మ్రింగి వేయ నే

లాగున నిన్నుచేరెదను రక్షణ గూర్పవు వేంకటేశ్వరా.90


పాలసముద్రమే పడక పాదములొత్తుచు లచ్చి తల్లి పా

పాలను తొల్గజేయునది పాదములందున నుండు గంగ మా

పాలుకు జన్మకర్మములు పాపముతాపము లీయ న్యాయమా

కేలను మోడ్చి మ్రొక్కెదను క్షేమము గూర్పవె వేంకటేశ్వరా.91


నాదము నీదురూపమట నామము బల్కుచు నున్న వాడ నీ

పాదము మోక్షదాయకము, బట్టియు విడ్వక గొల్చు వాడ, నీ

గాధలు తల్చువాడ చిరకాలము నుండి మహాను భావ నా

వేదన తీర్చి మమ్ములను వేగము గావవె వేంక టేశ్వరా.92


వృష్ణికులోధ్బవా శరణు కృంగెను నామది దారిజూపవే

కృష్ణుడవై జనించితివి క్రీడగ ధర్మము పెంపుజేయగన్

జిష్ణుడవై జయించితివి శ్రీకర సుందర లోకులెల్లరన్

తృష్ణను తీర్చవేడెద సుదృక్కుల గాంచవె వేంక టేశ్వరా.93



నీదయ గల్గెనే నగితి నీదయ గల్గగ  యేడ్చినాడనే

నీదయ ప్రాప్తి కష్టములు నీదయ గల్గిన  భోగ భాగ్యముల్

నీదయ దీరు కోర్కెలును నీదయ గల్గెలె దుఃఖతాపముల్

నీదయ నిన్ను నే దలఁతు నెమ్మది నీయుమ వేంకటేశ్వరా.94


ఇవ్వల దేహతాపములు నిత్తెము పాపము నివ్వ టిల్లగన్

కవ్వడినై చరించి చిరకాలము తప్పులు చేసినాడ నే

నవ్వల చేరుటెట్లనుచు నార్తిగ ప్రార్థన చేయుచుంటి నే 

దవ్వున నుండిచూచెదను దండము లందును వేంకటేశ్వరా.95


కాయము డస్సెనే విహితకర్మము లెన్నడు చేయనైతి నే

హేయములైన కృత్యముల కెన్నడు పాల్పడ నైతి గాని నే

కాయిక మైన సేవల సకాలము నందున చేయనైతి నీ

సాయము కోరుకుంటినయ సన్నుతి చేయగ వేంక టేశ్వరా.96



దేహపు భ్రాంతి వీడదయ దీనపరాత్పర  లోకనాయకా 

సోహపు భావమెట్లగును శూన్యము జేయక నాదు కర్మముల్

దేహియటంచు వేడెదను తీవ్రతపంబులు చేయ లేనయా

మోహము తీర్చనీకగును మోహన రూపుడ వేంక టేశ్వరా.97



ఏ పదసేవచేసి తరియించిన మారుతి ఖ్యాతినొందెనో

యే  పద ధూళిసోక తపియించెను గౌతమ మౌని పత్నియే

యేపద మంటినంత పరమేశ్వరి దీవెన లన్ని దక్కునో

ఆపదమీయ వేడెదను ఆపద మ్రొక్కుల వేంకటేశ్వరా.98


పుట్టితినేమొగాని మరి పూర్వపు జ్ఞానము లేనివాడ నే

పుట్టినదాది లోకమున పోషణ చేసితి పాత్రలెన్నియో

గిట్టక తప్పదేమొ మరి గింజుకులాడను నిన్నుచేరగన్

పుట్టుకలింక చాలునని పోరునుసల్పెద వేంకటేశ్వరా.99


కట్టెల పాలగున్ దుదకు కాయము వీడక తప్ప దేరికిన్

పెట్టిన కాకిపాలగును పిండము దేహము కాల్చి వేయ గన్

పట్టునతేనెలా పరులపాలగు సంపదలంచు వింటి ని

ప్పట్టున దానమేమిడుదు పట్టెదపాదము వేంకటేశ్వరా.100


పుట్టుక నేనెరుంగ తగుపుణ్యము మాత్రము చేయ నైతినే

గిట్టుట లేదు నావశము కేలను మోడ్చుట నేర్వ నైతినే

పట్టుమటంచు దానముల ప్రాయము నందు తలంప నైతి నీ

గట్టున జేరదల్చితిని కాళ్ల ను బట్టెద వేంకటేశ్వరా.101


శ్రీ రఘురామరామయన శ్రీ కరమౌనని పెద్దలంద్రు నే

నా రఘునాథపాదముల నన్యమెరుంగక కొల్చినాడ నీ

తారక మంత్రరాజమును తప్పక తల్చుచు నున్నవాడ నే

నేరుగ నిన్నుచేరగను నీదయ కోరితి వేంక టేశ్వరా.102


మేడలు మిద్దెలంచు మిడిమేలపు వాహన భోగ మంచు నే

కూడుచు తీసివేయుచును కూరిమి మాత్రము కూడబెట్టికన్

గాడిని దప్పి జీవనము గానుగటెద్దును పోలె నీడ్చితిన్

వేడుక గాదు చూచుటకు వేడెదకావగ వేంకటేశ్వరా.103


దేహము నేనుకాదనిరి తిప్పలు మాత్రము నాకు గల్గ సం

దేహము వీడదాయె మరి దేవునివై జగ మంత నుంటివా

దాహము జన్మజన్మలది తప్పదు తీర్చము నీకు మ్రోక్కెదన్

తాహతు వీనికున్న వరదాయివి తెల్పవె వేంకటేశ్వరా.104


ఈ కనుదోయి చాలదట యెంతటి మోహనమైన రూపు యీ

లోకము నంత నిండినను లోపల వెల్పల కానరావు నీ

చీకటి వెల్గు నీవలన చీకటికావల నున్న వాడవే

నీ కనుదోయి జూపుమని నిన్నిక వేడెద వేంక టేశ్వరా.105



పప్పును ధప్పళమ్మనుచు వాటముగా రుచి పాయ సాదులన్

రొప్పుచు తిన్నవాడ నెలరోజుల కైనను మోజు తీరదే

ఎప్పడు మారునో మనసు కెప్పుడు తీరును తిండి ధ్యాస నే

చప్పున పాదమంటెదను సద్గతి నీయవె వేంకటేశ్వరా.106


రామ రసాయనంబుగొన త్రాసము వీడు రమా మనోహరుం

డా మునిలోక పూజితుని నార్తజనావను దీన బాంధవున్

రామ దయాకరాయనగ రక్షణ గూర్చెద వెల్లవారికిన్

స్వామివి లోకరక్షణకు ప్రార్థన సల్పెద వేంకటే శ్వరా.107


నీ పదమందు భాగ్యమును నీదు సమీపము నుండ వేడెదన్

నీ పద ధూళి దాల్చెదను నీ పద సేవన మెల్లకా లమున్

నీ పద సేవ చేయు మహనీయుల నెయ్యము నీయ గోరెదన్

నీపదమందు ధ్యానమును నిత్యము కోరెద వేంకటేశ్వరా.108


స్వస్తి.


@&%@₹%&@#₹%&@#₹%&@#₹%


ఉత్పలమాలమాలిక.


రామ రసాయనంబు గొని రాజిలవే మనసా మనో హరుం

డా మునిలోక పూజితుని యార్తజనావను దీన బాంధవున్

ప్రేముడి బిల్వవేల కనుపించగ వేగమటంచు గోరవే

ఓ మనసా రమాధవుని యూతము కై మనసార దల్వవే

స్వామిని ప్రేమమూర్తివని ప్రార్థన సేయవె సారె సారెకున్

రాముని లోకరక్షకుని రాక్షస లోక వినాశ కారునిన్

కామనలన్ని దీర్చమని కాముని తండ్రిని కంస మర్థనున్

నీమమగా దలంచి మహనీయుని పాదములంద గోరవే.

(రామ రసాయనంబు గొని రాజిలవే మనసా!!)