జయగురుదత్త
కరోనా శతకము
కరోనా మొదలైన రోజుల్లో
కం.
తగని పనిజేసె చైనా
మగటిమి జూపక కరోన మాయలు బన్నెన్!
జగతి రథచక్రమాగెను
వగచిన ఫలమేమి దత్త పాదము బడుదున్!!.1
గబ్బిలము కప్ప తేళుల
సుబ్బరముగ తిన్నవాని చోద్యము గనరే
యబ్బుర మాయెను జగతికి
యబ్బాబ్బా యీకరోన నంటించె నయా! 2
జబ్బలు జరచుట రాకయె
జబ్బుల నంటించె చైన చాలుకరోనా
మబ్బులు క్రమ్మెను జగతికి
గబ్బును వదిలించ వేగ కదలవె కృష్ణా! 3
చైనా ఫోనులు ఇకనుం
చైనా విడచిన శుభమగు చాలు కరోనా!
చైనా వస్తువులు వలదు
చైనా సంపర్కమింక ఛాలు కరోనా! 4
భూతము లైదని తెలియును
భూతము క్రొత్తది కరోన పుడమిన బుట్టెన్!
భూతము గానే మిగిలిన
భూతమునై చైన నిన్ను బూదిగ దాల్తున్!! 5
గాలి విషమైనది గనుడు
నాలుక చాపుచు కరోన నాట్యము లాడెన్!
మేలగు మాటలు నుడివెద
కాలుని భయమేల కాలకాలుండుండన్! 6
చుక్కల నంటెను ధరలే
రెక్కలు తొడిగెను కరోన రేయుంబవళుల్!
అక్కజమాయెను కష్టము
ముక్కుచు మూల్గుచు తరిమెద పోవెకరోనా! 7
దొరకిన దిదియే సందని
ధరలన్ పెంచిన కరోన దండించునయా!
మరవకు నీతియు న్యాయము
శరణము దొరకదు చివరకు శార్వరి మిగులున్!! 8
గంగా స్నానము సేయుచు
లింగారాధన కరోన రిక్తము జేయన్!
బెంగయె లేదిక మనలకు
రంగని పాదములు బట్ట రక్షణ గల్గున్!! 9
సరగున రావయ శ్రీ హరి
పరమ పురుష యీ కరోన భరతము బట్టన్!
పురుషోత్తమ వేగమె మము
గరుణించగరావె రామ కరుణా సింధో!! 10
భవ రోగ మెంత కఠినము
శివ నామమె రక్షనిచ్చి చింతలు దీర్చున్!
జవసత్వమిచ్చి జనులకు
పవమాన సుతుడు కరోన భరతము బట్టున్! 11
కిస్తీ గట్టగ లేరిక
సుస్తీ జేసెను కరోన చూడుము కృష్ణా
పస్తులు పగలును రాత్రికి
యస్తికలు మిగిలెడి రోజు లయ్యో వచ్చెన్!12
ఊడగనుద్యోగములిల
వేడిన విడువదు కరోన వికవిక నవ్వెన్
ఊడిగ మైనా జేయగ
జాడైనను గాననైతి జానకి రామా!13
అమ్మా కరోన భయమే
తుమ్మగ రాదట మనుజులు తొందర పడగన్
నిమ్మళ మెప్పుడు కలుగునొ
రమ్మని బిలచెద భవాని రక్షణనిడుమా! 14
రణభేరి మ్రోగెను వినుడు
గణగణ గంటలు కరోన కట్టడి జేయన్
గుణ పాఠము నేర్ప మనము
కణకణమను నిప్పుకణిక కావలెనికపై! 15
ధరణిని కరోన బట్టెను
మరణమృదంగము వినవడె మామవ కరుణా
వరణా వేగమె బ్రోవర
గిరిజా రమణా పరేశ కేలను మోడ్తున్!!16
ప్రాణాయామము జేయుడి
వీణావాదన కరోన విషమును జంపున్
వేణువు నూదుచు వచ్చెడి
బాణాసురవైరి దాని భరతము బట్టున్!17
హాలాహలమే మ్రింగితి
కాలుని దన్నితి పరేశ గరుణా సింధో
ఏలా యుపేక్ష శివ శివ
లీలగ రావయ కరోన రిక్తము జేయన్!18
సజ్జనుల గావ వెలసితి
వుజ్జయిని మహానుభావ యుగ్రుడరారా!
తర్జని జూపవె భవహర
గర్జించుము యీకరోన గడగడ వణకున్!19
ఓంకా రేశ్వర శివ నీ
ఘీంకారముతో కరోన గిజగిజ మన వా
మాంకాస్తిత యంబనుగొని
యింకా రావేమి స్వామి ఈశపరేశా!!20
కాశీ పురమున కర్ఫ్యూ
ఈశా ఏమిది కరోన యీవిధి జేసెన్
రోసితి మనమున నేనును
పాశము వేయుము కరోన భరతము బట్టన్!21
రామేశ్వరమున వెలసిన
రామేశా హర కరోన రట్టడి గనుమా!
ఏమా చోద్యపు నగవులు
రామా నీవైన మాకు రక్షణనిమ్మా!!22
తిరుమల గిరిపై శ్రీ హరి
మురిపెముగ నిలచి కరోన ముచ్చట మరచెన్
హరిహరి నీకిది తగునా
మరియాదగ నీకరోన మాయింపగదే!23
రేపగ కరోన చింతలు
రేపని మాపని దలపక లేవం డికపై
దాపునె వేంకట రమణుడు
జూపిన చరణములబట్ట సుఖములు గల్గున్!24
కృష్ణకు వలువల నిచ్చితి
కృష్ణుని రథమున నడిపితి కృపనే జూపన్!
కృష్ణా నీకే జెల్లును
కృష్ణా దయగొని కరోన కౄరుని గొనుమా!25
మారుతి రాయా రావయ
భారము ద్రింపవె కరోన పావన చరితా!
సారము లేనిబ్రతుకుల
సారథి నీవయ్య దేవ సాయము నిడవే!!26
దత్తుని పాదము బట్టితి
చిత్తుగ జేయగ కరోన చింతను దీర్చన్!
చిత్తము నీపై నిలిపెద
మొత్తము జగతిన కరోన పూడ్పింపగదే!!27
ఆపండిక మీగోలను
నేపంచాంగము కరోన నెప్పుడు దెలిపెన్!
ఈపండితులె మనకు శఠ
గోపము బెట్టగ భజింతు గోవిందుడనే !28
శ్రీ పాదవల్లభ శరణు
మాపాలిటి దైవమీవె మమ్ముల బ్రోవన్
నీపాదములే బట్టిన
రాపాడించవె కరోన రట్టడి నాపన్!29
ధారుణి విలవిల లాడెను
దారులు మూయగ కరోన తాండవ మాడెన్!
మారణ కాండము నాపి ని
వారణ సేయవె పరేశ ప్రార్థన జేతున్!30
దత్తుని పాదము విడువక
చిత్తము బెట్టిన కరోన చింతలు దీరున్!
సత్తెము భవభయ రోగపు
పత్తెము నేడే లబించె పాదము విడువన్!31
వారధి బంధన రామ ని
వారణ జేయవె కరోన బాధలు శ్రీ సీ
తారామచంద్ర వేగమె
రారా శ్రీ రాఘవేంద్ర రాజీవాక్షా!32
వరమేమియు నేఁ గోరను
కరములు జోడింతు నయ్య కష్టము దీర్పన్!
నరసింహ స్వామి వినుమ
దొర నీవైనను కరోనఁ త్రుళ్ళణచుమయా!!33
శ్రీ రామ నవమి వచ్చెను
మారాముడె మాకు దిక్కు మాయకరోనా!
మారామ భక్త హనుమయె
పోరాడును తోకముడిచి పోవెకరోనా!!34
శరవణ భవుడే దిక్కని
శరణము గోరితి కరోన శమియింపగదే!
వరముల నేమియు గోరను
మరణము లాపుము కరోన మాయింపగదే!35
కరములు మోడ్చిన చాలును
శరవణ భవుడే కరోన శఠమును దీర్చున్!
మరణపు భయమే వలదిక
గిరిజా సుతుడే కరోన కీడును బాపున్!36
నీవై రావా రామా
ఏవైపున గన కరోన యె టులుండెనయా
ఏవైనము నెరుగము మరి
వేవేగమె రావె రామ వేదన బాపన్!37
గోవిందా యాదుకొనవె
నీవెందు కలిగితి వయ్య నీవై రావా
కోవిడు కరోన కష్టము
లావైనది చూడవయ్య రక్షింపవయా!38
వందన మయ్యా శంకర
వందన శతములు సురేంద్రవందిత చరణా
యందును వందన మందును
చందన మలదుచు కరోన చలనము నాపన్!39
మ్రొక్కని దొరలకు మ్రొక్కుచు
చక్కగ పద్యముల నల్ల జచ్చుకరోనా!
మక్కెలిరగ దీసెద నిక
ముక్కలు చేసెదను చచ్చు పుచ్చుకరోనా!!40
గిరగిర తిరిగెడి వారలు
మరమనుజుల వలె కరోన మాయకు లోనై
చిరచిర లాడగ జచ్చిరి
గిరిజాపతినీవె రక్ష కిమ్మనవే లన్ !!41
వలదను పనిచేయుటలో
తలపండినవారె నాటి దనుజులె పోలెన్
విలవిల లాడిన నేమిటి
కలి కాలములో కరోన క్రమ్ముట దప్పా! 42
జానెడు పొట్టను నింపగ
మానము నమ్మిన కరోన మాయింపదొకో!
దానము ధర్మము మరచిన
మానవుల కిటుల జరుగుట మాయే గాదా!! 43
ధనసంపాదన మరిగిన
మనుజుల మధ్యన కరోన మాయలు గనరే!
కనులింక నెత్తికెక్కగ
మనిషియె మృగమై మనుగడ మట్టిన గలసెన్!! 44
దేవుళ్ళందరు హాయిగ
యేవూళ్ళో వారు చాల యేకాంతమునన్
సేవలు జేయించు కొనగ
మావంటి జనులు కరోన మాయకు జనరే! 45
ఎక్కడి దేవుళ్ళక్కడె
చక్కగ సేవల సుఖముల చాలని యనరే!
దక్కెను కరోన మాకిల
ముక్కిన మూల్గిన విడువదు ముంచెను జగతిన్!!! 46
అండగ నుండెడి వేల్పులు
మెండుగ కలరిలను మాకు మేటి కరోనా!
కండలు తిరిగిన భటులును
వెండితొడుగు డాక్టరులిల వేలుకరోనా!!47
పదునాలుగేళ్ళు రాములు
పదమూడేళులు ఘనులగు పాండవు లిలలో
సదమల వృత్తిని జనగన్
ముదమౌ కర్ఫ్యూ లు మాకు పొమ్ము కరోనా! 48
తెలతెల వారగ పక్షుల
కిలకిల రావముల వల్ల కీడే తొలగెన్
విలవిల లాడిరి కొందరె
గలగల మాట్లాడిరంత గనవెకరోనా! 49
వాహనముల రొద తగ్గెన్
సాహసములు జేసి కాలు సాగించె నరుల్!
ఆహా మేలని గుర్రపు
వాహనములనెక్కినారు వారుకరోనా!! 50
పట్టిన పట్టును విడువడు
గట్టిగ చెప్పెను జనులకు కదల వలదనెన్
రట్టడి నాపెను చివరకు
కట్టడి చేయగ కరోన ఖైదై పోయెన్! 51
ఎవ్వరు జేసిన కర్మము
నవ్వారిని విడువదనుచు నందరు తలపన్!
అవ్వల నివ్వల జచ్చిరి
కవ్వము లాగా చిలుకగ కాళి కరోనా!! 52
కలిసుండిన కలదు సుఖము
బలుసాకైనా బ్రతుకుకు బాగు కరోనా!
మెలమెల్లగ బుధ్ధి గలిగె
మెలకువ కలిగించె నిట్లు మేటి కరోనా!! 53
మిలమిల మెరిసెడి కన్నులు
తళతళ లాడెడి కురులును తమకము నింపన్
కలలా గడచెను కాలం
బిలలో తనసతియె చాల యింపు కరోనా! 54
ఎవరింటిన వారుండగ
ఎవరంట్లనువారె త్రోమ నేమి కరోనా!
చివరకు సడలెను కర్ఫ్యూ
అవసర మయినంత నేర్పె నయ్యొ కరోనా!! 55
పెద్దమ్మ బుట్టె చివరకు
పెద్దన్న వణక గడగడ పెరిగెకరోనా!
సుద్దులను విన్న వారల
వద్దకు వెళ్ళదట మేలు వగచెకరోనా!! 56
ఆర్థిక మాంద్యము బుట్ట స
మర్ధించెడు వారులేక మరిగె కరోనా!
వ్యర్థములై బ్రతుకు మన
స్పర్థలు పెరిగెను చివరకు శాంతియె తొలగెన్! 57
దానము ధర్మము చేయుచు
మానవులనిపించు కొన్న మాసెకరోనా!
మానవ సేవయె మేలని
మానక చేసిన మనుజుల మధ్యన నిలచెన్! 58
వాడని వీడని దలపక
వేడిన వారినెల్ల బ్రోచు వేంకట రమణా!
వేడితి వేగమె రావయ
దాడిని యాపవె కరోన దారుణ మికపై! 59
చెంపకు కరమును జేర్చిరి
సొంపుగ చరవాణి జేర్చి సోది కరోనా!
వంపుగ మెడనే బెట్టిరి
కొంపలు మునుగంగ వచ్చు కోరి కరోనా! 60
నెత్తికి నెక్కిన కళ్ళను
మొత్తము దించెను మొరటుగ మొట్టికరోనా
దత్తుని పాదము బట్టిన
చిత్తము శాంతించి మీకు చింతలు తొలగున్! 61
ఉరుకుల పరుగుల బ్రతుకులు
శరవేగముగా నిలచెను శాంతికరోనా
కరములు కడిగిన చాలదు
కరములు జోడించి స్వామికాళ్ళను పడుదున్! 62
అన్నము లభించదు ప్రజకు
కన్నము వేసిన కరోన కాలము వచ్చెన్!
మన్నను చేయుచు నుడివెద
వెన్నుని పాదములు బట్ట వేదన తొలగున్! 63
మనిషిని మనిషియె దోచిన
మనుగడ ప్రశ్నార్థకమ్ము మాయని మచ్చౌ
వనముల దిరిగెడి ప్రాణులు
మనకిక గుణపాఠ మౌను మాయు కరోనా! 64
కారులు బస్సులు దూరెడి
దారులు మూసిరి బ్రతుకులు దారుణ మాయెన్!
వారని వీరని లేదిక
దారుణముగ మము కరోన దండించెనయా!! 65
నడచుట మరచిన జగతికి
నడతను నేర్పిన కరోన నాట్యము గనరే!
కుడువగ కష్టంబౌనిక
మడిసిన మనుజుల మరువరు మాయకు లోనై! 66
చేసిన పాపము చాలని
వేసెను వ్రేటును కరోన వేంకట రమణా!
కాసుల వేటను నాపగ
మూసిన గుడి తలుపులన్ని బుద్ధులు చెప్పెన్! 67
భారీ మెషిన్లు వాడుచు
కోరిన యడవుల జలధుల కొండల నణచెన్
దూరని చోటే లేదని
పారెడు మనిషిని కరోన బంధించెనయా! 68
జీతములు రాక కొందరు
వేతనములులేక కొంత వెతలను బడగన్
వాతలు కరోన బెట్టెను
జాతకములు మారె నిట్లు చాలుకరోనా! 69
గాలిని పుట్టించె నెవరు
నేలను పుట్టించె నెవరు నింగిని నిన్నున్
హాలాహలమే మ్రింగిన
కాలాతీతుడు కరోన కష్టము దీర్చున్!! 70
మరణించినచో కాటికి
తరలించుట కష్టమాయె తప్పు కరోనా
మరి మానవత్వ మనునది
మరణించెను నేడుచాల మచ్చ కరోనా!71
అవినీతి యనెడి వైరసు
చివరకు మిగిలెను మనలకు చిత్రము గనరే!
సవరణ లేనిది శాపము
భవరోగముతో కరోన బంధించె నయా!! 72
ఎక్కడి వారక్కడనే
చక్కగ యుండంగ మేలు సత్యము దెలియన్
లెక్కగ చేతులు కడుగుడు
దక్కును ధైర్యము కరోన దండించదయా! 73
మొత్తము గుడులను మూసిన
చిత్తము శాంతించ దాయె చిక్కులు పెరిగెన్!
చిత్తుగ కరోన మిగులగ
దత్తుని దర్శనము దక్కె దండము పెడుదున్! 74
ఇంటనె యుండుట మేలని
యింటర్నెట్టుని సొగసరి యింతిని యిచ్చెన్!
ఇంటనె వండిన ఫుడ్డును
నొం టికి మేలని కరోన నోడించుమయా!! 75
కలుషిత పదార్థముల నా
గలగల పారెడు నదులను కలపగ నేలా!
కలుముల కరోన కాదది
విలువలు మరచిన మనిషికి విషమై చెఱచున్!! 76
అందరు తలతురు పుడమిని
సుందర నందన వనమని చోద్యము గనరే!
కొందరి కరోన బుద్ధులు
చిందర వందరె సుఖమని చిక్కులు దెచ్చెన్!!77
పల్లెల నుండెడి వారలు
కల్లాకపటములు నేర్చి కాసుల కొరకై
ఇల్లూ వాకిళ్ళ నొదలి
వెళ్ళిగ చివరకు కరోన వెతలను బెట్టెన్!!78
అమ్మా నీదయ
రమ్మా యని బిలచి మాకు రక్షణ నిడు దు
ర్గమ్మా విజయము నిమ్మా
పొమ్మని చెప్పుము కరోనఁ పోకడ గనుమా!! 79
నరసింహ దేవ కావర
హిరణ్యకశిపుని దునిమిన హితకర రారా
ఖరధూషణ రిపు మర్థన
దురితము బాపవె కరోనఁ ద్రుంచగ రావే!! 80
కరములు మోడ్చి కొలిచెదము
వరదాయిని శైలపుత్రి వందన మమ్మా
దరహాసము దయ సేయవె
దురిత నివారణి కరోనఁ ద్రుంచగ రమ్మా!! 81
భండాసురాది దైత్యుల
చెంఢాడితివమ్మ దుర్గ శీతల మాతా
అండగ నీవుంటి విగద
దండించుము నీ కరోనఁ దండము తల్లీ!! 82
నారాయణ నామములను
పారాయణ చేయమేలు పారు కరోనా
ఆరామచంద్రుని కొలువ
పోరాడును రామబంటు పోవె కరోనా!! 83
పాటలు పాడిరి మరి పే
కాటలు గవ్వలు చెడుగుడు కవితలు కథలన్
దీటుగ కరోన కాలము
పాటవమును జూపె దేశ ప్రజలయ్యారే! 84
సామాజిక దూరమనె డి
దేమాత్రము తలప రథిప ధిక్కారముతో
ఏమా కరోన భయమని
యీమాదిరి తిరిగెడి ప్రజ నేమని యందున్! 85
క్లబ్బులు పబ్బులు తిరుగక
సబ్బులతో చేయి కడుగు సౌఖ్యము కలుగున్
డబ్బులు మిగిలును చివరకు
జబ్బలు చరచిన కరోన చప్పున తొలగున్! 86
సినిమా హాళ్ళకు పోనిక
కనిపించిన చోట్లకెల్ల కాళ్ళరిగేలా
పనిలేకుండగ తిరుగను
మనిషిగ మిగిలెద కరోన మాయను గెల్తున్!! 87
షాపింగ్ మాల్సుకు జొరకుము
మాపింగ్ చేయరు కరోన మాటుగ నుండెన్
వ్యాపించెను నలుదిశలను
లోపించెను శుభ్రత మరి రోగము పెరిగెన్! 88
హ్యాండును షేకును జేయన్
ల్యాండౌదువు కాటిలోన లాక్డౌన్ వేళన్!
తొండిగ కరోన గెల్చున్
క్యాండిల్ వెల్గింతురయ్య కాలము దీరున్!! 89
పెళ్ళిళ్ళకు పోవలెనే
కళ్ళెము వేసెను కరోన కష్టము వచ్చెన్
వెళ్ళాలో లేదోమరి
పెళ్ళాలే చెప్పగలరు ప్రేమము మీరన్!! 90
పనిగట్టుకు పగబట్టెను
కనిపించదు యీ కరోన కష్టమ్ బెట్టెన్
వనితల కష్టము పెరిగెను
తిని పెంచిన వారి బొర్ర తిప్పలు పెరిగెన్!! 91
కందా బచ్చలి కలిపిన
కందరుచి పెరిగి కరోన కష్టము దీరున్
కందాలను వ్రాయగలను
కొందరి కైన రచియింప కోర్కెలు బెంచున్! 92
పేరంటాలకు బోవన్
క్వారంటైనా కరోన కాలము గనుకన్!
మీరెంతైనా చెప్పుడు
వారింతైనా వినరు నివారింప వలెన్!! 93
పగలంతయు పని చేసెను
వగలన్నియు రాత్రి వేళ వన్నెలు జూపెన్!
మిగిలెను కరోన కర్చని
నగలను చేయించ మంచు నాసతి దెలిపెన్! 94
కాగల కార్యము దీర్చుచు
నాగని జనులను కరోన యాగము జేసెన్!
దాగుడు మూతల నాడుచు
లోగిలి జేరును కరోన రోగము పెంచున్! 95
తొయ్యలి కేమియు తోచదు
నయ్యో కొత్తావ కాయ యనుచున్ వగచెన్!
అయ్యా కరోన కాలము
వెయ్యాలని యుంది కాని వేయుట యెటులన్!! 96
రంజన చెడి మానవులే
కుంజరయూధమున దోమ కుత్తుక భంగిన్
పంజరమున బందీలుగ
గింజుక చచ్చిరి కరోన గిల్లుట వలనన్!! 97
చచ్చును కరోన యని నా
కొచ్చిన రీతిగ శతకము కొలదిగ వ్రాయన్
మెచ్చిన వారికి నమతులు
నచ్చిన వారికి భయములు నాశనమందున్! 98
బుడిబుడి యడుగుల నడుగిడి
చెడుగుడు లాడెను కరోన చేటును బెంచెన్
తడవుగ మూడడగుల నిడి
వడుగా తొడిగిడి కరోన వైనము గనుమా! 99
ఉరుకుల పరుగుల బ్రతుకులు
చిరుచిరు నగవులను మరచి చిరుబురు లాడెన్!
పరిపరి విధముల వగచిరి
సరియగు దరి దొరకని ప్రజ సతమత మయ్యెన్!! 100
కలయో వైష్ణవ మాయయొ
నెలరోజుల లాకుడౌను నేటికి నిండెన్
ఇలలో జనులింటనె విల
విలలాడిచు బైటి కేగు విషయమె మరచెన్!101
వదలవు కొండల కోనల
వదలవు నదులను జలధుల వనరుల కొరకై!
వదలవు నరుడా యడవుల
వదలని ధనదాహమనెడి వైరసు బుట్టెన్!!102
లావొక్కింతయు లేదని
కావగరమ్మంచుహరిని గజమపుడడిగెన్
లావొక్కింతయు లేదని
చావులు తప్పించ మనుచు జగమిపు డడిగెన్! 103
ఏకాల సర్పపు మహిమో
మాకాలము దాపురించె మారకు డెవరో!
మాకీ కరోన వలదిక
నీకాళ్ళను పట్టెదమిక నీరజనాభా!!104
కోవిడు కరోన వైరసు
కోవెల తలుపులను మూసి కోయని గూసెన్
మావిధినేమని యందును
గోవిందుడుకూడదాని కోరిక దీర్చెన్! 105
చచ్చిన వారెటు జచ్చిరి
చచ్చక లాక్డౌనునందు చచ్చితిమయ్యా
నచ్చిన నచ్చక పోయిన
పచ్చడి చేసెను కరోన బయటికి తిరుగన్! 106
ధుమధుమ లాడెడు వారును
కమలము వికసించి నట్లు కలకల నగిరే!
నమతులు జేయుట శుభమని
తమకది సులువని కరోన తానై తెలిపెన్! 107
కదలక యింటనె యుండట
సుదతుల మనసులు గెలుచుట శుభమని నేర్పెన్!
సదమల వృత్తిని గరపుచు
పొదుపుగ బ్రతుకుగ కరోన పొలుపున నేర్పెన్ 108
కోవిడు కరోన వచ్చెను
లావుగ బొర్రలు పెరిగెను రమణుల దయతో!
ద్యావుడ యేమని యందును
సేవల కరుసుల నడిగిరి చిరిగెను జేబుల్! 109
ఇళ్ళకు చేరే దెపుడో
మైళ్ళకు మైళ్ళు నడిపించె మారి కరోనా!
కాళ్ళరిగేలా తిరిగిన
ఒళ్ళే గుల్లైన నేమి యోర్పును కనుమా!!110
ఏఁవిచ్చినతీరు ఋణము
నీవిచ్చితి లాకుడౌను నేనడుగకనే!
దేవా యేతీరుగనే
సేవింతును నిను నరేంద్ర సేవిత చరణా! 111
నీవిచ్చిన తీరు గనుము
లావైతిని స్వామినేను లాక్డౌన్ వలనన్!
దేవా నీకిది తగునా
సేవింగంతా కరోన షేవింగ్జేసెన్! 112
దేవుడు కూడా కదలడు
లావైన సుఖము తరుగును లాక్డౌన్ ముగియన్!
కోవిడు కోడై కూయును
చావడి ముండే నిలుచును జాగ్రత్త సుమా!! 113
ముగిసెను లాక్డౌన్ మాత్రమె
ముగియక నున్నది కరోన ముప్పును గనుమా!
తెగువను చూపిన చాలదు
జగమొండిగ తిరుగకు మరి జాగ్రత్త సుమా!114
సినిమా అవలేదింకా
పనిమనుషులు కూడ రారు భయమే గనుకన్!
వినవా యెవ్వరు చెప్పిన
కనుమా లాక్డౌన్ కరోన కాలేదింకా!! 115
ఇందుగల దందులేదని*
సందియమెందుకు కరోన ఛావగ లేదే
ఎందైనా గలదట కను
మందరిలోనూ నిలచిన యాహరి వలెనే! 116
విడిగా సాయిని చూడగ
వడిగా రాబోకుమింక వైరసు మిగిలెన్!
గుడికే రాఁబని లేదిక
తడవున టీవీల లోన దర్శన మీరే!! 117
ఛావో రేవో తేల్చెద
పోవే కోవిడు కరోన పొమ్మిక ఫోఫో
ఛావొచ్చిన రావచ్చును
దేవుడు రాడని తెలిసెను దేవుళ్ళాడన్! 118
మారాము చేసి రనుచున్
సారా త్రావించు చాలు చాలు కరోనా!
మా రాముని గుడి తెరవక
సా రాబడి తెరచిరోయి సాధుకరోనా!! 119
కోవిడు కరోన పుణ్యము
దేవళమున కేగనైతి తిరుమల
టీవీ యందున ఠీవిగ
నీవై దర్శన మిడితివి నీరజనాభా! 120
ఇకపై జలుబూ తుమ్మూ
వికటము యగునట కరోన విషమును మించున్
చకచక వైద్యపు బిల్లులు
నికముగ పెరుగును జనులను నిండా ముంచున్!! 121
తుమ్మకు దగ్గుకు నికపై
రమ్మని పిలదురు కరోన లక్షణమనుచున్
జుమ్మని టెస్టులు చేదురు
దిమ్మే తిరుగునిక బిల్లు తిక్కకుదుర్చున్! 122
నాడిని పరీక్ష చేయరు
వేడిమి వాతము నెరుగరు వింతగ వైద్యుల్
తోడుగ కరోన టెస్టులు
లోడును పెంచును పరుసుకు రోగము మిగులున్! 123
(హిందీ లో కందము )
జమునా తటుపరు కాన్హా
కమరు హిలాకె మురలీసె కాటా దిల్కో!
హముకో కరోన కాటా
తుముకో కైసే బతాఁవు తుమరీ జై హో! 124
( ఇంగ్లీష్ లో కందము )
వుయ్ సెల్యూట్దోస్ డాక్టర్స్
వుయ్ సెల్యూట్దోస్ పొలీసు వుయ్ లవ్ యూ ఆల్!
వుయ్ సెల్యూట్దోస్ పైలట్స్
వుయ్ సెల్యూటాల్ బిఫోరు వుయ్ డై ఓహ్గాడ్!!125
We salute those Doctors
We salute those Police we love you all!
We salute those Pilots
We salute all before we die oh! God!!
టేస్టీ టేస్టీ దోసాస్😇
హోస్టెడ్ బై మై లవింగు హోమ్ మేకర్ వావ్!😱
రోస్టెడ్ రోస్టెడ్ ఫుల్లీ
కాస్టెడ్ మైపర్స్ ☹️ యు నోన క్వారెంటైన్ యా! 126
Tasty Tasty Dosaas
Hosted by my loving home maker wow!
Roasted Roasted fully
Costed my purse you know na, quarantine yeah!!
అనంతచఛంద బృందం గురువులు శ్రీ తోపలల బాల సుబ్రహ్మణ్య శర్మ గారి ఆశీస్సులతో
కరోనా శతకము ## లంక శివరామకృష్ణ శాస్త్రి

No comments:
Post a Comment