నిత్య సురక్షితా.. 36. నూతన వృత్తాలలో (36x3=108) నా మనవరాలు నిత్య సురక్షైత. పేరు మకుటముగా 108 పద్యములు.
1)మత్తకోకిల(1)
ఎన్నిజన్మల బంధమోయిది యేరికెవ్వరు చెప్పుమా
మన్నికైనది లేదులేదని మాటిమాటికి చెప్పెదన్!
ఉన్నవారికి లేనివారికి యున్నదొక్కటె యాశలే
కన్నవారిని కన్నవారిని గాచు నిత్యసురక్షితా.1
ఇన్ని కోర్కెలు పుట్టుచుండుటదేమి చిత్రమొ చెప్పుమా
యెన్నికోర్కెల కన్నిజన్మము లెత్తగావలె సత్యమే
దన్ను శ్రీ పరమేశుడుండిన తక్కువేమిటి చెప్పుమా
చెన్నుగన్ బలికించితీవని చెప్పె నిత్యసురక్షితా.2
((ఉన్నదొక్కటి రెండులేవట యున్నదేమిటొ చెప్పుమా
కన్నులున్నను గాంచలేరట కారణంబది యేమిటో
కన్నదెవ్వరు విన్నదెవ్వరు గాఁచువాడది వెన్నుడే
వెన్నదొంగని వేడుకొమ్మిక వేగ నిత్యసురక్షితా.3))
ఉన్నదొక్కటి రెండులేవట యున్నదేమిటొ యందు నా
కన్నుదమ్ముల నందునామరి యాడ బిడ్డల నుందురా
కన్నదెవ్వరు విన్నదెవ్వరు గాఁచువాడది వెన్నుడే
వెన్నదొంగని వేడుకొమ్మిక బేల నిత్యసురక్షితా.3
2)వనమంజరి
నజజజజభర-14
కరివరదాయని ప్రార్థనజేయగ కాచినాడట సత్యమే
సరగున దాల్చక శంఖము చక్రము జాయకైనను జెప్పకన్
సిరులనుగోరక చింతలుదీర్పగ శ్రీనివాసుని వేడగన్
పరుగులుబెట్టుచు కావగవచ్చును బాల నిత్య సురక్షితా.4
వరదుడు వేంకట నాథుని శౌరినిపద్మనాభుని దల్వగన్
చిరుచిరు కోర్కెలు తప్పక దీర్చును శ్రీనివా సుని నమ్మగన్
విరులను జల్లిన వేదన దీర్చును వేంకటేశుడు సత్యమే
మరువక దాశరథీయని బిల్చెదమమ్మ నిత్య సురక్షితా.5
హరహర శంకర పాపవిమోచన యంత కాంతక బ్రోవరా
సురమునివందిత శ్రీ ధరసేవిత సుందరానన శ్రీ కరా
నిరతము దల్చుచు చిచ్చఱకంటిని నీల కంఠుని వేడగన్
కరివస నుండిక వేగమె వచ్చును కాచు నిత్యసురక్షితా.6
సురమునివందిత శ్రీధర సేవిత సుందరానన బ్రోవరా
వరసుగుణాకర దీనజనావన పాహిపాహి సదాశివా
హరహర శంకర పాపవిమోచన యంచు వేడిన చాలదా
దరిశనమిచ్చును జంగమదేవుడు తానె నిత్య సురక్షితా.6
3)అరసాత, అలసా మకరంద
భభభభభభభర-13
ఆశనిరాశల చిక్కిన జన్మము నార్తిని బాపగ రాముని వేడుచున్
దాశరథీయని ప్రేమగ బిల్చుచు దండము పెట్టిన కర్మము లుప్తమౌ
పాశములన్నియు పారగ ద్రోలెడి పావన నామము రామునిదే సదా
కేశవమాధవ యన్ననుచాలును క్లేశము లుండవు నిత్యసురక్షితా.7
వైష్ణవి లక్ష్మియపర్ణని గొల్వగ వైభవమబ్బుట సత్యముగా సదా
విష్ణుని గాథలు పాడుచునుండగ వేదన తీర్చును పార్వతియే సదా
జిష్ణుని దల్చుచు నామము బల్కుచు సేవలు చేయుట మేలుకదా సదా
కృష్ణుని రూపము దల్చుచు భక్తిగ కీర్తన చేయుము నిత్య సురక్షితా.8
మ్రొక్కినవారికి యాపదలుండవు మోదము గూర్చును మాశివుడే సదా
చక్కనినామము నిత్యముపాడెడి శక్తిని గూర్పును శంకరుడే హరా
చక్కని తండ్రివి జంగమదేవర సాధుజనావన కావమనన్ భళా
చిక్కులుదీర్చును చిత్తమునుండుచు క్షేమము గూర్పును నిత్య సురక్షితా.9
4)ఉజ్జ్వలా
ననభర-7
జలజలమని జారిన వానలా
కలరవములుగా వినిపించుచున్
తళతళనను తారల వెల్గులా
నిలుము మదిని నిత్య సురక్షితా.10
గల గలమను గాజుల సవ్వడుల్
మిలమిలమను మీనపు కన్నులున్
తలపుల పరదాలను దాకుచున్
నిలుము మదిని నిత్య సురక్షితా.11
అలకలు పరిహాసము లాడగా
కిలకిలములు కేతన మెత్తగా
జలదరములు జార్చిన చిన్కులా
నిలుము మదిని నిత్య సురక్షితా.12
5)ఉపమాలినీ (ప్రియా/రూపమాలినీ)
నన తభ ర-9
చిరునగవుల చిందించి రమ్మని కోరెదన్
కరుణను గురిపింపంగ పాదము లంటెదన్
వరముల కొరకై దీప హారతులెత్తెదన్
నిరతము మది నీపైనె నిత్య సురక్షితా.13
సుజన వినుత దేవీ శుభంకరి కావవే
గజముఖ జననీ శ్రీ కరీ మము బ్రోవవే
కుజనులు గని చీకాకులే తొల గించుచున్
విజయము లిడవా దేవి నిత్యసురక్షితా.14
వరముల గురిపించే ప్రభాకర శోభలన్
తిరుమల గిరిపైనే తిరమ్ముగ నుంటివా
దొరవని నిను గాంచన్ దువారము ముందుగన్
చొరగొన మిము దర్శించు నిత్య సురక్షితా.15
6)కథాగతి
తరభనజభర-15
భీమేశ్వరుండుతా పూజలగొనుచును దేవితో గను పించడా
సోమేశ్వరుండుతా వెన్నెల వెలుగుల దాసులన్ కరు ణించడా
రామేశ్వరుండుతా రక్షణ నిడునట ధారగా జల మీయగా
క్షేమమ్ము గూర్పడా స్వామి మొరలువిని దానె నిత్య సురక్షితన్.16
శృంగార నాయకాశ్రీకర శుభకర హే చిదాత్మక ప్రోవరా
లింగాత్మకా భవా దర్శన మిడగను వేడెదన్ కరుణించరా
భృంగమ్మునౌచు మీచుట్టు తిరిగెదను మోవిపై చిరు నవ్వుకై
గంగాధరా హరా కావర శుభకర వేగ నిత్యసు రక్షితన్.17
భారమ్ము వైచెదన్ ప్రోవగ శుభకరి పావనీ మము గావవే
చేరంగ వచ్చితిన్ మాధవి సురనుత వేచితిన్ నిను గాంచగన్
మారాము చేయకన్ మాకు కనబడవె నామమే బలికించవే
శ్రీ రంగ నాయికీ శ్రీ హరి సతి తవ దాసి నిత్యసు రక్షితన్.18
7)కిశోరము / కరశయా
నభర (యతిలేదు)
పదములంటుచు వేడగన్
ముదముగల్గును స్వామికిన్
మదిని దల్చుచు నిత్యమున్
కదులు నిత్యసురక్షితా.19
అదను కోసము వేచితిన్
సదముతీర్చును రాముడే
పదములందున వాలగన్
కదిలె నిత్య సురక్షితా.20
హృదయమందున నిల్పగన్
చదునుజేసి మనంబునున్
దదనమిమ్మని రామునిన్
కదిలె నిత్య సురక్షితా.21
8)కురంగికా
మతనజభర-13
శ్రీ రామా మాతండ్రి దయగనవేల సేవల గైకొనన్
మారామా మాస్వామి కనబడవేల మానిని సీతతో
రారా మాలక్ష్మన్న హనుమల వెంట రక్షణ జేయ క
న్నీరై జారెన్ జీవితము కరుణించు నిత్య సురక్షితన్.22
భ్రాతల్ చుట్టంబుల్ సుతులనుచు దిర్గి ప్రార్థన లేశమై
నాతిన్ ప్రీతిన్ జూడ మునుకొనువారు న్యాయము వీడగన్
పాతాళంబందున్ పరుగులిడు పాముభాతిన చావరే
నీతుల్ చెప్పంగా సులభమనియంద్రు నిత్య సురక్షితా.23
లోకంబందున్ జీవులను దొరకొన్న రోగము లుండగ
న్నేకాలంబందైన సుఖముగ వారలీశుని దల్తురా
సాకారంబౌనా మనుజులకు జన్మసద్గతి సాధ్యమా
నీ కాయంబందున్ నిలువదగునౌన నిత్య సురక్షితా.24
9) గగనమణి
భమసభర-11
కోరికలందున్ జిక్కితి చీకాకుల నొందితిన్
సారెకు జన్మంబుల్ కలుగంగా జనియించితిన్
సారథి నీవై నారధమందున్ చరియించవే
తారక రామా కావుమయా నిత్య సురక్షితన్.25.
ధారుణి పై జన్మించితినే సాధన వీడితిన్
తీరని యాశాపాశము లందున్ తిమిరంబులో
మారని కర్మంబుల్ పరమేశా మధియించగన్
దారుణ మౌగా, కావుమయా నిత్య సురక్షితన్.26
వారధి నిర్మింపన్ రఘురామా పరమేశ్వరా
తారణమౌనా జన్మ కపీశున్ తరలించవే
చేరెద నీపాదాబ్జములన్ దాసిని కావవే
తారక రామా కావుమయా నిత్య సురక్షితన్.27
10) గజరాజు
నజభభర-8
వరముల నిచ్చుదేవర కావర ప్రోవరా
చొరగొను మయ్య దాసుల యాశలు దీర్పరా
తిరుమలకొండపై తిరమైతివి వేంకటే
శ్వర కరుణించి కావర నిత్యసురక్షితన్.28
కలుములు బాపరా కలవంచును నమ్మితిన్
వలువలనిచ్చినావట ద్రౌపతి రక్షకై
కలవరమందితిన్ గనుపింపవు శ్రీ హరీ
వలచినదాన కావర నిత్యసురక్షితన్.29
శరణము దాశపోష జనార్ధన దేవరా
శరణము శ్రీనివాస రమాపతి బ్రోవరా
శరణము వేంకటేశ్వరమాధవ శ్రీ ధరా
వరదుడవంద్రు కావర నిత్య సురక్షితన్.30
11) గౌ (ననభభర-10)
హరిహరియన భక్తుల యార్తిని దీర్చవా
కరివరదుడవందురు కావగ రావయా
శరణు శరణు మాపతి సన్నుత శ్రీ ధరా
నిరతము నిను నమ్మెడి నిత్య సురక్షితన్.31
కరివసనుని దల్తును కార్తిక మందునన్
కరివరదుని గొల్తును కావగ వేగమే
హరిహరులను దల్చిన యార్తిని బాపరా
నిరతము మిము నమ్మెడి నిత్య సురక్షితన్.32
తిరుమల గిరులందున తీరుగ నుంటివా
తిరుపతి దొరవందురు తీరుగ మిమ్ములన్
సిరులనడుగ నీదరిచేరితి రక్షకై
నిరతము నిను నమ్మెడి నిత్య సురక్షితన్.33
((కరి మొరవిని క్రన్నన కాచిన దేవరా
చిరణములిడు మాపతి సన్నుత శ్రీ కరా
దరిశనమిడ వేడెద దత్తుడ ప్రోవరా
నిరతము నిను నమ్మెడి నిత్య సురక్షితన్.))
12) చలా (మభనజభర-10)
నిన్నే రూపంబున గొలుతు నీదయ గోరితిన్
నిన్నే నామంబున పిలుతు నీదరి జేరగన్
నన్నీ జన్మంబున శివుని నామము బల్కగన్
నిన్నే నాదైవతమనెడి నిత్యసురక్షితన్.34
గోవిందా యిందిర రమణ గోకుల నందనా
దేవా దీనావన వెదికితిన్ శరణంచునే
బ్రోవంగా కోరితి వరసుధాకర కావరా
నీవే దిక్కంచు మొరవిని నిత్యసురక్షితన్.35
కోపావేశమ్ముల కరకు కోరల జిక్కితిన్
భూపాలా శ్రీ ధర యనుచు మ్రొక్కెద కావరా
పాపంబుల్ చేసి శరణని బాయక పట్టితిన్
నీపాదాబ్జమ్ముల విడని నిత్యసురక్షితన్. 36
13) జననీముద
నసతజభర-9
రజత గిరిశా యీశా రమణీయ నాట్యవిశారదా
సుజన జనమందారా సుగుణాలవాల సురేశ్వరా
కుజన జన సంహారా గురుదైవమా శరణందురా
గజవసనుడా శంభో కరుణించు నిత్య సురక్షితన్.37
తిరుమల నివాసా నాతిని గాచినావట మాధవా
కరివరదుడా శ్రీశా కనుపించవేల రమాధవా
సరసహృదయా దేవా సరసాలు చాలుర మాదవా
గరుడ గమనా దేవా కరుణించు నిత్య సురక్షితన్.38
గిరిజ పతివైనా వాకిట నందితో యడుగేయరా
కరి వసనమేలా శ్రీ కర పట్టువస్త్రములిచ్చెదన్
వరద నగజానాధా పరమేశ వేగమె ప్రోవరా
స్మరహరుడయంచున్ నామము దల్చు నిత్య సురక్షితన్.39
14)
ధృతవిలంబితము, హరిణప్లుతా
నభభర-7
సుజనులుందరి చూజెడి శాంభవీ
విజయమీయవె విద్యల తల్లివై
భజనజేసెద పద్యము లీయవే
నిజము బల్కెడి నిత్యసురక్షితన్..40
ప్రకటమైన స్వభావము గూర్చితిన్
చకచకా నిను సన్నుతి చేసితిన్
నికము బల్కుచు నీపద మంటగన్
నికటమయ్యెను నిత్య సురక్షితన్.41
అలుకలుండెడి యానగుమోమునన్
లలితమౌనని రాముడు బల్కగన్
చిలుకు నవ్వులు చెంగట బట్టగన్
నిలచె చెంతనె నిత్య సురక్షితన్.42
15)పద్మసద్మ
రస నజ నభ ర-12
కొండకోనల దోగు చిగురుటాకు తనివి దీరగ నవ్వగన్
గండు కోయిల పాడగ తనరాక తెలుపగన్ మధు మాసమున్
దండిగా జడివాన తడుపగన్ తపనలు దీరగ స్వామి కో
దండరాముని దర్శనము విధాతనడిగె నిత్యసు రక్షితన్.43
వెండివెన్నెల పూచె చిగురుమోవి మురళిపై తగి లించగా
మెండుగా రసవాహిను లెదపై మెరిసెను గాన సుధాం బుధిన్
ఖండితమ్ముగ దెల్పగ తనరాక గమకముల్ పలికింప పూ
దండ వేసెడి భాగ్యమును విధాతనడిగె నిత్యసు రక్షితన్.44
కొండపై కొలువా! తిరుమలపై! కుదురుగ నుంటివి దేవరా
రండు రండని బిల్చెదొ కలికాలము వరదా నిను చేరగన్
గుండెలో నెలకొంటి వనిరినిన్ గురుతెరుగన్ గరు ణించరా
యండగా నిలుచుండమనుచు నిన్నడిగెను నిత్యసు రక్షితన్.45
16) పల్లవరి( భభభభర-7
రామునివా మరి రక్షణ నీయవు న్యాయమా
కామము క్రోధము కాళ్ళను జుట్టెను పాములై
ప్రేముడి బిల్చెద వేదన దీర్పగ వేడెదన్
కాముని తండ్రివి కావవె నిత్య సురక్షితన్.46
రామ సుధాకర క్రన్నన ప్రోవగ వేడెదన్
రామ దయాకర రాజలలామ సురేశ్వరా
రా మహనీయ పరాత్పర జానకి తోడుగన్
నామదినుండ సనాతన నిత్య సురక్షితన్.47
రమ్మని గోరితి రామ దయాకర రక్షకై
సమ్మతి నీయవె సన్నుతి చేసెడి పద్యముల్
కమ్మగ వ్రాసెద క్రన్నన నిన్ను నుతించుచున్
నెమ్మది నీయవె నీదయ నిత్య సురక్షితన్.48
17) పిపీలిక (మమ తర జభర- 9,15)
మాయా లోకంబందున్ బేలా మహానుభావులున్ మహా మహితాత్ములున్
సాయంబందింపంగా నీకై సదా సుధారసం బులన్ గురిపించగన్
నీయాత్మన్ సత్సాంగత్యంబున్ నికామము న్నిదాన మైన పథంబునన్
ప్రాయంబున్ దార్డ్యంబౌ మేనున్ రమాధవున్ భజింప నిత్యసు రక్షితా.49
శ్రీ మాతాయంచున్ సత్యంబౌ శివాణినిన్ శెనార్తితో పదమంటగన్
శ్రీ మాతా యంచున్ నిత్యంబా చిదాత్మనున్ సదా చిరాయువు గోరుచున్
శ్రీ మాతా నీవే దిక్కంచున్ శ్రియమ్ము నెంచి వాసిగా విరులీయగన్
శ్రీ మాతే రక్షించున్ గా కాశివాసమిచ్చి దాసి నిత్యసు రక్షితన్.50
శ్రీకాళేశా! నీవేలా! హస్తి వల్క పాత గోచి !ముంచవు గంగలో
శాకంబుల్ లేవా యేణీ మంసమేల నీకు! బిచ్చ మెత్తుట పాడియా
శ్రీ కైలాసంబేమాయెన్ కాశియో! శ్మశానవాసివైతివి న్యాయమా!
చేకొమ్మా నాసర్వస్వంబున్ శివానిపాద దాసి నిత్య సు రక్షితన్.51
18)ప్రగుణీకృతా (నభభభర-10)
తలచినంతనె క్షేమము దత్తుడు గూర్చు సురక్షితా
కొలచినంతనె దత్తుడు కూరిమి సంపదలీయడా
నిలచిచూడుము చెంతన నీదయ యంచును భక్తితో
తలచిచూడుము నిత్యము దత్తుని నిత్యసురక్షితా.52
అలలు గావవి కోర్కెలు హ్లాదము గూర్పువు సత్యమే
కలలు రాలిన రాత్రులు కల్లలు చేయును వేకువన్
తలపులందున తల్లిని తండ్రిని నిల్పి సభక్తితో
తలచిచూడుము దత్తుని తప్పక నిత్యసురక్షితా.53
వలపువాకిటనిల్చిన వేదనబెంచును సత్యమే
మలచికొమ్మని దత్తుని మేలగు జీవన మీయగన్
పిలచుచూడుము దత్తుని ప్రేమము నిల్పి సభక్తితో
బలిమినిచ్చును దత్తునిపాదము నిత్యసురక్షితా.54
19) ప్లవంగమః (భభతభర-9)
రామ సుధాకర రారా రమాధవ వేడెదన్
రామ దయాకర రావేర శంకర సన్నుతా
రా రణధీర సుధీరా ప్రభాకర శోభలన్
కామన దీర్చుచు కావంగ నిత్య సురక్షితన్.55
పాదములంటెదరా రావణాసుర మర్థనా
నీదయ కోరితినాపన్నివారణ చేయగన్
హ్లాదము గూర్చవయా మాయ మోహము ద్రుంచుచున్
బేధములెంచకుమా కావ నిత్య సురక్షితన్.56
లేదని చెప్పకయా వేడెదన్ కరుణింపగన్
నీదయ కోరితినాపన్నివారణ చేయగన్
హ్లాదము గూర్చవయా మాయ మోహము ద్రుంచుచున్
పాదములంటెదరా దేవ నిత్య సురక్షితన్.57
20) భీకర (భయజజభర-11)
దాశరథి భద్రాచలమ్మున తల్లితో నెలకొంటివా
దాస జనపోషా త్వదీయ పదాంబుజమ్ముల నమ్మితిన్
పాశములలో జిక్కుకుంటిని పాదదాసిని బ్రోవరా
నీ శపథమేమాయెరా కరుణించు నిత్య సురక్షితన్.58
ఆకసముపైనాకమందున హాయిగా నెలకొంటివో
లోకముల నీలోన యుండగ లోకులందురు నుండగన్
నీ కనుల ముందున్న వారిని నీవు గాంచవు న్యాయమా
నీకథలనే పాడెదన్ కరుణించు నిత్యసురక్షితన్.59
నీ మురళి గానామృతమ్మున నీరమై ప్రవహించనీ
నీ మధురమౌ మోవిపై కమనీయ రాగము నౌదునా
నా మనవినందించనా కరుణాలవాల రమాధవా
నీ మనసులో నుంచుమా కరుణించు నిత్య సురక్షితన్.60
21) మణిభూషణము( రనభభర-10)
రమణీయక, సుందర, ఉత్సర, మణిభూషణశ్రీ) నూతనం
పాపరాశిని దహించెడి పాదములంటెదన్
రేపుమాపని తలంచక రేడు రమాధవున్
కోపతాపములబెంచెడి కోర్కెల ద్రుంచగన్
నీపదమ్ముల భజింతును నిత్యసురక్షితన్.61
కాలకాలుడు వసించెడి కాశిపురమ్మునన్
కాలభైరవుని మ్రొక్కగ కాశిపురమ్మునన్
ఫాల లోచనుని గొల్చిన పాపములంటునా
నీలకంఠుని భజింతును నిత్యసురక్షితన్.62
కాశికాపురము నందున గంగను మున్గుచున్
కాశికాపురము నందు సకాలము నందునన్
కాశినాథుని భజింపగ కావగ భక్తులన్
నీసమానమెవరందును నిత్యసురక్షితన్.63
22)మణిహంసా 699 మనోహంస 700 మానసహంస రణహంస
సజజభర-10
జడగట్టెజుట్టు చాలును స్నానము శంకరా
గుడిగట్టినీకు చేసెద కూరిమి పూజలన్
మడిగట్టి వంటచేసెద మాంసము మానుమా
నిడిగాలి దీపముంచెద నిత్యసురక్షితన్.64
తడగట్టు గట్టెదన్ నెలతాలుపు చాలదా
తడవాడుచుండె పాములదండలు శంకరా
తడిలేని వస్త్రమిచ్చెద తాండవమాడగన్
నిడిగాలి దీపముంచెద నిత్యసురక్షితన్.65
తడగట్టు= పాముల మంత్రము
తలపైన గంగతో శివతాండవమేలరా
వలిచేయుతీయరా భవ పాముల దండలన్
తలపైన నిల్పరాహర దండము బెట్టెదన్
నెలదారివందురే దొర నిత్యసురక్షితన్.66
23)మత్తవిలాసినీ, కవిమయూర
భభభభభభర-13
శంకర శ్రీ కర సాంబసదాశివ దండము సాధుజ నావనా
కింకరులన్ కరుణించవె చండుడ క్ష్వేళగళుండని గొల్చెదన్
శంకలు దీర్చవె పాదములంటెద సాంబదిగంబర ప్రోవరా
నెంకెఱజేయక దర్శనమీయవె నీదయ నిత్య సురక్షితన్.67
కాశిపురాథిప కామితదాయక కావరవేగమె శంకరా
దాసుల బ్రోచెడి చండుడవీవయ దండము భక్తవ శంకరా
పాశవిమోచన పాదములంటెద భస్మవిలేప శుభంకరా
నీశుభనామము నిత్యము బల్కెద నీదయ నిత్య సురక్షితన్.68
మోదకహస్తుడ డుంఢివినాయక ప్రోవర విఘ్న వినాశకా
మోదముగూర్పర సాక్షిగణేడుడ మోహన రూప వినాయకా
పాదములంటెద పాశముదీయర బాలగణే శుడ కావరా
నీదయ గోరితి విద్యలనీయగ నెమ్మది నిత్య సురక్షితన్.69
24)మదనోద్ధురా / ఉత్సుక (భభర)
దేవకినందకుమారుడా
దీవెనలిచ్చిన చాలురా
పావన నామము పాడెదన్
బ్రోవర నిత్యసురక్షితన్.70
రావణ దర్పవినాశకా
రావయవేగ రమాధవా
సేవలనంద జనార్థనా
కావర నిత్య సురక్షితన్.71
కావలి యుంటిని వాకిటన్
పావనదర్శన మీయరా
త్రోవనుజూపగ రావయా
నీవయె నిత్య సురక్షితన్.72
25)మధుమల్లీ (సభర)
వినుమా నామొర శ్రీధరా
మనసారా నిను గొల్చెదన్
మనసేనీదని తెల్పెదన్
కనుమా నిత్య సురక్షిత న్.73
నరసింహా శరణంటి ని
న్నరయంగా దరిజేరితిన్
కరుణింపన్ దరిశించెదన్
వరదా నిత్యసురక్షితన్.74
నరసింహా కనుపింపవా
నరసింహా దరి జేర్చవా
నరసింహా కరుణించవా
త్వరగా నిత్యసురక్షితన్.75
26) మనహంస (తజజభర-10)
సాకేతపురాథిప రాక్షసమర్థనా శరణంటిరా
లోకాన పరాత్పరుడెవ్వరు భక్తులన్ కరుణించగన్
లోకంబుల సుందరుడెవ్వరు రావణాసుర మర్థనా
నీకేతన మెత్తెద దాసిని గాన నిత్యసురక్షితన్.76
యాదాద్రి విభో శరణంటినయా దయాకర బ్రోవరా
వేదాద్రి నివాసుడ వేదవిహార వేదన దీర్చరా
పాదమ్మల నమ్మితి భక్తవశంకరా కనుపించరా
నీదాననురా పరమేశుని దాసి నిత్యసు రక్షితన్.77
రామా రఘునందన దాశరథీ దయాకరు డంటిరే
రామా యినవంశజ రాజలలామ దైత్యవినాశకా
రా మాధవ కేశవ కావర భక్త రక్షణ చేయవా
రా మాయిలవేలుప బ్రోవర నన్ను నిత్యసు రక్షితన్.78
27)మనోజ్ఞ -కలభాషిణి- నవనలిన అరవిందక
నజజభర-10
శరణము రాఘవ రాక్షసమర్థనా పదమీయవా
సురముని వందిత సర్వశుభంకరా మరుగేలరా
వరసుగుణాకర దానవసంహరా కరుణించరా
నిరతము నమ్మిన దానని గాన నిత్యసురక్షితన్.79
హరహర శంకరరార హరోంహరా యని బిల్తురా
సురముని పూజిత మౌళి సుధాకరా వరమీయరా
పరమదయాకర రామపదార్చితా శరణంటిరా
తిరముగ బ్రోవర పార్వతి నాథ నిత్యసురక్షితన్.80
హరిహరసూనుడ దైత్యహరా దయాకర ప్రోవరా
గురుగుహ మూర్తివిశంభుకుమార దేవసుధాకరా
శరవణ పాలిత స్వామి షడాననా కరుణించరా
తిరముగ నుంటివినామది నీది నిత్యసురక్షితన్.81
28) మయూవదనా (భజజభర-9)
భద్రగిరి వాసుడ రావణాసుర మర్థనా
రుద్రుడవు నీవుర దారుణమ్మును గాంచరా
క్షుద్రమగు జీవుల నీకు గుర్తును తెచ్చితిన్
భద్రమున గూర్పగరావ నిత్యసురక్షితన్.82
పాదములనీయర కావరావయ శంకరా
వేదముల నేర్వను నీ విధానము నేరనే
నీ దయను గోరితి మౌనినైనను గానురా
చేదుకొన గోరితిదాసి నిత్యసురక్షితన్.83
రామ యను నామము తారకమ్మని యందురే
రామ యని యంటిని జాలమేలరమాధవా
రామసుగుణాకర తాళలేనుర కావరా
క్షేమ మిడ గోరితి దాసి నిత్యసురక్షితన్.84
29) రాధికా (సభభర-7)
మదిలో శంభు నుమాపతి దల్చుచున్
మదియే యీశుని మందిరమై హరా
పదిలమ్మౌనిక పాదము లంటగన్
నిధులే గోరని నిత్యసురక్షితన్.85
అదివో వేకువ యంబరమంటగన్
నదిలో కాంతులు నాట్యము లాడగన్
కదిలే యూహలు కాంతుల నింపె నా
నిధులే యన్నది నిత్యసురక్షితన్.86
సుధలే చిల్కెడి సుందర దృశ్యముల్
విధి తా వ్రాసిన ప్రేముడి చిత్రముల్
మదిలో నిండెను మాధవ డుండు స
న్నిధిలే యన్నది నిత్యసురక్షితన్.87
30) లలితా (ననమతభర-12)
కరివరదుడ రారా దేవా శ్రీ కరా కరుణించరా
గిరిధర దొర రారా కృష్ణా చేకితానుని నేస్తమా
సిరిపతి దొర రావేరా నీ దాసినే నను బ్రోవరా
మొరలను వినవేరా రామా దాసి నిత్యసు రక్షితన్.88
కరివసనుడ రారా దేవా శ్రీ కరా కరుణించరా
గిరిజనుగొన లేదా రారా చేకితానుడ గావరా
సిరులను వరమీరా యీశా నా చికాకుల ద్రుంచరా
మొరవిని పరమేశా రారా వేచె నిత్యసు రక్షితన్.89
పగటి వెలుగులందించేవా దేవరా కరుణించరా
అగణిత గుణశీలా దివ్యాంశా! యజంభుడ! బ్రోవరా
గగనమణివి మార్తాండా దేవా గభస్తివి దేవ నీ
నగవులు గన దర్శింతున్ నీదాన నిత్యసురక్షితన్.90
31) వాంధర/యూథికా/యురీకా (రనభర-7)
నాది నాదనుచు నాటకమాడితి
న్నేదినీదనగ నేమని చెప్పెదన్
నీది నాదనను నీ దయ నీయవా
నీదుపాదముల నిత్యసురక్షితన్.91
అందమైనవని యర్రులు జాచితిన్
పొందరానివని పోరును చేసితిన్
సందియమ్మువిడ సన్నుతిజేసెదన్
నిందజేసితిని నిత్యసురక్షితన్.92
దూర రానిదట దుష్కరమైన సం
సారసాగరము సన్నుతి చేసెదన్
చేరవచ్చితిని చెంతన నిల్చెదన్
నేరమెంచకుము నిత్యసురక్షితన్.93
32) విభ్రమగతి(మసజసతతభర-13)
శ్రీ రామా రఘునందనా దశరథా సీతమ్మనే జూచితిన్ జని లంకకున్
క్రూరుండాతడు రావణాసురుడుతా ఘోరాతి ఘోరమ్ముగా చెరబట్టెరా
పారావారము దాటి చూచితిని నీపాదమ్ములే నమ్మి రోసెడు జానకిన్
రారా వేగమె లంక కేగెదమురా రక్షింప మాయమ్మ నిత్యసు రక్షితన్.94
సీతామాతను జూడనేగెదను నే శీఘ్రమ్ముగా లంక నంతయు చూచెదన్
పాతాళమ్మునకేగి జూచెదను నేపాథోధిలో జూచెదన్ వినువీధిలో
మా మాతన్ కనుగొందునే రయముగా మాతండ్రి సంధించగా శరమయ్యెదన్
రామా వేగమె లంక కేగెదను సం రక్షింప మాయమ్మ నిత్యసు రక్షితన్.95
ఎన్నోరాత్రులు జారిపోయినవి నేనిన్నెట్లు వీక్షింప చేరెద నాథుడా
నిన్నా బంగరు జింక తెమ్మనుచు నేనే పంపితిన్ న్నా థుడా కరుణింపరా
యెన్నోయెగ్గులు లక్ష్మనున్ బలికితిన్యిక్కట్లబాలైతినే మని చెప్పెదన్
మున్నీ దైత్యుడు రావణారి చెర నన్నోముంగ రమ్మందు నిత్యసు రక్షితన్.96
33)శంబర(నభ భర నభ భర-7/12)
శరణమంటిని శంకరదేవ శాశ్వతుడ కావర పార్వతి నాథుడా
శరణమంటిని సాంబమహేశ సాధనము చేసెద నాట్య విశారదా
శరణమంటిని సాధుశరణ్య చాలునిక కావర శ్రీ పర మేశ్వరా
శరణమంటిని శర్వుడ శార్ఙ్గి సంగ్రహుడ బ్రోవర నిత్య సురక్షితన్.97
కరుణజూపర శంకరదేవ కారణుడ కావర పార్వతి నాథుడా
మరణమన్నది మాయర దేవ మా మదిని నిల్వర నాట్య విశారదా
తరుణమైనది తప్పదు బ్రోవ దాసులను కావర శ్రీ పర మేశ్వరా
శరణమంటిని శాంఖ్యుడ రార సంగ్రహుడ బ్రోవర నిత్య సురక్షితన్.98
చరణమంటెద శంభునిజేరి సంయుతుడ కావర కాశి పురాథిపా
వరములీయర పార్వతినాథ పాదముల బట్టెద నాట్య విశారదా
గిరిజనాథుని కీ ర్తనచేసి క్ష్వేళగళుడాయని గానము చేసెదన్
తరుణి నైతిని దాసినిగాన దాతవని మ్రొక్కెద నిత్య సురక్షితన్.99
34) సహేలికా (జభర)
హరోంహరాయని దల్తురా
గిరీశ కావర దేవరా
సురేశ సన్నుత బ్రోవరా
స్మరించు నిత్యసురక్షితన్.100
వరాలనేమియు గోరరా
సరాగమాలలు వైతురా
పరాకు జూపక వేగరా
వరించు నిత్య సురక్షితన్.101
సరేగదా యని యన్నచో
సరాసరి యటు వచ్చెదన్
శరీరమే తమ దౌనురా
వరించు నిత్య సురక్షితన్.102
35)హరణీపద. (నస మత భర-11)
కరివరదుడా గోవిందా నీకన్న దిక్కెవరందురా
గిరిధర దొరా రాధా కృష్ణా కేలుమూడ్తును శ్రీ ధరా
సిరిపతి దొరా రావేరా రక్షింపరా నను బ్రోవరా
మొరల వినరా చూపించన్ నీ మోము నిత్యసు రక్షితన్.103
శరవణభవా శ్రీ స్కందా నీశక్తి తో నను బ్రోవరా
హరిహరసుతా యయ్యప్పా నీయందమే కను విందురా
గురుగుహ! కుమారా! షడ్వక్త్రా!కూర్మితో మము కావరా
వరద శుభదా సుబ్రహ్మణ్యా! దేవ! నిత్యసు రక్షితన్.104
కరివదన దేవా విఘ్నేశా కావరా కరుణించరా
సరియెవరు లేరయ్యా విఘ్నేశా నమామి వినాయకా
వరములిడగా హేరంబా రావయ్య పార్వతి నందనా
చిరునగవులే చాలయ్యా! నీదాసి! నిత్యసు రక్షితన్.105
36)హాసాస్య(జరభర-7)
పరాకు చాలురా పార్థన చేసెదన్
సరాగమాడగన్ సాధ్యము కాదురా
వరాల మాదొరా పాదము లీయరా
నిరాకరించకన్! నిత్యసు రక్షితన్.106
పదామ్మునంటుచున్ పార్థన చేసెదన్
సదాశివా హరా కావర దేవరా
సుధాకరా శివా సుందర బ్రోవరా
నిదానమేలరా! నిత్యసు రక్షితన్.107
