Saturday, June 25, 2022

ఆటవెలది శతకము

 ఉచిత మైన వాటి కూతమిచ్చిరి నేడు

చేయి జాపు బుధ్ధి చేటు దెచ్చు

ముష్టి బ్రతుక దేల మురిపెమాయెను నేడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.


 లంచ మీయ కున్న రక్షణ కలుగదు

బల్ల క్రింద జేయి వాటి మాయె

చదువు కొన్న వారి సంగతీ లాగున

వింత మాట యనుచు వినడు శాస్త్రి.


కల్ల లాడు వారి కళలు వేవేలట

మాట కోట దాటి మాయ మయ్యె

ఒట్టు గట్టు మీద నూరికే పెడుదురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.


తప్పు తాను జేసి తనవారి నిందించు

తప్పు యనెడి మాట నొప్పు కోరు

ముప్పు దెచ్చు తప్పు ముంచునీ కొంపరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.


మనసు మాట వినదు మామూలు గా మరి

మనసు గెలిచి చూడ మర్మ మెరుగు

మనసు వయసు గలిసి మాయలో ముంచురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.5


వైద్య మనిన నేడు బాధలే తీరవు

నాడి బట్ట రాదు నాట టంచు

ఫీజు గొట్టె షాకు పిచ్చివా ళ్ళౌదురే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.6


ఆవు పాలు త్రావ నాల మందలు లేవు

అమ్మ పాల వంటి వావు పాలు

బర్రె పాలు త్రావ బలుపు పెరిగె నేడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.7


పాడి పంట లేని పల్లెలే మిగిలెను

రైతు లన్న వారు రాలి పోయె 

నారు బోసి నోడు నీరేల బోయడో

వింత మాట యనుచు వినడు శాస్త్రి.8


పల్లె టూళ్ళు వీడి పట్నాల కేగిరే

మట్టి బిసికె టోడు మాయ మయ్యె

సొంత వృత్తి మరచి సోకుల పాలాయె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.9


పిల్ల పెద్ద లంత పిచ్చెక్కి నట్టుల

సెల్లు చేత బట్ట చిత్ర మాయె

సెల్లు లేని వాడు చింతాకు కొరగాడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.10


మాయ రోగ మొకటి మనుషుల బట్టెను

ముక్కు మూతి నేడు మూయ మనెను

కొవ్వు కరిగి పోయె కోవిడు దెబ్బకు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.11


కాల మాగ దాయె కాళ్ళులేకున్నను

పగలు వెంట రాత్రి పరుగు లిడును

కాశికాపురమని కాలుడే విడచునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి. 12


తల్లి దండ్రు లెవరు తనవార లెవ్వరు

కాటి కెవరు రారు కడకు తోడు

నాలు బిడ్డ లైన నవసర మునకగు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.13


అప్పు లేని వాడు  తప్పు చేయనివాడు

పుడమి మీద లేడు పుట్ట బోడు

అప్పు జేయ నేల మానవా మానవా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.14


పాలు పెరుగు లేవి పసిబిడ్డలకు నేడు

చిబుసు బెట్టు చుండె చిత్ర మాయె

వండి వార్చు నట్టి వైనమ్ము నెరుగరు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.15


గురువు గారి మాట గురుతును గలిగించ

పెద్ద వారి మాట పేర్మి బెంచు

నాలి నాట విన్న నాయుష్షు బెరుగురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.16


చెట్టు లోని పురుగు చెట్టునే చెరచగా

మనసు లోని పురుగు మనిషి జెరుచు

మనసు గెలవ కున్న మాయెట్లు విడచునో

వింత మాట యనుచు వినడు శాస్త్రి.17



మాట లోన తీపి మనసులోన విషము

మనిషి తీరు లోనె మాయ గలదు

పాము దేలు మిన్న పాడు మనిషికన్న

వింత మాట యనుచు వినడు శాస్త్రి.18


చేసు కున్న కర్మ చెంతనే నిలచును

జన్మ లెత్తె గాని జ్ఞాన మెద్ది

పాప భీతి లేక పాడుపనులు జేయ

వింత మాట యనుచు వినడు శాస్త్రి.19



పాము తేలు కప్ప వానపాముల దిన

మాయ రోగ మొకటి మనిషి కంటె

చైన వాని సరుకు చావులే దెచ్చును

వింత మాట యనుచు వినడు శాస్త్రి.20


బానిసత్వ ముండె భావజాలమునందు

భరత జాతి బ్రతుకు భార మాయె

పడమటింటి చూపు పచ్చగా నుండెనే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.21



గుండె లోన గలడు గోవిందు డందురు

తీర్థ యాత్ర లంచు తిరుగ నేల

గురుతు కలుగ దాయె గుండు కొట్టించినా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.22


చీర కట్టు లోని సింగార మెరుగరు

ప్యాంటు షర్టు లనుచు పడతు లిపుడు

వండి వార్చ రాదు వడ్డించ లేరయా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.23


ముగ్గు వేయ లేరు ముదితలు నేడింక

నడుము వంగ దాయె నాతి కిపుడు

మేడ మిద్దె లాయె మేల మాడగనేల

వింత మాట యనుచు వినడు శాస్త్రి.24


ఏడు కొండ లెక్కి  ఎంకన్న సామిని

ఎన్ని సార్లు చూడ నేమి ఫలము

నిన్ను జూడ డాయె నీస్వామి యొకసారి

వింత మాట యనుచు వినడు శాస్త్రి.25


రాయ బార మనుచు రాడొకో కృష్ణుడు

విశ్వ రూప మేమి విద్య నేర్పె

గూలి పోయి రాయె కౌరవులందరు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.26


రామ రామ యన్న రక్షణలు కలుగ

కృష్ణ కృష్ణ యన్న తృష్ణ దీరు

చిలిపి మాటలేల శివరామ కృష్ణుడా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.27


దత్త దత్త యనుచు తలచిన చాలును

చిత్త శాంతి కలుగు చింత దీరు

పదము లన్ని గూర్చి పద్యము లందువా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.28


పద్య మల్ల నీవు పండితుడవు గావు

కావ్య మల్ల లేవు కవివి కావు

పద్య మెందు కనెను భార్యామణియె నన్ను

వింత మాట యనుచు వినడు శాస్త్రి.29


శరణు శరణు యనగ శరవణ భవుడుండె

వరము లీయ గలుగు వరదు డతడు

కరము మోడ్చి వేడ కరివర దుండెగా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.30


యమ నియమము లెరుగ యముడన్న భయముండె

వేద శాస్త్ర మెరుగ విద్య లేదు 

బ్రతుకు చక్ర మరిగె భారతము నెరుగ

వింత మాట యనుచు వినడు శాస్త్రి.31


సంజయునకి కపికి సవ్యసాచికి గల్గె

కృష్ణ మూర్తి వలన గీత యొకటి

గుడ్డి రాజు వినెను గురుతేమి గల్గదే 

వింత మాట యనుచు వినడు శాస్త్రి.32



నాది తెలివి యనుచు నాకు దెలుసు నని

పెండ్లి కాక మునుపు భ్రాంతి యుండె

గూగు లోడిపోయె గురుతున్న భార్యతో

వింత మాట యనుచు వినడు శాస్త్రి.33


నేను నాది యనకు నీదేది లేదని

గీత లోన దెలెపె కృష్ణ మూర్తి

యాలి యొకతె వచ్చె నంత నాదనుచును

వింత మాట యనుచు వినడు శాస్త్రి.34


తండ్రి మాట వినిన ధనము లభించును

తల్లి మాట వినన ధైర్య మబ్బు

భార్య గీత వినిన బ్రతుకు బాగౌనురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.35


చిత్త శుధ్ధి లేని శివపూజ లేలరా

గురువు లేల నీకు గురుతు లేల

భార్య యొకతె జాలు భవసాగరమునీద

వింత మాట యనుచు వినడు శాస్త్రి.36



ఆను లైను క్లాసు ఆనులైనాఫీసు

అబ్బ మాయ దారి జబ్బు వచ్చె

జబ్బు పోదు గాని డబ్బులే కరుసాయె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.37


ఆను లైను క్లాసు ఆఫు లైన్లో గ్లాసు

అబ్బ మంచి దనిరి జబ్బు కూడ

జబ్బ జరుచు వారు దొబ్బున కూలిరే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.38


అప్పు జేసి కారు నప్పుడే కొంటిరి

యప్పు జేసి యిల్లు తప్పు కాదు

అగ్గి పెట్టె కొనుట కప్పుకావాలిరా!!

వింత మాట యనుచు వినడు శాస్త్రి.39


గురుకులములు లేవు గురువులు లేరండి

విద్య తీరు మారె వినయ మెద్ది

చదువు "కొన్న  వారి" చవిజూడ లేమయా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.40


పగల రాత్రి యనక బాగుగ చదివించి

అమెరి కాకు పంపి రమ్మ నాన్న

అప్పు మిగిలె బిడ్డ లమెరికా నందుండె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.41



నోరు మంచి దైన ఊరు మంచిదనిరి

మాట వలన పెరుగు మనిషి విలువ

తప్పు మాట లాడ తగువులే గలుగవా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.42


పాడి పంట లుండు పల్లెటూళ్ళు విడచి

నరక ప్రాయ మైన నగరి కేగి

పరుగు లెత్తి బ్రతుకు బాగులేదందువా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.43


పాంచ భౌతికమట పాడుమనిషి జన్మ

కట్టె మీద బెట్ట కాలి పోవు

నేను నాది యనుచు నీల్గుడు నీకేల

వింత మాట యనుచు వినడు శాస్త్రి.44



ఉచిత మనుచు ప్బ్రభువు లూరికే యిచ్చిరి

ప్రజల ధనము చాల పంచి బెట్టి

పిచ్చి వారు ప్రజలు పెట్రోలు నడగరు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.45


నేతి బీర లోన నేయెట్లు నుండదో

చదువు కొన్న వారి చదువు యటుల

పదము లల్లి నేను పద్యమన్నటల నే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.46


బ్రతుకు బండి లాగు పాఠమే వేరయా

పక్షి కెవరు నేర్పె పైకెగురగ

నేర్పు గలిగి బ్రతుక నేర్చుకో వచ్చురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.47


వాత మేమి జేయు వాతాత్మజుఁ దలువ

గాలి ధూళి బాధ కాలి పోవు

చేరి మ్రొక్క హనుమ చెంతనే నిలువడా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.48


మంచి చెడ్డ లన్ని మనసులో మాయలే

మర్మ మెరుగ గలము మాయ వీడ

గీత లోన జెప్పె కృష్ణ మూర్తి మునుపు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.49


మంచి మాట లాడి మనసు గెలువ వచ్చు

పళ్ళు రాల గొట్టు పాడు మాట

మాట లాడ కున్న మౌనమే మేలురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.50


విశ్వ మంత గలడు విష్ణువని చదివి

విషయ మేమి దెలిసె విశద మవగ

చీమ దోమ కుట్ట చీకాకు గల్గునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.51


లంక గాల్చితివని రావణుండన రామ

బంటు ననుచు తానె బలికె హనుమ

వినయ మైన మాట విశ్వమ్ము గెలుచురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.52


విషయ భోగ మందు విర్రవీగుట చేత

పడమ టింటి ప్రజల పాట్లు బెరిగె

విషయ వాంఛ లుడుగ విశ్వమ్ము గెలువవా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.53


లంక గాల్చి నట్టి రామ బంటైనను

కల్లు ద్రాగి రేపె కలకలమ్ము 

త్రాగు బోతు మాట తప్పుకాదందురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.54


తెలుగు బడుల కేల తెగులు బుట్టించిరో

మమ్మి డాడి నేడు డమ్మి లయిరి

లక్షణమగు తెలుగు రాబడి నియదా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.55



రణము చేయ నురికె రథసారథి వలన

వికల మనము నొందు విజయు డపుడు

తెఱువు జూప రాడొ   తేఱునడుపు వాడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.56


మూడడుగుల నేల పురుషోత్తమునకిడ

మూడె నపుడు బలికి ముచ్చటగను

నారడుగుల నేల నధికమగు మనకు

వింత మాట యనుచు వినడు శాస్త్రి. 57


పదవి వీడ ననుచు పట్టు బెట్టి వెడలె

ట్రంపు శకము ముగిసె కంపు మిగిలె

జేబు నింప కుండ జోబిడె నుండునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.58


కొండ లెక్కి వచ్చి గోవింద యనువారి

కోర్కె లన్ని దీర్చు కూర్మి మీర

సిరి గలిగిన వారి దొరయని యందురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.59


వలువ లేల దోచె బాలగోపాలుడు

విలువ లేమి  నేర్పె వెన్న దొంగ

పట్టు చిక్క డంట పాలు పోదామన

వింత మాట యనుచు వినడు శాస్త్రి.60



పరమ సుఖము నిచ్చు పరమాత్మ పాదము

పట్టి విడువ కున్న ఫలము దక్కు

వేరు మాట లేల విషయ వాంఛ విడుము

వింత మాట యనుచు వినడు శాస్త్రి.61


వెన్న పాల నిచ్చి విన్నపాల నిడిము

వలువ దొంగ వనిన బాధపడడు 

వాని పాల బడిన పరమ పథము దక్కు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.62


మన్ను తినగ నేల కణ్ణాయన యశోద

మిన్ను లన్ని జూపె వన్నె కాడు

కన్ను మిన్ను లన్ని కన్నయ్య పరములే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.63


ఉట్టి మీద పాలు, చెట్టుపై వలువలు

దూడ కట్లు తెంపి దొరక డాయె

పాల బడద మన్న పారిపోవు నితడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.64


చక్ర ధారి గలడు వక్రములను ద్రుంచ

కుబ్జ పుణ్య మాయె గూని తొలగె

వక్ర మైన వారు వానిపాల బడురు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.65


నమ్మి భక్తి తోడ నడచువారు గలరు

భక్తి లేక బ్రతుకు వారు గలరు

భక్తి నమ్ముకొనుచు బ్రతుకు వారు పెరిగె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.66


మూడడుగుల నడిగి ముజ్జగముల పతి

యణగ దొక్కె బలిని యబ్బురముగ

నేమడిగిన నీయ కేమిజేయుదురిక

వింత మాట యనుచు వినడు శాస్త్రి.67


విన్నపాలు వినడు వెన్నపాలు గొనును

కన్నె మనసు దోచు వన్నె కాడు

వెన్ను డంద్రు గాని మన్నేల మ్రింగెనో

వింత మాట యనుచు వినడు శాస్త్రి.68


వానరముల తోడ వారథి గట్టెను

నమ్మ జాడ గనక నలమటించె

వేద వేద్య డనిన వీని నేమడుగుదు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.69



తండ్రి మాట వినెను దండక వనమేగె

రాతి నాతి జేయు రాము డంట

విల్లు నేల విరిచె పిల్ల నడుగ కుండ

వింత మాట యనుచు వినడు శాస్త్రి.70


అడవి కేల నంపె నమ్మనీ రాముడు

నాతి జంపి చుప్పనాతి యనెను 

నమ్మ లేను రామ అమ్మవెనుక లేదు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.71


తల్లి దండ్రి లేరు తనవారు లేరని

మూడడుగుల నడిగి ముంచు వాని

నమ్మ లేను వాని నరసింగ మను వాని

వింత మాట యనుచు వినడు శాస్త్రి.72


కులము మతము లనుచు కుమ్ములాట పెరిగె

పొరుగు మతము పైన పోరు పెరిగె

మనిషి చావ కుండ మతమేమి యాపునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.73


అమ్మయనెడి పిలుపు కమ్మ నైన దనుచు

జన్మ లేని వాడు జన్మ నెత్తె

నమ్మ కన్న నేడు నాలి ముద్దాయెరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.74


ముక్కు మూతి రెండు మూయమనె కరోన

మాస్కు తొడుగు కొనుడు మంచిదనెను

జబ్బు పోదు గాను డబ్బులై పోయెనే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.75


పూర్వ కర్మ వలన పుట్టుకలు గలుగు

మనిషి జన్మ లోన మాయ గలదు

జాతకాల పిచ్చి జన్మలే మార్చునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.76



గృహమునందు శాంతి గ్రహము లెట్లిచ్చునో

 రంగు రాళ్ళు వలన రక్షణటుల

భయము కూడ నేడు వ్యాపార మాయెనే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.77


వరము లన్ని గోరి మరణము వలదని

బ్రతికి బయట పడిన వారు లేరు

మరణ భయము లేని మానవుండుండునా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.78


పాల సంద్ర మందు పద్మనాభుండట

వెండికొండ నెక్కె విషధరుండు

నల్లి బాధ కన్న నిల్లరికమె మేలు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.79


ఆఅ లనెడి కొన్ని అక్షరములు నేర్చి

పదములన్ని కూర్చి పద్యమనిరి

ఛందమేల ననెడి చాందసులుండరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.80


దొంగ తనము జేసి దొరవలె నటియించి

నేరములను జేయు నేరగాళ్ళు

రాజు  లైరి నేడు రామరాజ్యమనుచు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.81


ఫేసు బుక్కు వచ్చె ఫేసులే మారెను

పాడు చెడ్డ దండి వాటుసప్పు

చేత నిమిడి యుండు సెల్లులో నరకమే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.82


విద్య లన్ని నేడు విలువైన వాయెనే

విద్య యున్న వాడె వింత పశువు

చదువు లందు వేరు సాఫ్ట్వేరు చదువురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.83


వలువ విడచు నటుల పతిని మార్చెదననె

మార్పు సహజ మనుచు మహిళ నేడు

వలువ లేని నాడు విలువెట్లు దొరకురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.84


వంట చేయ రాయె వనితలు నేడింట

పనులు చేయు చుండె భర్త లంత

చెప్ప లేని కర్మ చేసు కున్నంతరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.85


అత్త మామ వలదు నాస్తి కావాలనె

యాడ పిల్ల నేడు అబ్బురముగ

అత్త గారి బ్రతులు లుత్తగా తెల్లారె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.86


మమ్మి డాడి యనగ మాతాపితలు మెచ్చె

 బానిసలుగ మారె బాల లంత

కస్సు బుస్సు నేర్పె కాన్వెంటు చదువులు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.87


కూడు గుడ్డ నిచ్చె కులవృత్తి యొకనాడు

రేపెటులను చింత లేదు నాడు

కంటి నిండ నిద్ర కడుపులో ముద్దరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.88


రక్ష చేయు వారె రక్షక భటులైన

దొంగ లెటుల నింట దూరి నారు

తప్పు చేయమనిరి దండనే లేదని

వింత మాట యనుచు వినడు శాస్త్రి.89


సెల్లు చేత బట్టి చిత్రమౌ సెల్ఫీలు

సెల్ఫి దీయ కున్న సెల్లు వేస్టు

సెల్లు మహిమ జూడు సెల్ఫీలు శవముతో

వింత మాట యనుచు వినడు శాస్త్రి.90


ఇంట నుండి జాబు యింటరు నెట్టుతో

నింతి జాబు కూడ నింట నుండె

నంట్ల తోమ నేల యన్నమే వండరు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.91


చిన్న కష్టములకు చీకాకు పడువారు

చిన్న పెద్ద లేక చిత్రమగును

చింత యున్న చాలు చితిని రగులఁజేయు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.92


దిక్కు లేని వాడు దిసమొలవేలుపు

నంబరముల గల దిగంబరునకు

తల కడుగను రాదు తలమీద గంగట

వింత మాట యనుచు వినడు శాస్త్రి.93


నాల్క నలువ రాణి, నగజ సగము తానె

హృదయమందు నమరె అమల తానె

మనకు బ్రతుక నేర్పె మన త్రిమూర్తులకును

వింత మాట యనుచు వినడు శాస్త్రి.94


ప్రక్క వాని పాట్లు పట్టనే పట్టవు

నిరుగు పొరుగు మనకు నింపు కాదు

కలదె సుఖము నీకు కలిసియుండిన గాని

వింత మాట యనుచు వినడు శాస్త్రి.95


అయ్య కన్న మంచి దామాత దుర్గమ్మ

కొండ నెక్కె దుర్గ కుదురు కొనెను

నాపదలని తీర్ప వేపదములు నేడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.96


నారదాది మునులు నారాయణాయని

కొండ మీద నిన్ను కొలిచిరిలను

వెదుక దొరకడేల వేంకటేశుండిట

వింత మాట యనుచు వినడు శాస్త్రి.97


సాధనమున పనులు సమకూరు ననివిని

ముదిత లంత నేడు మురిసి పోయి

చావ గొట్టి మగని సాధింతు రక్కటా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.98


పతిని బాధ పెట్టు భర్తృవ్రతములట

సతిని కొట్టు వారు చవట లంట

నాది నండి చూదు మాదర్శ దత్త్వము

వింత మాట యనుచు వినడు శాస్త్రి.99



ఆచరించ డకట యాచారి యందురు

గురుతు లేని వాని గురువు ననిరి

మాట తీరు మారె మనుషులు మారిరి

వింత మాట యనుచు వినడు శాస్త్రి.100


పద్య విద్య నేర్పు బాలసుబ్రహ్మణ్య

శర్మ గారు గురువు శతకములకు

నేర్పు తోడ నెవరు నేర్పింతు రీవేళ

వింత మాట యనుచు వినడు శాస్త్రి.101


వంద పద్యములని వందన మందింతు

ఛంద బృంద సభ్యులందరికిని

శర్మ గారి చలువ చక్కని పద్యాలు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.102


తొలుత వందనములు తోబాసు శర్మకు

పద్య విద్య నేర్పె బాగు గాను

తప్పిదములు తెలుప దండమంటిని మీకు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.103


నరకములుగ మారె నగరములు ప్రజకు

దుమ్మ ధూళి నీరు దురితమాయె

కుడువ నీరు కూడ కుమ్ములాటలు దెచ్చె

వింత మాట యనుచు వినడు శాస్త్రి.104


ప్రజల జూసి నేర్చె పాలకులును నేడు

పాలకులను జూసి ప్రజలు నేర్చె 

ప్రజలె ప్రభువులైన పరిపాలన గనుడు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.105


సూర్య చంద్రులిల్లు చూదమనుచు రారు

మేడలందు బ్రతుకు మేడిపండు

విడచి నట్టి గాలి పీల్చుచు బ్రతికిరి

వింత మాట యనుచు వినడు శాస్త్రి.106


మట్టి లోన బుట్టె మట్టిలోనె మనిషి

నడిమిలోని వన్ని నాటకములు

కర్మ వలనె జన్మ కర్మవలనె చావు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.107


ఉంగరములు వేలు బంగారమొక్కటే

అంత లింత లేల ఆత్మ యొకటె

పాత్ర పేరు మారె సూత్రధారి యొకడే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.108


పురుషులందు పుణ్యపురుషులు లేరయా

స్త్రీల యందు పుణ్య స్త్రీలు లేరు

అత్త లందు మంచి అత్తలే లేరయా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.109


భ్రాంతి లోనె బుట్టి భ్రాంతి లోనె బ్రతుకు

మాయదారి మనిషి మాట వినడు

కాంతి గలిగినంత భ్రాంతియే దొలగురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.110


భార్య మంచి దైన బ్రతుకునందు సుఖము

చేటు దెచ్చు నేమొ చెడ్డ భర్త

భార్య చెడ్డ దైన భ్రాంతియే వీడురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.111



మద్యమందు గలదు మంచికిక్కందురు

మందు దాగనోడు మనిషికాదు

పద్యమిచ్చు కిక్కు మద్యమే మిచ్చురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.112


అడ్డ బొట్టు వార లన్నీ తెలుసనంద్రు

నిలువు బొట్టు వారి నిక్కు వేరు

నమ్మ కున్న మనకు నామాలు బెడుదురే

వింత మాట యనుచు వినడు శాస్త్రి.113


తప్పు నొప్పు కున్న   గొప్పకాదు వినుము

తప్పు తెలిసి కొన్న ధన్యుడగును

తప్పు జేయకుండ ఒప్పుకొను పతిరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.114


మంచి మాట వలన మనసు గెలువ వచ్చు

మంచి మాట పెంచు మనిషి విలువ

మాట లాడ కున్న మౌనమే మేలురా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.115


వెన్న దొరక దాయె వెన్నుడే వచ్చినా

పాలు దొరకవాయె బాలురకును

పాడి పంట లేని పల్లెటూళ్ళాయెరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.116


కొబ్బరాకు పైన కూకుంది కోయిల

గట్టు మీద దూడ గంతు లేసె

పల్లె టూళ్ళ లోన పైరగాలుందిరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.117


పగలు రాత్రి లేక పనులంటు తిరిగిరే

రోడ్ల మీడ బండ్లు రొదలు జేసె

నగర మనిరి గాని నరకమనిన మేలు

వింత మాట యనుచు వినడు శాస్త్రి.118


రంగు రంగు పూలు రంగవల్లుల జోరు

గంగిరెద్దు మెడన గంట  మ్రోగు

సంకురాత్రి రోజు సంబురా లేవిరా

వింత మాట యనుచు వినడు శాస్త్రి.119



No comments:

Post a Comment