Saturday, June 25, 2022

కాశీ కంద శతకము

 శ్రీ కాశి కంద శతకము. Revised. 


లంబోదరునకు మ్రొక్కితి

నంబా సుతుడ వని ముందు నంబకు జెప్పన్

గం బీజమునే దలతును

సాంబసదాశివుని పాద సాయుజ మీయన్...1.


సగభాగ మంబకిడితివి

యఘమే నిండిన తనువిది యకటా యందున్

నగవులు చాలిక ఈశా

పగలును రాత్రియు దలంతు ప్రార్థింతు మదిన్.2


మ్రొక్కితి లంబో దరుని

మ్రొక్కితి కేదారు గౌరిఁ మోదము గూర్చన్

మ్రొక్కితి శరవణ భవునే

మ్రొక్కితి నందరిని మిమ్ము మోక్షము నీయన్.3


మ్రొక్కితి కేదారేశున్

మ్రొక్కితి కేదారగౌరి మోదము గూర్పన్,

మ్రొక్కితి కాశీ నాధున్

మ్రొక్కితి గంగా భవాని మ్రోలన నిలుపన్.4.


లెక్కకు మించిన వారిట

చక్కని పద్యములు చాల ఛందము తోడన్

ముక్కంటి పైన చేసిరి

నిక్కము నీదయ గలదని నేనుదలంతున్.5.


అడగను నీభూషణముల

నడగను నీ వాహనమ్ము నసలే యడగను

నడిగెద గంగమ స్నానము

నడిగెద నాతో నడువగ నాగేందు ధరా.6.


నావాడనుకొని కొడుకును

నావా రనుకొంటి భార్య నానా బంధుల్

నావారల నేఁ బిల్చిన

నీవారిని బిల్చినట్టు నీవే గొనుమా.7.


ఆయువు తీరిన చాలును

కాయము వీడగ పదమని కాలుడు బిలచున్

సాయము నీవే సాంబా

పాయక నీపదము నంటి ప్రార్థన లిడుదున్.8.


ఉపచారంబుల నరయను

తపమాచరణమన లేదు తనువే నీదని!

అపచారంబుల  జేసితి

ఉప వాసము చేయనిమ్ము యుంచుమిట శివా.9



నీలో రమించు నీవే

నాలోపల నీవె యుండి నన్నేలు శివా!

నా లోపము లెన్నకుమిక

లోలోపల నీవెయున్న లోపము లెవ్వీ!!10


నీశిరము పైన నుండగ

నీశా నేసోముడనన నీశాన  శివా

కాశినివాసము జేయగ

నాశపడితి తవపదముల నాకిమ్ము శివా. 11



ఆకారములేదేమో

సాకారముగ తవరూప సాయుజ్య మిడన్.

చీకాకులు వడియుంటిని

యేకా కినిజేయకయ్య యేమని యడుగన్..12


నీకై వెదికితి నీశా

నాకే మనియనకు కాశి నాధుడ రావో

యేకో పాసన చేయగ

రాకాశశినే ధరించి రావేల శివా..13


దండమయా దండమయా

దండమయా డుంఢిరాజ తామస హరణా

చెండాడుము నా రిపులను

భండాసురుని రిపుడందు భాగ్యము నీయన్...14



క్రమశిక్షణనెరుగ పరి

శ్రమలకసలు పనికి రాను శంభో మరినే

భ్రమలందు బ్రతుకు చుందున్

ప్రమథాధిపతి వనిదల్తు ఫాలుడ బ్రోవన్.15


అరుణాచలశివ కరుణా

వరణా వేడెద దురితము బాపగ రావా!

తరుణము నీకిది నాగా

భరణా భక్తుని మొరవిని భారము దీర్పన్.16


కలియుగ వరదుడ నీవే

వెలిసితి వట నిట జగతికి వెలుగులు నింపన్

తెలియని వారల కీశా

తెలియగ జెప్పుదు పరేశ తెలివిగ గనగన్.17


  


కలవా వైకుంఠమున

కలవా కైలాసమునను కల్మషకంఠా,

కలవన్ని దిశలనందురు

కలలో నైనా కనవడు కాలాంతకుడా.18


తలనీలాలిద్దును శివ

తలపులఁ శూన్యముగ జేసి తాండవ మాడన్!

తలపుల నైనా నిలవడు

తలపువ్వు గ నిలుపుము నను దహనాంబకుడా! 19


ఇటురావయ్యశివయ్యా

నిటలాక్షుడ వనగ నెరుగ నెట్లని పోల్తున్

పటుతరమగు పూజలనే

నెటులని తలపెడుదు నీకు నెటులందువయా.20


ఇటురావయ్యశివయ్యా

చిటుకున మటుమాయమౌకు చిచ్చరకంటీ

అటునిటు యని తిరుగ వలదు

కటువుగ మాటాడ బోను కల్మష కంఠా.21


శోధన సేయవలె బిందు

మాధవుని గన నిట నెట్లు మాయలు గెల్తున్,

బాధలు పడిమెట్లెక్కిన

గాధల నేమరువ లేను గంగా ధరుడా.22


ఆటాడగ నేఁ తగనుర

మాటాడవు మౌనమేల మదనాంతకుడా

వేటాడగ కిటియేలా

పోటీ పడ పార్థుఁ  గాను పురశాసనుడా.23


అడుగడుగున గుడి కలదిట

బుడిబుడి గుడులందు నీవె పురశాసనుడా

గుడిగుడి యందున వెదికితి

తడిలేని మనసిది రావె తామస హరణా.24



సిధ్ధుల గోరను గజముఖ

బుధ్ధిని కృపనిడు గణేశ బుధజన వంద్యా,

శ్రధ్ధగ పఠింతు నామము

శుధ్ధిగ నుంచెద మనసును శుభముల నీయన్.25


వేడితి వేంకట రమణుని

యేడగు కొండల నెటులని యెక్కుదు నీశా

రూఢిగ చనుమనె కాశీ

కూడగ మెట్లని పరేశ కొండలె మేలౌ.26


చక్కగ నర్ఘ్యము నీయగ

చిక్కవు గంగా జలములు చిచ్చరగంఠీ

చిక్కవు ఋషులకు మునులకు

నెక్కడ వెదుకను పరేశ నేమందు శివా.27


వాదము సేయగ నేలా

పాదము లిమ్మని యడిగితి పాయక బడుదున్

వేదము నేర్వని వాడను

వేదన దీర్చుమశుతోష వేడుక దీర్పన్.28


ఆవాహన మెట్టుల నో

నీవాడనుకొని శశాంక నీవే రావా

దేవా కావగ లేవా

భావన నిల్పెద పరేశ భవనాశ శివా.29


మదిఁ పాదపీఠిఁ జేసెద

పదపద మనిరావె సాంబ పదముంచగరా

మదమును వీడెను నాయెద

ముదముగ తవ పాదముంచ ముక్కనుసామీ. 30


హృదిఁ సింహాసనమనుకో

సదమల పూజలు సలుపుదు సాంబా రారా

ఇదివరకెన్నడు జూడని

గదియే నామదిఁ యనందు గంగా ధరుడా.31


రంగరు బంగరు పాత్రల

గంగోదకమెటుల దెత్తు గంగాధరుడా

ఎంగిలి జలముల పాద్యము

లింగా నీకీయలేను లింగార్చనకై.32


సౌచ మెరుగనిది నామతి

నా చమన మెటులని నేర్తు నంగజహరుడా

పీచమణంచుము నంటిని

గాచుము నన్నిక కపాలి కాలాంతకుడా.33


వెండిపళ్ళెరములోన

కొండలుగ రత్నాల లేవు కురంగపాణీ

అండగ  నర్థేశడుండగ

కొండలరాయుడని గొల్తు గోపతి దేవా.34



సిరిగలవానికె చెల్లును

హరునకు నైవేద్యమీయ హటకేశ్వరుడా

మరియాదలు సేయను నేఁ

విరివిగనే దండమిడుదు విశ్వాత్మకుడా.35


ప్రకృతి మరచిరి జనులిచట

వికృతిగ వర్ణముల హోలి వింతగ యాడన్

ప్రకృతి వికృతి నీవె శివా

సుకృతిని కృపనిడు సురేశ సుందర వదనా.36


సన్నని సందుల గుడులిట

యెన్నని గలవో శివశివ యేకాంతమునన్

విన్నప మిడుదును సాంబా

కన్నుల నిండా కనవడి కాంక్షలు దీర్పన్.37


హోలీ యాడిరి జనులిట

హోలిక దహనము యనంచు హోరున యరచెన్

లీలా నాటక మాపుము

హేలగ నైనా కనవడ హీరుడ రారా.38


కన్నుల నిచ్చెను తిన్నడు

కన్నెలు నీపై నిలిపెద కనుగవ నీదే

కన్నప సాటిని కానయ

నన్నిక నీవాడనంచు నాదరమున రా.39


ఎక్కడ వస్త్రము తెద్దును

దిక్కులె అంబరము నీకు దిసమొల వేల్పా!

లెక్కగ కనవడ రావయ

చక్కగ పుష్పముల నీయ చంద్రసేఖర రారా.40


కనుమని కన్నుల నీయను

తినుమని ఎంగిలిని వెట్ట తిన్నడ గానే,

చనుమొన  పూజల సేయను

వినుమని మొరలిడుదు నీకు విషధర రారా.41


ఆకలి దప్పులనుచు నీ

వాకిట నిలబడగ లేను బాలేందు ధరా,

శోకము బాపుము జాలును

నాకము నాకేలనయ్య నాగాభరణా.42



ఆరాటంబులు తీరవు 

పోరాడగ పొటమరించు పొందిన యఘమే

రారా యనంచు బిలువుము

పారావారమును దాట ఫాలేక్షణుడా..43

  


ఒకపరి నిన్నంటిన నా

కిక జన్మము ధన్య మౌను ఈశా మరి నా

కిక జన్మ వలదు, నేఁ మరు

వక నినుదలచు నటులుండు వరమీయదగున్.44


 

హాలాహలమెందులకో

ఏలాలవముల జలముల నిత్తును నీశా

కాలాతీతుడ వందురు

ఏలా కనవడగ రావు యెటులుంటి వయా.45 


పొంగలి వెట్టెను శ్రీ హరి

ఎంగిలి మాంసము కుడుతువు నేమని యడుగన్

రంగని గుడికే బోదును

సింగపు మొకమే దలతును శితికంఠ శివా.46



రమ్మని బిలచిన వచ్చితి

కొమ్ములు జూపెను వృషభము గోపతి కనుమా,

అమ్మే నయమను కొందును

కమ్మని భోజనము నాకు గమ్మున బెట్టెన్!47


 హిమగిరి వాసము నీది, తి

రుమల నివాసమున విష్ణు! రుద్రుండెటనో?

నమతుల వెడుదును మరి నే

తమరిరువురిని గన నెట్లు తరుణేందు ధరా.48


అమ్మాయని బిలచితినే,

నేఁమ్మా యనియా దరమున నెమ్మది నిచ్చెన్!

రమ్మాయని బిలచితివే

కొమ్మా దరిసెన మనవిక కొండల రాయా!49


హరియన్నను హరుడన్నను

హరియింతు రఘముల నెల్ల హరిహరి యందున్,

హరిహరు లిరువురు నొకటే

స్మరహర కావర యనందు మరువక నిన్నే.50


అపచారములే జేసితి

నుపచారములెరుగ నయ్య నుగ్రాక్ష శివా,

నుపవీతము తేలే నయ

నుపదేశము లేదునాకు నుమతోడ శివా.51


శంకర నిన్నే దలిచెద

శంకల బాయంగ నేర్పు చాలా సుళువుల్,

శంఖము నూదగ రాదయ

నంకితముగ నిన్ను దల్తు నర్ధేంధు ధరా.52


కొండలు కోనలు వెదికితి

కొండల యల్లుని కనుగొన కోర్కెలు దీర్పన్

కొండలపై మీరుండుడు

నండ గ మాకున్న జాలు నానంద  శివా. 53 



దేవి విశాలాక్షిని గని

యా విశ్వేశ్వరుని గోర ఆశీస్సులనెన్

పావన గంగా జలములు,

కావగ మము యన్నపూర్ణ కలదుగ మాకున్.54


పక్షుల కెగురగ నెవ్వరు

శిక్షణ నిచ్చె శితికంఠ శివశివ మరి తమ

కుక్షిని నింపగ గోరవు

రక్షణ నిమ్మని యడుగవు రతిసేవ్య శివా!55



శివశివ యనియన రాదా

శివశివ యనగా శివాని శీఘ్రమె రాదా

భవసాగర మీదగనే

శివనామమునే దలంతు శితికంఠ శివా.56 


కరచరణాదులు గలవని

కరివరదుని నేఁ దలంచ కాశీ కంపెన్

కరిచర్మంబులు దాల్చిన

కరుణా సాగర యనందు కనవడ రారా.57 


వాడిన పూవులు దళములు

వాడితి నెన్నో పరేశ వాదము లేలా

వీడిక నీవా డనుకో

వాడని వీడని వదలకు బాయక కృపతో.58


వందన మందు గురువులకు

వందనమందును విశాఖ బృందాళికికన్

వందల పద్యము లందున

కందము నాదియు గ్రహించి కందువుగ శివా.59


గుండ్రాఁలను శివుడందురు

గుండ్రాఁతిని నేఁ నొకండ గుర్తించు శివా

ఉండ్రా యిక్కడె యనగనె

పొండ్రా యమబంటు లార  పొండ్రా యందున్!60

.


లక్షలు గలవాఁరిద్దురు

దక్షత గలవాడ గాఁను దక్షిణ లీయన్

అక్షరములు నీవిస్తివి

లక్షలు కోట్లేల నాకు లౌల్యము లేకన్. 61


వేదంబులు రావయ నీ

పాదంబులు పట్ట నిమ్ము పాపాత్ముడనే

కాదందువనీ సుతుడను

లేదందువ విడువనిన్ను లెమ్మిక నీశా.62 


లోకములును లోకేశులుఁ

లోకస్తులు నీలకంఠ లోలో గలరట,

చీకాకులు వెట్టకు మిక

నేకారణమో తెలియగ నేర్పుము నీశా. 63


పలుకుల కందని రూపము

నిలుపుము నాతలపులందు నిటలాక్ష శివా,

తెలిసిన రూపమె తలచెద

తలపుల నందున నిలిపెద తనరారు శివా.64


పరులకు నీతులు జెప్పితి

మరచితి పాటింపగాను మన్నించు శివా,

విరివిగ మాటలు నేర్చితి

తరుణము వచ్చెనిక బ్రోవ తరుణేందు దరా.65


ఎంచగ లేనిమహిమగల

పంచక్రోశము పరేశ ప్రకటిత మాయెన్

ఉంచగ గోరెద నీశా

సంచిత పాపములనన్ని సంహార‌మవన్.66


 కాలుని దన్నిన పాదము

నేలా గున తమరిదయ్య నేర్పడ జెపుమా

లోలోపలనే జూడగ

నాలాగున నంబ గాలు నగుపించె శివా!.67

.

కలడని నమ్మిన వారిని

కలలో నైనా విడువవు కంఠే కాలా,

తెలియక లేఁడను వారిని

తలపుల లోనూ మఱువవు తరుణేందు ధరా.68


నామాటే మరచితివని

నీమమున నిను దలువనని నిందించకయా

ఏమాటకు నామాటే

నే మాటల కందవనుచు నిన్నంటిశివా.69


నామాటలు వినడు కొడుకు

నామాటలు వినదు భార్య నాగాభరణా

నాముదుసలి  వయసున నీ

నామము దలుచు మతినిచ్చి నన్నేలు శివా.70


ఈ పర్జన్యమ్ములలో

నేఁ పగిది మెరుపులు దాగె నిటలాక్ష శివా!

నాఁపగిది కనవడవె లో

లోపల నపుడపుడు నైన లోలార్క శివా.71



వేషము లెన్నో వేసితి

రోషము వీడగ గొలిచెద రుద్రుడ వనుచున్

పాషాణములౌ రాగ

ద్వేషములనువీడ నన్ను దీవించు శివా.72


పర్జన్యమ్ముల నుండియు

గర్జనలేల శితికంఠ గజచర్మ ధరా

తర్జన భర్జన చేసియు

వర్జించకు మయ్య నన్ను భవనాశ శివా. 73.


దుర్జన సాంగత్యము చే

వర్జించితి పూజ నేను భవభయ హారీ

తర్జని చూపక  గావుము

గర్జించకు మయ్య ఈశ గర్వాపహరా.74


పాపము లెన్నో జేసియు

దాపున కొచ్చి నిలుచుంటి దయజూపు శివా

లోపము లెన్నక కృపతో

పాపము మనవాడె యంచు పదముల నిమ్మా.75


 సిగలో శశిరేఖనిడును

జగడము చేసిన గజమును జాలిగ జుట్టెన్,

సగభాగము నంబకు, నీ

నగవులు మాత్రమడిగితిని నాగా భరణా.76


రెండవ దైవము లేడని

తాండవ మాడకు పరేశ తగునే నమ్మన్?

గుండెలు దీసిన బంటుని

కొండొకచో కనవడవిక కోరిక దీర్పన్.77 .


మెడలో కపాల మాలలు

జడలే ముడిగట్టె నయ్య జగదీశ శివా

తడిగా తలపై గంగా!

వడిగా కడిగెదను రమ్ము వలదనకు శివా.78


 


పలుకుల కందని రూపము

తలపుల నైన తనరారు తరుణేందు ధరా

కులుకుల నగవులు చాలిక

తలుపులు తీయవె పరేశ తాండవము గనన్.79


 కర కమలములను జూపుము

వరదాభయ ముద్రతోడ భవభయ హారీ

నిరతిశయానందము నిడి

మరణపు భయమే వలదను మాహేశ్వరివై.80


నందిని ఎక్కిన వానిని

తొందర జేయను కనవడఁ ధూర్జటి రారా

ఎందెందు వెదుకుదునికన్

సందియము గలిగెను దీర్ప శంకర రారా.81



 ఆదియు నంతము లేదట

నాదము నీరూపమంట నాదశరీరా.

నాదనుదేదీ లేదని

నాతనువేనీదనందు నాగా భరణా.82


ఊపిరి యున్నంత వరకు

నాపక నీశా యనంచు నందునొ లేదో

తాపుల తన్నకు తండ్రీ

నా పదలొచ్చిన తలంతు నా దుకొనంగన్.83


 చేత త్రిశూలము దాల్తువు

భేతాళగణములు చెంత, భేరీ ఢక్కా

మ్రోతలు, మెడలో పాములు

నేతీరుగనేను వద్దు నీకడ కీశా!84


 

ఆశ నిరాశల మధ్యన

పాశనివారణ మెరుగక పాట్లుబడితినే

నీశా, తవ కణకణ మా

కాశపు తత్త్వముట నాకు కరుణించగదే.85


చుట్టూ భూతగణంబులు

బిట్టరచిన వినవడదుగ భేతాళ విభో

ఎట్టా నిను జేరుదునయ

ఇట్టే పాముల జుడితివి నిటలాక్ష శివా.86


అష్టమి యనిదర్శించితి

మష్టభుజాదేవి వమ్మ  నానందముగన్

కష్టములను దీర్చు మికను

దుష్టనివారణము జేసి దుర్గా మాతా.87



నాదము నీయూపిరిగ

వేదము నీపల్కులగునట నిటలాక్ష శివా

పాదము లిమ్మని యడుగుదు

నాతరమానిన్ను గొల్వ నాగాభరణా.88


నాదము నీయూపిరియట

వేదము నీపల్కులౌను విశ్వేశ శివా

పాదము లిమ్మని యడుగుదు

నాదగు పల్కుల బొగడగ నాతర‌మౌనా.89


నమకము చమకము దెలియదు

తమకము మాత్రము యధికము తరుణేందు ధరా,

యమనియమము లెరుగను నేఁ,

తమపాదములంటెదనిక తామస హరణా.90


గిరిజాపతినా తండ్రన

గిరిజా సుతుడౌను యన్న గిరిజే యమ్మౌ,

సరిగా బలికిన పలుకుల

విరులుగ భావింపరయ్య విశ్వేశ శివా.91


ఊహల కందని రూపము

సోహమ్మని యందమన్న చోద్యంబగునే

ఆహా ఏమది భాగ్యము

పాహీయన నీశు డొక్క పద్యంబిచ్చెన్.92.


 ఈ వారాణసి పతి నే

నావాడని దలచి మ్రొక్కి నతులను జేయన్

నీవే పద్యము జేసిన

నావే యవియన్నియంచు న్యాసము జేసెన్.93


ఎన్నో తీరని యాశలు

నాన్నా నేనుంటినంచు నాకిక జెపుమా

మన్నన జేయగ దగినవి

కొన్నైనన్ పద్యములను కొమ్మిక సాంబా.94


ఎందరు కవులెందరు మును

ముందుగ నీపైనె పద్యములఁ జేసె శివా

కందము నాదియు గొనుమిక

నందముగా లేదనకుము నాదర మిడుచున్.95


 

నీలోపల లోకములా

యేలా ప్రాదక్షిణమిక నేర్పడ జెపుమా,

లోలోపలనే జూడగ

ఏలాగున కనగ నగును  నేకన్నులనే.96


 గృహ కలహంబులు పెక్కున్

గ్రహదోషంబులవి మీకు గ్రాహ్యము గనుకన్,

అహరహము మిము దలతుమిక

నిహపర దాయక పరేశ నిటలాక్ష శివా.97



భోగంబుల నాశించుచు

రాగాంబుధినే మునిగితి రతిసేవ్య శివా

రోగంబులు గ్రసియించగ

వేగంబుగ నిను దలచితి విధినాశ శివా.98


  

ఇహలోకపు చింతలతో

నహమున్ జంపుకొని యుంటి  నప్పుల పాలై,

కుహనా వాదము లెన్నో

సహనము గోల్పోయి జేసి శంభో యంటిన్.99.


జగముల నేలెడు పతివని

జగములు నీలో గలవని జటధారి శివా,

తగువే లేదని దలచితి

తగునే నగువడవు నాకు తరుణేందు ధరా. 100


 

నగజా సుతునిన్ జేకొని

నగజాధిప కుమరుతోడ నాకగుపడగన్

జగమే మరవగ నౌనిక

నగినగి రారయ్య మీరు నగజేశ శివా.101


శివుని, వినాయకుని, కుమార స్వామిని గలిసి ఆ శివానీ కుటుంబము మొత్తాన్ని  "చూస్తే జగమే మరచిపోనా" యని నా భావము. దోషములున్న తెల్ప ప్రార్థన.


 

గజముఖ షణ్ముఖ సుతులను

నిజమగు నీపంచ ముఖము నీశ్వరి తోడన్

త్రిజగద్భూతా ధిపనే

నిజనైవేద్యము నిడగను నిలచితి నయ్యా.102


 అంతా భ్రాంతియె నంటిని‌

సంతోషముగ సుఖపడి సంసారమునన్

ఇంతే మీరింతే యని

వింతేమిటియని విడువకు విషధారి శివా.103


 అంతా భ్రాంతియె నంటిని‌

సంతోషంబుగ సుఖపడి సంసారమునన్

ఇంతే మీరింతే యని

వింతేమిటియని విడువకు విషధారి శివా.104


ఛందము వైయా కరణము

కందము నందున్ తెలియక కట్టిన పదముల్

విందుగ నయ్యా గొను శివ

డెందము నయ్యా తెలిపితి  డింభకు గొనుమా.105

  


తలపున కొచ్చిన వన్నియు

తలపగ పద్యమనుచుందు తగవేమి శివా,

తలపున నిలచిన చాలని

తలవక తలవక తలచితి తనరారు శివా.106


 

ఈనా పద్యము లన్నియు

నేనే వ్రాసితి న టంచు నేనెటులందున్,

ఈనాటికి నెటులన్నను

నే నాటికి నీవెకర్త యీ శాన శివా.  107


కాశీ వాసము నందున

వాసిగ పద్యములనీయ వాక్పతి గోరన్,

రాశిగ నెన్నో యిచ్చెను

కాశీనాధునికి నీయ కవనంబాయెన్. 108



తప్పులు జేయుట సహజము

తప్పులు దిద్దిన గురులకు దండంబిడుదున్,

తప్పులు జేసిన శశివలె

తప్పక ననుగూడ దాల్చు తరుణేందు ధరా.109



ఇటు రావయ్య శివయ్యా

జటిలంబాయె బ్రతుకేల జటధారి శివా

పటలము లేదుర తలపై‌

యెటులా నీగుడి కడుదును నెలనాగ ధరా.110


పటలము=ఇంటికప్పు


 నా పలుకునలేదార్ద్రత

నాపిలుపున లేదుతీపి నాగాభరణా,

నా పాటికి నన్నొదలకు

నీపాదములీయవయ్య నిటలాక్ష శివా.111


తనువే నీదంటి నికన్

గనుమా రోగంబులేవి గనకుండ నిటన్

మనుగడ ముగిసిన తోడన్

గొనుమా నీలోకినన్ను గురుతుంచి శివా.112


 

నాకాయాసము నిస్తివి

నీకేమయ్య విష కంఠ నీకిది తగునే,

నాకాయమైనగొను,  నా

నాకాయసమైన దీర్చు, నాగాభరణా. 113


నాకు చిన్నప్పటి నుంచి ఆయాసము  (ఆస్థమా ) ఇచ్చిన గరళ కంఠుడాయన  (కఫకంఠుడను నేను),   అది తగ్గించనూ తగ్గుంచడూ , నాకాయమైనా తీసుకోడు... యని నా నిష్టూరపు వేడికోలు.


 నీ ఆస్తులు నాకు వలదు

నా ఆయాసము‌ను గొమ్ము నాగాభరణా,

నాపాపములను సైచుము

నీపాదములిమ్ము చాలు నిటలాక్ష శివా.114


అడిగిన కనపడ కుందువు,

కడుగగ తవ పదములు శివ కనవడ వాయెన్! 

నుడువగ నుతులకు దొరకవు,

వడివడిగ దెలుపు జడముడి వదలనిక శివా.115


 

పట్టించు కోవదేలని?

తిట్టించు కొనక వదలవు తింగరి తనమా!

కట్టడి చేయను కనవడ

యిట్టే నామనమునుండు మీశాన శివా.116


ఏమయ్యా యని బిలచితి

నే మమ్మాయని బిలచితి నేమరు పాటున,

నే మాటలు రావాయెను

వా మార్థమునమ్మ యుండ వాపోయితినిన్. 117


లేవా కాశీ నగరిన

నావిశ్వాసంబు నిల్ప నాకగుపడవే!

ఈవిశ్వమంత నిండియు

నావిజ్ఞతకున్ దొరకవు నాగాభరణా.118


సత్యము రాముని నామ మ

సత్యము‌ జగతియె నటంచు శవ వాహకులున్

నిత్యము బల్కుట వింటిని,

సత్యము కడవరకు తోడు సాంబా యంటిన్..119


 కళ్ళెము నీకే ఇచ్చెద

త్రుళ్ళణచుము నా రిపులకు ద్రుగ్గోచరమై

త్రెళ్ళగ జేయుము బంధము

మళ్ళీ జన్మము వలదిక మాహేశ శివా.120


కళ్ళను నీపై నిలుపన్

త్రుళ్ళణచుము నా రిపులకు ద్రుగ్గోచరమై,

త్రెళ్ళగ జేయుము బంధము

మళ్ళీ జన్మము వలదిక మాహేశ శివా.121



ఏరోగము లేకుండెడి

యా రోగ్యమునిమ్ము మాకు నంబర కేశా

పోరాటము నాపను నా

యారాటము తీర్చవయ్య నర్థేంధు ధరా.122


తనవున్ జేర్చితి కాశికి

మనసిక్కడ లేదునాది మన్నించవయా,

తనువెక్కడ యున్నను నా

మనసిక్కడ యుండునట్లు మననిమ్ము శివా.123


మనసున కోర్కెలు కోటీ

తనువా రోగముల పుట్ట, తగవుల కొంపే!

యనుమానము లే లక్షలు

ననునీ దాసుని కృపనిడి నాకొమ్ము హరా.124



 రాశిగ బోసిన పురములు

కాశికి సరి తూగబోవు, కాశీ నాధున్

వాసిగ గొలచుచు, కాశి ని

వాసము జేయగ నిహపర భయమే దీరున్.125


కాశీ కాశీ యన్నను

కాశీ పురమున వసించు కాశీ నాధున్

చూసెద నన్నను చాలట,

కాశీ వాసపు ఫలితము కలుగును మీకున్.126


కాశి యను న క్షర యుగమే

వాసిగ గళమందుదాల్చు వానికి, కాశీ

వాసపు ఫలితము, రక్షణ

కాశీ నాధుడు సతతము కల్గించు నయా.127


వందనము విశ్వనాధా

ద్వందాతీతా పరేశ త్ర్యంబక సాంబా

యందును ముందుగ చందన

గంధము లలదిన సుగంధ కందము లిడుదున్.128


వందనము దండపాణికి,

వందనములు డుండిరాజ వ్రాతపతికినిన్

వందనము భైరవునకును

వందన శతములు భవాని, వారాణసికిన్.129


వందనము మాధవునకున్,

వందనము గుహకును, గంగ భాగీరథికిన్,

వందనము కాశి మాతకు,

వందనమందు మణి కర్ణ వందిత చరణా.130


ఇలపై నుండిన కాశీ

తలమానికమౌను జన్మ తరియింపంగన్,

మలుపే దిరుగును జన్మము

కలతలు తీరగ దలచుడు కాశీ యనుచున్.131


 త్రిపురాంతకునే దలచుచు

నపరాధములే తలపక నహరహ మందున్

తపములు చేసిన మోక్షము,

జపములు కాశీ పురమున, జయముల నిచ్చున్132.


 ఇలలో కాశీపురమును

తలమానికమై నిలిపెను దహనాంబకుడున్,

కలిపురుని కాలుని భయము

వలదని నభయంబు నిచ్చె వసుధా రథుడున్.133

 

పన్నగ శాయిని కొలిచితి

పన్నగ భూషణుని కోరి ప్రార్థించితినే,

నెన్నెన్ని మారులు బిలువ

మన్నన సేసి కనపడరు మాన్యులు తగునే.134


ఇందులో కొన్ని పద్యములు బాగులేక పోవచ్చు, అన్వయము కుదరక పోవచ్చు. నాకు బాగా నచ్చిన పద్యములని బోల్డుగా (Bold) చేసాను. 

No comments:

Post a Comment