మాఘ పురాణము పదిహేడవ అధ్యాయము.
మాఘ పురాణము (పదిహేడవ అధ్యాయము)
ధర్మమార్గము జూపవచ్చిన దత్తదేవుని దల్చెదన్
కర్మలన్నియు ప్రోదిజేసెడి కార్యకారణ రూపుడౌ
నిర్మలాత్ముడు దత్తదేవుని నీడయందున నిల్చెదన్.
మర్మమించుక దెల్పమందును మాఘ మాసము శ్రేష్ఠతన్.
శుకమహాముని మార్కండేయుడు మృత్యువును జయించెనని జెప్పగా పరీక్షిత్తు "ఓ మహాత్మా" ఆ వివరమును దెల్పని ప్రార్థించెను.
తరళము.
వినుము పాండవ పౌత్రుడాయని వేద్యుడౌ శుక మౌనితా
ననునయంబుగ జెప్పెనా కథ, నారుమాసము లాయు వే
తనకు దక్కెనటంచు బల్కు విధాత దిక్కని చెప్ప నా
ముని మృకండు మరుద్వతుల్ విని మూర్చ నొందిరి యక్కటా.
తరళము.
తనయుడా నిను చూడకుండిన దక్కునా మరి ప్రాణముల్
మనిసిజానుని వైరి గొల్వగ మాకు దక్కిన పుత్రుడా
తనయుడుండని యింటివారికి దక్కునా సుఖ సౌఖ్యముల్
తనయుడే గద వెల్గునిచ్చును తల్లుదండ్రుల కళ్ళకున్.
మ.కో
ఎన్ని నోములు నెన్ని పూవుల నెన్ని పూజలు సల్పుచున్
యెన్ని దీక్షలు బట్టినామయ నెన్నినాళుల నిష్ఠతో
నిన్ను పొందిన భాగ్యమేమరి నీలకంఠుని మ్రొక్కగన్
కన్న తండ్రివి నిన్ను గంటిమి కాలకంఠుడు మెచ్చగన్.
తరళము.
సుతులు లేని గృహంబులున్ మరి సూర్యు డుండని బవ్వలుల్
శతమయూఖుడు లేక శూన్య ఖజాక మందురు చూడగన్
సుతులు లేకయె లోక ధర్మము శూన్యమై గతి తప్పునే
సుతులు గల్గిన వారికే పలు సూనృతంబులు దక్కనే.
తరళము
మునుపు బ్రాహ్మణ సొత్తు దోచగ మోసగించి న వాడనా
పెనగి బిడ్డను తల్లుదండ్రుల వేరు చేసిన పాపినా
మునుకు యాకొని యున్న వానిని పొమ్ముపొమ్మను దోషినా
యని మృకండుడు చింతనొందెను నబ్బురంబుగ దోచెనే.
గీ.
దేవతలనింద యతి నింద తెలివి దప్పి
ప్రాణ నిందను జేసిన పాపి నగుదు,
సాధుజనులను తెలియక బాధపెట్ట
పూర్వజన్మల పాపము ముందు నిలచె
ననుచు నామృకండు మహర్షి యలమటించె.
మ.కో.
పిల్లవాండ్లను తల్లుపాలకు వేరుచేసిన పాపినో
పిల్లతల్లుల జూసి యీసును పెంచుకున్న విమోహినో
ప్రల్లదంబున ప్రక్కటిండ్లకు బాఱితో యని నేడ్చెనా
తల్లిచెంత మృకండు సూనుడు ధైర్యమించుక జెప్పెగా.
వచనము
కుమారా నీకు మరో ఆరుమాసములే ఆయువని చింతించు తల్లిదండ్రులను జూచి ఆ మార్కండేయుడు ఇట్లనె.
తరళము.
సవినయంబుగ బల్కెనిట్టుల శాంతచిత్తము నందునా
శివుని మెప్పును బొందినారలు చింత నొందుట న్యాయమా
భవుని గొల్చెద నాయువిమ్మని భార మంతయు వేసెదన్
యెవని కైనను నాయువిచ్చెడి ఈశుడుండెను దిక్కుగా.
మ.కో
ఆరుమాసము లందుదీరెడి నాయువున్నది చాలదా
కారుచీకటి పార ద్రోలెడి కాలకంఠుడు దిక్కు నే
చేరి మ్రొక్కెదనీశునే మరి శ్రీ కరంబగు దీప్తికై
మీరు చింతలబోకుడంచును మించి బల్కెను పుత్రుడే.
వచనము.
అనవుడు మృకండుడు తన కుమారుని జూచి ఇట్లనె. "పూర్వము సిధ్ధజనార్థన క్షేత్రమని నేడు కోటిఫలి (కోటిపల్లి) యను క్షేత్రము" గౌతమీ తటిన గలదు. అచటకేగి మృత్యుంజయునివి కమ్మని దీవించి బంపిరి.
మ.కో
గౌతమీతటి నందు గొప్పది కాలకంఠుని క్షేత్రమే
భూతనాథుని చేరి గొల్చిరి మున్ను మౌనులు తాపసుల్
శ్వేతకేతుని రక్షజేసెను జింకతాలుపు మున్నిటన్
చేతనత్వపు కోటిపల్లికి చేరుకొమ్మిక పుత్రుడా
మానిని.
సిధ్ధజనార్థన క్షేత్రము కేగుము సిధ్ధులు మున్ను వసించిరటన్
బుధ్ధిగ జేసిన పూజఫలించగ పూర్వము చెప్పిరి భూసురులున్
ఒద్దికగావిని ఓయని బల్కుచు నూరిని వీడెను నోరిమితో
సద్దును జేయక సాగెసతర్కుడు సాధ్య ఋషీవర సాధనకై.
ఆ పుణ్యగౌతమీ తీరానికి చేరిన మార్కండేయుడు.
మానిని
తానొక లింగము స్థాపన జేసెను ద్రాపుని గొల్వగ తాపసియై
పూనికనొందెను పూలను పత్రిని పూజకు గూర్చెను భూసురుడే
మానసపూజ నుమాపతి గొల్చెను మాపని రేపని మానకనే
దీనజనావన దేవరకావర దిక్కువు నీవని దీనముగా.
మానిని.
నామము బల్కెద నామది నీదిగ నాయువు నీయవె నాకు శివా,
నీమము దప్పక నీపద మంటెద నీదయ కోరుదు నింకశివా,
కాముని గాల్చిన కాలుడవైతివి కామన సేసెద కావుమయా,
నామది వీడకు నాదవిలోలుడ నాట్యవిశారద నాగశివా!
వచనము.
ఇక ఆ మార్కండేయునికి పదహారేండ్ల వయసు పూర్తి కావచ్చింది.
అంత విధాత దేవతాదులతో కూడి పరమేశ్వరుని చేరి తాను అనాలోచితముగా మార్కండేయుని చిరంజీవ అని దీవించిన వైనాన్ని భక్తితో తెల్పి, ఆ మృకండు సూనుని కరుణించి చిరంజీవిని చెయ్యమని ప్రార్థించారు.
మ.కో.
అంతనా విధి దేవతాదులు నంతకాంతకు గొల్వగా
చెంత నిల్చిరి చేరి మ్రొక్కిరి చెప్పిరాకథ నంతయున్
సంతసించి మృకండు సూనుకు చాలనాయువు నిచ్చెతా.
చింత దీర్చెద పోయిరండని జింకతాలుపు చెప్పెగా.
వచనము.
మాఘశుధ్ధ పంచమినాటికి మార్కండేయునికి పదారేండ్లు నిండినవని వాని తెమ్మని యమధర్మరాజు భటులబంపెను.
మానిని
కాలము తీరగ కాలుని భ్రుత్యులు గాలము వేయగ గాంచితిరా
బాలుని జేరగ బాలుడు జూచెను బాఱెను మందిర ప్రాంగణమున్
కాలుని భ్రుత్యులఁ కాదని చెప్పిరి గౌపతి భ్రుత్యులు గాచిరిగా,
కాలుని భ్రుత్యులు కాదని చెప్పగ కాలుడు జూపెను కావరమున్.
వచనము.
ఈ బాలుని బట్టుట మా వల్లకాదని భ్రుత్యులు చెప్పగా మాఘశుధ్ధ సప్తమి (రథసప్తమి) నాటికి కాలుడే స్వయంగా వచ్చెను క్రుధ్ధుడై.
మ.కో
కాలుడొచ్చి మృకండు సూనుని కాలమా యెను రమ్మనెన్
పూలు దెచ్చి పురారి గొల్చుచు పూజసేయుచు నుండెనా
బాలుడత్తరి కౌగిలించెను పంచవక్త్రుని నార్తితో
తాళుమోప్రభు పూజచేసెద తాళివచ్చెద నన్ననూ.
కాలుడాగక పాశబధ్ధుని కావరమ్ముగ జేసెగా
శూలపాణియె క్రుధ్ధుడాయెను సూటి తాపును తన్నగా
కాలుడత్తరి మూర్చనొందెను కాలమాగెను వానికిన్
కేలుమోడ్చిరి చేరి మ్రొక్కిరి గిబ్బ రౌతుదయా మయున్.
ఫెళ్ళెఫెళ్ళెను దిక్కులన్నియు పెద్ద శబ్దము నిండెగా
సుళ్ళుదిర్గెడి వింతవెల్గులు శూలపాణిని జుట్టెగా
కళ్ళు దిర్గిన కాలుడప్పుడు కాంకమందిన వానిగా
త్రుళ్ళిపోయెను కాలుడత్తరి దొర్లిపోయెను భీతితో.
శ్రీలుగూర్చును మాఘమాసము శ్రీకరమ్ములు నిచ్చుతన్
పాలు బిల్వము గంగనీటని పార్వతీశుని కిచ్చుచున్
నీలకంఠుని లోకచక్షుని నిష్ఠతో నుతి జేయగన్
మేలుమేలని పెద్దలందరు మించి చెప్పిరి మున్నిటన్.
బాలుడీతడు నన్నుగొల్చెను భక్తిమీరగ కాలుడా
కాలపాశము నాకు వానికి కావరమ్మున వేసితో
చాలు చాలును తెంపరీ నిను చావదన్నిన మేలగున్
కాలకంఠుని నేనుదల్చిన కాలమెట్టుల తీరురా?
వచనము.
అలా ఆ కాలకాలుడు కాలునికి బుధ్ధిచెప్పి బాలుడైన మార్కండేయుని రక్షించి చిరాయువునిచ్చినది ఈ మాఘమాసము నందేనని ఆ శుకబ్రహ్మ పరీక్షిత్తుకు వివరించెను.
స్వస్తి.
ధన్యవాదములు.
నమస్కారములు.
నాకు ఈ అవకాశము మరోసారి కల్గించినందుకు మీకు సదా కృతజ్ఞతలు తెల్పుతూ,
భవదీయుడు.
లంక శివరామకృష్ణ శాస్త్రి,
కుషాయిగుడ-500062
హైదరాబాదు.
10/02/2021

No comments:
Post a Comment