Saturday, June 25, 2022

నీరజనాభా శతకము

 

27/5/2020

శ్రీహరి కథలన్ పలుకన్

శ్రీహరి చరణములు నాకు చింతలు దీర్పన్

శ్రీ హరి దయనే నడుగన్

శ్రీహరి తెలిపిన విధమున చెప్పెద నయ్యా!1


చిత్తము శాంతించగ నే

దత్తుని కీర్తింతు నేడు తలచిన పనిగా!

సత్తెము బలికెద వినుడీ

మొత్తము దేవతలు సుంత మోదము నందన్!!2


మకరిని గాచిన వానికి

ముకురము మగసిరి యగునట మోదము గూర్పన్

ఒకపరి యెగిరి పడడితఁడు

సకల రిపుగణము హరించు శౌరిని దలతున్!3


గుడిలో నున్నది నీవే

విడిగా ప్రతిగుండెలోను వేంకట నాధా!

వడిగా రాలేను గుడికి

తడవుచు  మదిలోనె నిన్ను దర్శింతునయా!!4


~~~~~~~~ ~~~~~%%%


కనులకు కనవడ వాయెను

మనసున నిలవడవు నీవు మాయలమారీ

మనిషిగ బుట్టించితివిగ

నిను కనుగును సులువునిమ్ము నీరజనాభా!1


తనువే నేనను భావము

మనిషిగ నున్నంత తడవు మనుగడ చెరచున్

వినయముగా వరమడిగెద

నిను గనుగొను మనసునిమ్ము నీరజనాభా!2


నేనడిగితినా తనువును

నేనడిగితినా మరపును నీకే దెలియున్

నేనని నీవని మరిమరి

నేననకుండ గనుమయ్య నీరజనాభా!3


మును నేజేసిన కర్మము

మనిషిగ బుట్టితిని గాని మాయకు లోనై

తనువే నేనను కొంటిని

నినునే మరచితిని శరణు నీరజనాభా!4


నే ననిన నాకనిష్టము

నే ననిన పెలుచన నాకు నిను మరచితిగా

నేనీ రీతిన యుండగ

నేనే పని చేయకుంటి నీరజనాభా!5


నరుని వలె కనవడితి నే

నరయగ మృగము వలె తిరిగి నటమట మైతిన్

నరమృగ రూపా కావర

నిరుపమ రూపమునుజూపు నీరజనాభా!6


నిత్యము నిను తలచెడి మా

భృత్యుల కాచెదవని విని కృష్ణా యంటిన్!

సత్యము తెలియగ జన్మ మ

నిత్యమనుచు నిన్ను దల్తు నీరజనాభా!!7


అంకము ముగిసిన దేమో

బింకము సడలగ చివరకు పిలచెద నిన్నే

గ్రుంకిన పొద్దును గన నిం

దింకెను  ధైర్యము తలచితి  నీరజనాభా!8


నారాయణ యని యనిశము

నారదముని వలె పిలువగ నాకౌనా సం

సారపు 

నీరసమొక్కటె మిగిలెను నీరజనాభా!9


కాకాసురునే బ్రోచితి

నీకపకారము తలపని నీబిడ్డలమే

మాకీ కరోన నిచ్చితి

నీకిది తగునయ్య స్వామి నీరజనాభా! 10


ఆపద లెన్నో కలిగెను

నాప దలపవే మురారి యాత్మానందా

నోపక లేకుంటి శరణము

నీపద మంటెద దయగొను నీరజనాభా!!11


ఏమని చెప్పెద స్వామీ

కామము క్రోధము విడువవు కాలము గడచెన్

దామోదర సుగుణాకర

నీమముగా  తలువనిమ్ము నీరజనాభా!12


ఆకృతి లేదని యందురు

నీ కృతులను విన్నవారు నిన్నే గనిరే

శ్రీ కృష్ణా కాపాడుము

నీకృతులెరుగని జడుడను నీరజనాభా!13


చక్కగ సృజించి 

మక్కువ వలదను నియమము మాకా స్వామీ

చక్కని చుక్కలు మీకా

నిక్కము నీవే దెలుపుము నీరజనాభా!!14


ఇక్కడ నక్కడ జూచితి

మక్కువ మీరగ తిరిగితి మాయకు లోనై

లెక్కగ గుడులకు నేగితి

నిక్కము నీకే తెలియును నీరజనాభా!!15


కలవందురు లేవందురు

కలవాయని వెదికిరి మిము కలుముల బాపన్!

కలవని తెలియగ గోరెద

నిలువవె నామనమునందు నీరజనాభా!!16


కోపము తీరగ తిట్టితి

తాపసుడనుకాను నేను దండము స్వామీ

పాపము నావాడనుకో

నీపద మంటెద శరణము నీరజనాభా!!17


అందరి తప్పులు వెదకితి

మందమతిని నేనుగాదొ మరచితి నయ్యా

బంధము త్రుంచగ రావే

నిందలు మోపకు శరణము నీరజనాభా!!18


సాయిని గొలుతురు కొందరు

రాయిని రప్పని గొలుతురు రాముడ వనుచున్

మాయని గెలిచెడి సులువును

నీయవె దర్శనము మాకు నీరజనాభా!!19


కొండల కోనల నుంటివొ

కొండను సులువుగ నిలిపితి గోవిందుడవై

మెండుగ ధరించి మాలలు

నిండుగ కనవడవె స్వామి నీరజనాభా!!20


పుట్టుక గిట్టక నుందువు

పుట్టితివని పాల నిచ్చి  పూతన జచ్చెన్!

గట్టిగ పదమంటితి న

న్నెట్టుల రక్షించెదవిక నీరజనాభా!21


రాముడు మా కులదైవము

రాముడు మా సుతుడు హితుడు రక్షకు డనుచున్

రాముని కొలుతురు జనులిట

నీమముగా నీ భజనల నీరజనాభా!22


దాశరధీ యనిపిలచిన

నాశము జేయుదు వఘముల నాదాత్మకుడా

ఈశుని మదిలో నీవట

నీ శరణము కోరితయ్య నీరజనాభా!23


అల వైకుంఠపురంబున

నెలకొని యుందువట స్వామి నీలచ్చిమితో!

ఇలలో శాంతము ధర్మము

నిలుపగ వచ్చితివి స్వామి నీరజనాభా!!24



దశకంఠుని దునుమాడగ

దశరథ తనయునిగ బుట్టి ధర్మము నెరపన్

దశదిశలందున తిరిగితి

నిశితర శరముల గురియుచు నీరజనాభా!25



నలుగురిలో పెద్దన్నవు

నలుగురి తలలో‌ని నాల్క నడతలు నేర్పన్

నలుదిశలను పాలించితి

నిలిపితి ధర్మము శరణము నీరజనాభా!!26


శరణన్న విభీషణుడను

కరుణన కాపాడినట్టి కథలను వింటిన్

కరివరదా శరణు శరణు

నిరతము తలతును మనమున నీరజనాభా! 27


నాదమె నీతొలి రూపము

వేదమె నిను తెలుప లేక వెలవెల బోయెన్

పాదము లంటెద స్వామీ

నీదగు రూపము తెలుపుము నీరజనాభా!!28


నాదని నీదని చేసితి

వాదనలెన్నీ మురారి వామనరూపా

నాదని నీదని లేదని

నీదయ కోరితి నిరుపమ నీరజనాభా!!29


ఈ దేహము నేననుకొని

నే దేవుని కొలువనైతి నీల్గితి స్వామీ

నీ దాసుని మన్నింపుము

నీదరి చేరితి చివరకు నీరజనాభా!!30


నీ దయ కలుగును జగములు

నీ దయ విలయము కలుగును నీలోకరుగున్

నీ దయ నిలచును జగములు

నీ దయ గోరితి నిరుపమ నీరజనాభా!!31


నిను మొరలిడి కరి బ్రతికెను

నిను కెరలిన దనుజులెల్ల నీల్గిరి స్వామీ

నిను గొలిచిన కపి గెలిచెను

నిను విన దిక్కెవ్వరు మరి  నీరజనాభా!!32


నీ చెంతనె సిరియుండెను

నీ చెంతనె కపివరుండు నీసేవలకై

నీ చెంతనె సకలంబని

నీ చెంతకె చేరినాను నీరజనాభా!!33


నిను గొల్చిన ప్రహ్లాదుడు

నిను గొలిచి గెలిచె విజయుడు నీ భక్తులుగా

నిను తెలిసిరి గెలిచిరి హరి

నిను నే గొలిచెద మరిమరి నీరజనాభా!!34


నిను సేవించి కపివరుడు

నిను కెరలిన రావణుండు నిన్నే పొందెన్

నిను చేరెడి విధము తెలిపె

నిను సేవింతును తెలియగ నీరజనాభా!!35


విజయుని సారధి వైతివి

గజపతి మొర నంబరీషు కరుణను శబరిన్

నిజ భక్తి జూచి బ్రోచితి

నిజము దెలియ గొల్చెద నిను నీరజనాభా!!36


గండము కలిగిన యంతనె

మెండుగ మిము వేంకటేశ మేలుభజింతున్

రెండవ దైవము లేడని

నిండుమనంబున గొలిచెద నీరజనాభా!!37


శ్రీ రామా యనినంతనె

నా రామునిబంటు రక్ష నాకౌననగా

శ్రీ రామా యందును మరి

నీ రాజ్యము రావలెనక నీరజనాభా!!38


నీ నోటి మాట కావలెఁ

నా నాటక మాపెదనిక నాకల దీరన్!

నేనున్నానని జెప్పవె

నీ నామమె నాకురక్ష నీరజనాభా!!39


నీవే రక్షకు డంటిని

నీవే శిక్షకుడ వంటి నీవే గమ్య

మ్మీవే మార్గము జూపుము

నీవే నాతోడునీడ నీరజనాభా!!40


హరియని బిలచితి నొకపరి

హరుడని కొలచితి నొకపరి హరిహర రూపా

వరముల నడుగను మరిమరి

నిరతము నిను తలవనిమ్ము నీరజనాభా!!41


నాన్నా యనినే నన్నను

నన్నాయని యనకుమింక నాతండ్రివిగా

నాన్నన్నా యమ్మన్నా

నిన్నే యని తెలుసుకొనవె నీరజనాభా!!42


నీవిచ్చిన కాయంబిది

నీవల్లిన లోకమందు నేనేమందున్

నీవల్లిన కాలంబిది

నీవల్లిన మాయలోన నీరజనాభా!43


నాలో నరిషడ్వర్గము

నాలోనహముంచినావు నాకిక తెలిసెన్

నీలోనే నేనుండగ

నీ లీలల నేమనందు నీరజనాభా!44


కన్నా యుటురమ్మన్నది

నిన్నేనా యను యశోద నీవెంటబడన్

అన్నన్న చిక్కనంటివి

నిన్నెట్టుల నమ్మెదనిక నీరజనాభా!!45


నాలో లోపము లున్నవి

నీలో జగముండు తీరు నీవిధి గనుకన్

నాలో లోపము లెన్నుట

నీలోపమె యందునేను నీరజనాభా!46


పాపము పుణ్యము లేవని

పాపము లనె జేసియుంటి పావన చరితా

పాపము పుణ్యము తెలుపుట

నీపని గాదా తెలుపుము నీరజనాభా!!47


పరశువు ధరించి రాజులఁ

శరముల చేత నసురులను చక్రము చేతన్

దొరగొని దైత్యుల దునిమితి

నిరతము నిన్నే భజింతు నీరజనాభా!!48


నిను పుత్రుడను యశోదయు

నిను రిపుడను కంసమామ నినుసఖు డనుచున్

మని పార్థుడు నిను పొందిరి

నినునే సేవింతునయ్య నీరజనాభా!49


వలువలు దోచితి వంటిరి

విలువలు నేర్వని జనులిల వేదస్వరూపా

కలుములు బాపగ వేడెద

నిలువవె నామనము నందు నీరజనాభా!!50


నటనలు జేయగ పంపితి

నటనే జీవిత మను కొని నగుబాటైతిన్

పటుతరముగ నిను తెలియగ

నిటలాక్షుడ గాను నేను నీరజనాభా!!51


పలుకుల కందవు, వేదము

తెలుపగ లేదని యనెదరు తెలిసిన వారల్!

కలి కాలంబిది నీవై

నిలువుము నామనము నందు నీరజ నాభా!!52


ఏడుగడ వేంకటేశుడ

వేడెద మనసార వేదవేద్యుడ వనుచున్

మేడదిగి రమ్మనందున్

నీడగ నుండగ కొలిచెద నీరజనాభా!!53


పురుషోత్తమ నరసఖుడా

కరివరదా దానవారి కలియుగ వరదా

నరమృగ శరీర కేశవ

నిరతము నిను దల్తునయ్య నీరజనాభా!!54


హితుడనుచు పాండు సుతులును

సుతుడనుచు దశరథుడు మధుసూదన సీతా

పతివని జనకుడు మరి చిం

తితులకు దొరకవని యంద్రు నీరజనాభా!!55


సుందర నందన వనమున

మందిర ప్రాకారమందు మగువల చెంతన్

మందమతినైతి మరియెం

దెందు వెదుకనయ్య నిన్ను నీరజనాభా!!56


బాలుఁడ పూతన జంపగ

బాలుఁడ శకటాసురునట ప్రాణము లార్పన్

బాలుఁడ గిరిధారి వనగ

నీలీలలనేమనందు నీరజనాభా!!57


నిలకడ లేనివి కోతులు

సులువుగ వారధి నిలుపుట చోద్యము గాదా

సులువును నేర్పవె స్వామీ

నిలిపెద నీపై మనసును నీరజనాభా!!58


నీ పై పద్యము లల్లెద

నీ పలు కథలను తెలుపుచు నీనుతి సేయన్

నీ పని చేసెడి విధమును

నీ పదముల దృష్టి నిమ్ము   నీరజనాభా!59


కొంపా గోడా యనుచున్

సంపాదన కోసమంచు సంసార‌మునన్

నింపుగ సొమ్ములుగొని నిను

నింపాదిగ తలతునిప్డు నీరజనాభా!!60


ఇంతింత వాడి వందురు

నెంతెంతైనా యెదుగుట నేమనియందున్

అంతర్యామివి హరి నే

నెంతటి వాడిని నినుగన నీరజనాభా!!61


సొంతగ యిల్లే లేదట

కాంతలు పదహారువేలు కంతుని తండ్రీ

నింతికి సీతాపతి ని

న్నెంతని తెలిపెదను స్వామి నీరజనాభా!62


మూడడుగుల దానమడిగి

వేడుకగా జగతినిండు వింతను గంటిన్

పాడెద నీనామమె నీ

నీడనె మన నిమ్ము స్వామి   నీరజనాభా!!63


పిల్లన గ్రోవిని యూదుచు

పిల్లల మనసులు చొరగొను బిడ్డడివౌరా

నల్లని వాడా మరి ని

న్నెల్లా కనుగొందునయ్య నీరజనాభా!!64


ఉట్టిన పాలూ పెరుగులు

మట్టిని దిననేల నయ్య మాయలమారీ

కిట్టని పనియేటికి ని

న్నెట్టా సరిపెట్టు కొందు నీరజనాభా!!65


ముసిముసి నవ్వుల రువ్వుచు

పసివాడని తలచెనేమొ పాలను ద్రాపన్

కసిగా గొంటివి ప్రాణము

నిసిరాతిరి బుట్టి నీవు నీరజ నాభా!!66


దుష్టుల శిక్షించెదవట

శిష్టుల రక్షణను జేసి చింతలు దీర్పన్

భ్రష్టుల ప్రోచెదవని ని

న్నిష్టపడితినయ్య స్వామి నీరజనాభా!!67


 ఆదాయము పెరగదు మరి

వాదములే జేసె నాదు భామిని స్వామీ

గోదావరీద సులభము

నీ దారిని చూపకున్న నీరజనాభా !!68


అందరి గమ్యము లొకటట

ముందున వెనుకనొ యెరుగను ముఖ్యుడ గానో

అందని వాడవు హరి ని

న్నెందున వెదుకుదు ముకుంద నీరజనాభా!69


కరుణాసాగర స్వామీ

ధరణిని యేలగ నిలచిన దత్తుడ వీవే

వరలిన ప్రేమ స్వరూపా

నిరుపమ యగణిత గుణగణ నీరజనాభా!!70


పైపై పూజలు సలిపితి

యాపై వరముల నడిగితి యందరి వలెనే

ఛీపొమ్మనకుము దేవా

నీపై భారము నిలిపితి నీరజనాభా!!71


దోసము లెన్నో చేసితి

మీసము ద్రిప్పి కెరలితిని మేధావిగనే

వేసము లెరిగియు బ్రోవగ

నీ సములెవరయ్య స్వామి నీరజనాభా!72


వడుగాయని యడుగగ మూ

డడుగుల నిడు నేలచాల నంచును వడిగా

దొడగితి జగముల హరి నే

నిడుచను ననుగావ రావె నీరజనాభా!!73


నిడుచను - సాగదీయు....


కుడిచితి కూడని వన్నియు

నడతను నేరక నడచితి నగుబాటయితిన్

విడచితి ధర్మము శాంతము

నిడుచక యడిగెదను బ్రోవ నీరజనాభా!!74


గజరాజును రక్షింపగ

నిజపత్నికి దెల్ప కుండ నీవేగితివే!

గజరాజువలె వగచితిని

నిజముగ కాపాడరావె నీరజనాభా!!75


సీతను పెండ్లాడితివట

రాతిని నాతిగ మలచిన రామయతండ్రీ

నాతరమా నిను బొగడగ

నీ తరమా నను మరువగ నీరజనాభా!!76


ఒకటే మాటని యంటివి

యొకతే జానకి సతియట నొకటే బాణం

బొకడివి ధర్మము నేర్పగ

నికరముగా కొలుతునయ్య నీరజనాభా!77


సకలము నెరిగిన వారును

వికల మనస్కులగుచుంద్రు వింతేయనగన్

ముకుళిత మనసున వేడెద

నికముగ నిన్నెరుగ  నిమ్ము నీరజనాభా!!78


అన్నుల మిన్నలఁ మరినే

కన్నులు లేనట్టివారిఁ గందువు నాకున్

కన్నులు గలవని హరిని

న్నెన్నుదు కనవడవె నాకు నీరజనాభా!!79


దొరకక తిరిగి యశోదను

నిరతము ధ్యానించు వారిఁ నీవై దొరకన్

దొరకని దొరవని యని నిను

నిరతము మన్నించనిమ్ము నీరజనాభా!!80


జగడము చేసిన వారిని

తగవుల కొచ్చిన రిపులను తగునా బ్రోవన్

జగముల నేలెడు పతివట

నిగమాగమవంద్య చాలు నీరజనాభా!!81


ఆరోగ్యము కుదుటపడదు

వైరాగ్యము కలుగలేదు వైకల్యముతో

నైరాశ్యము వీడదుమరి

నీరాకకు వేచితినిక నీరజనాభా!!82


తెచ్చిన దేమియు లేదని

మచ్చుకు గొనిపోదునేది మాయకలోనై

హెచ్చుగ బలికితి నింగికి

నిచ్చెన వేసితి శరణము నీరజనాభా!83


నీవాడిన నాటకమగు

నీవాడిన గీతయౌను నిన్నెన్నుటయా

నీవాడటంచు బ్రోచిన

నీవౌ లీలల్ శరణము నీరజనాభా!!84


మనసున నాశలు తీరవు

తనువది సుఖములను గోరు తపనలు మెండౌ

ననుబోటి యధము డెవడని

నినువిన దిక్కెవ్వరంటి నీరజనాభా!85


వెన్నేమైనా తక్కువ

హన్నా మన్నేలతిందు వల్లరివాడా

కన్నెల వలువలు గొను ని

న్నెన్నరె యో గొల్లవాడ నీరజనాభా!86


నీ లీలలు శుభకరమగు

నీ లీలలు భవహరమగు నీ లీలలునా

లోలోపలి తెరలు తెరుచు

నీ లీలల నేదలంత నీరజనాభా!!87


నీ వెన్కగోపికల వలె

నీవెన్కనె గోవులేగు నీవెన్కసిరిన్

నీవెన్కనె ఋషులు మునులు

నీవెన్కనె నేనుకూడ నీరజనాభా!!88


తల నీలాలిచ్చితి నా

తలపులు శూన్యమగు ఇ దండము తండ్రీ

తలుపులు తెరలును దీయుము

నిలుపుము నీచెంతనన్ను నీరజనాభా!!89


వేడెద వేంకట రమణా

పాడెదనీ నామములను పావన చరితా

తోడుగ రమ్మందును నీ

నీడనె నన్నుండనిమ్ము నీరజనాభా!90


నాకము నరకము దాటగ

నాకగునో నెరుగను హరి నారాయణుడా

నీకగు నేదైనను నను

నీ కనుసన్నల నిలుపవె నీరజనాభా!91


ఏమారిరి బ్రహ్మాదులు

నీ మాయకు  గోకులమున నేమార్చితివీ

వా మోహిని వై భవునిన్

నీమాయకు శరణమందు నీరజనాభా!92


 ఏమారిరి నింద్రాదులు

నీ మాయకు  గోకులమున నేమారెనుగా

నీ మాయకు నారదుడును

నీమాయకు శరణమందు నీరజనాభా!93


అరుణ సుతుని‌ పరిమార్చ ఖ

దిరు సుతునికి తోడ్పడితివి దేవపతి సుతున్

పరిమార్చగ నరుణ సుతుని

నిరుత్తరపరచితి వయ్య నీరజనాభా!94


జయగురు దత్తాయనుచున్

రయమున ప్రార్థించితేను రక్షణ నిడుచున్

నయముగ పద్యము లిచ్చితి

నియతిగ సేవింతునిన్ను నీరజనాభా!95


కలవారని కాచెదవట

కలవానివి కనుకనీవు కరుణాసింధో

కలవని నమ్మిన వాడను

నిలువవె నామనము నందు నీరజనాభా!96


నాపై నీకెంతటి దయ

నీపై పద్యములనల్ల నిచ్చితివయ్యా

ఓపన్నగశాయి శరణు

నీపాదములన్ దలంతు నీరజనాభా!97


వలువల దోచిన చెల్లును

వలువలనిచ్చినను చెల్లు వరదుడ నీకున్

కలికల్మష కరివరదా

నిలువవె నామనమునందు నీరజనాభా!!98


నను గన్నవారి నావా

డని నను మన్నించు వారి నరయగ  తలతున్

నను ఖండించిన వారిని

నిను వేడెద కావమంచు నీరజనాభా!!99


నావన్నను నీవన్నను

నావన్నియు నీవియందు నారాయణుడా

నావని నీవని యననిక

నీవెంటనె యుండనిమ్ము నీరజనాభా!!100


నీవిచ్చిన నక్షరములు

నీవిచ్చిన నక్షయమగు నీభావనతో

నీవిచ్చిన పద్యములగు

నీవిచ్చిన వన్ని నీకె నీరజనాభా!!101


దాశరథిగ జన్మించితి

నాశము జేయగ దనుజుల నాదాత్మకుడా

ఆశాపాశములుడగన్

నీ శక్తిని గోరెదనిక నీరజనాభా!102


 సీతమ్మను రక్షింపగ

వాతాత్మజు సాయమంది వారధి గట్టెన్

వాతాత్మజు సంజీవిని

నీ తమ్ముని గాచెనంట నీరజనాభా!!103


శతకము నే వ్రాసితినా

మతిచెడు నామాటలన్న మన్నింపరయా

శతకము నిచ్చిన దొర మా

నిత పదపంకజమె శరణు నీరజనాభా!104


శిఖిపించమౌళి శౌరీ

యఖిలము నీలీలయందు నాత్మానందా!

మఖవైరిమురారి శరణు

నిఖిలము నీలోనెయుండు నీరజనాభా!!105


దొరవని రాముని గొలుతును

వరముల జానకి నడిగెద వరలఁ గపీశున్

మరి మా లక్ష్మణున భయము

నిరతము తలతునిక మిమ్ము నీరజనాభా!106


 భృత్యుడనయ్యా దేవా

సత్యమునాయొక్కమాట సరసిజనాభా

కృత్యము లన్నియు నీవే

నిత్యము నిన్నే కొలచెద నీరజనాభా!107


నీకిచ్చెద హారతులను

నాకగునటు ధూపదీప నైవేద్యములన్

నీ కిచ్చెద మంగళమని

నీ కిచ్చెద పద్యములను నీరజనాభా!!108


శ్రీదేవికి మంగళమౌ

వేదవినోదుడు హరికిదె ప్రియమంగళమౌ

శ్రీదత్తా మంగళమగు

నీదయయే మంగళమ్ము నీరజనాభా!109


తలపరు తండ్రులు, బిడ్డడు

తెలియక ముద్దుగ పలికిన తీయని తప్పుల్

తలపకు నాదోసములను

నిలుపవె నీమనను నందు నీరజనాభా!!110


స్వస్తి


6/6/2020



No comments:

Post a Comment