కార్తవీర్యాది రాజరాజ్యప్రదోనఘః
విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వరః
పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మదః
సమస్త వైరి తేజోహృత్ పరమా మృత సాగరః
అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదః
ఏవర మడుగను స్వామీ
దేవతలేనిను గొలిచిరి దీనశరణ్యా
దీవెన లిమ్మని యడిగెద
కావర గురవాయురప్ప కరుణా సింధో.1
అహమును గెలువని వాడను
యిహపరముల గెల్చుటెట్లు యెప్పటి కగునో
అహరహము నిన్ను దలచెడి
మహిమను గురువాయురప్ప మందుగ. నిమ్మా.2
రాజులు పేదలు వత్తురు
రోజూ నినుచూడ నీదు లోఁగిలి వరకున్
జాజులు మల్లెలు దెత్తురు
పూజకు గురువాయురప్ప మోహనరూపా.3
నడచుట మరచిరి జనులిల
వడిగా వాహనమునెక్కి వదరుచు సెలులో
సుడిగాలి పోలె తిరిగిరి
భడవలు గురువాయురప్ప భయమే లేదే.4
పుల్లలు వాడరు పళ్ళకు
చల్లని త్రాగుట మరచిరి, చద్దన్నమునూ
మెల్లగ మరచిరి పెట్టుట
తల్లులు, గురువాయురప్ప తప్పాకాదా.5
పేస్టును తిందురు ప్రొద్దున
బూస్టును త్రాగుదురు చిప్సు భోంచేదురయా
రెస్టును విడువరు, మరచిరి
కస్టమ్స్, గురువాయురప్ప కాలపు మహిమే.6
లంచము లెన్నో మెక్కితి
సంచిత కర్మముల మరచి సత్యంబిదియే
కంచికి చేరని కథలే
మంచివి గురువాయురప్ప మన్నించవయా.7
సాధుల సంతుల జూచితి
సాధు ప్రవర్తన మరచితి సత్యంబిదియే
క్రోధము కామము విడచెడి
సాధన గురువాయురప్ప చప్పున నిమ్మా.8
ఊరక యుండని మనసిది
నేరిచి ఉఉ యనదు స్వామి నిజమే కాదా
దారిని తప్పితి చేర్చుము
తీరము గురువాయురప్ప తెప్పవునీవై.9
చేసిన పాపము పుణ్యము
వాసిగ నరజన్మ గలిగె ప్రారబ్ధమునన్
చేసిన పూజలు కొరవని
దాసుని గురువాయురప్ప దండించకయా.10
ఆచారము మంట గలిపి
గోచారము నెంచినాను కూరిమి లేకన్
దాచిన దాగవు తప్పులు
నీచుని గురువాయురప్ప నిందించకయా.11
ధనదాహము తీరదు నిం
ధనమైనది కీర్తి కాంక్ష, తాలిమి కొరవై
మనసును తనువును కాల్చెను
కనుమో గురువాయురప్ప కరుణాసింధో.12
కనులా కనపడ వాయెను
వినబడవు చెవులు, పలుకులు పెడసర మాయెన్
తనువా విలవిల లాడెను
మనసున గురువాయురప్ప మనుగడ రావా.13
దేహము నటమట నొందెను
మోహము బాధించెనన్ను మోహనరూపా
దేహిని నేనా యను సం
దేహము గురువాయురప్ప తీర్చగరావా.14
కాఫీ త్రాగక రోజులు
సాఫీగా సాగవంట సత్యంబెరుగన్
లాఫింగ్ మ్యాటరు కాదిది
కాఫీ గురువాయురప్ప కాలపు మహిమే.15
టీ యన యేకాక్షరమే
చాయని త్రాగింతురంట చక్కెర తోడన్
మాయల టీ కాఫీలను
పోయక గురువాయురప్ప పొద్దే పోదే.16
పిల్లల చదువులు మారెను
సెల్లుల పాలాయె నండి చెప్పగనేలా
తల్లులు తండ్రులు గురువులు
చెల్లరు గురువాయురప్ప సెల్లే లేకన్.17
దేవుని వంటిది వైరసు
కోవిడు కనబడదు గాని కోరలు జూపున్
నోవలు కరోన వంటిది
దేవుడ గురువాయురప్ప తేబోకు సుమా.18
ఇంటనె చదివిరి బిడ్డలు
నింటనె యుద్యోగమంట నింతికి పతికిన్,
మంటలు రేపెడి బ్రతుకుల
తంటా గురువాయురప్ప తప్పించవయా.19
అత్తయు మామయు బరువట
క్రొత్తగ మాటాడునేడు కోడళ్ళయ్యో
అత్తల మామల కన్నులు
చిత్తడి గురువాయురప్ప చేయించకయా.20
~~ ~~ ~~
వందల *మందుల* షాపులు
మందలుగా మందుకొంద్రు మందుల బాబుల్
మందుని మ్రింగెడి ప్రజ నే
మందును గురువాయురప్ప మన్నించ. వయా.21
వార్తలు చూచిన చదివిన
భర్తీ యాస్పత్రిలోన భద్రము సుమ్మీ
వార్తలనమ్మెడి వారలు
కర్తలు గురువాయురప్ప కాదా చెపుమా.22
నాడిని చూడరు వైద్యులు
వేడిగ వడ్డింత్రు బిల్లు వేలకు వేలున్
గాడిన తప్పిన ల్యాబుల
దాడిని గురువాయురప్ప తప్పించవయా.23
అడుగడుగున గుడి కలదిట
యడుగడుగున బడికలదిట యడుగిడ మీ రా
బడినే పెంచును మరిమరి
తడబడి గురువారురప్ప తప్పనకయ్యా.24
అడుగడుగున యాస్పత్రులు
వడివడిగా వచ్చెనండి వైరసులెన్నో
విడిగా వాక్సిను బిజినెసు
వడిగా గురువాయురప్ప ప్రాభవమొందెన్.25
పుచ్చిన కూరలు సరుకులు
మెచ్చిన వానికి పదవులు మిచ్చెన లెక్కన్
చచ్చిన వానికి వైద్యము
నిచ్చలు గురువాయురప్ప నిందించకయా.26
ఫ్రీగా పంచిరి సొమ్ములు
ఫ్రీగా సారాయి గాని పెట్రోలనరే
ఫ్రీగా చేయరు వైద్యము
ఫ్రీగా గురువాయురప్ప పిచ్చెక్కించున్.27
చీరకు మ్యాచింగ్ జాకెట్
చీరకు మ్యాచింగుమాస్కు జేబుకు చిల్లే
ఛీరన కర్చులు పెరుగును
చీరే గురువాయురప్ప చెర్రెత్తించున్.28
Cheer… ఛీర్ + అన- ఛీరన
చక్కగ సుద్దులు విందురు
ముక్కలు లేకున్నవారి ముద్దే దిగదే
లెక్కగ మందును గొందురు
నిక్కము గురువాయురప్ప నిందించకయా.29
చక్కని గుడి గోపురములు
ప్రక్కన బ్రాందీలనమ్ము బారుల్ బీరుల్
బొక్కిన దెంతో తెలిపెడి
లెక్కలు గురువాయురప్ప లేనే లేవే.30
పెళ్ళికి వయసే వచ్చిన
పెళ్ళాడెడి వారులేరు ప్రేమము పెరిగెన్
గుళ్ళో పూజారులకున్
పెళ్ళా గురువాయురప్ప పిల్లలు రారే.31
బాగా చదివిన డబ్బులు
బాగా రావచ్చునంచు బాల్యము మొదలున్
బాగా రుబ్బురి బిడ్డల
బాగే గురువాయురప్ప ప్రాణము తీసెన్.32
పిల్లలు నమేరికాలో
తల్లీతండ్రుల మరచిరి తప్పని యనరే
మళ్ళీ రారట గూటికి
యెల్లా గురువాయురప్ప యెగిరెను గువ్వల్.33
పిల్లల గని కామముతో
ప్రల్లదమున కుప్పతొట్టి పాల్జేసినచో
తల్లిని దైవమనందురె
యెల్లా గురువాయురప్ప యేమందు నయా.34
మావా డమేరికాలో
మీవాడెక్కడ యనుచును మిడిసిపడకురా
రావా యన్నను రాడే
నీవే గురువాయురప్ప నిక్కము గనుమా.35
కాశీ పురమున శివుడవు
వాశిగ గురువాయురుపుర వాసివి నీవే
చూసెడి చూపుల మాయే
శ్రీ శా గురువాయురప్ప చిన్మయ రూపా.36
విలువలు నేర్పని చదువులు
మలినము చేసెను తలపుల మాయకు లోనై
కలుములు పెంచెను కలిలో
బలిమికి గురువాయురప్ప పాదము పడుదున్.37
కప్పలను వాన పాముల
నప్పనముగ తిని పురుగుల నయ్యో రామా
తిప్పలు పెట్టెను చైనా
ముప్పును గురువాయురప్ప పుడమిని గనుమా.38
యోగము ధ్యానము నేర్వక
రోగములకు భయపడి భవరోగము పాలై
దోగాడితి భువిపై నిక
భోగము గురువాయురప్ప ముగియింప వయా.39
జోలల పాడుదు మెల్లగ
లాలను పోసెదను బువ్వ రంజుగ పెడుదున్
మాలిమి చేసెద, త్రాగర
పాలను గురువాయురప్ప పాదము పడుదున్.40
గమ్మున క్షాళన చేయుచు
కమ్మగ జోకొట్టి పాడి కథలను చెబుచున్
రమ్మని యెత్తుకు త్రిప్పెడి
బామ్మలు గురువాయురప్ప బలిమే కాదా.41
పాములను ధరించె శివుడు
పాములపైనె పవళించు పన్నగశాయీ
దోమల పాల్జేసిరి మము
యేమని గురువాయురప్ప యిటువొచ్చి తివో.42
కాలము కర్మము తప్పిన
చేలము పామై కరచును చెప్పగనేలా
మేలగు మాటలు నుడివిన
చాలని గురువాయురప్ప చప్పున యనరే.43
నవ్వితి నలుగురినీ గని
నవ్వితి నేడ్చెడి మనుజుల నావారైనన్
నవ్వితి నేడ్చుట రాకనె
నవ్వితి గురువాయురప్ప నవ్వుల పాలై.44
ఎన్నో జన్మల కర్మలు
నెన్నో తీరని ఋణములు నెన్నడు తీర్చన్
ఎన్నో రోజులు లేవిక
కన్నా గురువాయురప్ప కరుణించవయా.45
సిగరెటు కాల్చెడి వారలు
తగులాడెడి వారికన్న తక్కువ కాదే
పొగతో ప్రాణము పోవును
తగవూ గురువాయురప్ప తలలే తీయున్.46
కష్టము లెన్నో పడితిని
దుష్టుల సహవాస మహిమ దూరితినెన్నో
ఇష్టముగ చేసియుంటిని
దుష్టుని గురువాయురప్ప దూషించ కయా.47
పందుల వలె పిల్లలకని
పందులవలె పెంచువారు బరువు జగతికిన్
పందికి మనిషికి తేడా
యేందని గురువాయురప్ప యెవరిని యడుగన్.48
తల్లియె దైవమొకప్పుడు
పిల్లకు పిజ్జాలు చిప్సు పెట్టుట సబబా
పిల్లకు కూల్డ్రింకు లిడెడి
తల్లికి గురువాయురప్ప దండము పెడుదున్.49
పరశువు దాల్చినదెందుకు
దొరలనువారి తలలెల్ల దొరలించుటకా
వరలిన శ్రీ రామునినే
నరయగ గురువాయురప్ప హరియే కాదా.50
పంచెలు గట్టుట మరచితి
పంచులు వేయగ తలచితి పద్యము లోనన్
మంచిగ చెప్పిన వినరట
కంచికి గురువాయురప్ప కథలే చేరున్.51
చక్కగ నిద్దుర లెమ్మని
కొక్కొరకోయన్నకోడి కూరై పోయెన్
చొక్కపు పల్కులు నచ్చవు
నిక్కము గురువాయురప్ప నిప్పై కాల్చున్.52
బంగరు జింకలు కలవా
చెంగున రాముడు దుమికెను చెప్పగ నేలా
ముంగిట కష్టము నిలచిన
దంగుడు గురువాయురప్ప తప్పదు కాదా.53
ఏరా రారా పోరా
తేరా మేరా సరేర తీయ్ రా యంటిన్
ఔరా మరచితినే నో
రారా గురువాయురప్ప రామా యనుటన్.54
సారీ చెప్పుట నేర్చితి
సారీ యని సత్యకాళ్ళు శౌరియె బట్టన్
సారీ కొనుటయు మంచిదె
సారీ గురువాయురప్ప సత్యము చెబితిన్.55
తప్పక చెబితిని సారీ
తప్పేమియు చేయకున్న తప్పించుకొనన్
తప్పేమిటి సారీ యన
తప్పెను గురువాయురప్ప తన్నులు నాకున్.56
కిళ్ళీ బుగ్గన నములుచు
నూళ్ళో దారంట వారు నుమ్మేసిరిగా
పళ్ళే పచ్చగ మారును
కిళ్ళీ గురువాయురప్ప కీడే కాదా.57
గుట్కా కిళ్ళీ సిగరెటు
మట్కా యలవాటు మాన మాకష్టముగా
గుట్కా మానుట యెటులో
చిట్కా గురువాయురప్ప చెప్పవె మాకున్.58
మద్యము మించిన హాయిని
పద్యము లిచ్చును సొగసుగ పదములు గూర్పన్
హృద్యంబుగ నే వ్రాసెద
పద్యము గురువాయురప్ప పదుగురు మెచ్చన్.59
జనవరి నెలలో కోళ్ళకు
మనుగడ సంక్రాంతి వరకు మాయే కాదా
పనిగా పందెములాడెడి
మనీషి గురువాయురప్ప మాయముకాడే.60
జాతక మార్తాండ ననుచు
జాతి రతనములను నమ్ము జ్ఞానుల వలనన్
జాతకములు బాగుపడునె
చేతికి గురువాయురప్ప చిప్పే మిగులున్.61
టీవీ లో వార్తల గని
టీవీలో చర్చలువిన డెంగ్యూ కలుగున్
జీవుల ప్రాణము తీసెడి
టీవికి గురువాయురప్ప టీకా లేదే.62
ఆకులు నలములు నమిలిన
మేకలను సుగరును బీపి మ్రింగవు నిజమే
ఆకొన చికెనూ మటనూ
బాకిన గురువాయురప్ప ప్రాణముపోదా.63
భార్యయె గురువును దైవము
భార్యయె సరిజోడులైన భర్తల కెపుడున్
భార్యయె ప్రాణము నిలుపును
భార్యయె గురువాయురప్ప బంధుగు డౌగా.64
భార్యయె గూగుల్‌కి గురువు
భార్యయె కంప్యూటరౌను భర్తల కెపుడున్
భార్యయె రక్షణ భర్తకు
భార్యయె గురువాయురప్ప వాయించ నిచో.65
భార్యల మాటలు వినవలె
భార్యల నేడ్పించకున్న భర్తకు మేలౌ
భార్యల కోర్కెలు దీర్చిన
భార్యలు గురువాయురప్ప భర్తల హితులౌ.66
బీరుల్ బ్రాందీ విస్కీల్
పారును వరదై జనవరి పస్టున కనుకన్
ఔరా కరోన భయమను
వారికి గురువాయురప్ప వాక్సిను దొరకున్.67
ఎప్పటి వలెనే వచ్చును
చప్పగ నెలకొక్క ఫస్టు సత్యము సుమ్మీ
గొప్పగ వచ్చెడి దొకటే
చప్పుడు గురువాయురప్ప జనవరి నెలలో.68
పచ్చడి తినెదరుగాదికి
పచ్చడి యగుదురు జనవరి ఫస్టుకి భర్తల్
పచ్చడి యెపుడూ చేదే
పచ్చడి గురువాయురప్ప భార్యలు పెట్టన్.69
నడిరేతిరి స్వాతంత్ర్యము
నడిరేతిరి ఫస్టు వొచ్చి నడతే మార్చెన్
భడవలు త్రాగిన గొడవలు
పడరా గురువాయురప్ప ఫస్టున కూడా.70
పాతకముల గతి మరచిన
జాతకములు మారబోవు శాస్తియె మిగులున్.
చేతలు మారక మన తల
రాతలు గురువాయురప్ప లావగు టెటులో.71
నూతన వత్సరమున మా
యాతన తొలగించవయ్య హారతు లిడుదున్
చేతన కలిగించుచు మా
భీతిని గురువాయురప్ప పెకిలించ వయా.72
బ్రేకింగ్ న్యూసులు గుండెల్
బ్రేకింగ్ జేయును మనుజుల పిచ్చెక్కించున్
మేకింగ్ న్యూసుల కన్నా
బ్రేకింగ్ గురువాయురప్ప రేటింగ్స్ పెంచున్.73
మరచితి గోదానములను
మరచితి గోపూజ నైన మందమతినినేన్
మరచితి గోచారములను
మరచితి గురువాయురప్ప మన్నించ వయా.74
మరచితి నీగుడికేగుట
మరచితి నీపూజసేయ మరచిన పనిగా
మరచితి తిలకము భస్మము
మరిమరి గురువాయురప్ప మన్నించ వయా.75
పండుగ లెన్నో చేసితి
రండని మిము పిలువనైతి లజ్జయె లేకన్
మెండుగ వరములు కోరితి
భండుడ గురువాయురప్ప పాలింప వయా.76
అణువణువున కలవనుచును
మనసారగ తలఁచ నైతి మన్నించుము నా
తనువున కలవంటిరి నిను
గనుటకు గురువాయురప్ప కనులీయ వయా.77
పులి నోటను తల దూర్చుట
చెలిమాటకు మారుమాట చెప్పగతగునే
చెలికన్నను పులిమేలట
కలిలో గురువాయురప్ప కరుణించవయా.78
మమకార మహంకారపు
తమకములో మునిగితేను తప్పేనయ్యా
శమమూ దమమూ నెరుగని
కుమతిని గురువాయురప్ప కోపించ కయా.79
ఇదిగో పొడి చేస్తారని
పదవిచ్చిన పాపమునకు బాగా దోచెన్.
అదియిది అనికనె పన్నులు
వెధవలు గురువాయురప్ప పెంచేస్తిరయా.80
ఎక్కువ కోరను స్వామీ
తక్కువ కాబోదు నీకు తప్పక నిడగన్
మక్కువ కల్గియు నిమ్మా
గ్రక్కున గురువాయురప్ప కాళ్ళను పడుదున్.81
అల వైకుంఠ పురమ్మున
కులుకుచు సరసమ్ముతోడ కూరిమి సతితో
కలనైనను కన రావయ
కలనని గురువాయురప్ప కరుణించ వయా.82
కరుణా సంద్రుడ వనెదురు
కరుణా భరుణడవనెదరు కాదని యననే
వరముల నేమియు గోరను
వరదా గురువాయురప్ప పాదములిమ్మా.83
దానము ధర్మము నెరుగను
కానిపనుల చేసియుంటి కాదని యనకన్
మానిత సురముని వంద్యా
దీనుడ గురువాయురప్ప దీర్పవె యార్తిన్.84
వారధి గట్టగ నేలా
సారధి గానుండనేల చక్కని తండ్రీ
నేరుగ రావచ్చు ననుచు
తేరగ గురువాయురప్ప తెరచితి తలపుల్.85
అగమము నెత్తగ నేలా
ఖగవాహన మెక్కనేల కరివరదుడవే
తగవులు పెట్టని వాడను
తగనా గురువాయురప్ప తప్పక ప్రోవన్.86
పాలకడలిలో పడకా
పాలూ వెన్నేల నీకు పావన చరితా
వేలకు వేలు సుదతులా
చాలా గురువాయురప్ప చక్కనితండ్రీ.87
అన్నియు నాకే తెలుసని
బన్నము పాలైతినేను పన్నగశయనా
మన్నున గలవక మునుపే
క్రన్నన గురువాయురప్ప కావగరావా.88
చదువులు వ్యాపారంబిట
మదుపరులే తల్లితండ్రి మాయాజగతిన్
ఎదిగిన బిడ్డలు ఎగురుట
విదితమె గురువాయురప్ప వేదన మిగులన్.89
కలుషిత మైనది మా మది
కలుషిత మైనట్టి తనువు కల్మష హరణా
కలుములు బాపగ రావా
కలిలో గురువాయురప్ప కరుణాసింధో.90
క్షేమము పేదలకిట సం
క్షేమ పథకములకు వారి జేబులు నిండున్
క్షేమము ధనవంతులకున్
నా మము గురువాయురప్ప నడుమ జనులకే.91
అన్నీ పేదలకుచితము
పన్నులు ఫీజులను కట్టు వగపే లేదే
మన్నే మధ్యతరగతికి
వెన్నా గురువాయురప్ప పెద్దలకేగా.92
తనవారి సంతసమునకు
తనవారికి సంపదలని ధనమార్జించన్
చనరారు వెంట తుదకన
వినరే గురువాయురప్ప పిచ్చిమను జులున్.93
చలిలో ముక్కులు గారుట
చలిలో తుమ్ములును దగ్గు జలుబే కాదా
కలిలో నోమైక్రానట
చలిలో గురువాయురప్ప చచ్చిరి జనులే.94
గలగల మాటలనాపక
కలలోనూ కలవరించు కాంతలకయ్యో
వలలా మాస్కుల గట్టిరి
కలిలో గురువాయురప్ప కాలపు మహిమే.95
మాస్కులు మూతికి ముక్కుకి
వేస్కొన మేలంద్రు గాని వేస్కొనరరెరే
దూస్కొని వచ్చెడి మిత్తికి
మాస్కులు గురువాయురప్ప మహిలో గలవా.96
సిరిగల వాడవనందురు
త్వరగా వచ్చెదవనంద్రు వాహనమేలా
దొరవై కనపడరావయ
సిరితో గురువాయురప్ప చిన్మయరూపా.97
అడగను సిరులిమ్మని నే
నడిగెద గురు భక్తి నిడగ నడిగెద సరియౌ
నడవడి గడియ గడియకును
పడగను గురువాయురప్ప పాదము లిడగన్.98
మనసుకు తోచిన దంతయు
కనులకు కనబడన వనుచు కవివలె నేనున్
పనిలేక పద్య మల్లెడి
మనిషిని గురువాయురప్ప మన్నించ వయా.99
తరగని సుఖసంపదలును
చెరగని చిరునవ్వుమోము చిందించుచు మా
దొరవై నా చదువరులకు
గురుతును గురువాయురప్ప గురువుగ నిడుమా.100
విత్తును నాటినదీవే
దత్తునివై నాకు పద్య ధారల నిడ నా
చిత్తము నీకే ధారా
దత్తము గురువాయురప్ప తప్పక గొనుమా.101
పద్యము చదివిన వారికి
పద్యము బాగున్నదన్న పాఠకులకు నా
పద్యము మెచ్చని వారిక
వద్యుడ గురువాయురప్ప వందన మందున్.102
కైలాసమునెక్కె శివుడు
పాలకడలిలోన దాగె పన్నగశాయియున్
చాలని ననునీ చెంతకు
త్రోలిరి గురువాయురప్ప దూరకు మయ్యా.103
సంకము చక్రముదాల్చిన
పంకజనాభా శరణము పద్యము గొని నీ
కింకరుడను నణగించుము
బింకము గురువాయురప్ప ప్రేమము మీరన్.104
గుడులు బడులు తెరచుచు రా
బడులను పెంచుచు జనులకు వైరసు రాకుం
డెడి మంచి రోజులి డుమా
వడిగా గురువాయురప్ప భరతావనికిన్.105
స్వేచ్చగ నూపిరి బీల్చుచు
పచ్చని వరిచేలు పాడి పంటలు పెంపై
మ్రుచ్చులు నాశనమయ్యెడి
ముచ్చట గురువాయురప్ప పుడమికి నిమ్మా.106
గారెలు బొబ్బట్లరిసెలు
బూరెలు నెయ్వేసి పప్పు భోజనమును నే
కోరి తినిపించెదనురా
వేరుగ గురువాయురప్ప వెన్న పెడుదునే.107
వెన్నయు పాల్పాయసమును
మన్నును మీగడలు జున్ను మరిమరి పెడుదున్
తిన్నగ రారా యింటికి
కన్నా గురువాయురప్ప కలియుగ వరదా.108